అప్పటికింకా రాముడు లేడు. రావణుడు మాత్రం ఉన్నాడు. ఆ రావణుడు శివుడి ఆత్మలింగం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు ఆత్మలింగం ఒక రాక్షసుడి పరమైతే ఎలా? లంకే కైలాసం అయిపోదూ? ఆ సంగతి తెలిసి విష్ణువు రంగంలోకి దిగాడు. శివుడు సతీ సమేతంగా రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు వరం కోరుకునే సమయానికి విష్ణువు తన మాయను అతడిలో ప్రవేశపెట్టాడు. ఇంకేముందీ? ఆత్మలింగం కోరబోయిన రావణుడి కన్ను శివుడి పక్కన ఉన్న పార్వతి మీద పడింది. కళ్లకు మాయ కమ్మేసింది. ‘ఇంత అందంగా ఉన్న అంగన, జంగమదేవర దగ్గరెందుకు? లంకలో ఉండాలి కానీ...’ అనే చింతన కలిగింది.
‘వరం కోరుకో రావణా’ అన్నాడు భోళా శంకరుడు. ‘ఈ పార్వతిని నాతో పంపించు’ అన్నాడు రావణుడు, విష్ణుమాయ మైకంలో.
భక్తుడి తపస్సు తిరుగులేనిది. అతడి కోరిక కాదనలేనిది.
తెల్లబోయిన పార్వతికి తప్పదని చెప్పి, ఆమెను రావణుడికి అప్పగించి అంతర్ధానమయ్యాడు భక్త సులభుడు. పతి మాటకి, తపతి వరానికి బద్ధురాలై రావణుడి వెంట లంకకు బయల్దేరింది పార్వతి. మధ్యలో నారదుడు కలిశాడు. పార్వతికి ‘ఇదంతా విష్ణు మాయ ప్రభావం’ అని చెప్పాడు. వెంటనే కోపానికి గురైన పార్వతి, ‘ఇప్పుడు నేను అనుభవిస్తున్న వియోగాన్ని ఆ విష్ణువు కూడా అనుభవిస్తాడు’ అంది. అది ఆమె దృష్టిలో శాపం. లోకాలకు మాత్రం వరం. ఆ సంగతిని నారదుడు గ్రహించి పులకరించాడు. భవిష్యత్తును దర్శించాడు. రాబోయే రామావతారం అతడి కళ్లకు గోచరమైంది. ఆ సంగతినే పార్వతికి ఆనందంగా చెబుతూ ఓ అద్భతమైన పాటను అందుకున్నాడు...
అదీ సందర్భం. ‘భూకైలాస్’ సినిమా చూసిన వారికి ఈ సన్నివేశం, అందులో వచ్చే పాట కూడా చిరకాలం గుర్తుండిపోయేవే. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, బి. సరోజ, జమున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎప్పుడో 1958లో వచ్చినా, ఇప్పటికీ పౌరాణిక చిత్రాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
నారదుడు, పార్వతికి రాబోయే రామావతార ఘట్టాలను కళ్లకు కట్టేలా పరవశించిపోతూ పాడే ‘రాముని అవతారం... రవికుల సోముని అవతారం...’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే.
మొత్తం రామాయణాన్ని క్లుప్తంగా చెప్పాలి. జరగబోయే లోకకళ్యాణాన్ని మనోహరంగా ఆవిష్కరించాలి. ఈ సందర్భాన్ని సీనియర్ సముద్రాల కలం అజరామరం చేసింది. మొత్తం ఏడు నిమిషాల ఈ పాట ఘంటసాల గళంలో మరింత అద్భుతంగా అమరింది. సంగీత దర్శకులు ఆర్. సుదర్వన్, ఆర్. గోవర్ధన్ స్వరకల్పనలో రాగరంజింతం అయింది.
...............
రాముని
అవతారం
చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం
:
ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత
: సముద్రాల (సీనియర్)
నేపధ్య
గానం : ఘంటసాల
సాకీ :
ద్వారపాలుర మరల దరిదీయు కృపయో...
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో...
రాముని అవతారం...
రవికులసోముని అవతారం....
పల్లవి :
రాముని అవతారం ...రవికులసోముని అవతారం
రాముని అవతారం ...రవికులసోముని అవతారం
సుజనజనావన ధర్మాధారం... దుర్జనహృదయవిదారం ...
రాముని అవతారం
చరణం 1:
దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ...
కౌసల్యాసతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు...
జన్మింతురు సహజాతులు మువ్వురు...
లక్ష్మణ.. శత్రుఘ్న.. భరతా
రాముని అవతారం ...రవికులసోముని అవతారం
చరణం 2:
చదువులునేరుచు మిషచేత...
చాపముదాలిచి చేతా
విశ్వామిత్రుని
వెనువెంట ...
యాగముకావగ చనునంట
అంతము
చేయునహల్యకు శాపము ...
అంతము చేయునహల్యకు శాపము
వొసగును
సుందర రూపం ...
రాముని
అవతారం...రవికులసోముని అవతారం
ధనువో జనకుని మనసున భయమో...
ధారుణి కన్యాసంశయమో
దనుజులు
కలగను సుఖగోపురమో...
దనుజులు
కలగను సుఖగోపురమో...
విరిగెను మిథిలానగరమునా
రాముని
అవతారం రవికులసోముని అవతారం
కపట నాటకుని పట్టాభిషేకం...
కలుగును తాత్కాలిక శోకం
భీకర
కానన వాసారంభం ...
లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరికతీరుచుకోసం ...
పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని
కోరికతీరుచుకోసం ...
పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి
నవ నవసంతోషం ...
గురుజనసేవకు ఆదేశం
రాముని
అవతారం రవికులసోముని అవతారం
చరణం 3:
అదిగో చూడుము బంగరు జింకా...
అదిగో చూడుము బంగరు జింకా...
మన్నైకనునయ్యో లంకా...
హరనయనాగ్ని పరాంగన వంకా...
అరిగిన మరణమె నీకింకా...
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ ...
వానరకుల పుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ...
వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం...
ముద్రిక కాదిది భువన నిదానం..
జీవన్ముక్తికి సోపానం... జీవన్ముక్తికి సోపానం
రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులశోమా...
సీతాశోక వినాశనకారి... లంకావైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ
చరిత...
సమయును పరసతిపై మమకారం...
వెలయును ధర్మవిచారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం
పాట గురించి నాలుగు మాటలు...
ఆద్యంతం అద్భుతంగా సాగే ఈ పాట సాహిత్యం గురించి చెప్పడానికి స్థాయి సరిపోకపోయినా, ఓ మంచి పాట అభిమానిగా నాలుగు మాటలు చెప్పుకుందాం.
"రాముని అవతారం రవి కుల సోముని అవతారం" అంటే సూర్య వంశానికి రాముడు
చంద్రుని వంటి వాడట. అలా రామచంద్రుడు నామాన్ని సార్థకం చేశారు సముద్రాల.
"దాశరధి గా శ్రీ
కాంతుడు వెలయు
కౌసల్యాసతి సతి
తపము ఫలించు
జన్మింతురు సహా
జాతులు మువ్వురు"...
మూడు ముక్కల్లో ఎన్ని విషయాలో. రాముడి తల్లిదండ్రుల
ప్రస్తావన వచ్చేసింది. విష్ణువు సహవాసులైన శేషుడు, సుదర్శనం, శంఖం అంశలతో లక్ష్మణ,
శత్రుఘ్న, భరతులు పుట్టారని చెప్పడానికి ‘సహాజాతులు’ అనే పదప్రయోగం ఎంత గొప్పగా
ఉంటుందో.
"చదువులు నేరుచు మిష
చేత
చాపం దాలిచి చేత
విశ్వామిత్రుని
వెనువెంట
యాగం కావగ
చనునంట"...
స్వయానా విష్ణువు చదువులు నేర్చుకోవాలా?
కేవలం ఆ మిష చేత విల్లు ధరించాడంతే... అని చెప్పడం... వెనువెంట, చనునంట అనడంలో
రాబోయే కథను చెబుతున్న భావన కలిగించడం... సముద్రాలకే కదా చెల్లుతుంది?
ఇక సీతా స్వయంవర ఘట్టం...
‘‘ధనువో, జనకుని మనమున భయమో, ధారుణి కన్యా సంశయమో… దనుజులు కలగను సుఖ
గోపురమో...
విరిగెను మిథిలా నగరమున…’
ఆహా... రాముడు విరిచింది ధనువొక్కటే కాదట... జనకుడి భయం, సీత సంశయం, రాక్షసులు కలలు... అన్నీ ఒకేసారి ‘ఫెల్లు’మన్నాయన్నమాట.
అక్కడి
నుంచి అరణ్య వాస దృశ్యం...
"అదిగో చూడుము బంగరు
జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగన
వంక
అడిగిన మరణమే నీ
కింక "
శివుడి కంటిలో అగ్నివంటిదట పరస్త్రీ
అంటే... ‘హర నయనాగ్ని పరాంగన..’ ప్రయోగం చక్కగా అమరింది. జింక, లంక, వంక, ఇంక...
అంత్య ప్రాసలతో అల్పంలో అనల్ప అర్థాలతో ఆవిష్కరణ.
సీతాపహరణం తర్వాత హనుమంతుడే కదా వస్తాడు?
అందుకే మరి...
"రమ్ము రమ్ము హే
భాగవతోత్తమ
వానర కుల పుంగవ
హనుమా
ముద్రిక కాదిది
భువన నిదానం
జీవన్ముక్తికి
సోపానం"
దేవుడికి దూరమైన జీవుడికి
ముద్రిక చేర్చడమంటే జీవన్ముక్తికి సోపానం వేయడమే కదా?
"రామరామ జయ రామ రామ
జయ రామరామ రఘుకుల
సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి"
ఈ నాలుగు పంక్తుల్లో... రామ నామ వైభవం, లంక నాశనం, రావణ సంహారం, భక్త జన శోక వినాశనం... ఇన్ని తాత్పర్యాలను "సముద్రాల"
వారి లఘు రామాయణం ప్రతిబింబిస్తుంది. ఇంకేం చెప్పగలం ఈ పాట గురించి... విని
పరవశించడం తప్ప.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి