మంగళవారం, అక్టోబర్ 25, 2016

జ్వరం మంచిదే!



పాపకి జ్వరంగా ఉంది. మూసిన కన్ను తెరవడం లేదు. 
ఏవేవో పనుల మీద ఇల్లంతా తిరుగుతున్న అమ్మ చేతి మునివేళ్ళు ఆ చిన్నారి నుదిటి మీద, మెడ మీద 
ఎన్ని సార్లు సుతారంగా తాకి చూశాయో.  
ఎక్కడో ఆఫీస్ లో ఉన్న నాన్న ఎన్నిసార్లు ఇంటికి ఫోన్ చేసాడో, పాపకి ఎలా ఉంది అని. 
చివరకి నాన్న మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాడు. 
అమ్మా నాన్నా పాపకి చెరో పక్కనా కూర్చున్నారు. 'ఎలా ఉంది బంగారూ' అని అడుగుతూనే ఉన్నారు. 
'బాధగా ఉందమ్మా' అని పాప అంటే, 'తగ్గిపోతుందమ్మా, కొంచెం ఓపిక పట్టు' అంటూ అమ్మ, పాప తల మీద రాస్తూ కూర్చుంది. పాపని మరిపించడానికి నాన్న ఏవో కథలు చెబుతూ పక్కనే పడుకున్నాడు. 
'నాన్నా! ఈ జ్వరం నాకొద్దు. తీసేయ్' అంది పాప నీరసంగా.  నాన్న, అమ్మ కేసి చూసి సన్నగా నవ్వాడు. 
తర్వాత పాపతో అన్నాడు, 'ఎలా నాన్నా! అలా అనకూడదు. నిన్న ఐస్క్రీమ్ తినొద్దంటే విన్నావా? చూడు ఇప్పుడెలా బాధ పడుతున్నావో.  అయినా తగ్గిపోతుందిలే సరేనా?' అంటూ ధైర్యం చెప్పాడు.
అంత జ్వరంలో ఉన్నా, ఆ పాపకి ఎంతో హాయిగా అనిపిస్తోంది. 
అమ్మా నాన్నా దగ్గరే ఉండి, ప్రేమ చూపించడం బాగుంది. 
'ఆమ్మా! నాకు బెండ కాయ వేపుడు తినాలని ఉంది' అని ఈ పాప అంటే, 
'ఇప్పుడు కాదమ్మా! నీకు జ్వరం తగ్గిపోగానే చేసి పెడతానే' అని అమ్మ భరోసా ఇచ్చింది. 
'నాన్నా! నాకేం బార్బీ బొమ్మ కావలి' అంది గోముగా. 
'తప్పకుండా తల్లీ' అన్నాడు నాన్న వెంటనే. అమ్మా నాన్నా చేతులు పట్టుకుని ఆ పాప నిద్రలోకి జారుకుంది. 
మర్నాడు లేచేసరికల్లా జ్వరం తగ్గింది. రెండు రోజుల్లో మామూలుగా అయింది. అమ్మ బెండ కాయ వేపుడు చేసింది. నాన్న బార్బీ బొమ్మ తెచ్సి ఇచ్చాడు. ఎందుకో తెలియదు కానీ జ్వరం రావడం ఆ పాపకి నచ్చింది.
********
దాదాపు ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. కానీ ఒక విషయం గ్రహించాలి. అమ్మా నాన్నా ఆ పాపకి ఎన్నో సపర్యలు చేశారు, కానీ జ్వరాన్ని మాత్రం ఆమె నుంచి తీసేయలేక పోయారు. ఆ బాధను పాపే భరించింది. కానీ అమ్మా నాన్నా మాత్రం పక్కనే ఉండి ప్రేమ చూపించారు. 
భగవంతుడు కూడా అంతే. మన కష్టాన్ని తీసేయలేడు . కానీ ఆ బాధని తట్టుకొనే ధైర్యాన్ని ఇస్తాడు. 
భరోసా కల్పిస్తాడు. 
ఎందుకంటే ఆ బాధ ఎప్పుడో మనం చేసిన పనుల ప్రభావమే! 
ఆ బాధ తగ్గిపోగానే మనం కోరినవి అన్నీ ఇస్తాడు!


బుధవారం, మే 04, 2016

జీవిత సత్యం

(ఎప్పుడో చిన్నపుడు రాసుకున్న కవిత)

 

వెలుగుతున్న ప్రమిద కింద... 

పొంచి ఉంది చీకటి!

వికసించే పువ్వు చూడు... 

వాడిపోవు గంటకి!

ఉదయించే సూర్యుడైన... 

అస్తమించు రాత్రికి!

పున్నమి చంద్రుడు సైతం... 

వన్నె తగ్గు మర్నాటికి!

జీవితాన సుఖముందని విర్రవీగి పొంగి పోకు... 

ఎంచి చూడ సుఖమంతా క్షణంలోన సగం సేపు!

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

రాద్ధాంత సిద్ధాంతం


‘నీచాయ నమః
నికృష్టాయ నమః
తుచ్ఛ రాజకీయ ప్రలోభాయ నమః
అసత్య ప్రలాపాయ నమః
అడ్డగోలు వాగ్వివాద ప్రకాశాయ నమః’
- గురువుగారి అష్టోత్తరం పూర్తయ్యే వరకు శిష్యుడు వినమ్రంగా కూర్చున్నాడు. గురువుగారు గంట కొట్టి ప్రసాదం ఇవ్వగానే కళ్లకద్దుకుని నోట్లో వేసుకుని- ‘ఎన్ని పూజలు చేసినా మన జాతకాలు మారతాయంటారా గురూగారూ?’ అన్నాడు.

‘భలేవాడివిరా! నమ్మకమే అన్నింటికీ పునాది. ఆ నమ్మకమే నిన్ను, నన్ను, ప్రజానీకాన్ని నడిపిస్తోంది. ఈ పాతకాల స్వామి ఆరాధనా ఆ నమ్మకం మీదే ఆధారపడి ఉంది నాయనా. ముందు లెంపలేసుకుని ఆ తరవాత సందేహాలు ఏమైనా ఉంటే అడుగు’

‘ఇంతకూ ఈ పాతకాల స్వామి ఎవరండీ?’

‘రాజకీయాల్లో ఈ మధ్య నీతి నిజాయతీ పెరిగిపోతున్నాయిరా. ప్రజల కోసం పని చేసే నికార్సయిన నేతలు అధికారం చలాయిస్తూ చెలరేగిపోతున్నారు. మనలాంటి నీచ నేతల భవితవ్యం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. అందుకే ఈయనను ప్రతిష్ఠించాను. కోల్పోయిన వైభవాన్ని ఏ నాటికైనా తిరిగి సాధించడానికి ప్రస్తుతానికి ఇదొక్క మార్గమే కనిపిస్తోంది నాయనా’

‘ఆహా, మీ చెత్తశుద్ధికి జోహార్లండీ. కానీ, ఏమిటో గురూగారూ... రోజురోజుకూ నిరాశ నిస్పృహలు తుపాను మేఘాల్లాగా కమ్మేస్తున్నాయి. ఏనాటికైనా మూడు కుంభకోణాలు, ఆరు అవినీతి పథకాలతో కళకళలాడే రోజులు మళ్ళీ వస్తాయంటారా?’

‘అందుకే కదరా నా తపన, తపస్సూనూ! రాత్రి పాతకాల స్వామిని ధ్యానిస్తూ మగత నిద్రలో జారుకున్నానా... ఓ రాత్రివేళ ఆయన కనిపించాడు. నీచా... నివ్వెరపోకు! లంచాల నైవేద్యాలు, అక్రమ ధన నివేదనలు, అవినీతి వాటాల ఆమ్యామ్యాలు, కమిషన్ల కైంకర్యాలు, ముడుపుల ఆరగింపులు లేక నాకు కూడా శోష వచ్చేట్టుంది. ఓపికతో నిరీక్షిస్తే గెలుపు నీదేనంటూ వూరడించాడు’

‘మరి అందుకు ఏం చేయాలో ఉపదేశించాడా గురూగారూ!’

‘ఆహా... వాటిని బోధిద్దామనే నిన్ను ఉన్నపళాన పిలిపించా. బుర్ర దగ్గర పెట్టుకుని విను. మనలాగా కుర్చీకి దూరమై కునారిల్లుతున్న నేతల్ని పోగుచెయ్యాలి. పాలకులు ఏం చేసినా అందులో తప్పులు వెతకాలి. వూరూవాడా గోలగోల చేస్తూ ఆరోపణలు, నిందలు, విమర్శలతో వూదరగొట్టాలి. చట్టసభల్ని సైతం సాగనీయకుండా మంకుపట్టు పట్టాలని పాతకాల స్వామి ఆన’

‘కానీ, పాలకుల పనులు ప్రజలకు నచ్చుతున్న వేళ, మన గోలను ఎవరైనా పట్టించుకుంటారా... అని!’

‘ఓరి పిచ్చి సన్నాసీ, నిన్ను జనం పట్టించుకోలేదు కాబట్టే ఇవాళ నువ్వీ స్థితిలో అఘోరిస్తున్నావ్‌. కాబట్టి, సిగ్గు లజ్జ ఉచ్చం నీచం వదిలేసి మరీ- ఈ పాలకుల వల్ల మహా ఘోరాలు జరిగిపోతున్నట్లు హడావుడి చేయాలి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి రాజకీయ రంగు పులిమేయాలి. దాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా పాలకుల మీద బురద చల్లేయాలి. దీన్నే రాద్ధాంత సిద్ధాంతం అంటారు’

‘భలే బాగుంది గురూగారూ! కానీ నాలాంటి మట్టిబుర్ర కోసం ఆచరణ కూడా కాస్త చెప్పరూ?’

‘ఏముందిరా, ఉదాహరణకు ఎక్కడో ఏ రైతో, విద్యార్థో ఆత్మహత్య చేసుకున్నాడనుకో... వాళ్లను ప్రభుత్వమే హత్య చేసిందని ఓ ప్రకటన చేసేయాలి’

‘ప్రభుత్వం హత్య ఎలా చేస్తుంది గురూగారూ... అదేమన్నా మనిషా?’

‘అలాంటివేమీ నువ్వు ఆలోచించకూడదురా. విమర్శే నీ పరమావధి!’

‘ఓ... అర్థమైందండి. ఆఖరికి నిద్దట్లో దోమ కుట్టినా, ఉలిక్కిపడి లేచి ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వమే దోమల్ని పెంచి పోషిస్తోందని అనాలన్న మాట’

‘పర్వాలేదు, కొంచెం దారిలో పడ్డావ్‌. ఇలాంటి చెత్త ప్రకటనలు చేసేటప్పుడు పనిలో పనిగా నీ గురించీ గొప్పలు చెప్పేసుకోవాలి. ఉదాహరణకు దేశభక్తి నా రక్తంలోనే ఉంది లాంటి స్వోత్కర్షలు చేసినా నష్టమేమీ ఉండదు’

‘ఆహా... దేశభక్తి రక్తంలో ఉందనా? భలేగా ఉందండీ. కానీ, గబుక్కున ఎవరైనా మనకు రక్తపరీక్ష చేస్తే, మరి అందులో కుయుక్తుల క్రోమోజోములు, అక్రమార్జనల డీఎన్‌ఏలు, కంత్రీ పనుల కణాలు, అవినీతి కొలస్ట్రాళ్లు... లాంటి వంశపారంపర్య అవలక్షణాలన్నీ బయటపడతాయేమోనండీ?’

‘ఓరి నీ భయసందేహాలు బద్దలైపోనూ! ఇలాంటి పిరికి సన్నాసివి నీచరాజకీయాల్లో ఎలా ఎదుగుతావురా? ముందు చెప్పేది విను. ఇలా ప్రతిదానికీ ప్రభుత్వాన్ని తిట్టడమే నీ దినచర్యన్నమాట. కావాలంటే దేశాన్నే నాశనం చేసేస్తున్నారని గగ్గోలు పెట్టాలి. ఇంకా అవసరమైతే కులాన్ని, మతాన్ని కూడా ఎగదోయాలి’

‘నేనేదో మీ దగ్గర నీచ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నవాణ్ని. ఇలాంటి బృహత్కార్యాలు చేయగలనా అని...’

‘ఆ మాట అన్నావంటే ఇంకా నీలో కాస్తోకూస్తో సిగ్గూ అభిమానం ఏడిశాయన్నమాటే! ఇలాంటి లక్షణాలు నీచనేతగా ఎదగడానికి ఎందుకూ పనికిరావు. కాబట్టి వదిలించుకో! నా పాఠాలు వినడంతోపాటు, సమకాలీన సిగ్గుమాలిన రాజకీయాల్నీ గమనిస్తూ ఉండాలి. నీ చుట్టూ చూస్తే ఇలాంటి దురంధరులు అనేకమంది కనిపిస్తారు. వారి దారిలో సాగిపో. మరోపక్క తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి పనులపై విచారణ జరుగుతుంటే అదంతా కక్షసాధింపు చర్యలంటూ యాగీ చేస్తున్న నాయకమ్మన్యుల్ని కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నావుగా? దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల అంతిమయాత్రలకైనా రానివారు, దిల్లీ నడిబొడ్డులో ఓ అతివ మీద అత్యాచారం జరిగినప్పుడు యువజనమంతా రగిలిపోయినా నోరు మెదపనివారు- ఇప్పుడు కంగారుగా ఎలా తల్లడిల్లిపోతున్నారో చూడలేదా? ఇవన్నీ ఒంటపట్టించుకుని ఎదగాలి మరి... తెలిసిందా?’

‘గురూగారూ! ఇది ఎదగడం అంటారా, దిగజారడం అంటారా?’

‘పిచ్చోడా! నీచ నేతగా ఎదగాలంటే మంచి మనిషిగా దిగజారాల్రా! అర్థమైందా? ఓసారి పాతకాల స్వామికి సాష్టాంగపడి రేపట్నుంచి రెచ్చిపో మరి! ఎప్పటికోప్పటికి అవకాశం రాకపోదు. ఇక పోయిరా!’
- ఎ.వి.ఎన్‌.హెచ్‌.ఎస్‌.శర్మ
Published in EENADU on 23.02.2016

గురువారం, డిసెంబర్ 31, 2015

ఉన్నదా మంచికాలం...




‘ఏందే ఎంకీ, నులక మంచమ్మీద దుప్పటేసినావా?’

‘ఏసాను మావా, ఎల్లి తొంగో’ అంది ఎంకి.

గుడిసె బయట నులక మంచం మీద నడుంవాల్చి, కాలుమీద కాలేసుకుని ఆకాశంలోకి చూశా.

పైన లెక్కలేనన్ని చుక్కలు! మిణుకుమిణుకుమంటున్న వాటిని చూస్తూ రెప్పవాలుద్దాం అనుకునేసరికి, ఆ చుక్కల్లో ఒకటి నెమ్మదిగా పెద్దదై, వెలుగులు విరజిమ్ముతూ కిందికి వచ్చేస్తోంది.

దాని జిగేల్మనే కాంతికి కళ్లు తెరవలేక తెరుస్తూ, భయపడుతూ లేచి నుంచున్నా.

ఎదురుగా ఓ మహాపురుషుడు! వేలాది తలలు... అంతకు మించి చేతులు!

‘నేను కాలపురుషుణ్ని! పాత సంవత్సరం కనుమరుగై కొత్త ఏడాది అడుగుపెడుతున్న శుభవేళ నీచేత మాట్లాడిద్దామని ఇలా వచ్చా! చెప్పు... నీకేం కావాలో కోరుకో! వరాలు ప్రసాదిస్తా’ అన్నాడు కాలపురుషుడు.

అంతే, ఒక్కసారిగా కడుపు పట్టుకుని పగలబడి నవ్వుతూ, కిందపడి దొర్లుతూ- ‘ఎహేమిటీ... హ హ్హ... నుహువ్వు... నహాకు వర...హ్హ...హ్హ మిస్తావా?’ అన్నా.

కాలపురుషుడు కంగుతిన్నాడు. ‘అదేమిటి! అలా ఆశ్చర్యపోతావేం?’ అన్నాడు.

అప్పటికి తేరుకుని, ‘చాల్చేలేవయ్యా... వూరుకో! ఆకు మీద ఆకు మారాకు ఏసినట్టు, ఏటి మీద ఏడాది వచ్చిపోతానే ఉంది. మా బతుకులు ఏం మారాయి సెప్పు? ఇన్నేల్లుగా మారని మా బతుకులు ఇయ్యాల నువ్వొచ్చి వరాలిచ్చేత్తే మారిపోతాయా అంట!’ అన్నా.

కాలపురుషుడు చిద్విలాసంగా నవ్వి, ‘నీ అసహనం అర్థమైంది నాయనా! ముందు నీ బాధలేమిటో చెప్పు. అప్పుడుగానీ నీ మనసు కుదుట పడేలా లేదు’ అన్నాడు.

‘ఏముంటది కాలపురుసా! సూత్తానే ఉన్నావుగా? మొన్నా పక్కసందులో బక్కరైతన్న ఉరిపోసుకుని ఉసురు తీసుకున్నాడు. నిన్న మాపటేల ఎదురింట్లో పురుగులక్కొట్టే మందు మింగేసి కౌలుకూలన్న కళ్లు తేలేశాడు. ఎన్నాళ్లయ్యా... ఎన్నేళ్లయ్యా సెప్పు! ఎప్పుడయ్యా అందరికీ అన్నం పెట్టే ఈ రైతన్నల కట్టాలు తీరేది? ఏమన్నా అంటే వరాలంటావ్‌! ఇదేదో మా ఒక్క వూర్లో సంగతే కాదయ్యోయ్‌! దేశమంతా ఇట్టాగే ఉంది. ఏ పుస్తెలో తాకట్టు పెట్టి, విత్తనాలు తెచ్చి జల్లితే, అయ్యి మొలకెత్తుతాయో తెలీదు. ఒకేల మొలకెత్తినా పంట సేతికందేదాకా నమ్మకం లేదు. పాణాలుగ్గబట్టి పెట్టుబడి పెడితే- గిట్టుబాటు ధరేదీ? నోటికాడ కూటిని దళారులొచ్చేసి రుణానికి జమేసేసుకుంటారు. ఇట్టాంటి కట్టాలు తట్టుకోలేక బలవంతంగా సచ్చిపోయాక పరిహారాలు ఇత్తేమాతరం ఉపయోగం ఉంటదా? ఎంతిస్తే రైతుల రుణం తీరుద్దయ్యా... ఈ జాతికి! ఎంతిస్తే ఆ కుటుంబాల కన్నీటిధార ఆగిపోద్దయ్యా సెప్పు! పోనీ, వానదేవుడైనా అదను సూసి కరునిత్తాడా అంటే అదీ లేదు. అయితే కుండపోత... లేకపోతే అదే పోత!’

కాలపురుషుడు ఏమీ మాట్లాడలేకపోయాడు.

‘ఇక నువ్వు చేసే సిత్రాల గురించి ఏం సెప్పమంటావయ్యా కాలపురుసా! ఉన్నట్టుండి రోజుల తరబడి ఆకాశం నుంచి వానలు ఒంపేసి, వరదల్లో ముంచి పారేస్తావ్‌! మరోపక్క జిల్లాలకు జిల్లాల్లో కరవు కాటకాలు కాళ్లకు గజ్జెలు కట్టి నాట్యమాడేలా సేత్తన్నావ్‌. ఇంకా ఏం సెప్పమంటావయ్యా! వందలాది వేలాది మందిని మతవిద్వేషాలతో సంపేసే ఉగ్రవాదాన్ని కళ్ల ముందు నిలుపుతున్నావ్‌. ఈ ఘోరాలు, నేరాలన్నీ నీ అడుగుజాడల్లో మడుగులు కట్టి కనిపిస్తన్నవే కదయ్యా... ఏటంటావ్‌?’

కాలపురుషుడు కట్రాటలా నుంచుండిపోయాడు- నా వాగ్ధాటికి!

‘సరేలేవయ్యా... నేన్నీకు సెప్పాల్నా? నీకు మాత్రం తెల్దూ? కిందటేడుకి, ఈ ఏడుకి సరకుల ధరలు ఎంతలేసి పెరిగిపోయాయో నువ్వు మాతరం సూడట్లేదూ? గంజిలోకి నంజుకునే ఉల్లిపాయ ధర కూడా ఉసూరుమనిపిస్తోంది. ఇక పప్పుల పరాసికాలు సెప్పాలా? కాయగూరల కస్సుబుస్సులు సూపాలా? వూరగాయలోకి చెంచాడైనా నూనేసుకుందారంటే ఎనకాముందూ సూడాల్సి వస్తోంది. ఇక నెయ్యేసుకుని పప్పు కలిపే రోజు పండగనాడైనా కరవే అయిపోతాంది. మరి ఎట్టాగయ్యా మా బతుకులు బాగుపడేది? వరాలిత్తాడంట వరాలు!

అయినా నువ్వన్నావు కాబట్టి అడుగుతాన్లే- వచ్చే ఏడాదైనా అయ్యన్నీ జరుగుతాయేమో సూడు మరి! మాలాంటి పేదోళ్లందరికీ సేతి నిండా పనుండేలా సూడు. సేతుల్లో పైసలాడేలా సెయ్యి. రెండు పూటలా కడుపునిండా కూడు దొరికేలా సూడు. మా నేతలందరూ మా కట్టాలు పట్టించుకునేలా ఆళ్ల బుద్ధులు మార్చు. అవినీతి, అక్రమాలు లేని మంచి రోజులియ్యి. మా రైతన్నల బతుకులు పండించు. ధరలు అందుబాటులో ఉండేలా సెయ్యి. బిడ్డల్ని సదివించుకునే వీలు కలిగించు. అందరూ సల్లంగా ఉల్లాసంగా బతికేలా సెయ్యి... సరేనా?’ అన్నా!

‘మాన్యా! జనహితాన్ని కోరే నీ కోరికలు విని సంతోషంగా ఉందయ్యా! నువ్వు కోరేవన్నీ కాలనుగుణంగా జరిగి తీరుతాయి. ఈలోగా నీకు తోడుగా ఆశను వరంగా ప్రసాదిస్తున్నా. దానివల్ల రేపటి నుంచి మంచిరోజులు వస్తాయనే భావన కలిగి ఇవాళ్టి నిరాశ నిన్ను బాధించదు’ అంటూ కాలపురుషుడు మాయమయ్యాడు.

* * *

‘ఒసే... ఎంకీ! కొత్తేడాది నుంచి మనకన్నీ మంచిరోజులేనంటే... కాలపురుషుడు చెప్పాడు’ అన్నా సంబరంగా!

‘సాల్లే మావా... సంబడం! కలవరింతలు ఆపి పడుకో. పొద్దుటే పనికిబోవాల’ అంది ఎంకి. 


Published in EENADU on 31.12.2016

శనివారం, సెప్టెంబర్ 13, 2014

ఆయన సినిమాలు ముత్యాల ముగ్గులు



'కొంటె బొమ్మల బాపు... 
కొన్ని తరముల సేపు... 
గుండెలూయలలూపు!' 
అంటూ ఆరుద్ర కూనలమ్మ పదాల మాలికతో బాపుపై భక్తిని చాటుకున్నారు. 
గీసిన బొమ్మలయినా, తీసిన బొమ్మలయినా... 
అవి చూసినవారి గుండెల్లో బొమ్మల కొలువులాగా కళకళలాడిపోతాయి. 
ఏమని చెప్పగలం బాపు సినిమాల గురించి! 
కళ్ల ముందు నుంచి ఆయన తరలి వెళ్లిపోయిన తర్వాత కన్నీరు నిండిన కళ్లలో ఆయన చిత్రాలే సినిమా రీలులాగా కదులుతున్నాయి. 
ఒకో సినిమా ఒకో రసరమ్య గీతమై అభిమానుల మనసుల్లో తారాడుతున్నాయి. 'సాక్షి' నుంచి 'శ్రీరామరాజ్యం' దాకా ఆయన వెండితెరపై మలిచిన ఏ సినిమాను తల్చుకున్నా అదొక తీయని అనుభూతినే గుర్తుకు తెస్తుంది. 
ఆయన సినిమాలు... చిత్రసీమ ముంగిట్లో ముత్యాల ముగ్గులు! 
సినిమా రంగం సింహద్వారానికి కట్టిన మామిడాకు తోరణాలు! 
సినీ వేలుపు మెడలో అలంకరించిన నిలువెత్తు కనకాంబరం దండలు! వాటికి వేవేల దండాలు...! ఏ సినిమా చూసినా ఆయన విలక్షణమైన ముద్ర కనిపిస్తుంది. అందుకే చిత్రరంగంపై అవన్నీ చెరిగిపోలేని, మరిచిపోలేని ముద్రను వేశాయి. ఒకో సినిమా ఒకో రకం అనుభూతిని, రసానుభూతిని ప్రేక్షకుల గుండెల్లో మిగిల్చినవే.

సినిమా ఎలా ఉండాలో ఆయనకు సుస్పష్టమైన అవగాహన ఉంది. అంతకు ముందు తీసే తీరుపై అంతులేని నమ్మకం ఉంది. అందుకనే 1967లో తొలి సినిమా 'సాక్షి' తీస్తూనే 'ఇది సాక్షినామ సంవత్సరం' అని నిబ్బరంగా చాటుకోగలిగారు. ఆ ప్రచారం చూసి కొందరు 'పొగరు' అన్నారు. కానీ ఆ సినిమా విడుదలయ్యాక తెలిసింది అది ఆత్మవిశ్వాసం అని! ఇండోర్‌ స్టూడియోల గదుల్లో, కృత్రిమ సెట్టింగుల హంగుల మధ్య సినిమాలు చూసిన ప్రేక్షకులకు 'సాక్షి' ఓ సరికొత్త వాతావరణాన్ని చూపించింది. ఔట్‌డోర్‌లో పకడ్బందీగా తీస్తే సహజత్వం ఎలా వెల్లివిరుస్తుందో సినిమావాళ్లకు కూడా చవిచూపించింది. ఇప్పటికీ చెప్పుకోదగిన ఓ పాఠంలా మిగిలింది. పల్లెటూరిలోని మనుషుల నైజాలను నిజాలుగా ఆవిష్కరించింది. అందుకనే ప్రతి వూరూ ఆ సినిమాను తనదనుకుంది. మన వూర్లోనే జరిగిన కథనుకుంది. ఆదరించి అక్కున చేర్చుకుంది.

అందులో 'అమ్మకడుపు చల్లగా... అత్త కడుపు చల్లగా... బతకరా... బతకరా పచ్చగా...' అనే పాటను కేవలం ఒకటి రెండు రోజుల్లో తీసినట్టు బాపు ఓ సందర్భంలో చెప్పారు. కొన్నేళ్ల తర్వాత ఆ విషయమై ఎవరో ప్రస్తావిస్తే 'ఇగ్నోరెన్స్‌ ఈజ్‌ బ్లిస్‌' అని నవ్వేశారాయన. తన సినిమాల మీద తనే కార్టూన్లు వేసుకోగలిగిన నిబ్బరి బాపు. అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంతో బాపు తీసిన 'బుద్ధిమంతుడు' (1969) చిత్రం కూడా పల్లె రాజకీయాలను కళ్లకు కడుతుంది. అందులో అక్కినేనిని ఆయన పూర్తి ఆస్తికుడైన అన్నయ్యగా, పరమ నాస్తికుడైన తమ్ముడిగా రెండు విభిన్నమైన కోణాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. 'భూమ్మీద సుఖపడితే తప్పులేదురా... బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా...' అంటూ తిరిగే తమ్ముడికి, 'నను పాలించగ నడచి వచ్చితివా...' అంటూ భక్తితత్పరతతో మైమరచి పోయే అన్నయ్యకి తేడా చూపించిన తీరు అద్వితీయం.


'అంతా భగవంతుడు చూసుకుంటాడనే' అన్నయ్యకు, సమాజంలోని అన్యాయాన్ని ఎదురించేవాడు నాస్తికుడైనా దేవుడికి ఇష్టుడవుతాడని చెప్పించిన తీరు మనసులకు హత్తుకుంటుంది. గోదావరి అన్నా, తీర ప్రాంతాలన్నా బాపుకి ఎంత ఇష్టమో 'అందాల రాముడు' (1973) సినిమా చూస్తే అర్థం అవుతుంది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు లాంచీలో జరిగే ప్రయాణంగా సాగిపోయే ఈ సినిమా గోదావరి అందాలకు పట్టిన నీరాజనం! ప్రకృతి రమణీయతకు నిలువుటద్దం! ఈ ప్రయాణంలోనే పేద, ధనిక తారతమ్యాలు, సమాజంలో విభిన్న మనస్తత్వాలు అన్నీ తారసపడి ప్రేక్షకులను కూడా గోదావరి లాంచీపై ఆహ్లాదకరమైన ప్రయాణం చేయిస్తాయి. వీటి మధ్యలో అల్లుకున్న ఓ చక్కని ప్రేమకథ సినిమాను రక్తి కట్టిస్తుంది. 'మనుషుల్లారా మాయామర్మం వద్దన్నాడోయ్‌...' అని 'రాముడేమన్నాడోయ్‌' పాటలో చెప్పిస్తారు. ఇందులో ప్రతి పాటా ఓ రసగుళికే. 



ఇక 'ముత్యాల ముగ్గు' (1975) మరో అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించింది. అందులో ముళ్లపూడి వెంకట రమణ రాసిన సంభాషణలన్నీ రికార్డులాగా వెలువడి రికార్డు సృష్టించాయి. ఆయన సంభాషణలకు తగినట్టుగా అందులో కాంట్రాక్టర్‌ అనే విలన్‌ పాత్రను బాపు మలిచిన తీరు అద్వితీయం. అపురూపం. 'మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా...', 'డిక్కీలో తొంగోబెట్టేస్తాను...', 'ఆ ముక్క నే లెక్కెట్టుకోక ముందు సెప్పాల...' 'ఏముందీ నిన్ను కరుసు రాయించి ఆయన కాతాలో జమేస్తే సరి...' లాంటి డైలాగులను రావుగోపాలరావు చేత పలికించిన పంథా విలనిజానికి విలక్షణతను ఆపాదించాయి. ఈతరం పిల్లలు ఇప్పుడు ఆ సినిమాను చూసినా అందులో మమేకమైపోతారనడంలో సందేహం లేదు. 'ఏదో ఏదో అన్నది... ఈ మసక వెలుతురు... గూడి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు...' 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది...' పాటలను బాపు వెండితెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను మంత్రుముగ్ధుల్ని చేస్తుంది. అందుకే ఆ సినిమా బాపు తీసిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 

కృష్ణంరాజు, వాణిశ్రీలతో తీసిన 'భక్త కన్నప్ప' (1976) భక్తి ప్రధానమైన సినిమాను కూడా ఎలా వ్యాపారాత్మకంగా, జనరంజకంగా తీయవచ్చో చెబుతుంది. అప్పటికి కృష్ణంరాజు, వాణిశ్రీకు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్‌ వేరు. కమర్షియల్‌ పంథాలో సాగుతున్న వారిని ఓ పౌరాణిక నేపథ్యంలో ఉన్న కథలో పాత్రలుగా చూపిస్తూనే అప్పటి యువతకి నచ్చే విధంగా పాటలు, పోరాటాలతో చక్కగా మలిచారు బాపు.

అలాగే పాండవులు, కృష్ణుడి పాత్రలను సాంఘికంగా మలుస్తూ ఓ పల్లెటూరిలో జరిగే రాజకీయాలు, అన్యాయాల నేపథ్యంలో తీసిన 'మనవూరి పాండవులు' (1978) ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో కూడా రావుగోపాలరావును ప్రతినాయకుడిగా తీర్చిదిద్దిన తీరు పల్లెటూరి మోతుబరుల అకృత్యాలకు అద్దం పడుతుంది. ఈ అన్యాయాలను సహించలేని ఐదుగురు యువకులను పాండవులుగా తీర్చిదిద్దుతూ, ప్రతినాయకుడి తమ్ముడి పాత్రలో కృష్ణంరాజును సాంఘిక కృష్ణుడిగా చూపించడం బాపు విలక్షణ శైలికి అద్దం పడుతుంది. 'పాండవులు పాండవులు తుమ్మెద...', 'ఒరేయ్‌ పిచ్చి సన్నాసి...' లాంటి పాటల చిత్రీకరణ గురించి ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటారు. చిత్రం చివర్లో వూరందరూ చైతన్యవంతులై రావుగోపాలరావు అనుచరులను తరిమికొడుతున్నప్పుడు కృష్ణంరాజు చేత 'మేలుకున్న వూరు దేవుడి విశ్వరూపం లాంటిది...' చెప్పించినప్పుడు థియేటర్లలో చప్పట్లు మోగుతాయి. చిరంజీవికి మంచి గుర్తింపు తెచ్చిన తొలిచిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. ఆ తర్వాత కాలంలో చిరంజీవి కథానాయకుడిగా తీసిన 'మంత్రిగారి వియ్యంకుడు' (1983) మరో చిరస్మరణీయమైన సినిమాగా నిలిచిపోయింది.

ప్రయోగాలకు కూడా బాపు పెద్ద పీట వేసేవారు. ఓ చిన్నపిల్లవాడి కథతో తీసిన 'బాలరాజు కథ' ఇప్పటికీ పిల్లల్ని, పెద్దల్నీ ఆకట్టుకుంటుంది. ఆ కథలో ఓ గుడిలో రాసి ఉన్న నీతి సూత్రాలు ఓ పిల్లవాడి జీవితంలో ఎలా నిజమయ్యాయో, అవి ఆ పసి మనసుకు ఎంత గొప్ప జీవిత సత్యాలు బోధించాయో పిల్లల స్థాయిలో చిత్రీకరించిన తీరు ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోతుంది. అలాగే వాణిశ్రీని మేకప్‌ లేకుండా చూపించాలనుకోవడం అప్పట్లో ఓ సాహసం. ఆ సాహసాన్ని 'గోరంత దీపం' చిత్రంలో చేశారు బాపు. ఆ చిత్రం వ్యాపారాత్మకంగా విజయవంతం కాలేదనే సత్యాన్ని స్వీకరిస్తూ గోరు మీద దీపం కాలుతున్నట్టుగా కార్టూన్‌ వేసి అభిమానులను నవ్వించారు బాపు. వ్యాపారాత్మకతలను పక్కన పెడితే గోరంత దీపంలో తెలుగు వాడి ఆత్మ కనిపిస్తుంది. మధ్యతరగతి లోగిళ్లలోని విచిత్రమైన మనస్తత్వాలను వాస్తవికమైన రీతిలో ప్రతిబింబించిన తీరు, బాపు చిత్రీకరణలోని విలక్షణ శైలిని చాటి చెబుతుంది. 

ఇక 'పెళ్లి పుస్తకం..'. ఈ సినిమా గురించి ఏమని చెప్పాలి? ఉద్యోగాల కోసం 'పెళ్లి కాలేద'ని అబద్దం చెప్పిన ఓ జంట కథ ఇది. 'శ్రీరస్తు.. శుభమస్తు..' పెళ్లి పాటకు ఓ బ్రాండ్‌ అయిపోయింది. ఈ పాటని బాపు తెరకెక్కించిన విధానం నభూతో.. నభవిష్యత్‌ అనొచ్చు. 'మిస్టర్‌ పెళ్లాం'ది మరో వింత. ఉద్యోగం చేస్తున్న భార్య, వంటింట్లో గరెటె తిప్పుతున్న మగాడు.. అదీ కథ. మగవాడి మనస్తత్వానికి రాజేంద్రప్రసాద్‌ పాత్ర పరాకాష్ట. చివరి చిత్రం 'శ్రీరామరాజ్యం'లోనూ బాపు ముద్ర స్పష్టంగా కనిపించింది. వయసు మీరినా ఆయన మార్క్‌ చెరగలేదనడానికి... అదో నిదర్శనంలా నిలిచింది. ఇలా చెప్పుకొంటూ పోతే.. ప్రతి సినిమా భావి దర్శకులకు ఓ పాఠంలా మారిపోతుంటుంది. తెలుగు సినీ వాకిట్లో ప్రతి చిత్రం ఓ ముత్యాల ముగ్గులా మెరిసిపోతుంటుంది.

PUBLISHED IN EENADU ON 01/09/2014