అధినేత ఆకాశంలో సూర్యుడికేసి తదేకంగా చూస్తున్నాడు. వెనక నుంచి సెక్రటరీ వచ్చాడు.
"నమస్కారం సార్..."
"రావయ్యా సెక్రట్రీ... రా... ఏటిసయం?"
"అదేసార్... తాజా వార్తలు చెబుదామని..."
"అబ్బ... సెక్రట్రీ ఎప్పుడూ వార్తలు, పరిపాలనేనా? పొద్దున్నేకాస్త పచ్చిగాలి పీల్చుకోవద్దూ!"
"ఎస్సార్..."
"ఎస్సార్ కాదు... కళ్లెట్టుకు సూడు. ఏదో వైరస్ కమ్మేసినట్టు లేదూ ఆకాశంలో. సూర్యుడు కరోనా వేరియంట్లా లేడూ!"
"అద్భుతం సార్..."
"మరదేనో... మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాలి. ఎప్పుడూ అధికారం, ఆర్జనా అనుకుంటే ఎలా?"
"క్షమించాలి సార్... మీరిలా కళాపోసన అని కూర్చుంటే అవతల కలకలాపోసన జరిగిపోతోందండి..."
"ఏం? జనం కానీ చైతన్యవంతులైపోలేదు గద?"
"అబ్బే అదేం లేదుసార్... ప్రజలు మత్తులోనే జోగుతున్నారండి..."
"మరింకెందుకయ్యా... ఆ కంగారు? జనం మేలుకోనంత వరకు మనకి డోకా లేదయ్యా... ఒకేల అలాంటి సందేహం ఏదైనా వస్తే, ప్రచారాలతో మన పథకాల గురించి ఊదరగొట్టు... మనం బతికేదే ఆళ్ల కోసమన్నట్టు భ్రమలు కలిగించు... కావాలంటే నవ మాణిక్యాలనో, నవ వైఢూర్యాలనో కొత్త పథకాలు ప్రవేశ పెట్టేద్దాం. దాంతో వెర్రి జనం సంబరపడిపోతారు.ఏమంటావ్?"
"అయ్యా... మీ భరోసా చూస్తే ధైర్యంగానే ఉంటుందండి. కానీ ఓ పక్క మన పాలన గురించి విమర్శలు తలెత్తుతున్నాయండి... నిరసనలు పెల్లుబుకుతున్నాయండి... వాటిని మీ దృష్టికి తేవడం సెక్రటరీగా నా బాధ్యత కదండి మరి?"
"సరేలెద్దూ... ఎదవ న్యూసెన్సు... ఇంతకీ సంగతేంటో చెప్పు..."
"అదేనండి... ఓ పక్క కరోనా పెచ్చు పెరిగిపోతుంటే, జనం ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతుంటే ఏలినవారికి చీమ కుట్టినట్టయినా లేదని కోనసీమలో ఒకాయన నిరసన దీక్షకి కూర్చున్నాడండి.. పెద్ద తలకాయల్ని, అధికారుల్ని కలిసి వినతి పత్రాలు అవీ ఇవ్వడానికి సిద్దం అయిపోయాడండి..."
"దాందేముందయ్యా... వెంటనే మన పోలీసు బలగానికి కబురెట్టి అరెస్ట్ చేయించేయలేకపోయావా?"
"సార్... మరీ నిరసన దీక్షకి, వినతి పత్రానికే అరెస్టంటే బాగుండదేమోనండి... ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మరి కామనే కదండీ?"
"పెజాసామ్యమేంటయ్యా... పెజాసామ్యం... మనం కుర్చీ ఎక్కాక ఏం చెబితే అదే సామ్యం... అదే వేదం... ఈ విషయం అందరికీ అర్థమవ్యాలంటే ఇలాగే సెయ్యాల... పోనీ అరెస్ట్ కాపోతే ఆడిని ఇంట్లోంచి కదలనీకుండా, అదేదో గృహనిర్భంధం చేయించేయమను. ఆడి వాహనాలన్నీ సీజింగ్ చేయించేయమను... చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలయ్యో... నాకసలే విమర్శలంటే ఎలర్జీ... అర్థమైందా?"
"అర్థమైందండి... ఇక రెచ్చిపోమని పోలీసులకి సిగ్నల్ ఇచ్చేస్తానండి... కానీ నాదో సందేహం సార్. ఇలా విరుచుకుపడితే తమది నిరంకుశ పాలనని, నియంత విధానమని గొంతులు లేస్తాయేమోనండి. మరి ఆనక నేను చెప్పలేదంటారు..."
"గొంతులు లేస్తే లేవనీవయ్యా... మనకేంటంట... కావాలంటే ఆళ్ల మీద కేసులు బనాయిద్దారి... లేదా పాత కేసులేమైనా ఉంటే తిరగతోడ్దారి... మన సొంత పార్టీ ఎంపీ నోరెత్తితేనే మనం ఊరుకోలేదూ! ఆ యవ్వారం చూశాక కూడా నీకు మన తీరేంటో తెలిసొచ్చినట్టు లేదు... చీకటి కొట్లో పడేసి కుమ్మించలేదూ? గుర్తులేదా?"
"ఎందుకు గుర్తులేదండీ? ఆ వ్యవహారం చూసి దేశమంతా దిమ్మరపోతేనూ? ఆఖరికి కోర్టులు వ్యాఖ్యానాలు చేసినా నిమ్మకునీరెత్తినట్టు నిబ్బరం చూపించాం కదండీ?"
"అదీలెక్క. అద్సరే కానీ సెక్రట్రీ, మన బడ్జెట్ ఏమనుకుంటున్నారయ్యా జనం?"
"జనానిదేముందండీ... మనం చెప్పిన భారీ అంకెలు చూసి ఆహా ఓహో అనుకుంటున్నారండి. కానీ కొందరు ఆర్థిక విశ్లేషకులు మాత్రం పెదవి విరుస్తున్నారండి..."
"ఏమంటారేటి?"
"అదేనండి... ఆ అమరావతి ప్రాజెక్టులన్నీ ఆపేశాం కదండీ, ఆ కంపెనీలకు వెయ్యి కోట్లు బకాయిల కోసం కేటాయింపులేవని కొందరంటున్నారండి..."
"చూడు సెక్రట్రీ... ఆ అమరావతి పేరు నా దగ్గర ఎత్తకయ్యా... ఆ పేరు వింటేనే నాకు ఒళ్లంతా కంపరంగా ఉంటది... అసలు ఆ పేరు వినిపించకుండా చేయాలనేదే కదయ్యా... మన పంతం... అందుకే అరకొర నిధులు పడేసి చేతులు దులుపుకున్నాం... ఆ... ఇంకేంటంటారు?"
"నెలకు రెండు వేల కోట్లు వడ్డీలకే కడుతున్నారు... ఇక అసలు అప్పులు ఎప్పటికి తీరుతాయని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారండి..."
"కావాలంటే బుగ్గలు కూడా నొక్కుకోమనయ్యా... మనకేం నష్టం? అందినకాడల్లా అప్పులు తెచ్చి, అమాయక జనానికి తాత్కాలిక తాయిలాల పందేరం చేయడమే మన పాలసీ. అందుకోసం హోలాంధ్రా అప్పుల ఊబిలో కూరుకుపోతే మనకేంటట? పెజానీకాన్ని మత్తులో ముంచెత్తి పబ్బం గడుపుకోవడమే కద, మన ఉద్దేశం..."
"మరేనండి... ఇంకానేమో ఆరోగ్యానికి కూడా సరిగా నిధులు ఇవ్వలేదూ, పట్టణ అభివృద్దికి కూడా పట్టించుకోవడం లేదూ, విజయవాడ మెట్రో రైలు ఊసేలేదూ, మున్సిపల్ బడుల సంగతే మరిచారూ... అంటూ ఏవేవో అంటున్నారండి... ఇంకానండీ...."
"ఇక ఆపేయవయ్యా సెక్రట్రీ... ఏదో ఒకటి వాగుతూ ఉంటార్లే... మనం చూసుకోవలసింది అది కాదు.... ఇలాంటి విమర్శలు ఏఏ పేపర్లలో ప్రముఖంగా వేశారో, వాటి మీద ఏదో వంకెట్టి కేసులు బనాయించమని మన గూండా పోలీసులకు పురమాయించు. ఆ పేపర్లకి సర్కారు వారి నుంచి అందే ప్రకటనలు ఆపు చేయించు. దెబ్బకి దార్లోకి వస్తారు... ఇక ఈ నిజాలు చెప్పే వారి తాతముత్తాతల చరిత్రంతా తిరగదోడు. ఎక్కడో ఏదో ఒక లోపం కనబడకపోదు... దాంతో ఆళ్ల మీద కూడా మారుమూల సెక్షన్లు గట్రా వెదికి ఏవేవో కేసులెట్టించు... ఓ విమర్శకానీ, ఓ నిరసన కానీ మన జమానాలో వినిపించకూడదు మరి... తెలిసిందా?"
"తెలిసింది కానీండి... మరీ ఇలా అడ్డగోలుగా చేస్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతినేసిందని అంటారేమోనండి మరి..."
"ఏం సెక్రట్రీవయ్యా నువ్వు? మన ఆర్డరే లా... మనం ఎలా చెబితే అదే లా... మనం చేసిందే లా... ఏం ... ఇంకా అర్థం కాలా? చట్టం మన చుట్టం... మన మాటే శాసనం... మనం జమానా లోతు, వెడల్పు, వైశాల్యం నీకింకా ఎరికలోకి వచ్చినట్టు లేదు... మనం అధికారంలోకి వచ్చాక చెప్పేదొకటి, చేసేదొకటని మన అధికారులు, సిబ్బంది, అనుచరులు, నేతలందరికీ బాగానే తెలిసిపోయింది. చురుకైన వాళ్లు నోరెత్తకుండా మనకి అనుగుణంగా నడుచుకుంటూ నోరెత్తకుండా కుక్కిన పేనుల్లా పడుంటున్నారు... కాబట్టి నువ్వేం కంగారు పడకుండా కేసుల గురించి చూడు... తెలిసిందా?"
"మహాప్రభో... బాగా బోధ పడిందండి! మీ అధికార విశ్వరూపం చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయండి..."
"హ...హ్హ... హ్హ... సెక్రట్రీ... జడుసుకున్నట్టున్నావ్ కానీ... ఇంటికెళ్లి దుప్పటి ముసుగెట్టి పడుకో... పోయిరా!"
-సృజన
PUBLISHED ON 4.6.2021 IN JANA SENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి