"ఏంట్రా... ఒళ్లంతా చెమటలు పట్టి కనిపిస్తున్నావు? మీ ఆవిడేమైనా పని చెప్పిందా, లేక రాజకీయాల్లో రాటు
దేలాలని కసరత్తులేమైనా చేస్తున్నావా?" అంటూ పలకరించారు గురువుగారు, అప్పుడే వచ్చి ఆయాసంతో చతికిల
పడిన శిష్యుడిని చూస్తూ.
"మా ఆవిడ ఏ పని చెప్పినా నేనెలాగూ చేయలేను
కాబట్టి ఆయాసం రాదండి. ఇక రాజకీయాల్లో రాటు దేల్చడానికి మీరెలాగూ ఉన్నారు. కాబట్టి
ఈ రెండూ కావండి. ఈమధ్య వ్యాయామాలు,
ఆటలు మొదలు పెట్టానండి. అందువల్లండి" అన్నాడు
శిష్యుడు సేదతీరుతూ.
"ఉన్నట్టుండి నీకిందే బుద్ధిరా. అంత క్రితం
ఇస్త్రీ చేసిన జేబురుమాలులా ఉండేవాడివి,
ఇప్పుడు నలిపి పారేసిన కాగితంలా వడిలిపోయావ్. ఎందుకని?"
"ఏం లేదు గురూగారూ! ఒలింపిక్స్‌లో మన భారతీయులు
పతకాలు గట్రా సాధించారు కదండి అందువల్ల ఉత్సాహం వచ్చిందండి. వచ్చేసారికల్లా
ఎలాగో అలా ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించి దేశానికి పతకం తెచ్చేద్దారని బుద్ది
పుట్టిందండి..."
"అయితే మరి ఇక రాజకీయాలు నేర్చుకోనంటావ్?"
"అమ్మమ్మ ఎంత మాట. ఇటు రాజకీయాలు, అటు క్రీడలు రెండింట్లోనూ దూసుకుపోదామనండి... అందుకే
మైదానం నుంచి నేరుగా మీ దగ్గరకే వచ్చాను..."
"బాగుందిరా... కానీ నీకో ఆసక్తికరమైన
విషయం చెప్పనా? క్రీడల్లో ఒలింపిక్స్ పతకాలను
అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలు ఎగరేసుకుపోతాయేమో
కానీ, రాజకీయాల్లో ఒలింపిక్స్ పెడితే పతకాలన్నీ మనవేరా...
మన నేతలు రాజకీయ క్రీడల్లో అంతటి ప్రబుద్ధులు తెలుసా?"
"భలేవారు గురూగారూ! రాజకీయ ఒలింపిక్స్
ఏంటండీ బాబూ... అందులో ఈవెంట్లు ఏముంటాయి?"
"ఎందుకుండవురా... క్రీడల్లో ఉన్నవన్నీ
ఇక్కడా ఉంటాయి... మరి కొన్ని ఎగస్ట్రా కూడా ఉంటాయి..."
"ఇదేదో భలే సరదాగా ఉందండీ... ఉదాహరణకి
కొన్ని చెప్పండి, మీరు
చెప్పేదేంటో అర్థం చేసుకుంటాను..."
"ఏముందిరా... రిలే రన్నింగు పోటీల్నే తీసుకో.
ఒకడు కొంతదూరం పరిగెత్తి, గొట్టంలాడి కర్ర ముక్కని మరొకడికి అందిస్తే అక్కడ్నుంచి వాడు పరిగెడతాడు
అవునా? అలాంటివే కదరా మన వారసత్వ రాజకీయాలు? అలనాటి ఇందిరమ్మ దగ్గర్నుంచి ఈ నాటి రాహుల్ గాంధీ వరకూ ఇదే జరగడం
లేదూ జాతీయ పార్టీలో? రాజీవ్‌గాంధీ తర్వాత ఆయన సతీమణి సోనియాగాంధీ, ఆమె
తర్వాత రాహుల్‌గాంధీ రాజకీయ ట్రాక్ మీద పరుగులు పెట్టడం లేదూ? అంత పెద్ద పార్టీలో ఓ కుటుంబం వారసులు తప్ప చెప్పుకోదగ్గ మరో నేత లేడంటే
వింతగా లేదూ? ఇలా రిలే పొలిటికల్ రన్నింగులో ఎంత మంది క్రీడాకారులు
లేర్రా, మన దగ్గర. అప్పుడెప్పుడో బీహార్‌లో లాలూ ప్రసాద్
జైలు కెళితే ఆయన భార్య రబ్రీదేవి రంగం నడపలేదూ? మరి హోలాంధ్రా
గురించి మాత్రం మర్చిపోగలమా? వైఎస్సార్ తర్వాత ఆ రిలే గొట్టం పట్టుకుని అప్పటికప్పుడే పరిగెత్తేయాలని
జగన్మోహనుడు ఉవ్విళ్లూరలేదూ? ఆ మేరకు సంతకాలూ గట్రా కూడా
సేకరించి ట్రాక్‌లోకి దూకేద్దామనుకున్నాడుగా? కానీ అధిష్టానం హర్డిల్స్ పెట్టే
సరికి రోడ్ల మీద బాగా ప్రాక్టీసు చేసి ఇప్పుడు రన్నింగ్ లో రెచ్చిపోవడం లేదూ?
మరిక్కడ తెలంగాణాలో కూడా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ట్రాక్ మీద సిద్దంగా
నిలబడి లేడూ? మరాపక్కన తమిళనాడులో కొత్తగా రన్నింగ్
మొదలుపెట్టిన స్టాలిన్ తంబి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మరి ఇవన్నీ చూస్తే రాజకీయ రిలే
రన్నింగులో గోల్డు మెడళ్లు బోల్డు వచ్చేస్తాయి మనోళ్లకి. ఏమంటావ్?"
"ఇక అనడానికేముందండీ, మీరింత బాగా చెప్పాక? కానీ ఒలింపిక్స్‌లో మనకి స్వర్ణ
పతకం తెచ్చిన జావెలిన్ థ్రో లాంటి ఈవెంటు
లాంటిది కూడా ఉంటుందాండీ, రాజకీయ క్రీడోత్సవాల్లో?"
"ఎందుకుండదురా... జావెలిన్ థ్రో అంటే ఏంటి? ఈటెలు విసరడమే కదా? అదే రాజకీయాల్లోకి వస్తే ఈటెల్లాంటి మాటలన్నమాట. జావెలిన్ లో ఇన్నాళ్లకి ఒక్కడు తెర మీదకి వచ్చాడు
కానీ, అదే పొలిటికల్ ఒలింపిక్సులో గల్లీగల్లీకో ఆరితేరిన రాజకీయ
నేత కనిపిస్తాడు. తెల్లారి లేస్తే అవాకులు చెవాకులు ఎగస్పార్టీ వాళ్ల మీద విసిరేసే
వాళ్లేగా అందరూనూ. తాజాగా హుజూర్‌బాద్ ఉప ఎన్నిక రంగాన్ని తీసుకుంటే చాలదూ. ఓ పక్క
ఆ ఈటెల మాటలు విసురుతుంటే, ఇట్నుంచి ఎగస్పార్టీ రేవంత్ రెచ్చిపోవడం
లేదా? తెలంగాణా అధినేత
అల్లుడుంగారు హరిశ్‌ని తక్కువ చేయగలమా? మరి అటు ఆంధ్రా
కేసి చూస్తే స్వర్ణ పతకాలు పట్టేసే స్థాయిలో నిత్య రాజకీయ జావెలిన్ థ్రోలు ఎడాపెడా
జరుగుతూనే ఉన్నాయిగా? తాజాగా మంత్రి పేర్ని నాని ఏకంగా దిల్లీ దాకా ఈటెలు విసరడం లేదూ?
మరి అక్కడ్నుంచి బీజేపీ క్రీడాకారులు కూడా రెచ్చిపోయి మరీ ఇటు కేసి
విసరడం లేదూ? మరి ఇలాంటి వాళ్లకు కాక ఇంకెవరికి వస్తాయిరా
గోల్డు మెడళ్లు?"
"భలేగా చెప్పారండీ బాబూ. మరి బాక్సింగ్
సంగతేంటండీ?"
"బాక్సింగంటే ఏంట్రా? బరిలోకి దిగిన ఎదుటివాడిని మట్టి
కరిపించడమేగా? ఇందులో మనవాళ్లందరూ ఆరితేరిన వాళ్లే. ఇక
బంగారు పతక స్థాయిలో క్రీడాకారుడెవరంటే ఆంధ్రా కేసే చూడాల్రోయ్. అక్కడ సొంత పార్టీ
ఎంపీ అయినా చితకతన్నించిన గొప్ప క్రీడా నైపుణ్యం ఇంకెక్కడ కనిపిస్తుంది చెప్పు?
ఆంధ్రా పోలీసుల్ని కూడా పోటీలకు పంపామనుకో. ఇక పతకాలే పతకాలు.
అక్కడి రాజకీయ నేతలు చెప్పినట్టల్లా, ఓ గూండాల్లాగా,
సొంత అనుచరుల్లాగా మారిపోయి ఎవర్ని కొట్టమంటే వారిని, ఎలాంటి కేసులు పెట్టమంటే అలాంటి కేసులు పెట్టి మరీ పంచ్‌లు విసురుతున్న ఆళ్లకి
మించిన అడ్డగోలు ఆటగాళ్లు ఎవరుంటారు చెప్పు?"
"బాగా చెప్పారండీ. మరి హర్డిల్స్ పోటీ
సంగతేంటండి?"
"ఒరే... రాజకీయ క్రీడల్లో హర్డిల్స్
రెండు రకాలురా. ఒకటి ట్రాక్‌లో మనకున్న హర్డిల్స్ దాటుకుంటూ పరుగెట్టడం ఒకటైతే, వేరే వాళ్లు పరిగెట్టే ట్రాక్‌లో
పనిగట్టుకుని హర్డిల్స్ పెట్టడం మరో రకం. ఈ రెండు ఈవెంట్లలోనూ మీ ఆంధ్రా అధినేతను
మించిన గొప్ప ఆటగాడు ఇంకెవడూ ఉండడ్రా. మరాయన పరిపాలనలో ఎదురవుతున్న హర్డిల్స్ ఇన్నీ, అన్నీనా? పాలనా పరమైన పరుగులో నైపుణ్యం
లేకపోవడం వల్ల అడుగడుగునా అడ్డంకులే. ఓ పక్క ఆర్థిక అవకతవకలు. మరో పక్క
జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి కూడా కటకటలాడుతున్న పరిస్థితి.
ఇంకో పక్క మితి మీరిన అప్పులపై ఆరా తీస్తూ కేంద్రం పెడుతున్న హర్డిల్స్. ఇక ఆయన
గతంలో చేసిన అక్రమార్జన కార్యకలాపాలే కేసులై వెంటాడుతున్న హర్డిల్స్. ఇంకో పక్క పరిపాలనా వ్యవహారాలపై హైకోర్టు, సుప్రీం కోర్టులు పెడుతున్న చీవాట్లు, మందలింపులు కూడా
లెక్కలోకి తీసుకుంటే అడుగడుగునా హర్డిల్సే. అయినా వాటిని తన్నేసుకుంటూ మరీ అడ్డదిడ్డంగా పరుగట్టేస్తున్నాడ్రా
ఆయన. ఇలా పరిగెట్టడమే కాదురోయ్. వేరే
వాళ్లకి హర్డిల్స్ క్రియేట్ చేయడంలో కూడా ఆయనకే పతకం ఇచ్చేయాలి. మరి మొన్నీ
మధ్య అమరావతి రాజధాని కోసం 600 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు
తమ నిరసనను వినూత్నంగా తెలపాలని అనుకుంటే ఈయన పెట్టించిన అడ్డంకులు ఇన్నీ అన్నీనా
నాయనా? వేలాది మంది పోలీసుల్ని మొహరించి,
రోడ్ల మీద ఇనుప కంచెలు పెట్టించి మరీ అడ్డుకోలేదూ? శాంతి యుతంగా నిరసన తెలపడాన్ని
కూడా సహించలేనంత తెంపరితనంతో అలనాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తేలేదూ? ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని కూడా ఉక్కు పాదంతో నలిపేసే ఈయన తత్వం ఎలాంటిదంటే,
ఒకవేళ బంగారు పతకం ప్రకటించకపోతే వెళ్లి లాగేసుకుని మరీ తనను తాను విజేతగా ప్రకటించుకునేంత
దారుణమైనది. అర్థమైందా?"
"అద్భుతం సార్. ఇలాగే మిగతా ఈవెంట్లు
కూడా చెప్పండి సార్, సరదాగా ఉంది..."
"ఒరేయ్... అసలైన ఒలింపిక్స్‌లో ఈవెంట్లు
కొన్నేరా... కానీ పొలిటికల్ ఒలింపిక్స్‌లో లెక్కలేనన్ని. ఉదాహరణకి ఈతల పోటీ
పెట్టారనుకో, ఎదుటి
వాడి కాలు పట్టుకుని లాగేసి మరీ ఈదుకుంటూ పోతార్రా మన రాజకీయ నేతలు. ఇక సింక్రనైజ్డ్
స్విమ్మింగంటే, తమ మంత్రులు, అనుచరులను
పోగేసుకుని విన్యాసాలు చేస్తూ తమ పరిపాలన
అద్భుతంగా ఉందని భ్రమ కల్పిస్తూ కనువిందులాంటి కనికట్టు చేస్తుంటారు. ఇక హాకీలాంటి
ఈవెంట్లు పెట్టామనుకో, బంతిని కొట్టడం మీద కన్నా ఎదుటి వారి
కాళ్లు విరగ్గొట్టడం మీదే దృష్టి పెడతారు. అందరి కాళ్లూ విరగ్గొట్టాక బంతిని అడ్డగోలుగా
గోలు చేద్దామని చూస్తుంటారు. ఇందులో అన్ని పార్టీల నేతలూ పతక స్థాయి ఆటగాళ్లే
అనుకో. ఇలా చూస్తే, ఎన్నికల్లో అవకతవకలు చేసి గెలవడమంటే
లాంగ్ జంప్ చేయడమన్నమాట. ఎగస్పార్టీ కంటే ఎక్కువగా హామీలివ్వడమంటే హైజంప్ చేయడమన్నమాట.
ఇక అనెథికల్ అథ్లెటిక్స్‌లో మన వాళ్లని మించిన వాళ్లెవరురా? ఇక ఎదుటివారి మీద విమర్శలు, ఆరోపణలు చేసే ఫెన్సింగు
ఈవెంట్లో మన నేతలకి కాక ఇంకెవరికి వస్తాయి పతకాలు? అవసరమైతే ఫెన్సింగ్ కత్తితో పొడిచేసి మరీ గెలిచేస్తారు.
ఇక షూటింగనుకో, సున్నాల బోర్డు మీద కంటే ఎదుటి ఆటగాడి గుండెల
మీదకే గురిపెడతారు. పోనీ సైక్లింగ్ పోటీ పెట్టామనుకో, ఆ సైకిల్‌ని
కారు మీద నిలబెట్టి స్పీడు పెంచేసి గెలిచామంటారు. ఇలా ఏ ఆటలోనైనా అడ్డగోలుగా,
అక్రమంగా ఆడేస్తారు. అంతేకాదురోయ్... రిఫరీలని, ఎంపైర్లని కూడా ప్రలోభపెట్టి, లంచాలు పెట్టి కొనేయాలని
చూస్తారు. అసలైన ఒలింపిక్స్‌లో రూల్సు, నిబంధనలు, పద్ధతులు ఉంటాయి. వాటి ప్రకారమే ఆటగాళ్లందరూ ఆడాలి. అదే పొలిటికల్ ఒలింపిక్స్‌లో
అనుకో. ఆటగాళ్లే రూల్సు పెడతారు. పైగా ఆ రూల్సుని ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు.
ఎవడి నిబంధనలు వాడివే. తెలిసిందా?"
"ఆహా... ఎంత బాగా చెప్పారండీ, పొలిటికల్ ఒలింపిక్స్ కామెంట్రీ.
అయితే నేను కూడా ఇటు ఆటలు, అటు రాజకీయాలు నేర్చుకుని అడ్డగోలు
పతకాలు లాగేసుకుంటాను సార్. ఆశీర్వదించండి".
-సృజన
PUBLISHED ON 17.8.21 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి