"వేషము మార్చెనూ...
భాషను మార్చెనూ...
మోసము నేర్చెను...
అసలు తానే మారెను...
అయినా... మనిషి మారలేదు!
ఆతని కాంక్ష తీరలేదు!"
-శిష్యుడు వచ్చేసరికి గురువుగారు సెల్‌ఫోన్‌లో పాట వింటున్నారు. శిష్యుడు కూడా నిశ్శబ్దంగా కూర్చుని విన్నాడు. పాట పూర్తవగానే, "భలే పాట గురూగారూ! గుండమ్మ కథలోది. నాకెంతో ఇష్టం..." అన్నాడు.
గురువుగారు నవ్వి, "నీకు, నాకు ఇష్టమైన పాటలు చాలానే ఉంటాయిరా. కానీ నువ్వొచ్చే సమయానికి ఈ పాట ఎందుకు పెట్టానో ఆలోచించు..." అన్నారు.
"ఓహో... ఇవాళ రాజకీయ పాఠం ఇలా పాటలతో మొదలుపెట్టారన్నమాట. కానీ ఇంతకీ ఈ పాట ఎవరి గురించి పెట్టారో చెప్పండి సార్..."
"ఒరే... అన్నీ నేనే చెబితే ఇక నువ్వుఎలా ఎదుగుతావురా? కాబట్టి ఇప్పుడు ఈ పాటకు పేరడీ చెబుతాను. దాన్నిబట్టి నువ్వే ఎవరి గురించో చెప్పాలి. సరేనా?"
"భలే హుషారుగా ఉంది సార్... చెప్పండి..."
"ఆశలు పెంచెనూ....
హామీలిచ్చెనూ...
కుర్చీ ఎక్కెను...
ఆపై... అన్నీ మరిచెను...
అయినా... మనిషి మారలేదు!
ఆతని తృష్ణ తీరలేదు!!
ప్రతిపక్షంలో విరుచుకు పడెను...
ప్రజలను ఎంతో మభ్య పెట్టెను...
ప్రత్యేక హోదా తెస్తాననెను...
అరచేతిలో వైకుంఠము చూపెను...
వేదికలెక్కెను... వాదము చేసెను...
అధికారం అందాక అన్నీ మరచెను...
అయినా...మనిషి మారలేదు!
ఆతని ఆబ తీరలేదు!!"
గురువుగారు చెప్పిన పేరడీ వినగానే శిష్యుడు పగలబడి నవ్వాడు. ఆపై "అర్థమైంది గురూగారూ! ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఆటలాడి, అధికారం చేజిక్కించుకుని, ప్రజలను ఏమార్చి, ఇప్పుడు మాట మార్చిన మహానుభావుడి గురించే కదండీ?" అన్నాడు.
"శెభాష్ రా! దార్లో పడ్డావ్. ఇప్పుడు పాట సంగతలా ఉంచు. ఈ మొత్తం వ్యవహారంలో నీకు అర్థమైన రాజకీయ పాఠం ఏమిటో చెప్పు?" అన్నారు గురువుగారు గంభీరంగా.
"ఇందులో పాఠం ఏముంది సార్? అంతా నీచ రాజకీయం అయితేనూ! అరెరె... ఎంత ఘోరమండీ? అసలే దెబ్బతిని, రాజధాని కూడా లేని పరిస్థితిలో పడిపోయి, ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయంలో ప్రజలు ఉంటే, వారిని నమ్మించి, ఊరించి, ప్రత్యేక హోదా తెస్తానంటూ ప్రగల్భాలు పలికి, ఆశలు రేకెత్తించి అధికారం అందుకుని ఇప్పుడు చేతులెత్తేయడం ఏంటి సార్? పాత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధపడితే, ఈయనగారే కదండీ, అప్పట్లో నానా యాగీ చేసింది? నేనయితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరీ హోదా సాధిస్తానని మోర పైకెత్తుకుని బీరాలు పలికింది ఈయనే కదండీ? జనం కామోసని నమ్మి కనీవినీ ఎరుగనంత ఘనంగా అధికారం అప్పగిస్తే... కుర్చీలో కూర్చుని రెండేళ్లయినా ఆ ఊసే ఎత్తని ఈయన్ని ఏమనాలండీ? ఈయనగారు ఢిల్లీ వెళ్లనప్పుడల్లా ఏదైనా తీపి కబురు వినిపిస్తుందేమోనని జనం ఎంత ఆశపడుతున్నారండీ? రాజధాని వెళ్లొచ్చాక... వాళ్లకి దండలేశానూ, వీళ్లకి వెంకటేశ్వరుడి పటాలిచ్చానూ, ఆయన భోజనం పెడితే గంట సేపు తిన్నానూ, ఈయనతో చాలా సేపు మాట్టాడేశానూ అంటూ గప్పాలు కొట్టుకోవడం తప్ప... ఈయన ఏం సాధించాడండీ? రెండేళ్ల పాటు కాలక్షేపం చేసి, ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి ఏమీ చేయలేమంటాడా? వాళ్లకి పూర్తి అధికారం ఉంటే ఈయనకెందుకు, అరకొర అధికారం ఉంటే ఈయనకెందుకంట? మన రాష్ట్ర ప్రయోజనం కోసం, మన ప్రజల కోసం మన ప్రయత్నమేదో మనం చేయాలి కానీ... ఇలా చేతలుడిగి, చేతులు దులిపేసుకుంటే ఎలాగండీ? మెడలు వంచుతానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, ఇప్పుడు మెడ వేలాడేయడానికా జనం ఓట్లేసింది? పైగా దేవుడి దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని వేదాంతం చెప్పడమేంటండీ, దారుణం కాకపోతేనూ! పాపం... ఓట్లేసి గెలిపించిన జనానికి ఏం దక్కిందండీ? అటు ప్యాకేజీ పోయి, ఇటు హోదా ఆశలు అడుగంటి... రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలారు కదండీ? మీరెన్నయినా అనుకోండి గురూగారూ! ఇదంతా తల్చుకుంటుంటేనే అరికాలి మంట నెత్తికి ఎక్కిపోతుంటే... మీరేమో పేరడీలు పాడి, పాఠాలు నేర్చుకోమంటారేంటండీ?" అంటూ శిష్యుడు ఆవేశ పడిపోయాడు.
గురువుగారు మాట్లాడకుండా మంచినీళ్లు అందిస్తే శిష్యుడు గడగడా తాగేశాడు. కాసేపు ఆగాక గురువుగారు మొదలు పెట్టారు.
"ఆపరా... నీ అవకతవక మాటలు. నీకసలు సిగ్గుందా అని! రాజకీయాలకీ, ఆవేశానికీ పొంతన కుదరదని ముందు తెలుసుకో. కుర్చీ ఎక్కి అధికారంతో తైతక్కలాడుతున్న వాళ్లు, నీ లాంటి వర్థమాన రాజకీయ ప్రవేశాభిలాషులకి నిజమైన మోడల్సురా. వాళ్ల మాటలే నీకు పాలిటిక్సులో థియరీ. వాళ్ల నయవంచన పద్ధతులే నీకు ప్రాక్టికల్సు. వాళ్ల పాలనే నీకు ప్రాజెక్టు వర్కు. వాళ్ల చేతలే నీకు ఎంట్రెన్సు. ఇవన్నీ మర్చిపోయి, సామాన్య జనంలో ఒకడిలాగా ఆవేశపడితే ఎలా? ఇలా అయితే నువ్వు వీధుల్లోకెళ్లి నినాదాలు చేసుకో. రేపట్నుంచి నా దగ్గరకి రాజకీయ పాఠాలంటూ రాకు".
"అయ్ బాబోయ్... అంత మాటనకండి గురూగారూ! రాష్ట్రంలో జరుగుతున్న నయా నీచ రాజకీయ విధానాలు చూసి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూసి గబుక్కున ఆవేశపడిపోయానండి. ఇప్పుడు చెప్పండి గురూగారూ నన్నేం చేయమంటారు?"
"అలారా దారికి. ఇందాకా పేరడీ పాటని అపహాస్యం చేశావు కాబట్టి, నువ్వు కూడా పేరడీ కట్టి వినిపించు. అదే నీకు కంపోజిషన్".
శిష్యుడు బుర్ర గోక్కున్నాడు. కాసేపు జుట్టు పీక్కున్నాడు. మెదడు వేడెక్కేలా ఆలోచించాడు. ఆ తర్వాత కాగితం మీద రాసి తీసుకొచ్చి గురువుగారి ముందు చదివాడు.
"పిడికిలి మించని హృదయంలో...
కడలిని మించిన పేరాశలు దాచెను...
మాటలు మార్చి మాయ చేసెను...
అయినా మనిషి మారలేదు! ఆతని తీరు మారలేదు!
అడిగిన వారిపై ఆగ్రహించెను...
కాదన్న వారిపై కేసులు మోపెను...
చివరకి ప్రజలకే టోపీ వేసెను...
అయినా మనిషి మారలేదు! ఆతని యావ చావలేదు!!".
గురవుగారు నవ్వి, "సెభాష్‌రా ఇక పోయిరా" అన్నారు.
-సృజన
PUBLISHED ON 27.6.2021 IN JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి