గురువారం, అక్టోబర్ 16, 2025

నల్లచుక్క కాదిది... నమ్మలేని వింత!


ముందు ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్న నల్ల చుక్కను చూడండి. మహా అయితే వధూవరుల బుగ్గన పెట్టే దిష్టి చుక్క కన్నా చిన్నదిగా ఉంది కదూ? ఈతరం అమ్మయిలు నుదుటను పెట్టుకునే బొట్టు బిళ్లంత కూడా లేని ఈ చుక్క అంతరిక్షంలో ఓ అద్భుతం. ఇప్పుడు దీని గురించి ఆశ్చర్యకరమైన, నమ్మలేని నిజాన్ని ఊపిరి బిగబెట్టి తెలుసుకోండి. అంతరిక్షంలో ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్న ఈ నల్ల చుక్క, మన సూర్యుడి కన్నా 6.5 బిలియన్ రెట్లు పెద్దదైన కృష్ణబిలం. అంటే తెలుసుగా? బ్లాక్ హోల్. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ గా చెబుతున్న ఇది ఎక్కడో అంతరిక్షంలో కూర్చుని నిశ్శబ్దంగా దాని చుట్టూ ఉన్న సమస్త పదార్థాలనూ లాగేసుకుని తనలో కలిపేసుకుంటోంది. అంతుపట్టని అంతరిక్షంలో ఉన్న అద్భుత శక్తులకు ఇదొక తాజా ఉదాహరణ. కృష్ణబిలాలనేవి రోదసిలో అంతుపట్టని ఆశ్చర్యాలకు నిలయాలు. అవి దేన్నయినా మింగేస్తాయి. కాంతిని, పదార్థాన్ని, శక్తిని దేన్నయినా కబళించేస్తాయి. ఆఖరికి విశ్వంలో అతి ముఖ్య అంశాలైన స్థల కాలాలను కూడా లోబరుచుకుంటాయి. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ దగ్గర ఏం జరుగుతుందో పరిశోధకులు ఊహిస్తూ, అనేక సిద్ధాంతాలను చేశారు. కానీ ఇలాంటి ఓ కృష్ణబిలాన్ని ఫొటో తీసి చూడగలగడం మాత్రం ఇదే తొలిసారి. అందుబాటులో ఉన్న నక్షత్రాలు, వాయు మేఘాలు, పదార్థాలన్నీ బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తికి లోనై, దానిలో పడి ఎవరికీ తెలియని చోటుకి వెళ్లిపోతున్నాయి.

ఈ ఫొటో కేసి చూస్తే ఆశ్చర్యంతో పాటు, భయం కూడా కలుగుతుంది. అంతుబట్టని ఈ అనంత విశ్వంలో మనమెంత అల్పులమో అర్థమవుతుంది. అదే సమయంలో ఈ ఫొటో ఆదునిక సాంకేతిక ప్రగతికీ, మనిషి నిరంతర కుతూహలానికి కూడా సంకేతం. సుదూర రోదసి తీరాల్లోకి తొంగి చూడడానికి ఈ ఫొటో ఓ కిటికీలాంటిది. ఫొటోలో కనిపించే చిన్న నల్ల చుక్క మనం ఊహించలేనంత పెద్దదే కాదు, మనకి తెలియని ఎన్నో రహస్యాలను మరింత పరిశోధించాని గుర్తు చేసే ఓ సూచిక కూడా.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి