"ఏరా... నువ్వెన్నింటికి రావాలి? ఎన్నింటికి వచ్చావు? నా కోసం నువ్వు ఎదురుచూడాలా? లేక నీ కోసం నేను ఎదురుచూడాలా?" అంటూ కస్సుమన్నారు
గురువుగారు, శిష్యుడు
రాగానే.
శిష్యుడు బిక్కమొహం వేసుకుని, "మన్నించండి గురూగారూ! అనుకోకుండా ఆలస్యమైపోయింది..." అన్నాడు
వినయంగా.
"ఎందుకు ఆలస్యమైంది?"
"అదే సార్... లేటయిపోయింది..."
"ఒరే ఆలస్యమెందుకైందంటే లేటయిందంటావు...
లేటెందుకైందంటే ఆలస్యమైందంటావ్. అసలు సంగతి చెప్పి చావవేం?"
"సార్... ఏం లేదు సార్... మీతో చెప్పకపోవడమేం? నాకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి... అవి చెబితే సిల్లీగా ఉంటాయి. అందుకే నసుగుతున్నాను
సార్... అంతే..."
"ఒరే... సెంటిమెంట్లు సినీ నటుల దగ్గర్నుంచి, రాజకీయ నేతల వరకు అందరికీ ఉంటాయి. తప్పులేదు. వాటికి సిగ్గు పడితే ఎలా? సినిమా వాళ్ల సెంటిమెంట్ల గురించి
అందరికీ తెలిసిందే. ఇక రాజకీయ నేతలకి కూడా చిత్రవిచిత్రమైన నమ్మకాలు,
అలవాట్లు ఉంటాయి. ఒక నేతకి
అర్థరాత్రి దేవుడితో మాట్లాడడం సెంటిమెంటు కావచ్చు. లేకపోతే చనిపోయిన ఆత్మీయులతోనే
పరిపాలన గురించి చర్చించడం సెంటిమెంటు కావచ్చు. వాటి గురించి అధికారులతో చెబితే
వాళ్లు కంగు తినచ్చు కూడా. కానీ మన నమ్మకాల గురించి ఏమాత్రం సిగ్గు పడకూడదురా.
ఒక అధినేత ఉన్నట్టుండి గడ్డం పెంచుతాడు. మరో నాయకుడు అకస్మాత్తుగా యాగాలు గట్రా
చేయిస్తాడు. ఒక నాయకుడు గుడి నుంచి యాత్రలు మొదలు పెడితే, మరో నాయకుడు తరచు తిరుపతికి పోయి గుండు కొట్టించుకుంటాడు. మనకి కాషాయాలు
కట్టిన వాళ్లు, తలపాగాలు చుట్టిన వాళ్ల గురించి కూడా తెలుసుకదరా.
అంతెందుకు... అంతరిక్షంలోకి పంపే రాకెట్టుని కూడా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి
కాళ్ల ముందు పెట్టే సైంటిస్టుల గురించి కూడా తెలుసు కదా? కాబట్టి నీ నమ్మకమేదైనా నిర్భయంగా, నిర్లజ్జగా ఇంకా మాట్లాడితే మహ గొప్పగా కూడా చెప్పుకోవడం నేర్చుకో. ఇంతలా
ఎందుకు అడుగుతున్నానంటే, నీలో సిగ్గు గట్రా పోగొట్టడం కోసం. ఇవి పోకపోతే ఇక నువ్వు రాజకీయ పాఠాలు ఏం నేర్చుకుంటావు?
ఓ బరితెగించిన నేతగా ఎలా ఎదుగుతావు? అంచేత నువ్వు ఏం సెంటిమెంటు వల్ల
ఆలస్యంగా వచ్చావో చెప్పు..."
" అయితే సరే సార్... నేనసలు ఓ అరగంట
ముందే రావాలండి. కానీ ఇలా వీధిలోకి వచ్చానో లేదో, అలా చెత్త బండి ఎదురైందండి. చెత్త శకునం వస్తే ఇక
మీ దగ్గర రాజకీయ పాఠాలు ఏం వంటబడతాయండీ? పైగా ప్రతి మలుపులోనూ చెత్త బళ్లేనండి
బాబూ... అలా ఆగి, ఆగి వచ్చేసరికి ఇంతాలస్యం అయిందండి... ఆయ్!"
"వార్నీ... చెత్త బండి అడ్డుపడిందన్నమాట.
కానీ నీకో సంగతి తెలుసురా... చెత్త బండి చెడ్డ శకునం కాదురా... మా మంచి శకునం...
కావలిస్తే ఆంధ్రప్రదేశ్ సర్కారు వారిని అడుగు తెలుస్తుంది..."
"అయ్‌బాబోయ్... అదేంటండి బాబూ అలాగంటారు? చెత్త బండి ఎదురైతే తలపెట్టిన పనులన్నీ చెత్తయిపోతాయంటారు కదండీ... మరి
మీరు సర్కారువారిని అడగమంటారేంటండీ?"
"ఓరెర్రి శిష్యా... రాష్ట్రం మొత్తం మీద
పేరుకుంటున్న చెత్తంతా ఇప్పుడు శ్రీ సర్కారు వారికి సిరులు కురిపించే వనరైంది కదరా...
అంటే మన రాష్ట్రంలో చెత్త బండి ఎదురొస్తే,
సాక్షాత్తూ లక్ష్మీ దేవి వచ్చినట్టే కదరా..."
"మీరన్నీ విచిత్రంగా చెబుతారు సార్...
మీతో వాదించడం కష్టం... అయినా,
ఇంత పెద్ద సర్కారుకి చెత్త కుప్పలు ఆదాయాన్ని ఇవ్వడమేంటి సార్?"
"మరి నువ్వు నీ చుట్టూ ఉన్న రాజకీయ స్థితిగతుల్ని
ఏం పరిశీలిస్తున్నావురా? కాస్తంతైనా సామాజిక స్పృహ ఉండద్దూ?
మరి మన సర్కారు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎక్కడ ఎంత దొరుకుతుందా, ఎక్కడ ఎవరు అప్పిస్తారా?
ఎక్కడ నుంచి ఎంత పిండుకోవాలా? ఆదాయ వనరుల్ని
ఎలా పెంచుకోవాలా? వడ్డీలెలా కట్టాలా? జీతాలు, పింఛన్లు
ఎలా ఇవ్వాలా? చెల్లించాల్సిన
బకాయిలు ఎలా తీర్చాలా? ఏ నిధుల్ని ఎలా మళ్లించాలా? ఏ పథకాల సొమ్ములో ఎలా కొర్రీలు వేయాలా? ఇదే కదరా
చింత! మరి ఇంతటి దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది? మన
రాజకీయ భవిష్యత్తు కోసం, మన అధికారం కొనసాగడం కోసం,
మన పదవి పది కాలాల పాటు సుస్థిరంగా ఉండడం కోసం, అమాయక జనాన్ని ఊరించి, ప్రలోభపెట్టి, పదో పరకో ముట్టజెప్పి, కోట్లకుకోట్లు కొల్లగొట్టే అవకాశం
కోసం, అనాలోచితంగా,
అడ్డగోలుగా కేవలం ప్రజాకర్షణను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సృష్టించిన
పథకాలను మొండిగా, జగమొండిగా అమలు చేయడం కోసం, రాష్ట్రం భవిష్యత్తు అనేది పట్టించుకోకుండా, రాష్ట్రం
ఏమైపోయినా నాకేమనేంత నిర్లక్ష్యంగా, రాష్ట్రం దివాళా తీసినా
పట్టనంత అనాలోచితంగా, అహంకారంగా, ఇష్టారాజ్యంగా,
బాధ్యతారహితంగా, తెంపరితనంతో ప్రవర్తించడం
వల్లనే కదరా! మరి అలాంటి పరిస్థితుల్లోనే కదరా, చెత్త
మీద సైతం పన్ను ప్రవేశపెట్టింది మన సర్కారు?"
"అయ్యబాబోయ్... ఇంతుందాండీ? కానీ గురూగారూ, చెత్తను శుభ్రం చేయడం సర్కారు వారి
బాధ్యతే కదండీ, మరి దాని మీద కూడా పన్ను వేసేంత పరిస్థితి
రావడానికి ఇదన్నమాట కారణం... అయితే రాజకీయాల్లో ఇదెలాంటి పాఠం గురూగారూ?"
"అసలు సిసలైన నీచ రాజకీయ అధ్యాయంరా.
నిజానికి నీకు ప్రజల గురించి పట్టదు... నీ దృష్టంతా కేవలం ఓటు రాజకీయాల మీదనే
ఉండాలి. అందుకోసం ప్రజలకు ఇంచుమించు లంచం ఇచ్చేలాంటి పథకాలు రచించాలి. ఆ పథకాల
ద్వారా నీ ఓటర్ల కాతాల్లోకి జమయ్యే సొమ్ములన్నీ నీకు అప్రతిహత అధికార సింహాసనానికి
సోపానాలేనన్నమాట. అర్థమైందా?"
"అర్థమైంది కానీ గురూగారూ! ఇలా చెత్త మీద
పన్నులాంటివి వేయడం అంటే పరోక్షంగా మళ్లీ ఆ భారాన్ని ప్రజల మీద వేయడమే కదండీ?"
"కరెక్టుగా చెప్పావురా... కానీ అంత ఆలోచన
పాపం ప్రజలకి ఉండదురా. దానికి మూల్యం వాళ్లే చెల్లిస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు
ఏం జరుగుతోందో తెలుసుగా? ఆఖరికి వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ డబ్బుల్లో కూడా చెత్త పన్నును మినహాయించి,
కోత విధించి చెల్లించారురా. దీన్నే గార్బేజ్ మేనేజ్‌మెంట్ అంటారు. అంటే
చెత్త పాలన అన్నమాట. ఆఖరికి నిస్సహాయులకు ఆసరాగా ఇచ్చే డబ్బుకి కూడా చెత్త
కత్తెర వేస్తోందన్నమాటే కదా? మరి దీన్నేమంటారో నువ్వే చెప్పు?"
"ఉత్తమ చెత్త పాలన!"
"శెభాష్... ఇక పోయిరా. అన్నట్టు చెత్త బండి శకునం వస్తేనే వెళ్లు.
అప్పుడే నీకు ఇలాంటి నీచ రాజకీయాలు ఒంటబడతాయి!"
-సృజన
PUBLISHED ON 29.8.2021 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి