రామ దర్శనంతో అహల్యకు శాపవిమోచనం అవగానే గౌతమ మహర్షి విచ్చేశాడు. గౌతముడు, అహల్య కలిసి పరమానందంతో రాముడిని పూజించారు. వారి సత్కారాలు పొందిన తర్వాత రామలక్ష్మణులు, విశ్వామిత్రుడి వెంట మిథిలా నగరానికి బయల్దేరారు.
మిథిలలో జనక మహారాజు యజ్నం చేస్తున్న చోటుకి చేరుకున్నారు. యజ్నవాటిక కోలాహలంగా ఉంది. అదంతా చూసిన రాముడు విశ్వామిత్రుడితో ‘‘ఓ మహర్షీ... జనకుడి యాగశాల వైభవంగా, సకల సంరంభాలతో కూడి ఉంది. అనేక దేశాల వారు, వేద పండితులైన బ్రాహ్మణులు వేలాదిగా ఉన్నారు. ఈ ప్రాంతమంతా రుషుల నివాసాలతోను, వందల కొద్దీ బండ్లతోనూ నిండి ఉంది. మనం ఉండడానికి యోగ్యమైన ప్రదేశం ఏది?’’ అని అడిగాడు.
అందుకు విశ్వామిత్రుడు, ‘‘రామా... జలం సమృద్ధిగా ఉండే చోటు, జనం అంతగా లేని ప్రదేశం చూసి బస ఏర్పాటు చేస్తాను’’ అన్నాడు.
ఈలోగా జనక మహారాజుకు, విశ్వామిత్రుడు వచ్చినట్టు తెలిసింది. వెంటనే ఆయన తన పురోహితుడు శతానంద మహర్షితోను, బ్రాహ్మణులు, పరివారంతోను కలిసి వినయంగా అక్కడకి వచ్చాడు. యాగం నిర్వహించే రుత్విజులు భక్తితో విశ్వామిత్రుడికి పూజించి తగిన సత్కారాలు చేశారు.
విశ్వామిత్రుడు జనకుడితో, ‘‘రాజా... నీవు క్షేమంగా ఉన్నావా? యాగం సక్రమంగా సాగుతోందా?’’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అలాగే రుత్విజులను, బ్రాహ్మణులను పలకరించి, ‘‘మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నాడు. జనక మహారాజు వారందరికీ ఆసనాలు చూపించి ‘‘మహర్షీ... మీరు ఈ మునులందరితో కలిసి సుఖంగా కూర్చోండి. బ్రహ్మర్షులైన మీ రాక వల్ల నా యగ్నం సఫలమైంది. మీరందరి దర్శనంతో నా జన్మ ధన్యమైంది. మహాత్మా... ఇంకొక పన్నెండు రోజుల్లో యగ్నం పూర్తి అవుతుంది. అప్పుడు హవిస్సులను స్వీకరిచండానికి దేవతలంతా వస్తారు. మీరు కూడా వారిని చూడవచ్చు’’ అంటూ సంతోషంగా చెప్పాడు.
ఆ తర్వాత జనకుడు విశ్వామిత్రుడి వెంట ఉన్న రామలక్ష్మణులను చూసి వినయంగా ప్రశ్నించాడు.
‘‘ఓ బ్రహ్మర్షీ... మీతో వచ్చిన ఈ బాలురు ఎవరు? కాలినడకన ఇంత దూరం ఎందుకు వచ్చారు? చూస్తుంటే ఎంతో ఠీవిగా రాజకుమారుల వలె కనిపిస్తున్నారు. ధనుర్బాణాలు ధరించిన వీరు దేవతలతో సమానమైన పరాక్రమవంతులుగా అనిపిస్తున్నారు. విశాలమైన కన్నులతో, యవ్వనంలోకి అడుగుపెడుతున్న వీరు... అందంలో అశ్వనీ దేవతలనే మించిపోతున్నారు. వీరు ఎవరి కుమారులు? ఈ చిరంజీవుల గురించి తెలుసుకోవాలని ఉంది’’ అంటూ అడిగాడు.
అందుకు విశ్వామిత్రుడు,‘‘జనక మహారాజా... వీరిద్దరూ దశరథ మహారాజు కుమారులు. రామలక్ష్మణులు. సిద్ధాశ్రమంలో నేను చేస్తున్న యాగానికి మారీచ సుబాహులనే రాక్షసులు ఆటంకాలు కల్పిస్తుంటే వీరిని తీసుకువచ్చాను. వీరు ఆ రాక్షసులను జయించి యాగ రక్షణ చేశారు. ఆ తర్వాత నాతో కలిసి విశాల నగరానికి వచ్చారు. ఆపై గౌతముడి ఆశ్రమానికి వచ్చాం. అక్కడ రాముడి దర్శనంతో అహల్యకు శాప విమోచనం కలిగింది. గౌతమ మహర్షి, అహల్యల సత్కారాలు అందుకున్న మీదట ఇలా వచ్చాం. నీ దగ్గర ఉన్న శివధనుస్సును గురించి తెలుసుకోడానికి నాతో పాటు వచ్చారు’’ అంటూ వివరించాడు.
విశ్వామిత్రుడి మాటలు వినగానే రాజ పురోహితుడైన శతానందుడు పరమానందం చెందాడు. అహల్య, గౌతముల కుమారుడైన ఆయన, రామలక్ష్మణులను పరికించి చూసి పులకరించిపోయాడు. తర్వాత విశ్వామిత్రుడితో, ‘‘మహాత్మా... తీవ్ర తపస్సులో మునిగిపోయి ఉన్న మా తల్లి అహల్యను మీరంతా చూశారా? పవిత్రురాలైన నా తల్లి శ్రీరాముడికి తగిన విధంగా అతిథి సత్కారాలు చేసిందా? నా తండ్రి గౌతముడిని చేరిందా? నా తల్లికి విధివశాత్తు ఎదురైన సంఘటన గురించి రాముడికి వివరంగా చెప్పారా? నా తల్లిదండ్రులు ఇద్దరూ రాముడిని పూజించారా? శ్రీరాముడు వారిని అనుగ్రహించాడా?’’ అంటూ ప్రశ్నలు కురిపించాడు.
అందుకు విశ్వామిత్రుడు సవివరంగా అన్ని సంగతులూ చెప్పి, ‘‘శతానందా... నీ తల్లిదండ్రులిద్దరూ కలుసుకున్నారు. నేను ఆ సమయానికి తగిన విధంగా చేయగలిగనదంతా చేశాను. రేణుకాదేవిని జమదగ్నిలాగా నీ తండ్రి అహల్యను స్వీకరించాడు’’ అన్నాడు.
ఆ మాటలకు శతానందుడు ఎంతగానో ఆనందించి, రాముడి దగ్గరకు వచ్చి,
‘‘ఓ రామచంద్రా... నీవు విశ్వామిత్రుడితో కలిసి ఇక్కడకి రావడం మా అదృష్టం. నీకిదే స్వాగతం’’ అంటూ ఆప్యాయంగా పలకరించాడు.
ఆ తర్వాత, ‘‘రామా... ఈ విశ్వామిత్రుడు మహా శక్తిమంతుడు. ఈయన సాధించలేని కార్యం అంటూ ఏదీ లేదు. తపస్సుతో బ్రహ్మర్షి అయిన తేజశ్శాలి. ఇలాంటి గొప్ప గురువును ఆశ్రయించినందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఆ మహనీయుడి కథ చెబుతాను. విను’’ అన్నాడు.
రామలక్ష్మణులు భక్తిశ్రద్ధలతో వింటున్నారు. శతానందుడు చెప్పసాగాడు. ఆయన సవివరంగా చెప్పిన విశ్వామిత్రుడి కథ ఏంటో వచ్చే భాగంలో తెలసుకుందాం. జై శ్రీరామ్.
ఆదివారం, జులై 05, 2026
మిథిలా నగరంలో రామలక్ష్మణులు! (పిల్లల కోసం రాముడి కథ - 18)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి