"ఈ నాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు ముడివేసి పెనవేసెనో... " అంటూ హుషారుగా పాట పాడుకుంటూ వచ్చాడు శిష్యుడు, గురువుగారి దగ్గరకి.
"ఏంట్రోయ్ మంచి ఉత్సాహంగా ఉన్నావ్? ఏంటి కత?" అని అడిగారు గురువుగారు.
"ఏంలేదు గురూగారూ! ఇవాళ మా పెళ్లిరోజండి. అంచేత మా ఆవిడ కోరిక మీద యూట్యూబ్‌లో మూగమనసులు సినిమా చూశామండి. అందుకనే మీ దగ్గరకి రావడానికి ఆలస్యమైందండి. ఆ సినిమాలో పాట పాడుతున్నానంతేండి..."
"వార్నీ... అయితే నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇంతకీ పెళ్లంటే నీ అభిప్రాయం చెప్పరా..."
"ఏముందండీ... అదొక తీపి బంధమండి. ఏడేడు జన్మల నుంచి ముడిపడిపోతుందని మా ఆవిడ చెప్పిందండి. ఆయ్..."
"బాగా చెప్పావురా. పెళ్లిరోజు కూడా నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి వచ్చావంటే నీ చిత్తశుద్ధి ఏంటో అర్థమౌతోంది... సరే కానీ బంధాలన్నింటిలోకీ బలమైన బంధం ఏంటో తెలుసురా?"
"ఇంకేముంటుందండీ... పెళ్లి బంధమే కదండీ..."
"ఓరి సన్నాసీ... ఇక నీ పెళ్లిరోజు సంబరం నుంచి బయటకి రా. కాస్త ఆలోచించి సమాధానం చెప్పు..."
"ఓహో... అయితే పాఠం మొదలెట్టేశారన్నమాట. బలమైన బంధం ఏంటంటే... ఆ... తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య ఉండేదాండీ? పోనీ ప్రేయసీ ప్రియుల బంధం, స్నేహబంధం ఇలాంటివాండీ?"
"అబ్బే.... అవన్నీ మానవ సంబంధాలురా... సహజంగా ఉండేవేగా?"
శిష్యుడు బుర్ర గోక్కున్నాడు... "మరైతే చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నట్టు గుర్తండి... అయస్కాంత బంధం... గురుత్వాకర్షణ బంధం... అణుబంధం... ఇవాండీ?"
"ఏడిశావ్... అవన్నీ సైన్సు బంధాలురా... నేనడిగానంటే అది నీ చిన్నప్పుడు పాఠాల్లో ఉంటుందేంట్రా బడుద్దాయ్..."
శిష్యుడుతెల్లమొహం వేసి, కాసేపు ఆలోచించి, "ఆ... ఇప్పుడు చెబుతాను సార్... రాజకీయ బంధం కదండీ?"
"ఓరి అమాయకపు శిష్యా! ఈ రోజుల్లో రాజకీయ బంధాలు కూడా బలహీనమైనవే కదరా... గెలిచిన పార్టీని వదిలి అంతవరకు తిట్టిన పార్టీలోకి దూకేసే మహానుభావులు ఎంతమంది లేరు చెప్పు..."
"అదీ నిజమేనండి... మరయితే మీరడిన ప్రశ్నకి సమాధానం ఏంటో నా మట్టి బుర్రకి అందడం లేదండి... కాస్త మీరే చెబుదురూ... " అంటూ శిష్యుడు కాళ్లబేరానికి వచ్చేశాడు.
గురువుగారు తాపీగా పడక్కుర్చీలో వెనక్కి వాలి చెప్పారు... "అవినీతి బంధంరా. ఇది అన్నిబంధాలకన్నా
బలమైంది. రాజకీయాలకి అతీతమైంది. మానవ సంబంధాల కన్నా ముఖ్యమైనది. నువ్వు ఇందాకా చెప్పావే... గురుత్వాకర్షణ బంధం... అణుబంధం అని! అవి కూడా ఈ అవినీతి బంధం ముందు బలాదూర్‌రా. నయా నీచ రాజకీయ అధ్యాయంలో ఇదొక నికార్సయిన బంధం..."
"ఓహో... ఇంతకీ అవినీతి బంధం అంటే ఏంటి గురూగారూ?"
"ఏముందిరా... అవినీతి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రజాధనాన్ని కలిసి కొల్లగొట్టిన అధమాధముల మధ్య బలంగా పెనవేసుకుపోయే అపూర్వమైన, అద్వితీయమైన, అనిర్వచనీయమైన, అన్యాయమైన, అధర్మమైన, అసహ్యమైన, అనుచితమైన, అడ్డగోలు బంధంరా ఇది. ఒకసారి ఈ బంధం ఏర్పడిందంటే అది ఇనుముని, కంకరని కలిపేసే సిమెంటులాగా గట్టిపడి పోతుందిరా... ఇక దాన్ని పునాదిగా చేసుకుని అక్రమాల, అకృత్యాల భవంతులెన్నో కట్టేసుకోవచ్చు..."
"అంటే... దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టన్నమాటండి... మరైతే గురూగారూ! ఇలాంటి అవినీతి బంధంలో పెనవేసుకు పోయి, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నవాళ్లు మన మధ్య ఉన్నారాండీ?"
"ఓరి నా వెర్రి శిష్యా! ఇంకా అర్థం కాలేదా? సాక్షాత్తూ పరగణాని ఏలుతున్న అధినేతనే మరిస్తే ఎలారా? ఆయన మీద ఉన్న అక్రమాస్తుల కేసులు ఇంకా ఓ కొలిక్కి రాలేదని మర్చిపోయావంట్రా? అసలవో పట్టాన తేలేవేనా? ఈ నేత కుర్చీ ఎక్కక ముందు నుంచీ కోర్టుకెక్కినవే కదరా? వాటి అంతూ పొంతూ, లోతూ, పొడవు, వెడల్పు తేల్చలేక కోర్టులన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఈ కేసుల వెనుక ఒట్టి అవినీతి బంధమే కాదురోయ్... తండ్రీ కొడుకుల బంధం, భార్యాభర్తల బంధం, అన్నాచెల్లెళ్ల బంధం, అధికార బంధం, స్నేహబంధం... ఇలా ఎన్నో బంధాలు కలగలిసిపోయాయిరా... అప్పట్లో తండ్రి అధికార పీఠం ఎక్కగానే ఈ అపురూపమైన బంధాలన్నీ కలగలిసి, చేతులు కలిపి... అక్రమాల కోలాటం ఆడాయి. అకృత్యాల చెమ్మచెక్కలాడాయి. కాని పనులతో కాళ్లాగజ్జా ఆడేసుకున్నాయి. తప్పుడు పనులతో ఒప్పులకుప్ప తిరిగాయి. అడ్డగోలు వ్యవహారాల అష్టాచెమ్మా, వికృత కృత్యాల వైకుంఠపాళీ, చెడ్డపనుల చెడుగుడు... ఇలా ఒకటా రెండా అడ్డమైన ఆటలూ ఆడేశాయి. అధికార వేదికపై, ప్రజాస్వామ్య రంగస్థలంపై అవినీతి కరాళ నృత్యం చేశాయి. ఈ కొడుకు కంపెనీలు పెట్టడం, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గనులు, భూములు, సెజ్‌లు, పోర్టులు శాంక్షన్ చేసేయడం, అందుకోసం అవసరమైతే రాత్రికి రాత్రి జీవోలు జారీ చేయడం, అయినవారికి కాంట్రాక్టులు అప్పగించడం, ఆ పనులు సరిగా జరగకపోయినా బిల్లులు చెల్లించేయడం, ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజాధనాన్ని పంచేయడం, అంచనాలు పెంచేసి ప్రజల కష్టార్జితాన్ని ఇష్టారాజ్యంగా పంచుకు తినడం... ఇలా ఒకటా రెండా, లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఆ కేసుల ఊసులు ఎన్ని చెప్పుకుంటే తనివితీరుతుందిరా? నీకేమీ గుర్తులేదేంట్రా?"
"అయ్యబాబోయ్! మీరు చెబుతుంటే చరిత్రంతా కళ్ల ముందు ఆడుతోందండి... మరైతే గురూగారూ, అలనాటి ఆ అనుబంధాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయంటారా?"
"ఎందుకు కొనసాగడం లేదురా పిచ్చి సన్నాసీ! అప్పటి అడ్డగోలు పనుల్లో చేదోడు వాదోడుగా వ్యవహరించి జైలుకు కూడా వెళ్లొచ్చిన ఐఏఎస్ అధికారులకు ఇప్పటి జమానాలో మంచి హోదాలు దక్కలేదూ? అలనాడు సహకరించిన సన్నిహితులకు ఈనాడు ప్రత్యేక పదవులు లభించలేదూ? అప్పటి అకృత్యాలకు సాక్షులుగా ఉన్నవారికి ఇప్పుడు అనేక ప్రలోభాలు అందడం లేదూ? మరి ఇలా బలమైన అవినీతి బంధంలో బలంగా అతుక్కుపోయిన వాళ్లంతా ఆ అక్రమాస్తుల కేసుల్నినడవకుండా అడుగడుగునా అడ్డు పడడం లేదూ? ఒక పథకం ప్రకారం, ఓ ప్రణాళిక ప్రకారం ఒకొక్కరుగా హైకోర్టులో విడివిడిగా పిటీషన్లు వేస్తూ, విచారణ ముందుకు సాగకుండా కాలయాపన చేయడం లేదూ? ఆ నాటి తండ్రీకొడుకుల కేసుల్లో ఒకరా... ఇద్దరా... ఏకంగా వందకు పైగా ఉన్న నిందితులందరూ ఇలా న్యాయవ్యవస్థలో నిబంధనలను అడ్డం పెట్టుకుని, అదను చూసి పిటీషన్లు వేస్తూ పోతుంటే ఆ కేసుల నిగ్గు తేలేదెప్పుడురా? నిరూపణలు జరిగేదెప్పుడురా? నిందితులు నేరస్థులుగా బయటపడేదెప్పుడురా? ఈలోగా మరిన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అప్పనంగా చేతులు మారదనే గ్యారంటీ ఏంట్రా? మరిదంతా విన్నాక కూడా అవినీతి బంధం ఎంత గొప్పదో నీకు అర్థం కాకపోతే, ఇక నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడురా... అర్థమైందా?"
"అర్థం కావడం కాదు గురూగారూ! బుర్ర తిరిగిపోయిందండి. అన్ని బంధాలకన్నా బలమైన బంధమేంటో అరటిపండు ఒలిచిపెట్టినంత సులువుగా చెప్పారండి. ఇందాకా నేను పాడుకుంటూ వచ్చిన పాటని ఇప్పుడు మరోలా పాడుతాను వినండి. ఈనాటి ఈబంధమానాటిదే! ఆనాడు ముడివేసి పెనవేసినదే!!"
"సెభాష్ రా శిష్యా! పైకొస్తావు. పోయిరా"
-సృజన
PUBLISHED ON 10.7.2021 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి