అధినేతలుంగారు అద్దం ముందు నిలబడి మెత్తగా నవ్వడం ప్రాక్టీసు చేస్తున్నారు. పక్కనే సెక్రటరీ నిలబడి ఆ నవ్వులు చూస్తూ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో అక్కడికొక యువకుడు వచ్చాడు.
అధినేతని చూస్తూ వినయంగా "నమస్కారం సార్..." అన్నాడు.
"ఎవరు బాబూ నువ్వు? ఎవరు పంపించారు? ఎందుకొచ్చావ్?" అన్నారు అధినేతలుంగారు.
"నన్ను మా గురువుగారు పంపించారండి. నేను ఆయన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నానండి. అందులో భాగంగా నేరుగా మిమ్మల్నే కలిసి రాజకీయ సందేహాలు అవీ నేర్చుకోమన్నారండి..."
"ఓహో... 'అప్పు రెంటు షిప్ప'న్నమాట..." అన్నారు అధినేతలుంగారు. రాజకీయ శిష్యుడు తెల్లమొహం వేశాడు, ఆయనేమన్నారో అర్థం కాక.
సెక్రటరీ శిష్యుడి దగ్గరగా వచ్చి చెవిలో నెమ్మదిగా చెప్పాడు... "అంటే అప్రెంటీస్ షిప్ అని ఆయన ఉద్దేశం. ఆయన భాష అలాగే ఉంటుంది. మీరు కానివ్వండి..."
శిష్యుడు తలూపి, అధినేతలుంగారి వైపు తిరిగి, "ఆయ్... అదేనండి..." అన్నాడు.
"మంచిదేనయ్యా... కానీ మీ గురువుగారు నా దగ్గరికే ఎందుకు పంపించారు?"
"అంటే... మీరు ఓ రాష్ట్రానికి తొలి సారిగా అధినేతయ్యారు కదండీ... పైగా భారీ మెజార్టీతో సీట్లు గెలుచుకుని సీటెక్కారండి. ఆపై రెండేళ్లలోనే దేశ రాజకీయాల్లోనే ఓ సరికొత్త ఒరవడిని తీసుకొచ్చారండి. మీ తెగువ, ధైర్యం, దూసుకుపోవడం, పట్టుదల ఇవన్నీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకునే నా లాంటి యువకులకి ఆదర్శం కదండీ... అందుకనండి..."
"బాగుందయ్యా... అంటే మీ గురువుగారు నన్నొక 'సస్కర్త'ని గుర్తంచారన్నమాట. నన్ను 'విశ్మసిస్తే' తప్పకుండా 'వినయపూర్ణం'గా చెబుతాను..."
శిష్యుడు మళ్లీ తెల్లమొహం వేసి సెక్రటరీ కేసి చూశాడు. సెక్రటరీ ముందుకు వంగి, "సస్కర్త అంటే సంస్కర్త అని... విశ్మసించడం అంటే విశ్వసించడం... వినయపూర్ణం అంటే వినయ పూర్వకంగా అని..." అంటూ గుసగుసగా వివరించాడు.
శిష్యుడు తెల్లబోయినా, చేసేదిలేక తలూపాడు. "ఆపై చాలా సంతోషం సార్... కానీ ఒక్క మనవి. నేనేం అడిగినా మీరు ఉన్నదున్నట్టు నిజం చెప్పాలి..." అన్నాడు వినయంగా.
అధినేతలుంగారు మెత్తగా నవ్వి, "అలాగేనయ్యా... నేను ప్రజలతో మాట్లాడినట్టు మాట్లాడను, సరేనా? నువ్వు రాజకీయాలు నేర్చుకుంటున్నావు కాబట్టి, నా మనసులో మాటలే చెబుతానని ప్రతిగ్య చేస్తున్నాను. నేనిప్పుడు నీకు గురుదేవో మహేశ్వరం కదా... ఓ పదిహైదు రోజుల్లో నీకు రాజకీయాలు మొత్తం నేరిపించి పెతకం వచ్చేలా చేస్తా" అన్నారు అరచేతిని ఖైమా కొడుతున్నట్టు ఊపుతూ.
ఆ సరికి శిష్యుడికి అర్థమైపోయింది ఆయన చెప్పిన మాటల్లో ప్రతిజ్ఞ, గురుద్దేవో మహేశ్వరః, పదిహేను, పతకం పదాల పరిణామ క్రమం. అందుకే సెక్రటరీ ముందుకు వంగబోయినా, నవ్వుతూ వారించాడు.
శిష్యుడు గొంతు సవరించుకుని అడిగాడు... "సార్... మీ మీద చాలా అక్రమార్జన కేసులు ఉన్నాయి కదండీ? అయినా మీరు ఏమాత్రం నామర్దా కానీ, సిగ్గులాంటిది కానీ లేకుండా, హాయిగా నవ్వుతూ, ధైర్యంగా ఉంటారు. మీకింత జగమొండితనం ఎలా వచ్చింది సార్?"
అధినేతలుంగారు నవ్వేశారు... "భలేవాడివయ్యా... సిగ్గు, శరం వదిలేశాకే కదయ్యా... రాజకీయాల్లోకి వచ్చింది? అసలీ జగమొండితనం మా వంశంలోనే ఉందయ్యా... నా రగతంలోనే కలిసిపోయింది. అయినా నా మీద ఉన్నవి అక్రమార్జన కేసులేంటయ్యా... అవన్నీ నా దృష్టిలో సక్రమార్జన కేసులే. అవకాశం, అధికారం ఉన్నప్పుడు అందినంతకాడికి దోచుకోడమే అసలైన రాజకీయం. మరందుకేగా ఒకానొక దశలో ఇల్లు తాకట్టు పెట్టే దశ నుంచి మరీనాడు వేర్వేరు రాష్ట్రాల్లో కూడా పెద్ద పెద్ద భవంతులు అవీ కట్టించుకుంట. నేనీ అధికారం అందుకోవడానికి ఎంత కష్టపడ్డానయ్యా... ప్రజలు బాధపడకపోయినా ఓదార్చానా? ఏడవకపోయినా కళ్లు తుడిచానా? ఊరూవాడా తిరిగి కనిపించిన వాళ్ల బుర్రలు వంచి ముద్దులు పెట్టుకున్నానా? బుగ్గలు రాశానా? చేతులూపానా? ఓ అమ్మా... ఓ చెల్లీ... ఓ అన్నా... ఓ తమ్ముడూ... ఓ అవ్వా... ఓ తాతా... అంటూ వరసలు కలిపి కిలోమీటర్లకు కిలోమీటర్లు తిరిగానా? ఇవన్నీ చేస్తూ కూడా మొహానమెత్తని నవ్వు చెదరకుండా చూసుకున్ననా? నా బతుకే జనం కోసమన్నట్టు నమ్మబలికానా? ఆచరణ సాధ్యం కాని హామీలు ఊదరగొట్టానా? నాకు ఒక్క ఛాన్సు ఇస్తే చాలని దేబిరించానా? ఒక్కసారి కుర్చీ ఎక్కనిస్తే మీ బతుకులన్నీ మార్చేస్తానని భ్రమ కలిగించానా? మరి అప్పుడంత కష్ట పడ్డాను కాబట్టే, ఇదిగో... ఇప్పుడిలా నీకు రాజకీయ పాఠాలు బోధిస్తున్నా. మరి ఇవన్నీ నీలా రాజకీయాల్లో 'మునగడ' సాధించాలనుకునే కుర్రకారుకి వెర్రెక్కించే సూత్రాలు కాదూ? ఏమంటావ్?"
"అవున్సార్... కానీ నాదో సందేహం సార్... మరి అంతలా ప్రజల్ని నమ్మించి ఇప్పుడు ఆ ప్రజల్లో చాలా మంది విమర్శించేంతగా ఎలా వ్యవహరిస్తున్నారు సార్? నోరెత్తిన వాళ్లపై కేసులు బనాయిస్తున్నారు... ప్రశ్నించిన వారిపై కక్ష కడుతున్నారు... మీకు ఇష్టం లేని వాళ్లను కలిసినా చాలు, వాళ్లని భయభ్రాంతుల్ని చేస్తున్నారు... ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఇల్లు కూడా కూలగొడుతున్నారు... గృహనిర్భంధాలు చేస్తున్నారు... అరెస్టులు చేయిస్తున్నారు... ఇంత తెంపరితనం ఎలా సాధించారు సార్? ఇంతలా ఎలా తెగిస్తున్నారు సార్?"
అధినేతలుంగారు కుర్చీలో తాపీగా వెనక్కి జారగిల పడి, కళ్లు అరమోడ్పుగా పెట్టి నవ్వారు. ఆపై సెక్రటరీని పిలిచి, "ఏమయ్యా... ఇలాంటి ప్రశ్నలు వేసేవారిని మనం మామూలుగా ఏం చేస్తామయ్యా?" అని అడిగారు.
"ఏముందండీ? రాజద్రోహం కేసు పెట్టంచేవాళ్లమండి. ఈపాటికి ఏ చీకటి గదిలోనో చితకదన్నించి కాళ్లూ చేతులూ విరగ్గొట్టించేవాళ్లమండి... పోలీసులకో ఫోన్ కొట్టమంటారా?" అన్నాడు సెక్రటరీ.
"వద్దులే కుర్రాడు భయపడతాడు. పైగా పాపం పాఠాల కోసం వచ్చానంటున్నాడు..." అని మెత్తగా నవ్వి, ఆపై శిష్యుడికేసి తిరిగి చెప్పడం మొదలు పెట్టారు.
"చూడు బాబూ... నువ్వు అడగడం నేను చెప్పడం మొదలు పెడితే నా వ్యవహారాలు ఓ పట్టాన తేలేవి కావు. ఏళ్లకేళ్లు పట్టేస్తుంది. అంచేత, ఓ పదిహైదు నిమిషాల్లో మొత్తం నేనంటే ఏంటో, నా నిజస్వరూపం ఏంటో నీకు అర్థమయ్యేలా చెప్పేస్తా. అన్నీ రికార్డు చేసుకుని వీలున్నప్పుడల్లా వింటూ పాఠాలు రాసుకుని చదువుకో. నువ్వు ప్రజల మాట ఎత్తావు కాబట్టి ఆళ్ల దగ్గర నుంచే మొదలెడదాం. నా దృష్టిలో ప్రజలంటే ఓట్లు. ఓట్లే ప్రజలు. నా ప్రజల్లో 'నిరారక్షత' ఎక్కువ. 'నిరక్షసిత లేటు' ఎక్కువ. అంచేత, ఆలోచించేవాళ్లెవరూ నాకు ఓటేయరు. నాకు ఓటేసే వాళ్లెవరూ ఆలోచించరు. ఆళ్లంతా పాపం వెర్రిబాగులోళ్లు. ఆళ్ల చేతిలో ఓ రూపాయి పెట్టి, ఆళ్ల కళ్ల ముందే నేను కోట్లు నొక్కేసినా పట్టించుకోరు. నా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే బడాబాబులకి పోర్టులు, భూములు, ఫ్యాక్టరీలు కట్టబెట్టేసినా కానుకోలేరు. అందుకనే కదా ఆళ్లని ఆకర్షించే రకరకాల పధకాలు రచించి, వాటి కోసం ఎక్కడ లేని నిధుల్నీ దారిమళ్లిస్తుంట? అందిన చోటల్లా అప్పులు తెచ్చి దారపోస్తుంట? ఇక కేసుల సంగతి చెబుతాను వినుకో. నువ్వు ఎవరికైనా భయపడక్కరలేదు కానీ, నిజాయితీపరుడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా అలాంటి వాళ్లే నీ కుర్చీ కిందకి నీళ్లు తెస్తారు. అందుకే అలాంటోళ్లు ఓ చోట గుమి గూడకుండా చూసుకో. ఆళ్లని చెదరగొట్టడానికి, బెదరగొట్టడానికి చట్టంలో లొసుగులు అడ్డం పెట్టుకుని కాలం చెల్లిన సెక్షన్లు, ఎవరికీ తెలియని కేసులు బనాయించు. ఆటి పేరు చెప్పి అరెస్టులు చేయించు. ఆనక నువ్వు పెట్టిన కేసులు నిలబడకపోయినా పర్వాలేదు. ముందు నోరెత్తితే నాశనమే అనే భయం కలిగేలా చేసుకో. అధికారం అందగానే ముందుగా చేయాల్సిన పని... అధికారుల్ని, పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకోవడం. కొందరికి ప్రలోభాలు చూపించు. మరికొందరిని బెదిరించు. అలా మొత్తం వ్యవస్థలన్నింటినీ కాలికింద తేలులా తొక్కిపెట్టు. పోలీసుల్ని నీ గూండాలుగా మార్చుకో. అధికారుల్ని నీ తొత్తులుగా చేసుకో. ఆపై నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. ఆఖరికి న్యాయ వ్యవస్థని కూడా బెదిరించేంతగా బరితెగించు. నీ మీద ఉన్న కేసులకు ఏ మాత్రం భయపడకు. అలాంటి కేసులు ఎన్ని ఉంటే అంత పబ్లిసిటీ అని గర్వించు. ఆ కేసులు ఓ పట్టాన తేలకుండా పనికిమాలిన పిటీషన్లు పెట్టించు. కాలయాపన చేయించు. ఒకవేళ నీ కేసులు నిరూపణ అయి జైలుకెళ్లినా పర్వాలేదు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రని, రాష్ట్రాన్ని స్వర్ణయుగం కేసి నడిపిస్తుంటే ఓర్వలేక కక్షకట్టారని ఎదురెట్టి, నీ ప్రజల్లో సానుభూతిని సంపాదించు. నువ్వు లోపాయికారీగా నడిపిస్తున్న వ్యవహారాల గురించి పరిశోధించి, విశ్లేషించి ఎవరైనా వార్తలు రాశారనుకో, అక్రమ కేసుల ఆధారంగా ఆ మీడియాను గడగడలాడించు. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితిలో పడినా, సంక్షేమం అడుగంటిపోయినా, ప్రజలు నానా కష్టాలు పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండు. నీకు ఓటేసే వాళ్లు మాత్రం జారిపోకుండా చూసుకో. వాళ్లని నమ్మించడానికి ఎలాంటి భారీ పధకాలైనా ప్రకటించు. ఆశలు కల్పించు. భ్రమలకి గురి చెయ్యి. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా?"
అప్పటికి రాజకీయ శిష్యుడు గుడ్లు తేలేశాడు. కళ్ల వెంట నీరు కారుతుండగా లేచి అధినేతలుంగారి దగ్గర మోకాళ్ల ముందు కూలబడి, "ప్రభూ! శాంతించండి. మీ అవినీతి, అధికార, అప్రహతిగత, అద్బుత, అనూహ్య, అసమాన, అక్రమ విశ్వరూపం చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మీరు ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. మీ మొహం చుట్టూ వేలాది శిరస్సులు కనిపిస్తున్నాయి. అవన్నీ కోరలు చాచి, నోటి వెంట నిప్పులు కురిపిస్తూ భయపెడుతున్నాయి. ఆకాశమంతా వ్యాపించినట్లు కనిపిస్తున్న మీ చుట్టూ వేలాది చేతులు కనపిస్తున్నాయి. ఆ చేతుల్లో భయంకరమైన ఆయుధాలు తళతళ మెరుస్తూ భీతి కలిగిస్తున్నాయి. మీ చుట్టూ చట్టవ్యతిరేక శక్తులు జుట్టు విరబోసుకుని కరాళ నృత్యం చేస్తున్నాయి. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లంతా నిస్సహాయంగా చూస్తూ మీరు తెరిచిన నోళ్లలో కోరల మధ్య నలిగిపోతూ కనిపిస్తున్నారు. గూండాలు, విద్రోహులు, దగాకోరులూ మీ అధికార విశ్వరూపాన్నిచూస్తూ పరవశిస్తూ స్తోత్రాలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు భయవిహ్వలులై నలుదిశలకు పరుగులు తీస్తున్నారు. నేను మీ విరాట్ స్వరూపాన్ని చూడలేకపోతున్నాను. దయచేసి శాంతించండి" అంటూ చతికిలపడిపోయాడు.
అధినేతలుంగారు మెత్తగానవ్వి సెక్రటరీకేసి చూసి "కుర్రాడు జడుసుకున్నట్టున్నాడు. తీసుకెళ్లి ఆడి గురువుగారి దగ్గర దించేసిరా" అన్నారు.
-సృజన
brilliant.
రిప్లయితొలగించండి