గురువారం, జూన్ 11, 2026

వార్నాయనో... చంద్రుడే లేకపోతే?!

 

చంద్రుడు కేవలం రాత్రి వేళ వెన్నెల కురిపించే వాడే అనుకోకండి. మన భూమి ఎంత వేగంగా తిరగాలో చురుగ్గా నియంత్రిస్తున్న వాడు కూడా.

ఎప్పుడో 450 కోట్ల సంవత్సరాల క్రితం   భూమిని అంగారకుడి పరిమాణంలో ఉన్న ఒక గ్రహం ఢీకొట్టడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడు. ఆ సమయంలో భూమి చాలా వేగంగా తిరిగేది. ఎంత వేగంగానో తెలుసా? అప్పట్లో ఒక రోజు కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే ఉండేది. చంద్రుడు ఏర్పడ్డాక భూమి వేగానికి బ్రేకులు పడ్డాయనుకోవచ్చు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్ల "టైడల్ ఫ్రిక్షన్" అనే ప్రక్రియ మొదలైంది. ఇదే భూమి భ్రమణాన్ని తగ్గేలా చేసింది. భూమి తిరిగే శక్తి క్రమంగా చంద్రునికి బదిలీ అవుతోంది. దీని వల్ల మన భూమి వేగం తగ్గుతోంది. అంతేకాదు, చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున మనకు కొద్దికొద్దిగా దూరంగా జరుగుతున్నాడు.

చంద్రుడనేవాడు లేకపోతే ఆ బ్రేకింగ్ ప్రక్రియ ఎప్పటికీ జరగదు. భూమి తన వేగాన్ని అలాగే కొనసాగిస్తుంది. రోజులు చిన్నవిగానే ఉండిపోతాయి. అప్పుడు ఒక సంవత్సరానికి  వెయ్యికి పైగా రోజులు వస్తాయి.

దీని పరిణామాలు కేవలం సమయాన్ని లెక్కించడానికే పరిమితం కావు. వేగంగా తిరిగే భూమి చాలా శక్తివంతమైన గాలులను సృష్టిస్తుంది. వాతావరణ ప్రసరణ విధానాలు పూర్తిగా మారిపోతాయి. మరింత తీవ్రమైన, తరచుగా వచ్చే తుఫానులను సృష్టిస్తాయి. వాతావరణ వ్యవస్థలను, సముద్ర ప్రవాహాలను శాసించే "కొరియోలిస్ ప్రభావం" (Coriolis effect) మరింత తీవ్రంగా ఉంటుంది. జీవం ఏర్పడడానికి కారణమైన సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడేవే కావు.   జీవులు వృద్ధి చెందడానికి తోడ్పడిన ప్రస్తుత స్థిరమైన వాతావరణం అప్పుడు ఉండదు.

భూమి తన అక్షం మీద కొంత వంపుతో ఉంటాడని తెలుసుకదా? దీన్ని ‘అక్షీయ వంపు’ అంటే ‘యాక్సియల్ టిల్ట్’ అంటారు.   చంద్రుడు దీన్ని కూడా స్థిరంగా ఉండేలా చేస్తున్నాడు. ఈ వంపు సుమారు 22 నుండి 24.5 డిగ్రీల పరిమిత పరిధిలోనే ఉండేలా చూస్తున్నాడు. ఈ స్థిరత్వం లేకపోతే, లక్షల సంవత్సరాల కాలంలో ఆ వంపు విపరీతంగా మారిపోయేది. ఫలితంగా తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించేవి. జీవన వ్యవస్థలు నిలదొక్కుకోవడం చాలా కష్టమయ్యేది. మన పొరుగు గ్రహం మార్స్ లో ఇదే జరుగుతోంది. మనకి చంద్రుడిలాగా మార్స్ కి స్థిరత్వాన్ని ఇచ్చే ఉపగ్రహం లేదు కదా? అందుకనే  మార్స్ గ్రహం ఇలాంటి తీవ్రమైన అక్షీయ మార్పులను చరిత్రలో ఎదుర్కొంది.

ఇక అలల విషయానికి వస్తే, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లనే సముద్రంలో ఆటుపోటులు కలుగుతున్నాయి. ఈ అలలే మన తీరప్రాంతాలను తీర్చిదిద్దాయి. సముద్ర రసాయన శాస్త్రాన్ని ప్రభావితం చేశాయి. అంతేకాదు, సేంద్రీయ రసాయనాలు కేంద్రీకృతమై చర్యలు జరపడానికి వీలైన తీరప్రాంత మడుగులను (Tidal pools) సృష్టించాయి. ఇవన్నీ భూమిపై తొలి జీవం ఆవిర్భవించడానికి దోహదపడిన పరిణామాలే.  

ఇప్పుడు చంద్రుడిని తీసేశామనుకోండి. ఏం జరుగుతుందో తెలుసా? మనం కేవలం వెన్నెల రాత్రులను, సముద్రపు అలలను మాత్రమే కోల్పోతామని అనుకోకండి. సంక్లిష్ట జీవం ఏర్పడటానికి కారణమైన స్థిరమైన వాతావరణ పరిస్థితులనే పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.

మన భూమి కక్ష్యలో ఉంటూ, మన చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహంగా చంద్రుడు ఎంత బాగా మనకి ఉపయోగపడుతున్నాడో అర్థమైంది కదా. చంద్రుడు మనకి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటూ, నిశ్శబ్దంగా తన పనిని తాను చేసుకుపోతున్నాడు. మనకి చల్లని వెన్నెలతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలిగిస్తున్నాడు. అందుకే అందామా... ‘హ్యాట్సాఫ్ చందమామా’ అని.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి