బుధవారం, ఆగస్టు 11, 2021

మొగుణ్ణి కొట్టి... మొగ‌సాల‌కెక్కి!

 



"మ‌న‌సేం బాగాలేదు గురూగారూ... కాసేపు మీతో క‌బుర్లు చెబుదామ‌ని వ‌చ్చా... ఇవాళ పాఠాలేం వ‌ద్దులెండి.." అంటూ నీర్సంగా వ‌చ్చాడు శిష్యుడు.

"ఏమైందిరా..." అంటూ అడిగారు గురువుగారు.

"ఆఫీసులో నా లెక్క‌ల మీద త‌నిఖీ చేశారండి. కొన్ని త‌ప్పులు జ‌రిగాయ‌ని తేలిందండి..."

"మ‌రి నువ్వేం అన్నావ్‌?"

"ఏముందండీ... పొర‌పాటైందండీ... ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉంటాన‌ని  సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వ‌చ్చిందండి..."

గురువుగారు న‌వ్వి,  "ఘోర‌మైన త‌ప్పు చేశావురా..." అన్నారు.

"అదేక‌దండీ నేనూ చెబుతుంట‌..." అన్నాడు శిష్యుడు నిట్టూరుస్తూ.

"ఏడిశావ్. నువ్వు ఆఫీసులో చేసిన త‌ప్పు గురించి కాదురా నేను మాట్లాడుతుంట‌..."

"మ‌రింకేం త‌ప్పండీ?" అన్నాడు శిష్యుడు అర్థం కాక‌.

గురువుగారు తాపీగా కుర్చీలో జార‌గిల ప‌డి "సంజాయిషీ ఇచ్చుకోవడం..."  అన్నారు.

"అదేంటండీ అలాగంటారు? జ‌రిగిన పొర‌పాటుకి మ‌న‌సు సిగ్గుతో చ‌చ్చిపోతున్న‌ట్టు అయిందండి. ఆత్మ‌న్యూన‌తా భావంతో కుదించుకుపోయానండి. మ‌రి అలాంటి ప‌రిస్థితుల్లో సంజాయిషీ ఇచ్చుకోక ఇంకేం చేయాలండీ?"

"ఏం చేయాలా? ఎదురెట్టాలి... ఎదురు దాడికి దిగాలి. ఏం ఆఫీసులో ఇంత‌వ‌ర‌కు ఎలాంటి త‌ప్పులూ జ‌ర‌గ‌లేదా? నువ్వు ఇంత‌వ‌ర‌కు త‌ప్పు చేయ‌లేదా? న‌న్నే అంటే ఎలా? అంటూ విరుచుకుప‌డాలి. కావాలంటే ఇదంతా పెద్ద కుట్ర అంటూ నానా యాగీ చేయాలి..."

"ఊరుకోండి గురూగారూ! మీ మాట‌ల‌న్నీ తిర‌కాసుగా ఉంటాయి. అరె... మ‌నిష‌న్న‌వాడెవ‌డైనా అలా అడ్డ‌గోలుగా మాట్లాడుతాడాండీ?  చీమూ నెత్తురూ ఉన్న‌వాడెవ‌డైనా అలా బూక‌రిస్తాడాండీ? జ‌రిగిన త‌ప్పు క‌ళ్ల ముందు క‌నిపిస్తుంటే క‌ళ్లు మూసుకుపోయి కొవ్వెక్కిన‌ట్టు వాగుతాడాండీ?" అంటూ శిష్యుడు ఆవేశ‌ప‌డిపోయాడు.

"ఓరెర్రోడా... క‌ళ్లెట్టుకుని చుట్టూ చూడ‌రా. నీ ప‌ర‌గ‌ణా అధినేతని ఎదురుగా పెట్టుకుని కూడా అలా ఆవేశ‌ప‌డిపోతే ఎలారా? యథా రాజా త‌థా ప్ర‌జా అన్నట్టు ఆయ‌న నిర్వాకాన్ని చూసి నేర్చుకోవ‌ద్దురా?" అంటూ గురువుగారు కేక‌లేశారు.

శిష్యుడు శాంతించి "ఏం చేశాడండీ ఆయ‌న‌? ఏం నేర్చుకోవాలి ఆయన నుంచి?" అంటూ అడిగాడు.

"అలారా దారికి! నీకు నీ బాస్ ఎలాగో, రాష్ట్రానికి కేంద్రం అలాగేగా? మ‌రి మ‌న అధినేత హ‌యాంలో ఎడా పెడా జ‌రుగుతున్న ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌పై కేంద్రం సంజాయిషీ అడిగిందా, లేదా? ప‌రిమితిని మించిన అప్పులు, నిధులు దారి మ‌ళ్లించ‌డాలు, ఒక దానికి కేటాయించిన డ‌బ్బును ఇష్టారాజ్యంగా మ‌రో ప‌నికి వాడేయ‌డాలు, భ‌విష్య‌త్తు ఆదాయాన్ని కూడా త‌న‌ఖా పెట్టేయ‌డాలు లాంటి అనేకానేక అవ‌క‌త‌వ‌క‌, అస‌మంజ‌స‌, అడ్డ‌గోలు ఆర్థిక కార్య‌క్ర‌మాల‌పై వివ‌ర‌ణ అడ‌గ‌డం ఎంత సిగ్గు చేటు? మ‌రి ఆ అధినేత నీలాగా సిగ్గుతో చితికిపోయి, కుమిలిపోయి, త‌ప్పు ఒప్పుకుని సంజాయిషీ ఇచ్చాడా?  లేదే? ఏకంగా కేంద్రానికే ఎదురెట్ట‌డం లేదూ? ఏం... కేంద్రం అప్పులు చేయ‌డం లేదా, అప్పు చేయ‌డం త‌ప్పా అంటూ మంత్రుల చేత ప్రెస్మీటెట్టి మ‌రీ ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగ‌లేదూ? అంత‌టితో ఆగాడా? ఇదంతా పెద్ద కుట్రా, న‌న్ను సీటు దింపించి మీ అస్మదీయుడికి క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్నారూ... అంటూ నానా యాగీ చేయించ‌డం లేదూ?"

"అవునండి... గుర్తొస్తోందండి... కేంద్రం అకౌంటెంట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం అధికారుల‌తో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను త‌నిఖీ చేయించాని నిర్ణ‌యించిన‌ట్టు కూడా విన‌బ‌డుతోందండి... ఇదెంత సిగ్గు చేటండీ?  రాష్ట్రంలో ఓ పౌరుడిగా నాక్కూడా సిగ్గు వేస్తోందండి..."

"ఓరి నీ సిగ్గు చిమ‌డా?  రాజ‌కీయాల్లో సిగ్గేంట్రా?  సిగ్గూ ల‌జ్జా వ‌దిలేశాకే క‌ద‌రా ఇలాంటి నీచ రాజ‌కీయ నేత‌లుగా మార‌తారు?  కాబ‌ట్టి ఓ బాధ్య‌తగ‌ల పౌరుడిలాగా నువ్వు కూడా నీ అధినేత‌ను చూసి నేర్చుకో. కావాలంటే అర్జంటుగా కాశీకి పోయి సిగ్గు వ‌దిలేసి చ‌క్కా వ‌చ్చెయ్‌. లేక‌పోతే అస్స‌లు ఎద‌గ‌లేవు. అర్థ‌మైందా?"

"అర్థమైంది కానీ గురూగారూ, అస‌లు ఇంత దారుణంగా రాష్ట్రంలో ఆర్థిక త‌ప్పిదాలు ఎలా జ‌రిగాయండీ?"

"ఎందుకు జ‌ర‌గ‌వురా... నువ్వు నీ ఆఫీసులో ఏదో ఏమ‌రుపాటున చేసిన త‌ప్పులాంటిది కాదుక‌ద‌రా ఇది?  బాగా ఆలోచించి, ముందుగానే నిర్ణ‌యించుకుని, చ‌క్క‌గా ప్ర‌ణాళికలూ అవీ వేసుకుని, నేనేం చేస్తే అదే గొప్ప‌నీ, నా పాల‌న నా ఇష్టమ‌న్న‌ట్టుగా బ‌రితెగించీ, నిర్ల‌క్ష్యంగా, పొగ‌రుగా, ఏక ప‌క్షంగా చేసే ప‌నులే క‌ద‌రా ఇవి? ఎంత అడ్డ‌గోలుగా ఉండ‌క‌పోతే రాష్ట్రంలో అప్పులు ఏకంగా నాలుగు ల‌క్ష‌ల కోట్ల‌కు పెరుగుతాయి చెప్పు? ఎంత నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే పెండింగ్ బిల్లుల విలువ‌ ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు చేరుతుంది చెప్పు? మ‌ద్యం అమ్మ‌కాల‌పై వ‌చ్చే ప‌దిహేను ఏళ్లలో రావాల్సిన ఆదాయాన్ని కూడా త‌న‌ఖా పెట్టి 25 వేల కోట్ల రూపాయ‌ల అప్పు చేయ‌డంతో పోలిస్తే, నువ్వు నీ ఆఫీసులో చేసిన త‌ప్పు ఏపాటిది చెప్పు?   ప్రతీ నెలా జీతాల‌కు, పెన్ష‌న్ల‌కు కూడా క‌ట‌క‌ట‌లాడిపోయే ప‌రిస్థితి ఎంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే త‌లెత్తుతుంది చెప్పు? ఎంత స‌మర్ధించుకున్నా, ఎంత‌లా స‌ర్ది చూపించినా కొన్ని ల‌క్ష‌ల కోట్ల మేర‌కు లెక్క‌లు తే ల్చ‌లేని దుర్భ‌ర‌మైన స్థితిలో రాష్ట్ర ఆర్ధిక వ్య‌వ‌హారాలు ఉన్నాయంటే ఎంత దారుణంగా ప‌రిపాల‌న సాగుతోందో చెప్పు? ఇంత చేసి కూడా కేంద్రం సంజాయిషీ అడిగింద‌ని దుగ్ధ‌తో విమర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారంటే, మొగుణ్ని కొట్టి మొగ‌సాలకెక్క‌డం కాక మ‌రేమిటి చెప్పు?"

శిష్యుడి త‌ల తిరిగిపోయింది. "అవునండోయ్‌... ఇప్పుడు బాగా అర్థమైంది. ఎదురుతిరిగిన వాడికి తెడ్డే లింగం అన్న‌ట్టుంది మ‌న అధినేత నిర్వాకం. మొత్తానికి మీ ద‌గ్గ‌ర‌కి రావ‌డం వ‌ల్ల నా ఉత్సాహం తిరిగి వ‌చ్చింది గురూగారూ! ఇక నాలో సిగ్గు, శ‌రం, ఆత్మ‌న్యూన‌త‌, అప‌రాధ భావంలాంటి ఆలోచ‌న‌ల‌కి తావు లేదండి. నేనిప్పుడే వెళ్లి మా ఆఫీసులో నానా గొడ‌వా చేస్తానండి. ఎదురు తిరిగి, ఎదురెట్టి, ఎడా పెడా వాయించేస్తానండి. నాద‌స‌లు త‌ప్పే కాద‌ని బుకాయిస్తానండి. బూక‌రిస్తానండి. నాకు ఆ అధినేతే స్ఫూర్తండి. ఆయ‌న తీరే నాకు పెద‌బాల‌శిక్షండి... ఆయ్‌!"

"శెభాష్‌రా... ఓ నీచ రాజ‌కీయ నేత‌గా ఎదిగే క్ర‌మంలో మొద‌టి అడుగు వేశావ్.  పోయిరా".

-సృజ‌న‌

PUBLISHED ON 12.8.21 ON JANASENA WEBSITE

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి