గురువారం, సెప్టెంబర్ 03, 2026

పాముల జనాభా లెక్కలు!


 

మనుషుల జనాభా లెక్కల గురించి తెలుసు. మరి పాముల జనాభా లెక్కల గురించి విన్నారా? అదే జరుగుతోంది ఇప్పుడు మధ్యప్రదేశ్ లో. ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి. పాము కాటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడి అధికారులు ఆ పని మొదలు పెట్టేశారు కూడా. వాళ్లేమంటున్నారో తెలుసా? ‘‘దేశంలోనే తొలిసారిగా పాముల గురించి శాస్త్రీయంగా జరుగుతున్న అధ్యయనం ఇది’’ అని. ఈ కార్యక్రమం ‘‘స్నేక్ సెన్సస్’’ పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగని రాష్ట్రం మొత్తం మీద పాములెన్ని ఉన్నాయోనని వెతికి పట్టుకుని ఒకటి... రెండు... మూడు... అని లెక్క పెడతారనుకోకండి.

డెహ్రాడూన్ లోని భారత వణ్యప్రాణి సంస్థ, మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కలిసి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏ జాతి పాములు సంచరిస్తున్నాయి, వాటిలో విషపూరితమైనవి ఏవి లాంటి విషయాలపై సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తారన్నమాట.  అధికారులు మొన్న మార్చిలో పని మొదలు పెట్టారు. ఈ ఏడాది చివరి వరకు అదే పనిలో ఉంటారు.

నిజానికి ఇలాంటి పని కొత్తేమీ కాదు. ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతాల్లో పాముల గురించి కొంత సమాచారం సేకరించారు. అలాగే కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సరీసృపాలు, ఉభయచరాల డేటా సమీకరించారు. అయితే ఇంత పకడ్బందీగా, విస్తృతంగా పాముల గురించి సర్వే చేపట్టడం దేశంలనే తొలిసారి. ఇందుకోసం వందమందికిపైగా సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. తొలి దశలో పాముల సంచారం, పాము కాట్ల సంఘటనలు, మరణాల గురించి ఆరా తీశారు. వేర్వేరు సీజన్లలో అయిదు ప్రత్యేక ప్రాంతాల్లో పాములకు సంబంధించిన వీలయినన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తారు. తరచు కనిపించే నాలుగు విషపూరితమైన పెద్ద పాములు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, వాటిని పట్టుకుని ఏ ప్రాంతంలో వదిలిపెడితే మంచిదనే అంశాలను కూడా తెలుసుకుంటారు. పులులు సంచరించే కన్హా, సత్పుర, పెన్నా అభయారణ్యాలు, గాంధీసాగర్, అమర్ కంటక్  వన్య ప్రాంతాల్లోని మైదాన, నదీపరీవాహక ప్రాంతాల్లో  ఈ పాముల గణన జరుగుతోంది. పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ, రాష్ట్ర అటవీ శాఖల సమన్వయంతో ఈ సర్ప సమాచార సేకరణ జరుగుతోంది.  ఈ క్రతువులో 15 మంది పరిశోధకులు పాల్గొంటున్నారని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్ట్ డాక్టర్ అభిజీత్ దాస్ చెబుతున్నారు. ఈ సర్వే ఇక ముందు జరగబోయే వన్యప్రాణి సమాచార సేకరణలకు మార్గదర్శకంగా నిలిచేంత సమగ్రంగా ఉంటుందని చెప్పారు. వన్యజంతువుల విషయంలో ప్రజల భద్రతకు తీసుకోవలసిన చర్యలను కూడా ఈ సర్వే సూచిస్తుంది. ఇందులో పాల్గొనే సిబ్బందికి స్నేక్ కిట్లు, జియో టాగ్  కెమేరాలు, జీపీఎస్ పరికరాలు లాంటి ఆధునిక పరికరాలను అందించారు. ఏదైనా పామును ఫొటో తీసిన వెంటనే దాని ద్వారా అది తీసిన ప్రాంతం వివరాలు, ఆ పాము జాతి సమాచారాన్ని విశ్లేషించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో పాముల కదలికలను మరింత కచ్చితంగా తెలుసుకోడానికి రేడియో-టెలిమెట్రీ విధానాలను కూడా ఉపయోగిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాముల్లో రాజులాంటిదైన ‘కింగ్ కోబ్రా’ ఉనికి వివరాలను కూడా తెలుసుకుంటారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి