గురువుగారింటికి వచ్చిన శిష్యుడు పొరపాటున వేరే
వారింట్లోకి వచ్చేశాననుకుని భ్రమ పడ్డాడు. ఎందుకంటే హాల్లో ఓ పక్కన కోర్టులో
ఉండే బోను ఏర్పాటు చేసి ఉంది. మరో పక్క ఎత్తుగా
జడ్డిగారు కూర్చునే వేదికలాంటిది ఉంది. దాని ముందు కోర్టు గుమాస్తా సీటు, న్యాయవాదుల బల్లలు అన్నీ ఉన్నాయి.
అచ్చం కోర్టు సెట్టింగు వేసినట్టు ఉంది.
శిష్యుడు గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లబోతుంటే
గురువుగారి మాటలు వినిపించాయి.
"సరైన ఇంటికే వచ్చావ్‌రా శిష్యా! ఇది
మనిల్లే. రా..." అంటూ పిలిచారు.
"మరిందేంటి గురూగారూ! పొరపాటున ఏదో కోర్టులోకి
వచ్చేశానేమోనని భయపడ్డా..." అంటూ శిష్యుడు చుట్టూ పరికిస్తూ లోపలికి
వచ్చాడు.
"కోర్టంటే భయమెందుకురా. చేసిన తప్పులు
బయటపడిపోతాయనా?"
"నేనేం తప్పులు చేశాను సార్... మీ దగ్గర
ఇంకా రాజకీయాలు పూర్తిగా నేర్చుకోనైనా లేదు.
కానీ ఎందుకో ఈ వాతావరణం చూస్తే వణుకొస్తుంది
సార్..."
"ఒరే... మహా మహా కుంభకోణాలు చేసే నేతలే
దర్జాగా కోర్టుకొచ్చి, అంతకంటే గొప్పగా జనం కేసి చేతులూపుతూ ఏదో ఘనకార్యం చేసినట్టు నవ్వుతూ
ఫొటోలకి పోజులిచ్చే రోజులు కదా ఇవి... మరలా భయపడితే ఎలా?"
"అద్సరే కానీ గురూగారూ! ఇంతకీ ఈ ఏర్పాట్లన్నీ
ఎందుకు చేశారు సార్?"
"ఏం లేదురా. నువ్వా నా దగ్గర నీచ రాజకీయాలు
నేర్చుకుంటున్నావు. రేప్పొద్దున్న జనం ఖర్మ కాలి ఏ పరగణాకో నేత అయిపోయావనుకో.
ఎప్పుడో ఒకప్పుడు ఇలా కోర్టు సీన్‌లో నటించాల్సి ఉంటుంది. అప్పుడు నువ్విలా భయపడిపోయి గజగజా వణికిపోయావనుకో.
వీడెవడో నిజంగానే దేశాన్ని దోచేశాడని నిర్దారణకి వచ్చేసి, జడ్జిగారు విచారణ లేకుండానే
శిక్ష వేసేస్తారు. అందుకే నీకు కాస్త ప్రాక్టికల్
రిహార్సల్స్ చేయిద్దామని ఇలా సినిమా సెట్టింగు వేయించానన్నమాట..."
"భలే బాగుంది గురూగారూ! ఇప్పుడు నేనేం చేయాలండి..."
"నువ్వో రాష్ట్రానికి సీఎం హోదాలో ఆ బోనులోకెక్కి
నుంచోవాలిరా. నిన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నానా ప్రశ్నలూ అడుగుతాడు. నువ్వు ఎలా
సమాధానాలు చెబుతావో నేనా జడ్జి కుర్చీలో కూర్చుని గమనించి ఆనక నీకు పాఠాలు చెబుతానన్నమాట.
సరేనా?"
"సరేసార్... ఇంతకీ నా మీద ఉన్న ఆరోపణలు, అభియోగాలు ఏమిటండీ?"
"నీ మీద లేనివేంటిరా... ఖనిజాలు కొల్లగొట్టావు.
గనులు దోచేశావు. సూట్‌కేసు కంపెనీలు పెట్టావు. నిధులు దారి మళ్లించావు. పోర్టులు, ఫ్యాక్టరీలు ఎవరెవరికో కట్టబెట్టేశావు.
వాళ్లిచ్చిన వాటాలతో నీ సొంత వ్యాపారాలు విస్తరించావు. ర్యాంపులు గుల్ల చేశావు. రాష్ట్రాన్ని
దివాళా తీసే స్థితికి తీసుకొచ్చేశావు. ఇలా...
ఒకటా, రెండా అనేకానేక కేసులున్నయారా. కాబట్టి నువ్వా బోనులో
నుంచుని నిజమైన సీఎం లెవెల్లో నువ్వు చెప్పదలుచుకున్నది మొదలు పెట్టు. పద..."
గురువుగారు చెప్పినట్టే శిష్యుడు బోనులోకెళ్లి
నుంచున్నాడు. ఓ యువకుడు న్యాయవాదిగా సీన్లోకొచ్చాడు. గురువుగారుఉ జడ్జిగారి కుర్చీలో
కూర్చున్నారు. ఆయన
చెయ్యి ఊపగానే, న్యాయవాది
బైబిల్ పుస్తకం తెచ్చాడు. శిష్యుడు ప్రమాణం చేసి మొదలు పెట్టాడు.
"అవును. నేను ప్రమాణం చేసి నిజమే చెబుతున్నాను.
నేను సీఎంగా అధికారంలోకి వచ్చాను. నేనేం చేయాలన్నా ఇదే నాకు సరైన సమయం..."
"అంటే మీరిప్పుడు రాష్ట్రాన్ని కొల్లగొట్టినట్టేనా?"
"చ.. ఛ... అలా ఎన్నటికీ కాదు..."
"అయితే మీరు ప్రజల సంక్షేమం కోసం పాటు
పడతారా?"
"అవును. అదే నా జీవిత లక్ష్యం కదా..."
"మీరు ఖనిజాలు దోచేసి, గనులు కొల్లగొట్టారా?"
"అబ్బెబ్బే... కాదు... ఆరునూరైనా అలా చేస్తే
ఒట్టు..."
"అయితే మీరు ప్రజలకు ఉద్యోగాలు కల్పించి, జీవనోపాధి కల్పించి, రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేస్తారా?"
"అవును. కచ్చితంగా. అందులో సందేహం ఏముంది..."
"మరి మీరు అనేక కుంభకోణాలు చేసి, ఆర్ధిక అవకతవకలకు పాల్పడి
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారా?"
"నీకేమైనా పిచ్చా? అస్సలు కాదు..."
"మేమంతా మిమ్మల్ని, మీ నిజాయితీని నమ్మవచ్చా?"
"తప్పకుండా. అందులో ఏమాత్రం అనుమానం లేదు..."
"అయితే...మీరు మా నిజమైన నాయకులేనన్నమాట..."
గురవుగారు చెయ్యి ఊపగానే శిష్యుడు బోనులోంచి
బయటకి వచ్చేశాడు. ఆతృతగా గురువుగారి దగ్గరకి వెళ్లి, "నేను జవాబులు బాగా చెప్పానా సార్. ఓ
నీచ రాజకీయ నేతగా ఎదగగలనంటారా?" అంటూ ఆశగా
అడిగాడు.
గురువుగారు నవ్వి, "ఒరే... నేను ముందే చెప్పాను కదరా. ఇదొట్టి
మాక్ ప్రొసీడింగ్సని. నువ్వేదో మా గొప్పగా జవాబులు చెప్పానుకుంటున్నావు కానీ, నువ్వు బోనులోకి వెళ్లిన దగ్గర్నుంచి,
దిగే వరకు జరిగిన సంభాషణని ఇప్పుడు కింద నుంచి పైకి చదువుకో. అప్పుడు
బోధ పడుతుంది, నువ్వెలా సమాధానాలు చెప్పావో..." అంటూ గుమాస్తా
అందించిన ప్రశ్న, సమాధానాల కాగితం చేతిలో పెట్టారు. శిష్యుడు ఆ సమాధానాలను కిందనుంచి పైకి
చదివి తెల్లబోయాడు.
"అయ్యబాబోయ్... ఓ సీఎంగా ఇలా సమాధానాలు
చెబితే శిక్ష పడడం ఖాయం కదండీ"
అన్నాడు.
గురువుగారు పకపకా నవ్వి, "ఒరే మామూలు కోర్టులో ఇలా అడిగే ప్రశ్నలకి రాటు దేలిన ఏ నీచ రాజకీయ నాయకుడైనా
సరే ఇలాగే సమాధానాలు చెబుతాడు. వాడి నుంచి సరైన జవాబులు రాబట్టడం అసాధ్యం. కానీ
ఇది ప్రజాకోర్టురా. ప్రజలు అంతకంటే చురుకైన వాళ్లు. ఇందులో అడిగే ప్రశ్నలకి నీచ రాజకీయ నేతలు చెప్పే సమాధానాలను
ఇలా తలకిందులుగా అర్థం చేసుకోవాలని వాళ్లకు తెలుసు. అసలు నువ్వేంటో, నీ మాటల్లో నిజమేంటో వాళ్లు
ఇట్టే పట్టేయగలరు. అసలైన కోర్టులో ప్రమాణం
చేసి ఏం చెప్పినా చెల్లుతుందేమో కానీ, ఇలాంటి ప్రజాకోర్టులో
నీ ఆటలు కొన్నళ్లే సాగుతాయి. ఈ పాఠం నీకు చెప్పడం కోసమే ఇలా ఏర్పాటు చేశా. అర్థమైందా?"
"అద్భుతం సార్!"
-సృజన
PUBLISHED ON 23.8.21 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి