"నిన్నెప్పటికైనా ముఖ్యమంత్రిని చేస్తాన్రా... ఇదే నా శపథం" అన్నారు గురువుగారు గంభీరంగా.
అప్పుడే వచ్చిన శిష్యుడు ఆ మాట వింటూనే పులకించిపోయాడు. కళ్ల వెంట నీళ్లు ఉబికాయి. ఒళ్లంతా గగుర్పొడిచింది. గద్గద కంఠంతో "నా జన్మ ధన్యమైపోయింది గురూగారూ... " అంటూ ఉన్నపళంగా గురువుగారి కాళ్లమీద పడిపోయాడు.
గురువుగారు తాపీగా శిష్యుడిని లేవదీసి, "ఓరి నా వెర్రిశిష్యా! ఇలా నీరుగారిపోతే ఎలారా? ఇప్పుడు నువ్వు చేసిన హంగామా అంతా నేనన్నది నిజంగా జరిగినప్పుడు చెయ్యాలి..." అన్నారు.
"అంటే... జరగదా గురూగారూ" అన్నాడు శిష్యుడు బిక్కమొహం పెట్టి.
గురువుగారు నవ్వేసి, "ఓరి పిచ్చి సన్నాసీ... చెప్పడం వేరు, చెయ్యడం వేరురా. ముందు ఇది నేర్చుకో"
"అదేంటి సార్. మీరు చెప్పారంటే చేశారన్నమాటే కదండీ. మీ మాట మీద నాకంత నమ్మకం మరి" అన్నాడు అయోమయంగా.
"ఒరే... నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి వస్తున్నావ్ నువ్వు. నిన్ను పరీక్షించడానికి అలా అన్నా. నీకేమాత్రం రాజకీయం వంటబట్టి ఉన్నా, నేనలా అనగానే... 'ఏదో మీ అభిమానం... సరే అలాక్కానీండి...' అనాలి గుంభనంగా. అంతేకానీ గబుక్కున గుడ్డిగా నమ్మేయకూడదు. లేకపోతే ఆనక ఆంధ్ర ప్రజానీకంలాగా వెర్రిమొహం వేయాల్సి ఉంటుంది. అర్థమైందా?"
"అంత సులువుగా అర్థమైతే ఇంకా మీ దగ్గరకి ఎందుకు వస్తాను సార్? ఇంతకీ ఆంధ్ర ప్రజానీకం గురించి ఎందుకెత్తుకున్నారో చెప్పండి" అంటూ నీర్సంగా నోట్సు పుస్తకం, పెన్ను తీశాడు శిష్యుడు.
"నీకంత సులువుగా అర్థం కాదులే కానీ, ముందుగా నీకో కథ చెబుతా శ్రద్ధగా విను..." అంటూ గురువుగారు మొదలెట్టారు.
"... అనగనగనగా ఓ పల్లెటూరికి ఓ వస్తాదు వచ్చి, నలుగురి ముందూ బల ప్రదర్శన చేశాడు. పెద్ద పెద్ద బరువులు అవీ ఎత్తి ఆశ్చర్య పరిచాడు. ఆ ఊళ్లో పెద్ద బండరాయి ఉంటే దాన్ని అమాంతం ఎత్తుకుని మోసి చూపించాడు. ఊళ్లో జనమంతా చప్పట్లు కొట్టి ఆనందించారు. తలాకాస్తా పోగేసి ఆ వస్తాదుకు ముట్టచెప్పి పంపించారు. ఆ ఊళ్లో జగ్గూగాడని, ఓ పనికిమాలిన వాడున్నాడు. వాడు ఊరి జనం ముందుకు వచ్చి, 'ఆ వస్తాదుదేం గొప్ప? బాగా తిని బలిశాడు. వాడు తిన్నంత తిండి నాకు ఏడాది పాటు పెడితే చాలు, నేను ఆ కొండనే మోయగలను తెలుసా?' అన్నాడు. ఊరిజనం వాడి మాటలు నమ్మారు. 'సరే అయితే నువ్వంత బలశాలివైతే మా ఊరికే గొప్ప కదా? ఏడాది పాటు ఏది కావాలంటే అది పెడతాం' అంటూ ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఊరివాళ్లందరూ కలిసి చందాలేసుకుని వాడిని మేపారు. ఆ జగ్గూగాడు బాగా పిస్తాలు, బాదాలు, మాంసం, గుడ్లు, పాలు, పళ్లు తింటూ ఏడాది గడిపేశాడు. వాడన్నగడుపు పూర్తవగానే ఊరి జనమంతా కొండ దగ్గర చేరి, 'మరైతే ఆ కొండను ఎత్తు చూద్దాం' అన్నారు. అప్పుడు ఆ జగ్గూగాడు ఏమన్నాడో తెలుసా? 'నేను కొండను మోస్తానన్నాను కానీ ఎత్తుతాననలేదు. మీరంతా ఆ కొండను తెచ్చి నా భుజాల మీద పెడితే ఇట్టే మోసేస్తాను' అన్నాడు. అదీ కథ"
శిష్యుడు కథంతా విని, "వార్నీ ఎంత మోసం? అప్పుడు ఆ ఊరివాళ్లంతా కలిసి ఏం చేశారు సార్?" అన్నాడు ఉత్కంఠతో.
"ఆ ఊరివాళ్లు ఏం చేశారన్నది కాదురా పాయింటు. ఆ పనికిమాలిన వాడు ఏడాది పాటు తన పబ్బం గడుపుకున్నాడా లేదా అనేదే అసలు విషయం. జనాన్ని ఎలా నమ్మించాలో తెలియడం రాజకీయంలో ముఖ్యమైన సూత్రం. తెలిసిందా? చెప్పింది చేశావా లేదా అనేది తర్వాతి సంగతి. ఇప్పుడు చెప్పు ఆ జగ్గూగాడి కథ నీకెందుకు చెప్పానో?"
"తెలిసింది గురూగారూ! ఆ ఊరివాళ్లలాంటి వాళ్లే ఆంధ్ర ప్రజానీకం అని అర్థమైందండి. ఇందులో రాజకీయ సూత్రాలేంటో చెప్పండి రాసుకుంటాను"
"నేను చెప్పడం కాదురా. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయింది కదా... ఏదో చేసేస్తానని, ఏదేదో ఊడబొడిచేస్తానని చెప్పి కుర్చీ ఎక్కిన వాళ్లు ఏం చేశారో నువ్వే చెప్పు. నీ పరిజ్ఞానం ఎంతో చూద్దాం..."
"చెప్పడానికి ఏముందండీ? ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుందండి కథ. అధినేతగారు అధికారంలోకి రాగానే చేసిన మొదటి ఉపన్యాసం విని ఉబ్బితబ్బిబ్బయిపోయారండి జనం. ఇన్నాళ్లకి మనమంతా ఎదురుచూసిన గొప్పోడొచ్చాడు. ఇక రాజకీయాల్లో మహామహా మర్పులూ గట్రా వచ్చేస్తాయీ అనేసేసి, తెగ సంబర పడిపోయారండి. మొట్టమొదటిగా పాత నేత కట్టించిన అధికార భవనాన్ని అక్రమ నిర్మాణమంటూ పడగొట్టినప్పుడు, ఇక రాష్ట్రంలో ఎక్కడా అక్రమా కట్టడాలూ అవీ ఉండవన్న మాట అనుకున్నారండి. కానీ ఏమైందండీ? ప‌్రత్యర్ధులను దెబ్బతీయడం కోసమే ఆదర్శాలన్నీ అని బోధపడిందండి. ఎంతసేపూ, ఎగస్పార్టీ వారి మీద పాత కేసులు తిరగదోడి వెంటాడి వేధించడమే తప్ప, జనం గురించి ఆలోచించిన దాఖలాలు లేవండి. ఓటు బ్యాంకు కాపాడుకోడానికి ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెట్టే పథకాలే తప్ప, ప్రజల పురోగతి, ప్రగతి, స్వావలంబన, ముందు చూపులాంటి పన్లేవీ కనిపించడం లేదండి. చట్టం చట్టబండలైపోయిందండి. న్యాయం అనేది అన్యాయమైపోయిందండి. అధికార వ్యవస్థ కూడా అడ్డగోలు పనులకి అలవాటు పడిపోయిందండి. నేత నోటిలో మాటే వేదమైపోయిందండి. ఆఖరికి పెద్ద పెద్ద న్యాయస్థానాలు చురకలేసినా, చలనం అనేది లేదండి. పాత రాజధానిని కాదన్నారండి. దానికోసం భూములిచ్చిన రైతుల్ని, వాళ్ల ఆవేదనని అర్థం చేసుకునే ఇంగితం ఎక్కడా లేదండి. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట మొదలైందంది. పోనీ అదేమైనా ముందుకెళ్లిందా అంటే అదీ లేదండి. ప్రత్యేక హోదా అంటూ ఊదరగొట్టిన నోరు, ఇప్పుడా ఊసే ఎత్తడం లేదండి. ఇక పరిశ్రమలు రాబోయేవి కూడా పారిపోయాయండి. కొత్తవేవో వస్తాయనే ఆశ అడుగంటిందండి. మంత్రులు, ఎమ్మెల్యేలు... ముఖ్యమంత్రికి నచ్చని వాళ్లని తిట్టడానికే పరిమితమయ్యారండి. ఎవరైనా నోరెత్తితే ఆళ్ల మీద గూండా పోలీసులు విరుచుకుపడి, అడ్డమైన కేసులూ బనాయించడం నిత్యకృత్యమైపోయిందండి. 'ఒక్క ఛాన్స్... ఒక్క ఛాన్స్...' అంటూ బతిమిలాడితే, గొప్ప ఛాన్సే ఇచ్చారండి జనం. కానీ ఇప్పుడు నోరెత్తే ఛాన్సే లేకుండా పోయిందండి. కులం, మతం అనే కనిపించని గీతలొచ్చేస్తున్నాయండి జనం మధ్యకి. ఇంకెన్ని చెబుతానండి బాబూ... ఒకటా, రెండా... అన్నీ అవకతవకలేనండి. ఆయ్..." అంటూ ఆయాసమొచ్చి ఆగాడు శిష్యుడు.
"సెభాష్‌రా... నీ చుట్టూ ఏం జరుగుతోందో బాగానే గమనిస్తున్నావ్. నా పాఠాలు ఒంట పడుతున్నట్టే ఉన్నాయి. పోనీ... ఆ ఛాన్స్ నీకే వస్తే ఏం చేస్తావో అదీ చెప్పు.."
"ఛీ... ఛీ... ఇలాంటి పనులు చస్తే చేయనండి. చేసేదే చెబుతానండి. చెప్పింది చేస్తానండి. ఓట్ల కోసం కాకుండా, జనం సంక్షేమం కోసం పాటుపడతానండి. అంతేకదండీ?"
"ఏడిశావ్. నా ఉత్సాహం మీద నీళ్లు జల్లేశావ్ కదరా. ఇలా అయితే నువ్వు రాజకీయాలకు అస్సలు పనికి రావు. నేనేదో నిన్ను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని చేద్దామనుకున్నాను. శుద్ధ దండగని అర్థం చేసుకున్నాను"
"అయ్ బాబోయ్... అదేంటి సార్ అలాగనేశారు? మన్నించి మార్గం ఉపదేశించండి గురూగారూ..."
"ఒరేయ్ నేను చెప్పిన కథలో ఆ జగ్గూగాడే నీకు ఆదర్శం. ఆడిలాగా జనం ముందు గప్పాలు గొట్టి, నమ్మించడమే ముఖ్యం. ఆనక నువ్వేం చేస్తావో అనవసరం. చేసేది చెప్పావా, నాశనమైపోతావ్. చెప్పింది చేశావా, మసైపోతావ్. ఇంతకు మించిన రాజకీయ పాఠం ఇంకేం అక్కర్లేదు. ముందు నువ్వు నీ మనస్సులో ఉన్న మంచి భావాలన్నీ వదిలించుకుని వచ్చి నాకు కనబడు. అప్పుడు చెబుతాను, నీకు ముఖ్యమంత్రి అయ్యే అసలైన అర్హత ఉందో లేదో..." అంటూ గురువుగారు గద్దించారు.
శిష్యుడు మొహం వేలాడేసుకుని వెళ్లిపోయాడు.
PUBLISHED ON 12.6.2021 IN JANA SENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి