"ఏంట్రా... అలా మొహం వేలాడేసుకొచ్చావేం? ఒంట్లో బాలేదా?" అంటూ పలకరించారు గురువుగారు, నీర్సంగా వచ్చి చతికిల పడిన శిష్యుడిని చూసి.
"ఒంట్లో బానే ఉందండి... కానీ ఇంట్లోనే బాలేదండి" అన్నాడు శిష్యుడు దిగులుగా.
"ఏమైందో సరిగా చెప్పరా... "
"ఏముందండీ? ఈ నెల నా జీతం ఒక రూపాయే చేతికొచ్చిందండి..."
"వార్నీ... ఒక రూపాయి రావడమేంట్రా? నీది మంచి జీతమేగా?"
"అవునండి... కానీ అన్నీ కటింగ్‌లు అయిపోయాయండి... ఈఎమ్మైలు పోగా చేతికొచ్చింది అంతేనండి..."
"మరి అన్ని ఈఎమ్మైలు ఎందుకు పెట్టుకున్నావ్?"
"ఏముందండీ? మా పెద్దబ్బాయికి కారు కొనిచ్చానండి. పెద్దమ్మాయికి బైక్ తీశానండి. చిన్నోడికి లాప్‌టాప్, చిన్నదానికి సెల్లు ఇచ్చానండి... "
"ఓహో... అయితే బాధ్యత లేని తండ్రిగా ఇవన్నీ చేశావన్నమాట..."
"బాధ్యత లేని తండ్రేమిటిసార్? నా పిల్లలకి కావలసినవి వాళ్లు అడగకపోయినా కొనివ్వడం నా బాధ్యత కదండీ? కాదంటారా?"
గురువుగారు పగలబడి నవ్వారు. ఆపై "నీలా వెనకా ముందూ చూసుకోకుండా ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టేవాడిని అవకతవకడు అంటార్రా... నీది బాధ్యత కాదు. బాధ్యతా రాహిత్యం. ఇలాగైతే నీ కుటుంబం మొత్తం వీధిన పడ్డానికి ఎంతో కాలం పట్టదు..."
"అదేంటి సార్... అలా తిడతారు? నేను చేసిందాంట్లో అవకతవకలు ఏమున్నాయో చెప్పండి..."
"ఒరే... అంటే అలుగుతావు కానీ... ఖర్చు చేసేప్పుడు ఆదాయం సంగతి చూసుకోవద్దూ? ఇన్నేసి వస్తువులు ఇలా ఎడాపెడా కొనేసేప్పుడు ఈఎమ్మైలెంత అవుతాయో ఆలోచించుకోవద్దూ? మొత్తానికి నీ యవ్వారం ఆంధ్రా అధినేత పనుల్లాగే ఏడిసింది..."
శిష్యుడి మొహం ఎర్రగా అయిపోయింది. ఉక్రోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, "గురూగారూ! మీరు ఎన్ని చండాలమైన తిట్లయినా తిట్టండి కానీ, ఆ అధినేతతో మాత్రం పోల్చకండి... అంతకంటే అవమానం మరోటుండదు..." అన్నాడు.
గురువుగారు శిష్యుడు భుజం తట్టి, "ఉక్రోషం వస్తే వచ్చింది కానీ ఉన్నమాటన్నావురా... ఆయనతో పోల్చడం తప్పే... ఎందుకంటే ఆయన చేసే అవకతవక పనులతో పోలిస్తే నీ దెంత? నువ్వు చేసిన అనాలోచిత పనుల నుంచి నీ ఇల్లయినా తేరుకుంటుందేమో కానీ, ఆ నేత నిర్వాకం నుంచి ఆ రాష్ట్రం బయట పడడం మాత్రం కష్టమేరా..." అన్నారు.
శిష్యుడు కాస్త తేరుకున్నాడు. "అయితే ముందు ఆయన చేసిన అవకతవకల గురించి చెప్పండి సార్... కాస్త నా కష్టాలు మర్చిపోతాను... రాష్ట్రమే కటకటలాడిపోతుందంటే దాని ముందు నా ఇల్లెంత?" అన్నాడు.
"ఒరే నీకు ఆదాయం నీ జీతం. మరి రాష్ట్రానికి ప్రధాన ఆదాయం ఏమిటో చెప్పు..."
"కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధులు, వాటాలే కదండీ?"
"ఇప్పుడు ఆ నిధులను ముందు రిజర్వు బ్యాంకు జమ చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయిరా. ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పు?"
"అంటే... నా జీతం నుంచి ఈఎమ్మైలు కటింగయిపోయినట్టన్నమాట. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొచ్చిందండీ?"
"మరాయిన కేవలం ఓట్ల మీద దృష్టి పెట్టుకుని ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా ఏవేవో ప్రజాకర్షక పథకాలు ప్రకటించి, వాటి కోసం అప్పనంగా ప్రజాధనాన్ని వాటికి మళ్లించేస్తుంటే ఇంతకంటే ఏం జరుగుతుంది? ఇంకా వాటి కోసం ఎడాపెడా అప్పులు చేస్తుంటే ఏమవుతుంది? పరిమితులు మరిచి, ఎక్కడ వీలుంటే అక్కడ లక్షలాది కోట్ల రూపాయలు రుణాలు తీసేసుకుంటూ ఉంటే కొన్నాళ్లకి ఎలాంటి పరిస్థితి ఎదురౌతుంది? అంటే... కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం, ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేస్తున్నాడన్నమాట. ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతాను చెప్పు. రాష్ట్రానికి అధికంగా దేని వల్ల ఆదాయం వస్తుంది?"
"ఆ... తెలుసండి. మద్యం అమ్మకాల వల్లండి..."
"కానీ ఇప్పుడు నీకో సంగతి తెలుసా? రాబోయే పదిహేనేళ్ల పాటు ఆ మద్యం పై వచ్చే ఆదాయాన్ని చూపించి వేల కోట్ల అప్పు చేశాడా మహానుభావుడు. దానర్థం ఏంటి? రాబోయే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టినట్టేగా? ఎప్పుడో రెండేళ్ల క్రితం చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించడం లేదు. జీతాలు, పెన్షన్లకు కూడా కటకటలాడక తప్పడం లేదు. కాంట్రాక్టులకు, కర్షకులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోయి, వాళ్లంతా కోర్టులకు ఎక్కక తప్పని దుస్థితి ఉంది. ఓ పక్క లక్షల కోట్ల రూపాయల అప్పులు... మరో పక్క కొండలా పెరిగిపోతున్న బకాయిలు... ఇంతటి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం పడిపోయింది..."
"అయ్యబాబోయ్! తల్చుకుంటేనే భయమేస్తోందండి... మరి ఈ సంక్షోభం నుంచి బయట పడాలంటే ఏం చేస్తారండీ?"
"ఏం చేస్తారు? ఎడాపెడా పన్నులు పెంచుతారు. ఈయనైనా, మరొకరైనా అప్పులు, బకాయిలు, వడ్డీలు చెల్లించాలంటే అదేగా మార్గం? అప్పుడేమవుతంది? ప్రజల మీదే భారం పడుతుంది. ఇప్పుడర్థమైందా? నీ ఇంటి పరిస్థితి కన్నా, రాష్ట్రం దుస్థితి ఘోరంగా ఉందని?"
"నిజమేనండి... ఘోరాతిఘోరమండి..."
"సరేరా... కాసేపు నీ ఇంటి సంగతి, ఆ రాష్ట్రం గురించి పక్కన బెట్టు. ఈ మొత్తం వ్యవహారంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో చెప్పు? నువ్వేగనక ఓ పరగణాకి నేతవైపోతే ఏం చేస్తావో అదీ చెప్పు?"
"ఆయనలాగా ఉండకూడదండి. ముందు ఆదాయ వనరులు ఏంటో ఓ అవగాహనకు రావాలండి. ఆ తర్వాత ఆ ఆదాయాన్ని క్రమంగా పెంచుకోడానికి ప్రయత్నించాలండి. అలాగని ప్రజల మీద భారం పడకుండా చూసుకోవాలండి. ఆర్థిక స్వావలంబన సాధిస్తూనే ప్రగతి బాటలు వేయాలండి. పరిశ్రమలు, ఉద్యోగాలు, అవకాశాలు పెరిగేలా చర్యలు చేపట్టాలండి. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరగయ్యేలా పరిపాలించాలండి. రాష్ట్రం సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం సాధించాలండి. అంతే కదండీ?"
"ఏడిశావ్. నీకింతకాలం బోధించినదంతా బూడిదలో పోశేశావ్ కదరా బడుద్దాయ్! నువ్వు నా దగ్గరకి వచ్చేది రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి అనే సంగతి మర్చిపోకు. గుణపాఠాలు వేరు, రాజకీయ పాఠాలు వేరు. శిష్యుడిగా ఉన్నప్పుడు నీతి సూత్రాలు నేర్చకో, తప్పులేదు. కానీ అధికారం అందాక ఆ నీతి సూత్రాలనే అవినీతి మార్గాలుగా మార్చుకో. ప్రజాస్వామ్యంలో అధికారం అప్రతిహతం కాదని తెలుసుకో. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు నీ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే నిరంతరం పాటుపడు. రాష్ట్రం ఏమయిపోతే నీకెందుకు? ప్రజలు కునారిల్లితే నీకెందుకు? ఇదే అసలైన పాఠం, అర్థమైందా?"
"అర్థమైంది సార్... అర్థమైంది. ఇక నాకు ఒకే ఒక వ్యక్తి ఆదర్శమండి..."
"ఎవరది?"
"ఇంకెవరండి? ఆ అవకతవకడే!"
"సెభాష్!"
-సృజన
PUBLISHED ON 25.7.21 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి