ఇప్పుడంటే వాట్సాప్‌లు, జూమ్‌లు, వీడియో కాల్సూ గట్రా వచ్చేశాయి కానీ, ఓ నలభై ఏళ్ల కిందట ఉత్తరాలే కదా, కబుర్లు బట్వాడా చేసేవి? అంత పాత ముచ్చటే ఇది. నేను డిగ్రీ చేసి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న సమయం అది. కుర్రతనం వెర్రితలలు వేస్తూ ఉండేది. అప్పట్లో దాదాపు అన్ని వార పత్రికల్లోనూ కలం స్నేహం కోసం ఓ పేజీ కేటాయించేవారు. అందులో ఓ వైజాగ్ అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయికి అమ్మాయి పేరుతో ఉత్తరం రాయాలనే కొంటె ఊహ కలిగింది. ఏ పేరుతో రాయాలి? వెంటనే తట్టింది కల్పన అని. ఇది నా కల్పనే కదా? ఆ అబ్బాయిని కలం స్నేహానికి ఆహ్వానిస్తూ ఓ అందమైన ఉత్తరం రాశాను. ఉత్తరానికి అందమేమిటనుకోకండి. అందులోని భావాలు అందమైనవన్నమాట.
''కలం స్నేహం కాలమ్‌లో మీ వివరాలు చూశాను. మీ అభిరుచులు నచ్చాయి. మీతో స్నేహం చేయాలనిపించింది. నా పేరు కల్పన. ఏలూరులో ఉంటాను...'' అంటూ పరిచయ వాక్యాలతో పాటు, ఏవేవో రాసి పోస్టు చేసేశాను.
మేం ఏలూరు పవర్ పేటలో శ్రీమతి అరుంధతి రావు గారి ఇంట్లో వెనక పోర్షన్‌లో అద్దెకుండేవాళ్లం. ఉత్తరాలేమైనా వస్తే ఆవిడే అందుకునే వారు. తర్వాత ఎవరివి వారికి అందించేవారు. ఎందుకంటే వాళ్లింట్లో రెండు మూడు పోర్షన్లు ఉండేవి. అద్దెకుండే వాళ్లందరికీ ఆవిడ వీధి గదే కబుర్ల ఖజానా. అందరం ఆవిడ ల్యాండ్ లైన్ నెంబర్నే బంధువులకి ఇచ్చేవాళ్లం. వాళ్లెవరైనా ఫోన్ చేస్తే ఆవిడ స్వయంగా పిలిచేవారు. మాకే కాదు, ఆ వీధి మొత్తానికి ఆవిడ ఫోన్ నెంబరే గతి. వేరే ఇళ్ల వాళ్లకి ఫోన్ వస్తే పనిమనిషి సుందరమ్మని పంపి కబురంపేవారు. ఇలా ఎప్పుడు చూసినా ఆవిడ వీధి గది సందడిగా ఉండేది. అద్దెకుండే వాళ్లు ఎవరు బయటి నుంచి వచ్చినా ముందు ఆ హాల్లోకే వెళ్లి ఆంటీని పలకరించి నాలుగు కబుర్లు చెప్పి ఆ తర్వాతే తమ పోర్షన్‌లోకి వెళ్లేవారు. మనం సందడిగా జోక్స్ వేస్తూ లొడలొడా మాట్లడతాం కాబట్టి ఆంటీకి ప్రత్యేకమైన ఇష్టం. అదీగాక నేనప్పట్లో కాలక్షేపానికి ఓ స్థానిక సాయంకాలం పత్రికలో పనిచేస్తుండేవాడిని. ఆంటీ రాసిన కవితల్ని అందులో వేసేస్తూ ఉండేవాడిని. దాంతో పాటు వార పత్రికల్లో వచ్చే పద బంధ ప్రహేళిక (క్రాస్ వర్డ్) లాంటి పజిల్స్‌ని నేను చకచకా పూర్తి చేస్తుండేవాడిని. వాటిని ఆంటీ తన పేరుతో పంపుకుంటూ ఉండేవారు.
ఓసారి నేను వీధిలోంచి ఇంటి ఆవరణలోకి రాగానే ఆంటీ నన్ను పిలిచి ''కల్పన ఎవరు శర్మా?'' అని అడిగారు. అప్పటిదాకా నాకు కలం స్నేహానికి ఆహ్వానం పంపిన సంగతే గుర్తు లేదు. నా చిరునామా 'కల్పన, కేరాఫ్ శర్మ...' వగైరా వివరాలతో ఇచ్చానన్నమాట. నేను ఆత్రుతగా ఆ ఉత్తరం అందుకుని ఆ వైజాగ్ అబ్బాయి రాసిన ఉత్తరం చదివేశా. ఆ తర్వాత నవ్వుతూ మొత్తం సంగతి చెప్పా. ఆంటీయే కాదు, అక్కడ ఉన్న వాళ్లందరూ పగలబడి నవ్వేశారు. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని ఒకరి తర్వాత ఒకరు చదివేశారు.
ఇహ అక్కడి నుంచి కల్పనకి వచ్చే ఉత్తరాలన్నీ మాకు గొప్ప హాస్య కాలక్షేపమై పోయాయి. నేను ఠంచనుగా జవాబులు రాస్తూ ఉండేవాడిని. ఆ వైజాగ్ అబ్బాయి పాపం... కల్పన అనే అమ్మాయిని ఊహించుకుని తెగ ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఆ ఉత్తరాలను నేను నెమ్మదిగా స్నేహం స్థాయిని దాటించి, ఇష్టం దశకి చేర్చాను. నా జవాబులు, కల్పనకి వచ్చే ఉత్తరాల కోసం ఆ ఇంట్లో అందరూ ఎదురు చూసేవారు.
ఆఖరికి ఆ కుర్రాడిని కల్పనని ప్రత్యక్షంగా కలవడానికి తహతహలాడే స్థితకి తీసుకొచ్చా. నేను మాత్రం 'అమ్మో... తల్లిదండ్రుల చాటు పిల్లని. అన్నయ్య ఊరుకోడు...''లాంటి కబుర్లు చెబుతూ ఉండేవాడిని. ఆఖరికి అతడు హైదరాబాద్ వెళుతూ నన్ను మధ్యలో ఏలూరు స్టేషన్‌కి వచ్చి కలుసుకోవాలని ప్రతిపాదించాడు.
''మరి ఇప్పుడేం చేస్తావ్?'' అని అడిగారు, ఆంటీ నవ్వుతూ.
''ఏముందాంటీ? ఎర్ర చీర కట్టుకొస్తానని రాస్తా. ఆ చీర కట్టుకున్నవాళ్లందరినీ వెతుక్కుంటాడు...'' అన్నాన్నేను.
ఆ వైజాగ్ అబ్బాయి పాపం తాను ఎక్కిన రైలేంటో, బోగీ ఏంటో లాంటి వివరాలన్నీ ఏకరువు పెట్టాడు.
ఆ రోజు రానే వచ్చింది. ఆంటీ సహా అందరిలోనూ ఉత్కంఠ.
''పాపం.... ఆ కుర్రాడు డిజప్పాయింట్ అవుతాడేమో... ఇప్నుడేం చేస్తావ్?'' అని అడిగారు ఆంటీ.
''జ్వరం వచ్చి రాలేకపోయానని చెబుతానాంటీ...'' అనేశా నేను తేలిగ్గా.
అయితే విషయం అంత తేలిగ్గా వదల్లేదు.
రెండు రోజులు పోయాక ఆంటీ మా వెనక పోర్షన్ లోకి కంగారు పడుతూ వచ్చి, ''ఆ కుర్రాడు వచ్చాడు శర్మా... కల్పన ఉండేది ఇక్కడేనా అని అడిగాడు. నాకేం చెప్పాలో తెలియక హాల్లో కూర్చోబెట్టి వచ్చా.... ఇప్పుడెలా?'' అన్నారు.
నాక్కూడా కాస్త కంగారనిపించింది. ''ఎలాగరా బాబూ... '' అనుకున్నా. వెనక పోర్షన్ లోంచి ఆంటీ వాళ్ల హాల్లోకి తొంగి చూశా. ఆ కుర్రాడెవరో తెల్లగా, నాజూగ్గా ఉన్నాడు. ఏదో పత్రిక తిరగేస్తూ కనిపించాడు.
''ఏం చెప్పమంటావో చెప్పు మరీ...'' అంటూ ఆంటీ రెట్టించారు.
ఈలోగా మా అమ్మగారు కల్పించుకుని, ''ఇలాంటివన్నీ వద్దని చెబుతూనే ఉన్నాను. వినలేదు. ఇప్పుడు నిజం తెలిస్తే అతడేం గొడవ పెడతాడో ఏంటో...'' అంటూ కంగారు పడ్డారు.
నేను కాసేపు ఆలోచించి, ''సరే ఆంటీ... నేనే మీ వీధి గదిలోకి వస్తాను. నన్ను కల్పన వాళ్ల అన్నయ్యగా పరిచయం చేయండి...'' అన్నాను. ఆవిడ సరే నని వెళ్లారు. నేను తయారై, ప్యాంటు, షర్టు వేసుకుని, మొహం వీలయినంత గంభీరంగా పెట్టుకుని సందు చుట్టూ తిరిగి ఆంటీ వీధి గదిలోకి వెళ్లాను.
ఆంటీ ఓ పక్క నవ్వు ఆపుకుంటూనే నన్ను చూసి, ''ఇతడేనండీ కల్పన వాళ్ల అన్నయ్య...'' అంటూ పరిచయం చేశారు.
ఆ కుర్రాడి మొహంలో కూడా కాస్త కంగారే.
''ఎవరండీ మీరు? మీకు కల్పన ఎలా తెలుసు?'' అని అడిగాను నేను కాస్త సీరియస్‌గా.
ఆ కుర్రాడు కాస్త తడబడి, ''నేను కల్పన ఫ్రెండ్‌నండీ... వైజాగ్‌లో ఉంటాను...'' అంటూ తడబడుతూ చెప్పాడు.
''మీ ఇద్దరికీ స్నేహం ఎలా? కల్పన మాకేమీ చెప్పలేదే?''
''అంటే... అది కలం స్నేహమండీ. ఉత్తరాలు రాసుకుంటున్నాం. తనకి జ్వరమంటేను కలవాలని వచ్చా...'' అన్నాడు.
ఓ పక్క నాకు ఏం చెప్పాలో, ఎలా దీన్ని ముగించాలో తెలియడం లేదు. అయినా మేక పోతు గాంభీర్యంతో ''కల్పన లేదండీ. ఊరెళ్లింది. అయినా కలం స్నేహం అని చెప్పి ఇంటికి వచ్చేస్తే ఎలా? ఇంట్లో పెద్ద వాళ్లకి తెలిస్తే ఊరుకుంటారునుకున్నారా?'' అంటూ కాస్త గొంతు పెంచి అడిగా.
ఆ సరికే అతడికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. చటుక్కున లేచి, ''సరేనండీ... సారీ... పని మీద ఈ ఊరికి వచ్చాను కదాని కలుద్దామని వచ్చానంతే.... ఉంటానండీ...'' అంటూ బయల్దేరాడు. ఒక్క క్షణం ఆగి నాతో, ''పాపం... కల్పనని ఏమీ అనకండీ..'' అంటూ వడివడిగా వెళ్లిపోయాడు.
అతడు వీధి గేటు దాటి వెళ్లగానే ఆంటీ పగలబడి నవ్వసాగారు. టెన్షన్‌గా ఉన్నా, నేనూ నవ్వేశాను.
''అవును శర్మా... మరి ఇప్పుడేం చేస్తావు?'' అన్నారాంటీ.
''కల్పన చేత ఉత్తరం రాయిస్తానండీ. ఇంట్లో పెద్ద వాళ్లకి తెలిసిపోయినట్టూ, తిట్టినట్టూ, ఇంటికి చెప్పకుండా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినట్టూ రాయమంటా. ఈ వంకతో ఈ కలం స్నేహానికి బైబై చెప్పిస్తా...'' అన్నాను.
ఆ తర్వాత ఆ వైజాగ్ అబ్బాయి నుంచి ఉత్తరాలు రాలేదు. కల్పన కూడా ఏమీ రాయలేదు.
ఆహ్లాదం
అక్షరాల సీమలో నా ప్రయాణం
గురువారం, మే 08, 2025
కలం స్నేహంలో కలవరం!
మంగళవారం, మార్చి 18, 2025
ఘంటసాల, సుశీల ప్రేమించుకున్నారా?
''ఘంటసాల, సుశీల ప్రేమించుకున్నారంట!'' అన్నాడు మా వాడు.
''అవునా?'' ఆశ్చర్యంగా అడిగాను నేను.
''అవును... వాళ్లిద్దరి డ్యూయెట్లు ఎన్ని లేవు?'' అంటూ సాక్ష్యం కూడా చూపించాడు వాడు.
ఇలాంటి కబుర్లు చెప్పే వాడు నా దృష్టిలో ఓ హీరో. నాకే కాదు నాతోటి కుర్రగ్యాంగ్‌కి కూడా.
''అరే... ఈడికి చాలా తెలుసురా!'' అనుకునేవాళ్లం మేం అప్పట్లో.
అప్పట్లో... అంటే ఎప్పట్లో తెలుసా?
ఓ అయిదు దశాబ్దాల క్రితం అన్నమాట.
ఆ అప్పట్లో నేను రెండో తరగతి. వాడు మహా అయితే మూడో, నాలుగో తరగతి. మా కుర్రగాళ్ల బ్యాచ్‌కి వాడే లీడర్.
కుతుకులూరులో హైస్కూలు ఎదురుగా ఉండే చెరువు మెట్ల మీదో, స్కూలు లేనప్పుడు ఖాళీగా ఉండే బెంచీల మీదో కూర్చుని వాడిలాంటి కోతలు చాలా కోసేవాడు.
వాడు చెప్పేదేదైనా నమ్మేయడమే. వాడూ అంత నమ్మకంగానే చెప్పేవాడు మరి.
సినిమా పాటలు వింటే మాకు ఆ నమ్మకం మరింత బలపడిపోయింది.
మరి అప్పట్లో అన్ని డ్యూయెట్లూ వాళ్లవేగా! ఏ పాట విన్నా మా వాడి మాటలే గుర్తొచ్చేవి.
'నిజమే... లేకపోతే అంత బాగా ఎలా పాడతారు?'అనుకునేవాళ్లం.
ఎంత అమాయకత్వం? ఎంత తెలియనితనం?
రేడియోలు, సినిమాలు తప్ప టీవీలు కానీ, సెల్‌ఫోన్లు కానీ మరే ఇతర వ్యాపకాలు కానీ లేని ఆ రోజుల్లో ఎవరి కబుర్లు వారివి! ఎవరి ఊహలు వారివి!
నా మటుకు నాకు మావాడి మాటలు నిజమేననిపించాక... మరి అంత మంచి వార్త ఎవరికైనా చెప్పకపోతే ఎలా? కడుపు నెప్పి రాదూ?
అందుకే తిన్నగా మా నాన్నగారి దగ్గరకి వెళ్లాను.
''నాన్నగారూ! మీకో సంగతి తెలుసా? ఘంటసాల, సుశీల ప్రేమించుకుంటున్నారంట...'' అన్నానో సెలవురోజు.
ఆయన కాస్త కోపంగా మొహం పెట్టి, ''ఏడిశావ్... అలా మాట్లాడకూడదు...'' అన్నారు.
''నిజమేటండీ... వాళ్లు పెళ్లి కూడా చేసుకుంటార్ట...'' అంటూ రెట్టించి మరింత మసాలా దట్టించాను నా వార్తకి!
ఈసారి ఆయన నవ్వేశారు. ''ఎవడు చెప్పాడు?'' అన్నారు.
ఆ తర్వాత కూర్చోబెట్టి సినిమాల గురించి, వాటి చిత్రీకరణ గురించి వివరించారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు కూడా నిజంగా ప్రేమించకోరనీ, అలా నటిస్తారని, వాళ్లందరికీ ఎవరి సంసారాలు వాళ్లకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్లేబ్యాక్ గురించి, పాటల రికార్డింగు, వాటిని పాడే గాయకుల గురించి చెప్పారు.
ఇన్నేళ్ల తర్వాత అప్పటి ఆ జ్ఞాపకాలని తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ, ఆ వయసులో ఆ నాటి ఎదిగీఎదగని మనసుకి అవే పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు మరి!
శుక్రవారం, ఫిబ్రవరి 28, 2025
పాత్రికేయుడి మాటలతో ప్రాణం పోసుకున్న 'దాసి'
తెలంగాణ గడీలలో దొరలు, దొరసానుల చెప్పుచేతల్లో బతికే స్త్రీల విషాదగాథలకు నిలువుటద్డం బి. నరసింగరావు తీసిన 'దాసి' (1988) చిత్రం. అప్పటికే 'మా భూమి' (1980), 'రంగుల కల' (1984) చిత్రాల ద్వారా తనకంటూ ఒక శైలిని, తెలుగు చిత్రాలకు జాతీయ స్థాయి గౌరవాన్నీ సంపాదించిన నేపథ్యంలో నర్సింగరావు నిర్మించిన 'దాసి' తెలుగు వారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళింది. ఒక పాత్రికేయుడు ఆయనతో జరిపిన ముఖాముఖీ, 'దాసి' కథకు పునాదులు వేసిందట. ఆ పాత్రికేయుడు గతంలో పాలమూరు ప్రాంతం లోని ఓ సంస్థానానికి వెళ్ళినప్పుడు ఓ అందమైన అమ్మాయి వచ్చి ఆయన కాళ్ళు కడగబోయింది. అందుకు ఆయన తిరస్కరించగా ఆ మహిళ ఆశ్చర్యబోతూ అన్న మాటల్ని పాత్రికేయుడి నోటి ద్వారా విన్న నరసింగరావు తీవ్రంగా ఆలోచించారు. ఆ ఆలోచనలు ఓ అద్భుతమైన సృజనకు బీజాలు వేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన ప్రతిభావంతుల ప్రశంసలను అందుకునే దిశగా ఆయనను నడిపించాయి. దొరల గడీలలో దాసీల ఉదంతాల్ని తన తల్లి గారిని అడిగి తెలుసుకోడంతో పాటు, తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలు పర్యటించి, కథకు అవసరమైన 1920-40 సంవత్సరాల నాటి నేపథ్య సమాచారాన్ని విస్తృతంగా సేకరించి, ఓ అద్భుతాన్ని సృష్టించారాయన. ఈ సినిమాలో దాసిగా కామాక్షి పాత్రలో నటి అర్చన నటించింది. ఆమె నటనకు 1989లో జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. 94 నిమిషాల ఈ సినిమా అయిదు జాతీయ అవార్డులు అందుకుంది. ఒక తెలుగు చిత్రానకి ఇన్ని అవార్డులు రావడం అదే తొలిసారి. ఉత్తమ సినిమా, నటి, సినిమటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ డిజైనర్, కళా దర్వకత్వాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా 1989లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో డిప్లొమా ఆఫ్ మెరిట్ అవార్డును కూడా గెలుచుకుంది. అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికల్లో దాసి గురించి మంచి రివ్యూలు వెలువడ్డాయి.
ఆదివారం, ఫిబ్రవరి 09, 2025
మరుగుజ్జులుగా మారిన అప్సరసలు! (పిల్లల కోసం రాముడి కథ-12)
మారీచుడు, సుబాహుడు మొదలైన రాక్షసుల్ని చంపి సిద్ధాశ్రమంలో యాగాన్ని సంరక్షించిన రామ లక్ష్మణులు, ఆ మర్నాడు విశ్వామిత్రుడి సూచనపై అతడి వెంట మిథిలా నగరానికి బయల్దేరారు. ఆ సాయంత్రానికి శోణ నదీ తీరానికి చేరుకున్నాక, ఆ ప్రదేశం ఎవరిదని రాముడు కుతూహలంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు విశ్వామిత్రుడు ఆ కథతో పాటు, తన వంశానికి సంబంధించిన వివరాలను కూడా చెప్పుకొచ్చాడు.
''రామా! పూర్వం బ్రహ్మ మనసు నుంచి పుట్టిన కుశుడనే మహా తపస్వి ఉండేవాడు. ఆయనే మా వంశానికి మూల పురుషుడు'' అంటూ మొదలు పెట్టి ఇలా చెప్పాడు.
''బ్రహ్మ మానస పుత్రుడైన కుశుడు, వైదర్భి అనే రాకుమారిని పెళ్లి చేసుకుని నలుగురు కుమారులను కన్నాడు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు. ఆయన క్షత్రియ ధర్మాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో తన కుమారులతో భూమిని పంచుకుని న్యాయంగా ప్రజలను పరిపాలించమని ఆదేశించాడు. అప్పుడు ఆ నలుగురు కుమారులూ నాలుగు నగరాలను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు. కుశాంబుడు కౌశాంబీ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు. కుశనాభుడు మహోదయమనే మహానగరాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఆధూర్తరజసుడు ధర్మారణ్యమనే పురాన్ని కట్టుకున్నాడు. వసువు అనేవాడు గిరివ్రజమనే నగరాన్ని నిర్మించుకున్నాడు. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం ఆ గిరివ్రజంలోదే. ఈ దేశం చుట్టూ అయిదు పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలో పుట్టిన శోణానది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ ఈ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తోంది'' అంటూ వివరించాడు.
ఆపై ఆయన మరిన్ని ఆసక్తికరమైన అంశాలను చెప్పసాగాడు.
''రామా! కుశుడి కుమారులలో కుశనాభుడనే వాడొకడు ఉన్నాడని చెప్పాను కదా! ఆయన భార్య ఘృతాచి అనే అప్సరస. వీళ్లకి వంద మంది అందమైన ఆడపిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకసారి ఆ నూరుమంది కన్యలూ చక్కగా అలంకరించుకుని వన విహారానికి వెళ్లారు. ఆట పాటలతో ఆనందిస్తున్న వారిని చూసిన వాయుదేవుడు మోహించాడు. ఆయన వారి ముందుకు వచ్చి, ''మీరందరూ నన్ను పెళ్లి చేసుకోండి. మీరందర్నీ ముసలితనమూ, చావూ లేని దేవతలుగా మారుస్తాను'' అంటూ బలవంతపెట్టాడు.
అందుకు ఆ కన్యలందరూ ముక్తకంఠంతో తిరస్కరించారు. ''అన్ని జీవులలోనూ ప్రాణ రూపంలో ఉండే నీ ప్రభావం గురించి మాకు తెలుసు. నువ్వెందుకు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నావు? మేం కుశనాభుడి కుమార్తెలం. మా త్రండి ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటాం. నువ్వు దేవుడవే అయినా దుర్భిద్ధి చూపుతున్నావు. మేం తల్చుకుంటే నీ దివ్యశక్తులను కూడా తీసివేయగలం. కానీ మా తపశ్శక్తి తగ్గిపోతుందని అలా చేయడం లేదు'' అంటూ కచ్చితంగా చెప్పేశారు.
వాళ్ల మాటలు విన్న వాయుదేవుడు కోపించి వారిని మరుగుజ్జులుగా మార్చేశాడు. వాళ్లంతా ఏడుస్తూ తమ తండ్రి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పారు.
అంతా విన్న కుశనాభుడు ''కుమార్తెలారా! మీరందరూ ఒకే మాటపై నిలబడి మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. మీరు ఆ వాయుదేవుడిని క్షమించి వదిలి పెట్టడం మరింత గొప్ప విషయం. దాన యజ్ఙాల వల్ల కలిగే గొప్ప ఫలాలన్నీ కూడా, క్షమా గుణం వల్ల లభిస్తాయి. మీ అంతటి క్షమను కలిగి ఉండడం దేవతలకు కూడా సాధ్యం కాదు'' అంటూ ప్రశంసించి, ఆపై జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచన చేశాడు. తన కుమార్తెలకు పెళ్లి చేయాలని నిర్ణయించి తగిన వరుడి కోసం మంత్రులతో చర్చించాడు.
ఆ కాలంలోనే చూళి అనే మహాముని ఉండేవాడు. ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేసుకుంటున్న సమయంలో సోమద అనే ఓ గంధర్వ కన్య ఆయనకు సపర్యలు చేసేది. ఆమె సేవలకు సంతోషించిన చూళి మహాముని ఒక రోజు, ''నీకేం వరం కావాలో కోరుకో'' అని అడిగాడు. అందుకామె వినయంగా నమస్కరించి, ''స్వామీ! నేను ఎవరికీ భార్యను కాను. పవిత్రురాలను. మీ బ్రహ్మతేజస్సు ప్రభావంతో ఒక పుత్రుడిని ప్రసాదించండి'' అని కోరుకుంది. అప్పుడాయన తన మనస్సు నుంచి బ్రహ్మదత్తుడనే కుమారుడిని అనుగ్రహించాడు. ఆ బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. కుశనాభుడు ఆ బ్రహ్మదత్తుడిని ఆహ్వానించి తన కుమార్తెలతో పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుడు ఆ నూరుగురు అమ్మాయిల చేతులను వరసగా తాకగానే, వారికి ఉన్న వాయు దోషము తీరిపోయి, తిరిగి చక్కని అందగత్తెలుగా మారిపోయారు''
ఈ కథంతా చెప్పిన విశ్వామిత్రుడు తన పుట్టుక గురించి కూడా చెప్పాడు.
''రామా! ఆ కుశనాభుడు తన వంద మంది కుమార్తెలకు వివాహం చేశాక, పుత్రుడి కోసం పుత్రకామేష్ఠి యాగాన్ని ఆచరించాడు. ఫలితంగా ఆయనకు గాధి అనే కుమారుడు కలిగాడు. ఆ గాధియే నా తండ్రి. నేను కుశ వంశంలో పుట్టాను కాబట్టి నాకు కౌశికుడు అనే పేరు కూడా ఏర్పడింది. గాధి మహారాజుకు నాతో పాటు సత్యవతి అనే కుమార్తె కలిగింది. కుశ వంశంలోనే పుట్టింది కాబట్టి ఆమెకు కౌశికి అనే పేరు కూడా ఉంది. ఆమె మహా పతివ్రత. శరీరంతో స్వర్గానికి చేరింది. ఆమే కౌశికి అనే పేరుతో హిమాలయాల్లో నదిగా మరి భూతలంలో ప్రవహిస్తోంది. ఆమె మీద మమకారంతోనే నేను హిమాలయాల్లో ఉంటాను. సిద్ధాశ్రమానికి యాగం కోసమే వచ్చాను. నీ పరాక్రమం వల్ల యాగం చక్కగా పూర్తయింది'' అంటూ విరమించాడు.
ఆ రాత్రి వారందరూ శోణ నదీ తీరంలో విశ్రమించారు. అయోధ్య నుంచి బయల్దేరిన రామలక్ష్మణులకు ఇది పదకొండవ రోజు. మరుసటి రోజు వారి ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్!