"ఇవాళ నీకో స్లిప్ టెస్టు పెడతాన్రా... ఎలా రాస్తావో చూద్దాం..." అన్నారు గురువుగారు, శిష్యుడు రాగానే.
"అంటే స్లిప్‌లు పెట్టుకుని రాసుకోవచ్చాండీ?" అన్నాడు శిష్యుడు ఉత్సాహంగా.
"ఏడిశావ్. ఇన్నాళ్లుగా నా దగ్గర రాజకీయాలు నేర్చుకుంటున్నావు కదా... ఎంత వరకు ఒంటబట్టాయో చూద్దామని... " అంటూ ప్రశ్నపత్రం చేతిలో పెట్టారు.
తీసుకున్నాడు. కాసేపయ్యాక వచ్చి, "రాసేశాను గురూగారూ! దిద్దుతారా?" అన్నాడు.
"ఒరేయ్...పేపర్ దిద్దాలో, నిన్ను దిద్దాలో చూద్దాం కానీ, ఆ ప్రశ్నలేంటో, నువ్వు రాసిన జవాబులేంటో వినిపించు..." అంటూ గురువుగారు పడక్కుర్చీలో వాలారు.
శిష్యడు గొంతు సవరించుకుని చదవడం మొదలు పెట్టాడు.
"మొదటి ప్రశ్న. 'ఓ పరగణాకి అధినేతగా పదవీ స్వీకారం చేయగానే చేయాల్సిన మొదటి పనులు ఏవి?' దానికి నా సమధానం సార్, వినండి. 'అధినేతగా పదవి చేపట్టగానే, అంతకు ముందు ప్రభుత్వం చేసి పనులు, పధకాలు పరిశీలించవలెను. వాటిలో బాగున్నవాటిని కొనసాగించవలెను. కొన్ని పథకాల్లో లోపాలు ఉన్నచో సరిదిద్ది మరింత మెరుగ్గా అమలు చేయవలెను. రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగడానికి వీలుగా సుదీర్ఘ ప్రణాళికలు రచించవలెను. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి పధకాలను ప్రోత్సహించవలెను'. బాగా రాశానా సార్? దీనికి అయిదు మార్కులు సార్... మీరెన్ని వేస్తారు?"
"సున్నా..."
"అదేంటి సార్? పోలిటిక్స్ పాఠ్య పుస్తకాల్లో ఇలాగే ఉందండి. యధాతధంగా దించేశానండి. కానీ మీరు సున్నా వేశారెందుకండీ?"
"ఓరి సన్నాసీ! పుస్తకాల్లో ఉన్నది దించేస్తే నువ్వు రాజకీయ నేతగా ఎదగలేవురా. ఒకవేళ పదవి వచ్చినా ఉపన్యాసాలు ఇవ్వడానికి తప్ప ఎందుకూ పనికిరావు. అదే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి నేర్చుకున్నావనుకో. పది కాలాల పాటు నీచ నేతగా ఆరితేరుతావు. అర్థమైందా?"
"మరైతే సరైన సమాధానం ఏంటండీ?"
"నువ్వుంటున్న ఆంధ్రా పరగణాకి అధినేత ఎవరో, ఆయన ఏం చేశాడో గ్రహించి ఉంటే సమాధానం సరిగా రాశేవాడివి. సరే నేనే చెబుతాను రాసుకో. ముందుగా నువ్వు చేసే ప్రారంభ ఉపన్యాసంలో గొప్ప గొప్ప ఆదర్శాలు వల్లించాలి. విన్నవాళ్లందరూ రాజకీయంలో సరికొత్త శకం ప్రారంభమైనట్టు మురిసిపోవాలి. ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా? ప్రారంభ ఉపన్యాసంలో ఒక్క ముక్కను కూడా నువ్వు పాటించకపోవడం".
"అయ్యో అదేంటండీ?"
"మరంతే కదరా? ఆ అధినేత ఏం చెప్పాడు? రాష్ట్రంలో ఎక్కడా అక్రమ ఆక్రమణలు ఉండకూడదన్నాడు. అంతకు ముందు ప్రభుత్వం కట్టిన సభా భవనాన్ని క్రేన్లతో కూలగొట్టించాడు. 'అబ్బో... సంస్కరణ మొదలైందన్నమాట' అనుకున్నారు వెర్రిజనం. కానీ ఆ తర్వాత ఏం చేశాడు? కేవలం తన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించడానికే పరిమితమయ్యాడు. ఆపై ఆయన తొలి ఉపన్యాసంలో ఒక్క ఆదర్శమైనా అమలు జరిగిందా? లేదు కదా? అంచేత చక్కగా ప్రజలను వంచించేంత తియ్యగా మాట్లాడడం మొదట చేయాల్సిన పని. చెప్పింది చేయాల్సిన అవసరం లేనంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అసలైన పని. అర్థమైందా? ఇక నీ రెండో ప్రశ్న, దానికి నీ సమాధానం చదువు".
శిష్యుడు నీర్సంగా పేపరు విప్పి చదవడం మొదలు పెట్టాడు. "అధినేత పరిపాలనా వ్యవహారములు ఎట్లుండవలెను?' దానికి నా సమాధానం సార్. 'ఎన్నికయ్యేంత వరకే ప్రతిపక్షం తప్ప ఆ తర్వాత అందరినీ కలుపుకుని పోవలెను. అన్ని పార్టీల సభ్యులను మిత్రులుగా పరిగణిస్తూ వారి సలహాలను తీసుకొనవలెను. ప్రతిపక్షనేతల విమర్శలను సహేతుకంగా పరిశీలించి, వాస్తవాలను గ్రహించి తన పరిపాలనలో లోటు పాట్లను సరిదిద్దుకుంటూ పెద్ద మనసును చాటుకోవలెను. మేధావుల ఆలోచనలను ఆహ్వానించి పాలనతో పారదర్శకత పాటించవలెను'. మరి దీనికి ఎన్ని మార్కులు వేస్తారు సార్?"
"సున్నా..."
"అన్యాయం సార్. నేను రాసిన జవాబు ఎంత ఆదర్శంగా ఉందండీ? మరైతే దీనికి సమాధానం ఏంటో చెప్పండి సార్..."
"రాజకీయాల్లో ఆదర్శాలేంట్రా వెర్రి సన్నాసీ! నీ పరగణా నేత వ్యవహార శైలి చూసి కూడా నేర్చుకోపోతే ఎలారా? సరే నేనే చెబుతాను. రాసుకుని బట్టీ పట్టు. ముందు ఎవరిని చూసినా చాలా సహృదయుడిలాగా, మొహమాటస్తుడిలాగా నవ్వడం నేర్చుకోవాలి. ఆ నవ్వు చూస్తే 'ఎంత మంచి వాడవురా... ఎన్ని నోళ్ల పొగడుదురా...' అనే పాట పాడుకోవాలనిపించేంత మెత్తగా ఉండాలి. కానీ చేయాల్సిందేంటో తెలుసా? కుర్చీ ఎక్కగానే ప్రతి పక్ష నేతలపై కక్ష కట్టడం. వాళ్లని రకరకాల కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నించాలి. ఎప్పటెప్పటి సంఘటనలో వెతికి వెలికి తీసి, వాటి మీద అర్థం పర్థం లేని కేసులు పెట్టించాలి. జైలులో పెట్టడానికి చట్టాన్ని అడ్డగోలుగా ఉపయోగించుకోవాలి. అరెస్టుల భయంలో ప్రతిపక్ష నేతలు భయభ్రాంతులయ్యేలా వెంటాడాలి. ఆఖరికి ఆత్మహత్య కూడా చేసుకునేంతగా కూడా వేటాడాలి. తెలిసిందా? ఇప్పుడు తర్వాతి ప్రశ్నకి నీ జవాబు అఘోరించు".
శిష్యుడి మొహంలో ఏడుపొక్కటే తక్కువ. నెమ్మదిగా చదవసాగాడు.
"సార్. తర్వాతి ప్రశ్న. 'అధినేత ప్రజలతో ఏ విధంగా వ్యవహరించవలెను?' దీనికి నా సమాధానం సర్. 'అధినేత అనేవాడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకొనవలెను. కుల, మత, జాతి, వర్ణ, వర్గ విభేదాలకు అతీతంగా వ్యవహరించవలెను. అందరి సంక్షేమం కోసం సమానంగా పాటు పడవలెను. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడేందుకు దోహదం చేసే పధకాలను బాధ్యతాయుతంగా ప్రవేశపెట్టవలెను'. ఇది సార్. కనీసం ఒక్క మార్కైనా వస్తుందాండీ..."
"మళ్లీ సున్నా వేసుకోరా బడుద్దాయ్..."
"ఎందుకో నా మట్టి బుర్రకు తెలిసేలా చెప్పండి సార్..."
"నీ చుట్టూ ఏం జరుగుతోందో కళ్లెట్టకుని చూడరా. ఓ మతం వారి విశ్వాసాలు దెబ్బతినేలా కొందరు ఉన్మాదులు ఆలయాల విధ్వంసానికి పాల్పడితే ఏ కేసైనా ముందుకు సాగిందిరా? అలా చేసిన వాళ్లంతా మతి స్థిమితం తప్పిన వారేనన్నట్టుగా చూపించడం లేదూ? ఇది మతాల వారీగా సమాజంలో చిచ్చురగిల్చేలా చేయడమే కదా? అధినేత మాటల్లో తరచు కుల ప్రస్తావన వస్తోందంటే ఏమనుకోవాలి? కులాల కులకులలకు నాంది పలకడమే కదా? ముఖ్యమైన పదవులన్నీ ఓ వర్గం వారికే ఎక్కువగా కేటాయించడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు? ఇక ప్రజల పేరిట ప్రవేశపెట్టిన నవ పథకాల ద్వారా ఏం జరుగుతోందో గమనించలేదా? ప్రజల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించాల్సింది పోయి, ఉచిత పథకాల ద్వారా ఓటు రాజకీయాలు నడపడం లేదూ? ఇది బాధ్యతంటావా? బాధ్యతారాహిత్యం అంటావా? పైగా నీ చచ్చు సమాధానానికి మార్కులు రాలేదని ఏడుస్తావ్. ఇప్పుడు తర్వాతి ప్రశ్న చదువు. అదైనా బాగా రాశావేమో చూద్దాం..."
శిష్యుడికి నీరసం వచ్చేసింది. అయినా తప్పక చదవసాగాడు.
"తర్వాతి ప్రశ్న సార్. 'అధినేత పరిపాలనా వ్యవస్థలను ఏ విధంగా పరిపుష్టం చేయవలెను?' దీనికి నా సమాధానం ఇలా రాశాను సార్. 'పరిపాలనకు సహాయ పడే చట్ట, అధికార, న్యాయ, సామాజిక, ఆర్థిక, రక్షణ వ్యవస్థల్లో పారదర్శకత పెరిగేలా చేయవలెను. ఆయా వ్యవస్థల అధికారుల్లో విశ్వాసం పాదుకొనేలా వ్యవహరించవలెను. ప్రజల క్షేమం కోసమే తామున్నామనే భావన వ్యవస్థల ప్రతినిధుల్లో ఎల్లప్పుడూ కలిగేలా చూడవలెను. వారికి అర్హత రీత్యా పదోన్నతులు, ప్రోత్సాహకాలు అందిస్తూ ఉత్సాహంగా పనిచేసే పరిస్థితులు కలిగించవలెను. వారికి పాలనా వ్యవహారాల్లో తగిన భాగస్వామ్యం కలిగించి చైతన్యపరచవలెను'. మరింతే కదండీ? దీనికెన్ని వేసుకోమంటారు?"
"చక్కగా గుండ్రంగా, చెగోడీలాగా ఓ సున్నా వేసుకోరా సన్నాసీ..."
"సరేసార్... వేసుకున్నా... మరి అసలైన జవాబు చెప్పండి సార్..."
"మళ్లీ నీ అధినేత కేసి చూడరా నాయనా! మహత్తరమైన సమాధానం లభిస్తుంది. అధికార వ్యవస్థను అధినేత ఎలా మార్చాడురా? తను లోగడ చేసిన అవకతవక, అవినీతి కార్యకలాపాల్లో సహకరించిన ఐయ్యేఎస్ అధికారులను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ హోదాలు కల్పించలేదూ. మాట వినని అధికారుల పట్ల అధినేత తీరు ఎలా ఉందో తెలిశాక ఏ అధికారైనా నోరెత్తుతున్నాడా అని? ఆ విధంగా అధికార వ్యవస్థ కునారిల్లలేదూ? తనకు వ్యతిరేకంగా తీర్పులు, మందలింపులు వస్తున్నాయని అధినేత స్వయంగా దేశ రాజధానికి వెళ్లి న్యాయ వ్యవస్థపైనే ఫిర్యాదు చేసిన వింత ఎప్పుడైనా విన్నామా? కన్నామా? ఇది న్యాయ వ్యవస్థను అన్యాయంగా నీరుగార్చే ప్రయత్నం కాదూ? ఇక చట్టాన్ని రక్షించే పోలీసు వ్యవస్థ సొంత గూండాలు, అనుచరుల మాదిరిగా మారిపోలేదూ? ఆఖరికి పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల కన్నా, స్ధానిక అధికార పార్టీ నేతల ఆదేశాలే పాటించేంతగా వ్యవస్థ భ్రష్టుపట్టిపోలేదూ? ప్రశ్నించిన పాపానికి సొంత పార్టీ ఎంపీపైనే కక్ష కట్టిన వారికి సామాన్యులొక లెఖ్ఖా? అరెస్టులు, గృహనిర్భంధాలతో పరగణా ప్రతిధ్వనించడం లేదూ? ఇక అదుపులేని అప్పులతో, నిధుల మళ్లింపుతో, ఉచిత పధకాలతో ఆర్ధిక వ్యవస్థ అణగారిపోయిందాలేదా? ఇలా ప్రతి వ్యవస్థను పిడికిట్లో పెట్టుకోవాలని కదరా నువ్వు రాయాల్సిన సమాధానం? మరింకా మార్కులంటావేం?"
శిష్యుడికి దుఃఖం తన్నుకొచ్చింది. దాదాపు ఏడుస్తూ... "ఇదేంటి సార్... మీరు పెట్టిన స్లిప్‌టెస్టులో 20 మార్కులకి ఒక్క మార్కు రాలేదు? ఎక్కడ పొరపాటు జరిగిందండీ?" అని అడిగాడు.
గురువుగారు పగలపడి నవ్వి, "ఓరి నా వెర్రి శిష్యా! నువ్వు స్వచ్ఛ రాజకీయ జవాబులు రాశావురా. రాయాల్సింది నీచ రాజకీయ జవాబులు. నువ్వు ఒక నేతగా ఎదిగి... ప్రజల క్షేమం కాకుండా నీ సంక్షేమం, జనం అభివృద్ధి కాకుండా నీ పరిజనం అభివృద్ది, రాష్ట్రం ఎదుగుదల కాకుండా నీ ఎదుగుదల, పరగణా ప్రగతి కాకుండా నీ బంధుమిత్రుల పురోగతి చూసుకుని పదికాలాల పాటు పదవిలో ఉండాలనుకున్నా, పది తరాల పాటు తరగని ఆస్థిపాస్థులు సంపాదించుకోవాలన్నా... ఈ జవాబులే కరక్టురా. అప్పుడే నేను చెప్పే పాఠాలకీ, నువ్వు నేర్చుకున్న విద్యకీ సార్ధకత ఏర్పడుతుంది. అర్థమైందా? సరే నువ్వు తెగ బాధ పడిపోతున్నావు కానీ, ఆఖరుగా బోనస్ ప్రశ్న అడుగుతా. దీనికైనా సరిగా సమాధానం చెప్పు. ఇప్పుడు నీ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న అక్రమార్కుడి పరిపాలనా శైలికి ఎన్ని మార్కలు వేస్తావు?"
శిష్యుడు ఉత్సాహంగా చెప్పాడు.
"చక్కగా, గుండ్రంగా, చక్కిలంలా, చెగోడీలా, బండి చక్రంలా, బస్సు టైరులా, అప్పడంలా... ఏది ఉంటుందో అన్ని మార్కులు సార్..."
"శెభాష్... ఇప్పుడు నీకు నూటికి నూరు మార్కులురా. ఇక పోయిరా!"
-సృజన
PUBLISHED ON 3.8.2021 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి