మంగళవారం, సెప్టెంబర్ 14, 2021

దీని భావ‌మేమి తిరుమ‌లేశా!


 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అతి సంప‌న్న‌మైన హిందూ ఆల‌యాల్లో ఒక‌టి...

ఏటా వేల కోట్ల ఆదాయాన్ని పొందుతున్న అతి పెద్ద దేవ‌స్థానం...

ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి కోట్లాది మంది భ‌క్తుల‌ను ఆక‌ర్షిస్తున్న ప‌విత్ర స్థ‌లం...

ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న తిరుమ‌ల తిరుప‌తి దివ్య క్షేత్రం గురించిన ఏ చిన్న అంశ‌మైనా అది దేశ‌విదేశాల్లో ఉన్న బాలాజీ భ‌క్తుల‌ను ఎంతో ప్రభావితం చేస్తుంది.

ఇంత‌టి ప్రాధాన్య‌త ఉన్న తిరుమ‌ల‌కు సంబంధించిన కొన్ని  అనాలోచిత నిర్ణ‌యాలు, అసంబ‌ద్ధ‌మైన ప్ర‌క‌ట‌న‌లు త‌ర‌చు వివాదాస్ప‌దమ‌వుతుండడం, చ‌ర్చ‌నీయాంశ‌మ‌వ‌డం, విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌డం భ‌క్తుల మ‌నోభావాల‌ను తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆందోళ‌న‌కు సైతం గురి చేస్తున్నాయి.

"ఏడు కొండ‌లూ వెంక‌టేశ్వ‌రుడివి కావు... రెండు కొండ‌లు మాత్ర‌మే ఆయ‌న‌వి..." అనే వ్యాఖ్యలు వినిపించిన వైఎస్ హ‌యాం త‌ర్వాత ఆయ‌న  త‌న‌యుడు జ‌గ‌న్ పాల‌న‌లో కూడా కొన్ని నిర్ణ‌యాలు తీవ్ర‌మైన ప్ర‌తిస్పంద‌న‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల విక్రయం, వేలం, దేశ‌వ్యాప్తంగా ఉన్న క‌ళ్యాణ మండ‌పాల లీజు  వ్య‌వ‌హారంభ‌క్తుల‌కు ఉచితంగా  కాకుండా ఓ హోట‌ల్ మాదిరిగా భోజ‌నాన్ని అమ్మాల‌నుకోవ‌డం, ఈ దేవ‌స్థానానికి సంబంధించిన పాల‌క వ‌ర్గంలో అర్హ‌త‌లు సైతం చూడ‌కుండా కొంద‌రు వివాదాస్ప‌ద వ్య‌క్తుల‌ను నియ‌మించ‌డం, ఇలాంటి స‌భ్యుల్లో కొంద‌రిపై అస‌భ్య‌మైన ఆరోప‌ణ‌లు కూడా ఎదురు కావ‌డం, దేవ‌స్థానానికి సంబంధించిన కార్య‌క‌లాపాల‌పై సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా వ్య‌క్తం చేసిన వ్య‌క్తుల‌పై బెదిరింపులు, కేసుల న‌మోదుకు కూడా తెగ‌బ‌డ‌డం.... ఇలా చూస్తే ఎన్నో అంశాలు త‌ర‌చు చ‌ర్చ‌నీయాంశం కావ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌నే అభిప్రాయాలు స‌ర్వే స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌పంచంలోనే అత్యంత కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టి.  దాదాపు ల‌క్ష కోట్ల విలువైన ఆస్తులు తిరుమ‌ల బాలాజీ పేరిట ఉన్నాయి.  బాలాజీ ద‌ర్శ‌నానికి వ‌చ్చే కోట్లాది మంది భ‌క్తుల ద్వారా ఏటా 12 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆదాయం పొందుతున్న ఈ దేవ‌స్థానం పాల‌క వ‌ర్గంలో ఎన్న‌డూ లేనంత‌గా  సుమారు 50 మంది స‌భ్యులు నియ‌మితులై ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల ప్ర‌కారం చూస్తే ఈ సంఖ్యా ఇంకా పెర‌గ‌వ‌చ్చ‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఇక ఈ దేవ‌స్థానానికి సంబంధించిన అధికార వ్య‌వ‌స్థ కూడా చాలా విస్తృతంగా, ప‌క‌డ్బందీ విధానాల‌తో కూడి ఉంటుంది. ఇంత నేప‌థ్యం ఉండి కూడా ఈమ‌ధ్య కాలంలో స‌రైన ఆలోచ‌న‌, ప్ర‌ణాళిక లేకుండా తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు, విడుద‌ల చేస్తున్న కొన్ని ప్ర‌క‌ట‌న‌లు భక్త జ‌నంలో తీవ్ర‌మైన ఆందోళ‌న‌ను రేకెత్తించేలా ఉంటున్నాయి. విమ‌ర్శ‌లు త‌లెత్తిన ప్ర‌తీసారీ దేవ‌స్థానం పాల‌క వ‌ర్గం ఉలిక్కిప‌డి కొన్ని నిర్ణ‌యాల‌ను నిలిపివేస్తు్న్న సంద‌ర్భాలు కూడా ఎదురవుతున్నాయి. ఈ వ్య‌వ‌హారాల‌ను నిశితంగా గ‌మ‌నించేవారికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌ట్ల పాల‌కుల‌కు స‌రైన శ్ర‌ద్ధ‌, బాధ్య‌త ఉన్నాయా లేవా అనే అనుమానాలు, ఇక ముందు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు వినాల్సివస్తుందోన‌నే భ‌యాందోళ‌ల‌న స‌హ‌జంగానే త‌లెత్తుతున్నాయి.

సంప్ర‌దాయ భోజ‌నం సంగ‌తేంటి?

 

తాజాగా సంప్ర‌దాయ భోజ‌నం వ్య‌వ‌హారం తిరుమ‌ల దేవ‌స్థానం అనాలోచిత నిర్ణ‌యాల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ర‌ద్దు చేయ‌డంతో పాటు "అబ్బే...ఇది ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి లేని స‌మ‌యంలో అధికారులు తీసుకున్న నిర్ణ‌యం" అంటూ దేవ‌స్థానం చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి ప్ర‌క‌టించ‌డం హాస్యాస్ప‌దంగా మారింది. ఇంత పెద్ద దేవ‌స్థానానికి సంబంధించి ఆర్భాటంగా ప్రారంభించిన ఓ కార్య‌క్ర‌మం గురించి  ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లికి తెలియ‌ద‌న‌డ‌మే వ్య‌వ‌స్థ‌లో లోపాల‌కి ద‌ర్ప‌ణం ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అస‌లు ఇంత‌కీ ఏంటీ సంప్రదాయ భోజ‌నం? అని నేప‌థ్యాన్ని ప‌రికిస్తే, నిజానికి మూడు నెల‌లుగా గోఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌తో శ్రీవారికి నైవేద్యాలు స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ వేత్త‌లు సూచ‌న‌ల‌తో ఎలాంటి కృత్రిమ‌మైన ఎరువులు వాడ‌కుండా సేంద్రీయ సేద్యం విధానంలో పండించిన బియ్యం, కూర‌లు, పప్పు దినుసుల‌ను ఉపయోగించి కొన్ని నైవేద్యాల‌ను త‌యారు చేస్తున్నారు. దీన్ని విస్త‌రించి భ‌క్తుల‌కు కూడా సంప్ర‌దాయ భోజ‌నాన్ని అందించాల‌ని నిర్ణ‌యించారు. ఆ మేర‌కు అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఆగ‌స్టు 26 నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా  ఉచిత భోజ‌నం కూడా ఏర్పాటు చేశారు. అవ‌డానికి ఇది మంచి ఆలోచ‌నే. కానీ ఈ భోజ‌నాన్ని ఇక‌పై ఉచితంగా కాకుండా రుసుము తీసుకుని అందించాల‌నే ఆలోచ‌నే అనేక విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. ఓ ప‌క్క వెంగ‌మాంబ నిత్యాన్న‌దాన ప‌థ‌కం ద్వారా ప్ర‌తి రోజూ వేలాది మంది భ‌క్తులు ఉచిత భోజ‌నం, అల్పాహారాల‌ను పొంద‌తున్నారు. గ‌త ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ నిత్యాన్న‌దానాన్ని కేవలం వెంగ‌మాంబ భ‌వ‌నంలోనే కాకుండా మెట్ల దారిలోను, తిరుమ‌ల‌లోని వేర్వేరు స్థ‌లాల ద్వారా ఎక్క‌డికక్క‌డ భ‌క్త‌ల‌కు అంద‌జేస్తూ వ‌స్తున్నారు.  ఈ విధానం ఎంతో ఆద‌ర‌ణకు సైతం నోచుకుంది. అలాంటిది దేవ‌స్థానం ఓ హోట‌ల్ మాదిరిగా, వ్యాపార‌ధోర‌ణిలో భ‌క్తుల‌కు డ‌బ్బులు తీసుకుని భోజ‌నం పెట్టాల‌నుకోవ‌డమే వివాదాస్ప‌ద‌మైంది. వంద‌లాది, వేలాది కిలోమీట‌ర్ల దూరం నుంచి వ్య‌య‌ప్ర‌యాస‌లకు ఓర్చి, ఆర్తితో తిరుమ‌ల బాలాజీ ద‌ర్శ‌నానికి వ‌స్తూ వేల కోట్ల ఆదాయాన్ని స‌మ‌కూరుస్తున్న భక్త జ‌నానికి డ‌బ్బులు తీసుకుని అన్నం పెట్ట‌డ‌మేంట‌నే విమ‌ర్శ‌లే ఈ సంప్ర‌దాయ భోజనం వ్య‌వ‌హారాన్ని ఓ ప్ర‌హ‌స‌నంగా మార్చాయి. దీనిపై కొన్ని ధార్మిక సంస్థ‌లు కూడా ధ్వ‌జ‌మెత్తాయి. పైగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి క్ర‌మం త‌ప్ప‌కుండా విరాళాలు అందించే దాత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. వారితో ఈ ఆలోచ‌న గురించి చ‌ర్చిస్తే వారంద‌రి స‌హ‌కారంతో ఇదెంతో ఉదాత్త‌మైన గొప్ప కార్య‌క్ర‌మంగా రూపుదిద్దుకుని ఉండేది.  తిరుమ‌ల‌లో ఎన్నో హోట‌ల్స్ ఉన్న‌ప్ప‌టికీ వాటిలో నాణ్య‌త మీద అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో  దేవ‌స్థానం సంప్ర‌దాయ భోజ‌నాన్ని అందిస్తే ఎంతో ప్ర‌యోజ‌న కరంగా ఉండేది. ఇవేమీ ఆలోచించ‌కుండా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించ‌డం, పైగా త‌ప్పంతా అధికారుల‌దే అన‌డం పాల‌క వ్య‌వ‌స్థలోని లొసుగుల‌కు తార్కాణంగా నిలిచింది. అయితే ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం వెనుక తిరుమ‌ల లోని హోట‌ల్ య‌జ‌మానుల ఒత్తిడి కూడా కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చ‌నే విమ‌ర్శ‌లు కూడా త‌లెత్తుతున్న నేప‌థ్యంలో భ‌క్తులు "దీని భావమేమి తిరుమ‌లేశా" అనుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు.

 

కళ్యాణ మండ‌పాల క‌థేంటి?

 

పాల‌క మండ‌లి  తీసుకున్న నిర్ణ‌యాల్లో మ‌రో వివాదాస్పద‌మైన అంశం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన నిర‌ర్ధ‌క ఆస్తుల వ్య‌వ‌హారం. దేవ‌స్థానానికి దేశ‌వ్యాప్తంగా ఎన్నో ఆస్తులు, స్థ‌లాలు, భ‌వ‌నాలు ఉన్నాయి. దాదాపు ఇవ‌న్నీ వేంక‌న్న మీద భ‌క్తితో వేర్వేరు దాత‌లు దేవ‌స్థానానికి ఇచ్చిన‌వే. వాటిలో క‌ళ్యాణ మండ‌పాలు, ఇత‌ర భ‌వ‌నాలు, స్థ‌లాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వేలం వేయాల‌నే ఆలోచ‌న కూడా తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. దాంతో ఈ నిర్ణ‌యంపై కూడా వెన‌క‌డుగు వేయ‌క త‌ప్ప‌లేదు. ఇక క‌ళ్యాణ మండ‌పాల సంగ‌తి.  దేశ‌వ్యాప్తంగా దేవ‌స్థానానికి 304 క‌ళ్యాణ మండ‌పాలు ఉన్నాయి. వాటిలో 216 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌గా, 77 తెలంగాణ‌లో ఉన్నాయి. వీటిని లీజు విధానం ద్వారా ప్రైవేటు వ్య‌క్తుల‌కు అప్ప‌జెప్పాల‌నే నిర్ణ‌యం తాజాగా ఎన్నో వాద‌ప్ర‌తివాదాల‌కు, చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. దేవ‌స్థానానికి దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక ఆస్తుల్లో చాలా మ‌టుకు నిరర్ధ‌కంగా ఉన్న‌యని, వాటి నుంచి ఆదాయం ఏమీ ఉండ‌డం లేద‌ని, పైగా వాటి నిర్వ‌హ‌ణ‌కు అద‌న‌పు ఖ‌ర్చు అవుతోంద‌నే ఆలోచ‌న లోంచే ఈ నిర్ణ‌యం పుట్టుకొచ్చింది. అయితే క‌ళ్యాణ మండ‌పాల‌ను లీజుకిస్తే కొంద‌రు ఇత‌ర మ‌తాల వారు వాటిని ద‌క్కించుకునే అవ‌కాశం ఉండ‌డం, వారు అన్య మ‌త ప్ర‌చార కార్యక్ర‌మాల‌కు వాటిని వాడుకునే వీలు ఉండ‌డం... వెంక‌న్న భ‌క్తుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రుస్తోంది. ఇది హిందూ మ‌త అభిలాషుల‌కు, అభిమానుల‌కు తీవ్ర అభ్యంత‌ర క‌రంగా తోచింది. దాంతో తిరిగి పాల‌క వ‌ర్గం స్పందించ‌క త‌ప్ప‌లేదు. అయితే ఇదేమీ కొత్త విష‌యం కాదంటూ 1990 ఏప్రిల్ 9 నాటి ఓ పాత జీవో 311ను చూపిస్తూ పాల‌క మండ‌లి త‌న‌ను తాను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది. దాంతో పాటు అన్య‌మ‌తాల వారికి లీజుకి ఇవ్వ‌కుండా  కేవలం హిందూ మ‌త ప్ర‌చారానికి, హిందూ సంప్ర‌దాయ పూర్వ‌క‌మైన వేడుకుల‌కు మాత్ర‌మే ఇచ్చేలా నిబంధ‌న‌లు రూపొందించామ‌ని ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌లేదు. అంతే కాకుండా ఇంత వ‌ర‌కు 29 క‌ళ్యాణ మండ‌పాల‌ను లీజుకిచ్చామ‌ని, ఇంత‌వ‌ర‌కు ఎలాంగి విమ‌ర్శ‌లు రాలేద‌ని చెప్పుకొచ్చింది.  అయితే ఈ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు భ‌క్తుల‌కు పూర్తి భ‌రోసాను ఇవ్వ‌లేక‌పోతున్నాయ‌నేది నిర్వివాదాంశం. ఎందుకంటే ఈ క‌ళ్యాణ మండ‌పాల‌ను చాలా మ‌టుకు దాత‌లిచ్చిన స్థ‌లాల‌లోనే నిర్మించారు. త‌మ ప్రాంతంలో తామిచ్చిన స్థ‌లంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మండ‌పాల‌ను క‌డితే, ఆ మండ‌పాల్లో జ‌రిగే శుభ‌కార్యాల ద్వారా ఓ మంచి స‌త్సంప్ర‌దాయంలో భాగ‌స్వాముల‌య్యామ‌నే తృప్తి మిగులుతుంద‌నేది ఆయా భక్తుల మ‌నోభావ‌న‌. అయితే అలాంటి దాత‌లను కానీ, వారి కుటుంబీకుల‌ను కానీ ఏమాత్రం సంప్ర‌దించ‌కుండా లీజు నిర్ణ‌యం తీసుకోవ‌డం అనేక మందికి అభ్యంత‌ర‌క‌రంగా మారింది. దాంతో ఇది మ‌రొక తొంద‌ర‌పాటు చ‌ర్య‌గా, అనాలోచిత వ్య‌వ‌హారంగా నిలిచింది. ఏది ఏమైనా  పాల‌క మండ‌లి స‌రైన ప్రణాళిక‌, ఆలోచ‌న‌, చ‌ర్చ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఏది తోస్తే అలా చేస్తోందా అనే అనుమానాలు భ‌క్తుల్లో త‌లెత్తి "ఏం జ‌రుగుతోంది తిరుమ‌లేశా" అనుకోక త‌ప్ప‌డం లేదు.

 

ఇంకా ఎన్నో... ఎన్నెన్నో...

 

ఇలా చూస్తే ఇంకా ఎన్నో దృష్టాంత‌రాలు క‌నిపిస్తూ అటు దేవ‌స్థానం పాల‌క మండ‌లిని, ఇటు అధికారవ్య‌వ‌స్థ‌ని, ఆపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ్య‌వహార శైలిని కూడా ప‌లుచ‌న చేస్తున్నాయి. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు దేవ‌స్థానం త‌ర‌ఫున 50 కోట్ల రూపాయ‌ల‌ను విరాళంగా ఇవ్వ‌డం, తెలంగాణా నుంచి వెళ్లే ప్ర‌ముఖుల‌ను చిన్న‌చూపు చూస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు తావివ్వడం, దేవ‌స్థానంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌నే నెపంతో 18 మందిపై కేసులు పెట్ట‌డానికి తెగ‌బ‌డ‌డం, పాల‌క మండ‌లి స‌భ్య‌ల‌ను ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెంచేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు గుర‌య్యేలా ప్ర‌వ‌ర్తించ‌డం, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌లైన కొన్ని క్ష‌ణాల్లోనే దేవ‌స్థానం అధికారిక వెబ్‌సైట్లు గంట‌ల త‌ర‌బ‌డి స్తంభించిపోవ‌డం... లాంటి ఎన్నో నిర్ణ‌యాలు, ప్ర‌క‌ట‌న‌లు, చ‌ర్య‌లు వివాదాల‌కు గుర‌వుతున్నాయి. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తున్న భ‌క్తులు కోరుకునేదొక్క‌టే. దేవ‌స్థానం పాల‌క మండ‌లి, అధికారులు, ప్ర‌భుత్వం ఎవ‌రైనా స‌రే అత్యంత ప్రాధాన్య‌మైన‌, అతి ప‌విత్ర‌మైన క్షేత్రానికి సంబంధించిన వ్య‌వ‌హారాల్లో అశ్ర‌ద్ధ‌గా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని. నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డంలో కానీ, వాటి అమ‌లులో కానీ పార‌దర్శ‌క పాటించాలని. అది జ‌ర‌గాల‌ని ఆ అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడిని వేడుకోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేని స్థితిలో బాలాజీ భ‌క్తులు ఉన్నార‌నడంలో సందేహం ఏమీ లేదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి