"ఓరి నీచుడా... నికృష్టుడా... కనిష్టుడా... కనాకష్టుడా... అష్టదరిద్రుడా... అయోగ్యుడా... అధముడా... అధమాధముడా... అహంకారుడా... అప్రాచ్యుడా... దగుల్బాజీ... దగాకోరుడా... దౌర్భాగ్యుడా... దుష్టుడా... దుర్మార్గుడా...దుర్జనుడా... దౌర్జన్య కార్యకలాపా... అసందర్బ ప్రలాపీ... అసత్య స్వరూపా... అన్యాయ వర్తనుడా... అక్రమార్కుడా... అధర్ముడా... అడ్డగోలుడా... అవకతవకడా... నిత్య నిందుడా... సత్య దూరుడా... "
-గురువుగారి ఇంటి గుమ్మం లోకి అడుగుపెట్టగానే శిష్యుడు ఈ తిట్ల పురాణం విని మాన్ప్రడిపోయాడు. తిడుతున్నది ఎవరో తెలియని పిల్లాడు. నానా రకాలుగా తిట్టిపోసిన ఆ కుర్రాడు ఆ తర్వాత వీధిలోకి తుర్రుమన్నాడు. శిష్యుడి బుర్ర తిరిగిపోయింది. మెదడు వాచిపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ కుర్రాడెవడో, ఎందుకు తిట్టాడో బోధపడలేదు. మొహం మాడ్చుకుని, మెడ వేలాడేసుకుని నీర్సంగా ఇంట్లోకి అడుగుపెట్టేసరికి, గురువుగారు పడక్కుర్చీలో కూర్చుని ఉన్నారు. శిష్యుడిని చూడగానే నవ్వుతూ, "రా.. రా.. ఎలా ఉన్నావ్?" అని అడిగారు.
శిష్యుడు అయోమయంగా చూస్తూ, "ఆ పిల్లాడెవడండీ, అలా తిట్టేశాడూ? నేనేం చేశానని?" అన్నాడు ఉక్రోషంగా.
గురువుగారు పగలబడి నవ్వేసి, "అలా ఉడుక్కోకురా... కాస్త స్థిమిత పడు. ఇంద... ఈ నీళ్లు తాగు. ఏం లేదురా, నేనే ఆ కుర్రాడికి ఓ చాక్లెట్ ఇచ్చి, ఈ తిట్లన్నీ నేర్పి నువ్వు రాగానే అప్పజెప్పమన్నానంతే..." అన్నారు నవ్వుతూనే.
శిష్యుడు తెల్లమొహం వేశాడు. ఆనక తేరుకుని, "కానీ... గురూగారూ? ఇలా ఎందుకు తిట్టించారండీ?" అంటూ అడిగాడు వచ్చే ఏడుపు ఆపుకుంటూ.
"ఒరేయ్... నువ్వు నా దగ్గరకి రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి వస్తున్నావు కదా? అలాగని ప్రతిసారీ నువ్వడగడం, నేను చెప్పడం బోర్ కొడుతుందని... ఏదో కాస్త వెరైటీగా ఇలా నీకు వినూత్నంగా స్వాగతం పలికించానురా... అంతే!"
"ఇదేం వెరైటీ సార్? ఈ తిట్లన్నీ నిజమేననుకుని ఎంత బాధ పడిపోయానోనండి... సిగ్గుతో చితికి చచ్చినంత పనయిందనుకోండి..."
"ఓరి నా వెర్రిశిష్యా! ఇలా తిట్లు తిని సిగ్గుపడిపోయేవాడివి, రేప్పొద్దున్న రాజకీయాల్లో ఎలా రాణిస్తావురా? ఎవరైనా నిన్ను తిడితే, ఏమాత్రం కంగారు పడకుండా, అది కూడా ఓ పబ్లిసిటీ అనుకోవాల్రా... ఆనక తాపీగా ఓ ప్రెస్మీటెట్టి నిన్నన్నవాళ్లని అంతకి పదింతలు తిట్టి పత్రికలకెక్కాలి. అర్థమైందా? ఇది రాజకీయాల్లో తప్పని సరిగా నేర్చుకోవాల్సిన నిందారోపణ అధ్యాయంరా బడుద్దాయ్!"
"ఏం పాఠమో గురూగారూ! బుర్ర వేడెక్కేలా చేశారు. ఇంతా చేసి ఈ తిట్లన్నీ ఉత్తుత్తి తిట్లన్నమాట. కానీ గురూగారూ.. నాదొక సందేహమండి. నిజం రాజకీయాల్లో ఇలా ఉత్తుత్తిగా తిట్టుకోవడం ఉండదు కదండీ? అందరూ బహిరంగంగా, బాహాటంగా తిట్టేసుకుంటారు కదండీ?"
"అందుకేరా నిన్ను నిజంగా తిట్టాలనిపిస్తుంది... కాస్త కళ్లెట్టుకుని చుట్టూ చూడరా... ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో కనిపిస్తాయి. రాజకీయాల్లో నిజమైన విమర్శలు ఏమిటో, నికార్సయిన ఆరోపణలు ఏమిటో తెలుసుకోవడం అంత సులువేమీ కాదురా సన్నాసీ!"
"తిడితే తిట్టారు కానీ గురూగారూ, అలాంటి ఉదాహరణలు ఏంటో కాస్త నా మట్టి బుర్రకు అర్థమయ్యేలా చెప్పండి సార్..."
"నేను చెప్పడం కాదురా... నువ్వే చెప్పు... ఈ మధ్య ఎవరెవరి మధ్య తిట్ల పురాణం జరిగిందో?"
"ఆ... గుర్తొచ్చిందండి... నీళ్ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నేతలూ ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉన్నారు కదండీ? మాకు తిక్కరేగితే మనుషులం కాదనీ, తల్చుకుంటే దిమ్మ తిరుగుతుందనీ... ఇంకా రకరకాలుగా కవ్వించుకుంటూ, విలేకర్ల ముందు మైకుల మీద మూతి పెట్టుకుని ఓ... తెగ రెచ్చిపోతున్నారు కదండీ? అయితే గురూగారూ, ఇవన్నీ కూడా ఉత్తుత్తి తిట్లేనంటారా?"
"ఓరేయ్... ఏవి నిజమైన తిట్లో, ఏవి నకిలీ తిట్లో తేల్చడం కాదురా, మన పని. జరుగుతున్న వ్యవహారంలో అసలు సమస్య మీద దృష్టి పెడుతున్నారా, లేదా అనేదే పాయింటు. మంత్రులు, నేతలు రెచ్చిపోతున్నారు సరే, మరి అసలైన అధినేతలు నిజంగా ఈ వివాదం ముగించడానికి ప్రయత్నిస్తున్నారా, లేదా అనేది గ్రహించాలి. ఆంధ్రాలో ఈ అధినేత గెలుపుకోసం, అప్పట్లో ఆ తెలంగాణా అధినేత తన మంత్రుల్ని, అనుచరుల్ని మొహరించాడా లేదా? ఆయన జల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు పిలిస్తే ఈయనగారు వెళ్లడం, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆతిథ్యాలు స్వీకరించడం జనం మరిచిపోతార్రా... మరి అంత సఖ్యత ఉన్నప్పుడు ఈయనగారు నేరుగా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుందిగా? అనుచరులు వాగుతున్నారు సరే... మరి అధినేత నోరు విప్పడేం? ఎందుకంటే... ఈయనగారి పరిపాలన ఇక్కడ... ఆస్తులన్నీ అక్కడ... తేడా వస్తే లోటస్ పాండ్, మడ్ పాండ్ అయిపోతుందేమోనని భయమని జనం గుసగుసలాడుకుంటే తప్పేముంటుంది? అంతేనా... అటు బెంగళూరు, ఇటు చెన్నయ్‌లో కూడా ఈయనకు ఆస్తులు, స్థలాలు లేవూ? అందుకనే తన అనుచరులు, మంత్రులు నోరు పారేసుకుంటున్నా... అధినేతలుంగారు మాత్రం నాకు ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టడం ఇష్టం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది ఎందుకో అర్థం చేసుకుంటే, అంతకు మించిన రాజకీయ పాఠం ఇంకేముంటుందో ఆలోచించు"
"అవునండోయ్... ఈ సంగతి గురించి ఈయనగారి చెల్లెమ్మగారు, ఆ పరగణాలో పార్టీ పెట్టినప్పుడు అన్నారు కూడానూ. ఇద్దరు నేతలూ కలిసి భోజనాలు చేస్తారూ, మిఠాయిలు పంచుకుంటారూ, ఉమ్మడి శత్రువు మీద యుద్ధం కోసం చేతులు కలుపుతారూ... కానీ జల వివాదం గురించి రెండు నిమిషాల సేపు మాట్లాడుకోలేరా... అని చెప్పేసేసి దులిపేశారండి... అన్నట్టు గురూగారూ, ఈ అన్నా చెల్లెళ్ల లొల్లి, ఆ అమ్మా కొడుకుల యవ్వారం... వీటి సంగతేంటండీ? ఇవి కూడా ఉత్తుత్తివేనా? నిజమైనవేనా? లేక సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న డ్రమానా... ఏమంటారు?"
"ఓరి అమాయకుడా! కొన్ని విషయాలు నేరుగా అడగకూడదురా, అర్థం చేసుకోవాలంతే! ముందు ఈ పాఠం నేర్చుకో. కొత్తగా పార్టీ పెట్టిన ఆ చెల్లి, ఆ చెల్లికి తోడుగా వేదికలెక్కే ఆ తల్లి, ఆ తల్లీ చెల్లెళ్ల వ్యవహారం చూస్తూ కూడా ఏమాత్రం నోరు విప్పకుండా, ఎక్కడా బహిరంగంగా ఎదురు పడకుండా తప్పించుకుపోతున్న ఈ అన్న... అందరూ కూడా ఉండేది ఆ తెలంగాణా పరగణాలో ఒకే ఇంట్లో కదరా. అలాగని ఒకే ఇంట్లో ఉన్న వాళ్ల మధ్య తేడాపాడాలు ఉండవా, అంటే దానికీ సమాధానం ఉండదు. అర్థమైందా?"
"అర్థమైంది సార్. కానీ పాపం ప్రజల్ని చూస్తే మాత్రం చాలా జాలేస్తోంది సార్. వాళ్లు తమని పరిపాలించే అధినేతల మాటలు నమ్మి ఆవేశపడిపోతూ ఉంటారు. అక్కడ ఆయన కరెంటు ఉత్పత్తి కోసం ప్రాజెక్టులో నీళ్లు వాడేస్తే, రేపు వేసవిలో కటకటలాడేది ప్రజలే. నోరెత్తాల్సిన ఈయన అసలు సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోతే నష్టపోయేది కూడా ప్రజలే. ఈ మొత్తం వ్యవహారంలో నాకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి సార్. నేను మీ శిష్యుడిని కాబట్టి, నేరుగా నాకు మీరు నిజం చెప్పాలంతే. సరేనా?"
"సరే... అడగరా... "
"చెల్లెమ్మ పార్టీ పెట్టడానికి కారణం ఏమిటి? నిజంగా అన్న మీద కినుకేనా? లేక అన్నొక రాష్ట్రాన్ని ఏలితే, తానొక రాష్ట్రంలో పగ్గాలు పట్టుకుందామనా? కన్న కొడుకుకి, కూతురికి ఆ తల్లి నచ్చచెప్పలేక పోతున్నది నిజమేనా? కూతురికి తోడుగా వేదిక ఎక్కిన ఆ తల్లి, తన కూతురికి మద్దతు పలుకుతోందని అనుకోవచ్చా? అంటే ఇదంతా ఆ కొడుకు మీద అలకేనా? మరయితే ఆ కుటుంబంలో తేడాపాడాలు వేదికల సాక్షిగా బయటపడినట్టేనా? ఇంతవరకు నీటి గోల పట్టని ఆ తెలంగాణా నేత ఇప్పటికిప్పుడు పేచీ పెట్టడానికి కారణం ఏమిటి? రాబోతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని ఆకట్టుకోడానికా? లేక చెల్లెమ్మ పార్టీ పెడుతున్నా నివారించలేక పోయిన ఆ అన్న మీద కోపమా? తన ప్రజలు నష్టపోయే అవకాశం ఉందని తెలిసినా, ఈ నీటి పేచీ గురించి ఈ అన్న నోరెత్తకుండా ఉండడానికి కారణమేంటి? తన సొంత ఆస్తుల మీద భయమా? లేక చెల్లెలికి కూడా నచ్చచెప్పుకోలేని అసహాయతా? చెప్పండి సార్!"
శిష్యుడి ప్రశ్నలు విని, గురువుగారు తాపీగా పడక్కుర్చీలో జారగిల పడి, కళ్లు అరమోడ్పుగా పెట్టుకుని, నిదానంగా అన్నారు.
"బాగున్నాయిరా నీ ప్రశ్నలు. కానీ ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక సమాధానంరా. అది విని ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లి పోతానంటే చెబుతాను. సరేనా?"
"సరే.. చెప్పండి గురూగారూ!"
"రాజకీయ రహస్యం!"
-సృజన
PUBLISHED ON 17.7.21 ON JANASEN WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి