ఆదివారం, అక్టోబర్ 12, 2025

ఎలక్ట్రాన్ గారూ... మీ వయసెంత సారూ?

 









ఒకసారి మీ శరీరం కేసి చూసుకోండి... ఇప్పుడు ఓసారి తలెత్తి ఆకాశం కేసి చూడండి... మీ శరీరమైనా, ఆకాశంలో కనిపించే తారలైనా అన్నింటిలోనూ కనిపించే అతి సాధారణ, ప్రాథమిక కణం ఏంటి? ఎలక్ట్రాన్. మీ లోను, ఈ సమస్త విశ్వంలోనూ కూడా ఉండే ఈ ఎలక్ట్రాన్లు సామాన్యమైనవి కావు. ఇవి లేందే ఈ విశ్వమే లేదు. వీటితోనే పరమాణువులు, వాటితోనే మన కంటికి కనిపించే జగత్తంతా తయారైంది. వీటి గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇవి ఈ విశ్వం కన్నా ఎక్కువ కాలం ఉండగలవని. ఎప్పటికో అప్పటికి ఈ సమస్త విశ్వం నశిస్తుందనే చెబుతారు కదా, కానీ ఎలక్ట్రాన్లు మాత్రం విశ్వం వయసుకి మించి బిలియన్ ట్రిలియన్ రెట్లు అధికంగానే మనగలుగుతాయట. తాజా అంచనాల ప్రకారం ఒక ఎలక్ట్రాన్ జీవిత కాలం 66,000 యోట్టా ఏళ్లు. అంటే ‘6.6 ఇంటూ 10 టుది పవర్ ఆఫ్ 28’ ఏళ్లు. ఇది విశ్వం వయసుతో పోలిస్తే బిలియన్ ట్రిలియన్ రెట్లు అధికం. పోలిక కోసం చూడాలంటే... ఈ విశ్వం పుట్టి ఇప్పటికి 13.8 బిలియన్ సంవత్సరాలు అయింది. అంటే ఎలక్ట్రాన్లు అంత స్థిరమైన ప్రాథమిక కణాలన్నమాట. ఇవంటూ ఉన్నయి కాబట్టే అణువులు ఏర్పడుతున్నాయి. వాటితోనే మనం, సకల జీవ రాశులు, ఈ విశ్వం అన్నీ ఉనికిలోకి వచ్చాయి. గ్రాండ్ యూనిఫైడ్ థీరీస్ లాంటి సిద్ధాంతాల ప్రకారం ఎలక్ట్రాన్లు అనూహ్య కాలం తర్వాతనైనా నశిస్తాయని అంటున్నారు కానీ, దానికి ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు కనిపించలేదు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే విశ్వంలో అమరత్వం ఉన్న కణాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎలక్ట్రాన్లే అనుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి