"ఒరే... నిజానికి, అబద్దానికి తేడా ఏంట్రా?" అంటూ అడిగారు గురువుగారు శిష్యుడు రాగానే.
శిష్యుడు బుర్ర గోక్కుని, "మరండీ... నిజం నిజమేనండి... అబద్దం అబద్దమేనండి... అలాగే, నిజం అబద్దం కాదండి... అబద్దం నిజం కాదండి..." అన్నాడు అయోమయంగా, ఏం చెప్పాలో తెలియక.
"ఏడిశావ్. ఇన్నాళ్లు నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నావు కదా, ఏమాత్రమైనా నీ బుర్ర ఎదిగిందో లేదో చూద్దామని ఈ ప్రశ్న అడిగాన్రా... అబ్బే... నీ బుర్ర ఇసుక పర్రని తేలిపోయింది..."
"అదేంటి గురూగారూ! అంత మాటనేశారూ? ఇలాంటివేమీ తెలియకనే కదండీ, మీ దగ్గర శిష్యరికం చేస్తుంట... కాబట్టి కోపగించుకోకుండా చెప్పండి. ఏంటి తేడా?"
"సరే... రాసుకో. నిజం కాకపోయినా, అచ్చం నికార్సయిన నిజంలాగా చెలామణీ అయిపోతూ, జనం ముందు ధగధగలాడిపోయేదే అబద్ధంరా. అలాగే శుద్ధ అబద్దమైనా, రాజకీయ అవసరాలకి ఆసరా ఇస్తూ, ప్రజానీకాన్ని భ్రమలో పడేస్తూ, నిదానంగా అబద్ధమని అర్ధమయ్యేదే అసలైన నిజంరా. అర్ధమైందా?"
శిష్యుడు కళ్లు తేలేశాడు. రెండు చేతుల్తో జుట్టు పీక్కుని, "బాబోయ్... ఒక్క ముక్క బోధపడలేదండీ... కాస్త నా స్థాయి తెలుసుకుని చెప్పండి గురూగారూ! ఎల్కేజీలో ఎమ్మే పాఠం చెబితే ఎలాగండీ?" అన్నాడు బేలగా.
గురువుగారు నవ్వి, "ఒరే... కంగారు పడకు. నీకు అర్థమయ్యేలా చెబుతాలే. చూడూ... నువ్వొక ముఖ్యమంత్రివనుకో. నువ్వు ఓ పెద్ద సభలో ప్రసంగిస్తున్నావనుకో. అహ... నువ్వు ముఖ్యమంత్రివి కాలేవులే, అది నిజం. కానీ... జస్టు ఊరికే అనుకో. అది అబద్దమైనా సరే... ఏం? ఇప్పుడు నీ మనసులో ఉన్నది నిజమన్నమాట... కానీ నువ్వు మైకు పుచ్చుకుని జనానికి చెప్పేది అబద్దం అన్నమాట... ఇప్పుడైనా అర్థమైందా?" అన్నారు నవ్వుతూనే.
శిష్యుడు తలూపి, "నాకు అర్థం కాలేదన్నది నిజం సార్... కానీ అర్థమైనట్టు తలూపింది అబద్దం సార్... అయితే మీరేదో కొత్త పాఠం మొదలెట్టారని అర్ధమైంది మాత్రం నిజమే సార్. దాన్ని కాస్త సూటిగా చెప్పి పుణ్యం కట్టుకోకపోతే, నాకు అస్సలు అర్థం కాదనేది అబద్దం కాదు సార్..." అన్నాడు ఏమంటున్నాడో కూడా తెలియనంత అయోమయ స్థితిలో.
గురువుగారు పగలబడి నవ్వేశారు. "బాగా చెప్పావురా సన్నాసీ... సర్లే... నిన్నింక ఏడిపించను కానీ, నీకో పరీక్ష పెడతా. సరేనా?"
"అమ్మయ్య. బతికించారు సార్. ఆ పరీక్షేంటో చెప్పండి..."
"ఏం లేదురా...ఇందాకా నువ్వొక ముఖ్యమంత్రివనుకోమన్నాను కదా. నిజంగానే అనుకో. ఇప్పుడు నువ్వు ఏమాత్రం సంకోచం లేకుండా నికార్సయిన నిజంలాంటి అబద్దాలు చెప్పాలి. చెప్పు చూద్దాం..."
"ఆ... తెలిసింది సార్... ఇక చూస్కోండి నా తడాఖా... ప్రియమైన నా ప్రజలారా... నా బతుకు మీ కోసమే. నా తపన మీ కోసమే. అతి త్వరలోనే మీ బతుకుల్ని అద్భుతంగా మార్చేస్తా... భూమి మీదకు స్వర్గం దించేస్తా... స్వర్ణ యుగం అంటే ఏమిటో చూపిస్తా... ఇలాగే కదండీ?"
"పర్వాలేదురా... కాస్తో కూస్తో పనికొచ్చేలాగే ఉన్నావు. కానీ ఇవన్నీ సాదాసీదా అబద్దాలురా. వినడానికి బాగానే ఉంటాయి కానీ, వింటూనే జనానికి అర్థమైపోతాయి, ఇవన్నీ ప్రసంగం కోసం చెప్పే అబద్దాలని. ప్రజలు కూడా తెలివిమీరి పోయార్రోయ్. కాబట్టి వాళ్లకి ఏమాత్రం అనుమానం కలగకుండా... నిజంగానే నిజం కాబోలనుకునే అబద్దాలు చెప్పాల్రా. విన్న జనం నిజంగానే ఆ అబద్దాల్ని నమ్మేయాలి. అలాంటివేమైనా చెప్పు..."
శిష్యుడు ఇక కాళ్లబేరానికి వచ్చేశాడు. "నా వల్ల కాదు సార్. నేనీ పరీక్షలో ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఇది నిజం. కానీ... ఇంత గొప్పగా అబద్దాలని, నిజాలుగా చెలామణీ చేసే నేత ఏవడైనా ఉన్నాడాండీ? జనానికి ఏమాత్రం అనుమానం రాకుండా అతడు చెప్పే అబద్దాలు ఎలాంటివండీ? కాస్త చెబుదురూ... ముందు రాసేసుకుని ఆనక ఇంటికెళ్లి బట్టీ పట్టేస్తాను..." అంటూ బుద్దిగా నోట్సు పుస్తకం తెరిచి, పెన్ను పట్టుకుని కూర్చున్నాడు.
"ఒరే... ఎంతసేపూ థియరీ రాసుకుంటానంటే ఎలారా? ప్రాక్టికల్ నాలెడ్జి పెంచుకోవాలికానీ. అలా పెంచుకోవాలంటే నీలో పరిశీలన పెరగాలి. అలాంటి నేత ఎవడైనా ఉన్నాడాండీ, అంటూ అడగడమేంట్రా... ఈ పాటికి గుర్తు పట్టేయొద్దూ. సరేలే... ఆ నేత చెప్పిన అబద్దాలేంటో నేను చెబుతాను. ఆ నేత ఎవరో నువ్వు గుర్తు పట్టు సరేనా?"
"సరే గురూగారూ! చెప్పండి..."
"నిజానికి ఆ నేత నోటంట వచ్చేవన్నీ ఇలాంటివేరా. కానీ అన్నీ ఒకేసారి చెప్పుకుంటే నీకు ఎన్ని నోట్సు పుస్తకాలైనా సరిపోవు. సిలబస్ పెరిగిపోతుంది. కాబట్టి శాంపిల్‌గా కొన్ని చెబుతాను. రాసుకో. ఉదాహరణకు ఉద్యోగాలు. ఈ అబద్ధపు వ్యవహారం ఉంది చూశావూ... ఇది రెండు మూడేళ్లుగా నికార్సయిన నిజంలాగా చెలామణీ అయిపోయిందిరా. పాపం... వెర్రి జనం నిజంగానే నమ్మేశారు. ఎన్నికలకు ముందు నుంచీ ఆ నేత దీన్ని ఊదరగొడుతూనే ఉన్నాడు. ఏకంగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తానంటే ఆశే కదరా? అబ్బో అనేసుకున్నారు పాపం. ఈ అబద్దాన్ని నిజంలాగా చెలామణీ చేయడానికి జాబ్ కేలండర్ ప్రకటిస్తామన్నాడా నేత. ఒహో... ఏదో కేలండరంట కూడానూ అని సంబర పడి నిరుద్యోగులు ఎదురు చూడ్డం మొదలెట్టారు. నిజం కేలండర్లో పేజీలు మారాయి కానీ, జాబ్ కేలండర్ బయటకి రాలేదు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. చివరాఖరికి ఇక తప్పదనుకున్నట్టు మా గొప్పగా జాబ్ కేలండర్ ప్రకటించారు. అందులో చూపించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? ముప్పై ఆరు! మరీ ఉద్యోగాల అబద్దం రెండేళ్లపాటు నికార్సయిన నిజంలాగా జనం ముందు ధగధగలాడిపోలేదూ? అదీ తెలివంటే! ఇంతకీ ఈ అబద్దాల లెక్కలు ఆగాయా, అంటే అదీ లేదు. గ్రామ వాలంటీర్లంటూ పనికిరాని పోస్టులు కొన్ని ఏర్పాటు చేశారు చూడూ... అదిగో వాటిని కూడా తాను ఆడిన అబద్దానికి కిరీటంలాగా మేకప్పు చేస్తున్నాడా నేత. పోనీ చిన్నవో, పెద్దవో అవీ ఏర్పాటయ్యాయి కదా అనుకుంటే, వాళ్లీ మధ్య జీతాలు పెంచాలని అడిగితే... ఈ నేత ఏమన్నాడో తెలుసా? అబ్బే... మీవి ఉద్యోగాలు కావూ... స్వచ్చంద సేవేనని. మరైతే ఏది నిజం? ఏది అబద్దం? ఓ పక్క వేలాది టీచర్ల పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. మరో పక్క ప్రభుత్వోద్యోగాలు కూడా వందలాదిగా ఖాళీలవుతున్నాయి. వాటిని నింపే ఉద్దేశం ఏదీ ఆ నేతకు పట్టదు. ఎందుకంటే వాటిని నింపాలనుకున్నది అబద్దం కదా? అదన్నమాట. అర్ధమైందా?"
"అయ్యబాబోయ్... ఎంత దారుణం సార్? వింటుంటే నాకు కళ్లు తిరిగిపోతున్నాయండి..."
"ఆగరా... బడుద్దాయ్. ఇంకా అయిపోలేదు. మరో నికార్సయిన అబద్దం ఇంకోటుంది. అదే రైతుల నుంచి ధాన్యం కొనడం. హామీ ఇచ్చింది లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని. అయితే నిజంగా కొన్నదానికి, అన్నదానికి ఎక్కడా పొంతన లేదు. పోనీ కొన్నదానికైనా పాపం ఆ రైతులకు డబ్బు విదిల్చారా అంటే అదీ లేదు. మూడు రోజుల్లో చెల్లిస్తామని ఆ నేత ప్రతి ప్రసంగంలోనూ చెబుతున్నది నిజమైన అబద్దం. ఇంకా రైతన్నలకు ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయల బకాయి ఉందన్నది చేదు నిజం. నమ్ముకున్న రైతులు నిండా మునిగారనేది నిజమైతే, తమది రైతు పక్షపాత ప్రభుత్వమంటూ ఆ నేత చెబుతున్నది నికార్సయిన అబద్దం. ఇప్పటికైనా, నిజమైన నిజానికి, నిజంలాగా కనిపించే అబద్దానికి తేడా తెలిసిందా? అబద్దాలని అచ్చమైన నిజాల్లాగా నమ్మించే ఆ నేత ఎవరో గుర్తు పట్టావా?"
శిష్యడు కాసేపు ఆలోచించి, "ఆ...గురూగారూ! గుర్తు పట్టేశా. ఆ నేత, దేశం మొత్తం మీద నీచరాజకీయాలకు నిజమైన అడ్డాలాగా మారిపోయిన ఆంధ్ర పరగణాలో అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న అబద్దాలకోరండి... ఆయనంత బాగా అబద్దాలకి మారువేషం వేయించి, నిజాలుగా జనంముందు నిలబెట్టి తైతక్కలాడించే నేత ఇంకెక్కడా కనిపించడండి. ఇది మాత్రం అబద్దం కాదండి... నిగ్గుతేలిన నిజమండి. ఆయ్..." అన్నాడు.
గురువుగారు తృప్తిగా తలాడించి, "నువ్వు కొంచెం రాటుదేలావనేది నిజంరా. కానీ అంతటి నేతవి కాగలననుకుంటే అది మాత్రం అబద్దం. ఇవాల్టికి ఇక చాల్లే. వెళ్లిరా" అంటూ పాఠం ముగించారు.
-సృజన
PUBLISHED ON 3.7.21 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి