మహర్షి విశ్రామిత్రుడితోను, ఇతర మునులతోను కలిసి రామలక్ష్మణులు మిథిలకు వెళుతూ, మార్గమధ్యంలో విశాల నగరం చేరుకున్నారు. రాముడి అడిగిన మీదట విశ్వామిత్రుడు ఆ నగరం ఏర్పడడానికి గురించిన కథంతా చెప్పాడు. విశాల మహారాజు సుమతి వారందరికీ తగిన రీతిలో ఆతిథ్యమిచ్చాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించిన వారు, ఆ మర్నాడు తమ ప్రయాణాన్ని కొనసాగించి మిథిలా నగరానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడితో ఉన్న మునులందరూ అందమైన మిథిలను చూసి ఎంతో ఆనందానికి గురై ‘బాగు బాగు’ అంటూ ప్రశంసించారు. మిథిలకు సమీపంలోనే ఉన్న ఒక వనంలో ఒక ఆశ్రమాన్ని రాముడు చూశాడు. అది బాగున్నప్పటికీ అందులో ఎవరూ లేకపోవడాన్ని గమనించాడు. ఆ సంగతినే విశ్వామిత్రుడిని అడిగాడు.
‘‘మహాత్మా... ఈ ఆశ్రమంలో మునులెవ్వరూ కనిపించడం లేదేమిటి? పురాతనమైన ఈ ఆశ్రమం ఎవరిది? దీని వివరాలు తెలియజేయమని కోరుతున్నాను’’ అని వినయంగా అన్నాడు.
అందుకు విశ్వామిత్రుడు, ‘‘రామా... ఈ ఆశ్రమం ఒక మహాత్ముని కోపం కారణంగా శాపానికి గురైంది. ఆ వివరాలన్నీ చెబుతాను విను’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు.
‘‘మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమం ఇది. ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుతూ ఉండేది. దేవతల పూజలు సైతం అందుకునేది. గౌతముడు తన భార్య అహల్యతో కలిసి ఇక్కడ ఉంటూ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసుకుని ఇంద్రుడు అతడి రూపం ధరించి అహల్య దగ్గరకి వచ్చాడు.
‘‘సుందరీ... కోరిక కలిగిన వారు సమయం కోసం ఆగరు. నాకు నీతో కలవాలనే కోరిక కలిగింది’’ అన్నాడు.
అహల్య తన భర్త రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడేనని తన తపశ్శక్తితో గ్రహించింది. దేవతలకు రాజయిన వాడు మారువేషంలో వచ్చి ఇలా మాట్లాడుతున్నాడేమిటని అహల్య ఆలోచనలో పడింది.
తర్వాత, ‘‘ఓ దేవేంద్రా... నేను నా దాంపత్య జీవితంలో సుఖంగా ఉన్నాను. నీవు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో. నీ గౌరవాన్ని, నా గౌరవాన్ని కూడ నిలబెట్టు’’ అంది.
అందుకు ఇంద్రుడు నవ్వుతూ, ‘‘సుందరీ... నీ ప్రవర్తనకు సంతోషించాను. ఎలా వచ్చానో, అలాగే వెళ్లపోతాను’’ అంటూ ఆశ్రమం బయటకి వచ్చాడు. అదే సమయానికి, నదీ స్నానం చేసి వచ్చిన గౌతమ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమం నుంచి తన వేషంలో బయటకి వస్తున్న ఇంద్రుడిని చూసి ఆగ్రహించాడు.
‘‘ఓరీ దుర్మతీ... నా రూపం ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తించావు. కాబట్టి నువ్వు వృషణములను కోల్పోతావు’’ అని శపించాడు. వెంటనే ఇంద్రుడి వృషణములు నేలపై రాలి పడ్డాయి.
కోపంతో ఉన్న గౌతముడు, అహల్యను కూడా శపించాడు. ‘‘నువ్వు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడే పడి ఉంటావు. అన్నపానాలు లేకుండా నిరాహారంగా గాలి మాత్రమే భుజిస్తూ ఎవరికీ కనిపించకుండా తపిస్తావు’’ అన్నాడు. ఆ తర్వాత, ‘‘చాలా కాలం తర్వాత దశరథుడి కుమారుడైన శ్రీరాముడు వచ్చినప్పుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. శ్రీరాముడికి అతిథి సత్కారాలు చేశాక నీలో లోభమోహాలు నశించి నన్ను చేరుకుంటావు’’ అని చెప్పి ఆశ్రమాన్ని విడిచి తపస్సు చేసుకోడానికి హిమాలయాలకు వెళ్లిపోయాడు.
గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడు దీనంగా మహర్షులు, చారణులతో కూడి ఉన్న అగ్ని మొదలైన దేవతల దగ్గరకు వెళ్లాడు.
‘‘సమస్త దేవతలారా... మహర్షులారా... చారణులారా... మహాత్ముడైన గౌతముడికి కోపం తెప్పించి ఆయన తపస్సును భగ్నం చేశాను. దేవతల మేలు కోసమే ఇదంతా చేశాను. గౌతముడి శాపం వల్ల నేను అశక్తుడనయ్యాను. కాబట్టి మీరంతా నాకు సాయపడాలి’’ అని వేడుకున్నాడు.
అప్పుడు దేవతలంతా పితృదేవతల దగ్గరకి వెళ్లి, ‘‘యగ్జ్యాల్లో మీ భాగంగా వచ్చే మేకపోతు వృషణాలను ఇంద్రుడికి ఇవ్వండి’’ అని కోరారు. వారందుకు అంగీకరించారు.
విశ్వామిత్రుడు ఈ కథంతా చెప్పి, ‘‘రామా... అప్పటి నుంచి పితృదేవతలు వృషణాలు లేని మేకలనే స్వీకరిస్తున్నారు. ఇంద్రుడు ‘మేష వృషణుడు’ అయ్యాడు. ఇప్పుడు నీవు ఈ ఆశ్రమంలో అడుగుపెట్టు. అహల్యకు శాపవిమోచనం కలిగించు’’ అన్నాడు.
ఆపై విశ్వామిత్రుడు, లక్ష్మణులతో కలిసి రాముడు గౌతముడి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. కఠోరమైన తపస్సు చేస్తూ ఎవరికీ కనిపించకుండా, తేజోరూపంలో ఉన్న అహల్యను చూశాడు. శ్రీరాముడి దర్శనం అయిన వెంటనే అహల్యకు శాప విముక్తి కలిగింది. ఆమె తన పూర్వరూపంలో అందరికీ కనిపించింది. రామలక్ష్మణులు ఆమెకు భక్తితో నమస్కరించారు. అహల్య వారికి అర్ఘ్యపాద్యాలతో అతిథి సత్కారాలు చేసింది. ఆకాశం నుంచి దేవతలు దుంధుభులు మోగిస్తూ పుష్ప వర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చినట్టు గ్రహించిన గౌతమ మహర్షి ఆ క్షణమే అక్కడకి చేరుకున్నాడు. తపస్సుతో పవిత్రురాలైన అహల్యను దేవతలు ప్రశంసించారు. గౌతముడు అహల్యతో కలిసి, శ్రీరాముడిని భక్తిశ్రద్ధలతో పూజించి పరమానందభరితుడయ్యాడు. ఆపై శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రడి వెంట మిథిలా నగరానకి బయల్దేరాడు. జై శ్రీరామ్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి