"రా రా శిష్యా... సమయానికి వచ్చావ్... నేనిప్పుడే కొన్ని కొత్త సంక్షేమ పథకాలు రచించాన్రా... వాటిలో ఒకటి 'శిష్య భరోసా' పథకం... ఇంద ఈ 50 రూపాయలు తీసుకో..."
అంటూ గురువుగారు డబ్బు అందించారు.
శిష్యుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. వినయంగా నోటు అందుకుని కళ్లకద్దుకుని జేబులో వేసుకుని, "ఆహా గురూగారూ... రాజకీయ పాఠాలు చెబుతూ రాటు దేలేలా చేయడమే కాకుండా, ఇలా శిష్యుల కోసం సంక్షేమ పథకాలు రచించే రాజగురువును మిమ్మల్నే చూశాను సార్..." అన్నాడు భక్తితో అరమోడ్పు కన్నులతో.
"అప్పుడే అయిపోలేదురా... 'గురువు ఒడి' అని మరో పథకం కూడా ఉంది. ఇంద ఈ 50 రూపాయలు కూడా తీసుకో... " అంటూ నోటు అందించారు.
"ఆహా.. గురూగారూ! మీలాంటి గురువు దొరకడం నా పూర్వజన్మ సుకృతం సార్..." అంటూ శిష్యుడు అందుకుని, "ఇంతేనాండీ, ఇంకేమైనా పథకాలున్నాయాండీ" అని అడిగాడు ఆశగా.
"ఉన్నాయ్‌రా... గురువు ఆసరా, గురువు చేయూత, శిష్యశ్రీ, రాజకీయ యజ్ఞం, పాఠాల పెంపు... ఇలా మరికొన్ని ఉన్నాయిరా... "
"అద్భుతం గురూజీ... ఆనందంతో నాకు నోట మాట రావడం లేదండి... నోరెండిపోతోంది. కాస్త మంచి నీళ్లు ఇప్పించండి సార్..."
గురువుగారు మంచినీళ్లు తెప్పించి ఇచ్చి... "ఒరేయ్... కొన్ని కొత్త పన్నులు కూడా ఉన్నయిరోయ్... మన రాజకీయ గురుకులం బాగా నడవాలంటే అవి నువ్వు చెల్లించాలి మరి..." అన్నారు.
"తప్పకుండా సార్... చెప్పండి..." అన్నాడు శిష్యుడు.
"అయితే నువ్వు తాగిన మంచి నీళ్లకు 100 రూపాయలు చెల్లించాలిరా శిష్యా... ".
బిక్కచచ్చిపోయిన శిష్యుడు జేబులోంచి డబ్బు తీసిచ్చి, "ఇది చాలా అన్యాయం గురూగారూ... ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటున్నారు..." అన్నాడు.
గురువుగారు పగలబడి నవ్వేసి, "ఒరేయ్... ఎప్పుడూ నేను చెప్పడం, నువ్వు రాసుకోవడం అంటే బోర్ కొడుతుందని, కాస్త వెరైటీగా ఇలా చేశాన్రా సన్నాసీ...అయినా ఇది కూడా ఓరాజకీయపాఠమేరా..."
"ఇందులో పాఠమేముంది సార్... సరదాగా నన్ను ఆట పట్టించారంతేగా?"
"కాదురా బడుద్దాయ్... నయా రాజకీయ శకంలో ఇదొక రంజయిన అధ్యాయంరా. బడుగు ప్రజలను ఆకర్షించి, ఊరించి, ఆశపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, నమ్మించి, మభ్యపెట్టి, మాయ చేసి, మత్తులో ముంచి, మైకంలో పడేసి, మైమరపించి, గారడీ చేసి, మురిపించి, మరపించి, ఏమరుపాటుకు గురిచేసి... మన రాజకీయ పబ్బం గడుపుకుంటూ, కుర్చీ కాపాడుకుంటూ, అధికారాన్ని చిరకాలం అనుభవించే అనితరసాధ్యమైన నీచ, నికృష్ట, నీతిబాహ్య, నిర్లజ్జ, నిరుపమాన రాజకీయ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యరా నాయనా..."
"అమ్మబాబోయ్ ఇంత ఉందాండీ? మొత్తానికి మసి పూసి మారేడుకాయ చేయడమే కదండీ? మరిందులో ఆరితేరిన సమకాలీన, సమర్థ, అసమాన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారాండీ?"
"ఎందుకు లేరురా... కాస్త పాఠ్య పుస్తకాల పుటల మధ్య నుంచి నీ మస్తకాన్ని చుట్టూ తిప్పి చూడరా... నీ ఆంధ్రా పరగణలోనే పరమాద్భుతమనిపించేలా పరిపాలిస్తున్న అధికార లీలా మానుషవిగ్రహుడు, సుదీర్ఘ రాజకీయ సోపాన నిర్మాణ సంకల్పుడు, కుటిల రాజకీయ వ్యవహార కౌశలుడు, దురంహంకార అధికార వ్యూహ రచనా దురంధురుడు కనిపిస్తాడు కదరా? ఆయన రచించిన పథకాల ముందు నా పథకాలెంతరా నాయనా... అర్థం కాలేదా?"
"అర్థమైంది గురూగారూ! కానీ నాదో చిన్న సందేహమండి... మరి ఆయన రచించిన పథకాల వల్ల ప్రజానీకానికి గొప్ప మేలు జరిగిపోతోందని ఆయన అనుచరులంతా ఊదరగొడుతున్నారు కదండీ... అలాగే వాటిని అందుకుంటున్న జనం కూడా ఆహా... ఓహో అనుకుంటున్న ఉదాహరణలు ఉన్నాయి కదండీ... మరి దానికేమంటారు?"
"అనడానికేముందిరా... అర్థం చేసుకోవడమే కష్టం అవుతుంటేనూ... కానీ ఆ పథకాల మాటున జరుగే తంతు చూస్తే నీకు అంతకు మించిన రాజకీయ పాఠాలు వేరే ఉండవురా... పైకి మేలు చేస్తున్నట్టు కనిపంచే ఆ పథకాలన్నీ ఓట్ల పంట కోసం జల్లే విత్తనాలురా... ఓట్ల చేపల్ని ఒడుపుగా పట్టే వలలురా... తెలిసిందా?"
"సరే గురూగారూ! మీరన్నట్టు ఓట్ల కోసమే అనుకుందాం. కానీ ఎంతో కొంత మేలు జరుగుతున్నట్టే కదండీ? ఇందులో నిగూఢంగా ఉండే పాఠాలు ఏమున్నాయో, నా మట్టి బుర్రకు అర్థమయ్యేట్టు చెబుదురూ, రాసుకుంటాను..."
"ఓరి... నా వెర్రి శిష్యా... ఆ పథకాల కోసం అప్పనంగా ధారపోస్తున్నదంతా ప్రజాధనమే కదరా... ప్రజలంతా కష్టపడి కడుతున్న పన్నుల ద్వారా సమకూరేదే కదా? అమూల్యమైన ప్రజాధనాన్ని రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాల కోసం, స్వావలంబన కోసం, భవిష్యత్ ప్రగతి చర్యల కోసం, ప్రజల ఆర్ధిక స్థాయి పెంచడం కోసం, రేపటి తరం పురోగతి కోసం కాకుండా... ఇలా తాత్కాలిక స్వీయ రాజకీయ, సొంత అధికార ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంలో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో అర్థం చేసుకో. ఇక నువ్వు చెబుతున్నట్టు కొందరు జనం ఉబ్బితబ్బిబ్బవుతున్నా, ఇటు పథకాల పేరు చెప్పి ఇచ్చినట్టే ఇచ్చి, అటు వాళ్లకి తెలియ కుండానే వాళ్ల జేబులోంచే తిరిగి తీసుకుంటున్న రాజకీయ చాతుర్యాన్ని ఒంట బట్టించుకో. జనాన్ని మత్తులో ముంచి ఖజానాను నింపే మద్యం అమ్మకాల సంగతి చూడు. ఆ అమ్మకాలన్నీ నాణ్యమైన సరుకు సరఫరా పేరిట టోకుగా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయినట్టే కదా? ఆపై వాటి ధరలు అమాంతం పెరిగిపోలేదూ? మరి ఆ భారం అంతా భరించేది ప్రజలే కదా? అదిగో... అలాంటి రాజకీయ కుటిలతను నేర్చకో. మరో పక్క కొత్త పన్నుల సంగతి చూడు. చెత్త మీద కూడా పన్నులు వడ్డించడానికి మున్సిపాల్టీలు సిద్ధం అయిపోతున్నాయి. చెత్తను నిర్మూలించడం ప్రభుత్వం బాధ్యతే కదా? కానీ ఆ చెత్త నిర్వహణకు కూడా ప్రజలే డబ్బులు చెల్లించాల్సి రావడం ఎంత వింతో ఆలోచించు. ఇలాంటి మురికి, చెత్త రాజకీయ ఎత్తుగడలను ఔపోసన పట్టు. అలాగే ప్రజల రక్షణ పేరు చెప్పి వాహనాలని, హెల్మెట్లని, రోడ్డు రూల్స్ అనీ, ప్రమాదాల నివారణ కోసమని పెంచేసిన జుర్మానాలు, చలానాలు, ఫైన్ల సంగతి చూడు. రోడ్డు మీదకు వస్తే చాలు ఏదో విధంగా జనం జేబులో డబ్బు గుంజుకునే సరికొత్త విధానాల రచనా చాతుర్యాన్ని అధ్యయనం చెయ్యి. ఒకప్పుడు సులువుగా దొరికే ఇసుక కూడా అధినేతల అస్మదీయుల అధీనంలోకి పోయి, కృత్రిమ కొరతతో అందరానిదైపోవడం లేదూ? దాని ధర కూడా అంతకు ముందు ఉన్నట్టు ఎక్కడుంది? అదిగో... అలా జనావసరాలకు కావలసిన వ్యవస్థలన్నింటినీ కేంద్రీకృతం చేసి నీ అనుచరులకు, అనుయాయులకు, నీ సొంత ప్రయోజనాలకోసం నువ్వు చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగలిగే బడాబాబులకు అప్పగించి, ఆనక ప్రజల నడ్డి విరిచే అధునాతన అరాచకం మీద పరిశోధన చెయ్యి... అర్థమైందా?"
"అర్థం కావడమేంటండి బాబూ... బుర్ర తిరిగిపోతుంటేనూ? అరచేతిలో పాకం చూపించి, మోచేతులు నాకించడం అంటే ఇదే కదండీ... ఇచ్చినట్టే ఇవ్వడం, జెల్లకొట్టి గుంజడం, జేబు గుల్లచేయడం... అబ్బో ఇలా చాలా చాలా పాఠాలు రాసేసుకోవచ్చండి..."
"శెభాష్... ఇక పోయిరా!"
-సృజన
PUBLISHED ON 19.6.2021 IN JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి