* కేవలం ఒక్క క్షణం... తేరిపారి ఆ తిరుమల
వెంకటేశ్వరుడి దివ్య సుందర విగ్రహాన్ని కనులారా వీక్షించుకోవాలని, ఆ రూపాన్ని మనసునిండా నింపుకుని
తరించాలని సుదూర తీరాల నుంచి పిల్లాపాపలతో,
వృద్ధులతో వ్యయప్రయాసలకు ఓర్చి, ఆపసోపాలు
పడుతూ తరలి వచ్చే లక్షలాది మంది భక్త జనానికి మరింత నిరీక్షణ తప్పని పరిస్థితి
ఇప్పుడు దాపురించినట్టే!
* ఇంట్లో వెంకన్న పటం ముందు ఏ ఇత్తడి
చెంబులోనే హుండీ ఏర్పాటు చేసుకుని,
మొక్కులు మొక్కుకున్నప్పుడల్లా అందులో నోట్లు, నాణాలు వేసుకుంటూ, ఆ డబ్బుల మూటను భక్తితో నెత్తి
మీద పెట్టుకుని తిరుమల చేరుకుని ఆ సొమ్మును వెంకన్న హుండీలో సమర్పించడం ద్వారా
ఏటా ఏకంగా 12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని అందిస్తున్న కోట్లాది మంది సామాన్య భక్త జనులకు ఇప్పుడు తిరుమలలో మరిన్ని వెతలు, యాతనలు, కాలయాపన ఎదురయ్యే దుస్థితి ఏర్పడినట్టే!!
* మరో పక్క ప్రత్యేక దర్శనాలు, ప్రముఖులు, విఐపీలకు బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక సదుపాయాలు,
సౌకర్యాలు ఇకపై ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయే పరిస్థితి కూడా ఇకపై
కలిగినట్టే!!!
--- అవును! గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లేని
విధంగా, తిరుమల తిరుపతి
దేవస్థానం బోర్డు సభ్యుల సంఖ్యను ఇష్టానుసారం
పెంచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్వాకం వల్ల, ప్రపంచ వ్యాప్తంగా దివ్యక్షేత్రంగా పేరొందిన తిరుమల యాత్ర మరింత కష్టసాధ్యం
కానుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
ఇవన్నీ ఒక ఎత్తయితే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ
దిగజారిపోయేలా, ఆ ఏడుకొండల వాడి దివ్యథామం పవిత్రత అణగారిపోయేలా
కొందరు నేరస్థులు, నిందితులు కూడా బోర్డు సభ్యల హోదాలో సకల
మర్యాదలు అందుకునే కనీవినీ ఎరుగని విడ్డూరం అక్కడ దర్శనమివ్వనుంది. జగన్
ప్రభుత్వం తాజాగా నియామకాలు చేసిన బోర్డు సభ్యుల్లో కొందరి పూర్వాపరాలు పరిశీలించినప్పుడు
ఈ విషయం తేటతెల్లమవుతోందనే ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఒక ఛైర్మన్, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, 24 మంది సభ్యలు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు...
వీరు కాకుండా అదనంగా మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు... వెరశి
అందరూ కలిస్తే మొత్తం 81 మంది! ఇదీ ఇప్పుడు తిరుమల తిరుపతి పాలక
మండలి విరాట్ స్వరూపం!
ఎవరికి ప్రయోజనం?
గతంలో ఎవరి హయాంలోనూ లేనంత మంది సభ్యులతో ఏర్పడిన
ఈ మండలి వల్ల అటు భక్తులకు కానీ,
ఇటు తిరుమల క్షేత్రానికి కానీ ఏం ప్రయోజనం ఏర్పడుతుందన్నది అనుమానమేననడంలో
సందేహం ఎవరికీ కనిపించడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో బోర్డు సభ్యల సంఖ్య
కేవలం 18 మంది. జగనం ప్రభుత్వం కొలువు
తీరగానే ఆ సంఖ్య 37కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా
81 మందితో
కిటకిటలాడుతోంది. వీరిలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి నిర్ణయాలు
తీసుకునే శక్తి ఉండదు. సమావేశాల్లో కూడా వీళ్లు పాల్గొనలేరు. అయినా సరే.... వీళ్లు
బోర్డు సభ్యులతో పాటు సమాన హోదాను అనుభవిస్తారు. అంటే బోర్డు సభ్యులకు ప్రోటోకాల్
ప్రకారం కేటాయించే వసతి, వాహన, దర్శన సదుపాయాలు, సౌకర్యాలు
వీరు హాయిగా పొందగలుగుతారు. మరి ఇలాంటి ప్రత్యేక ఆహ్వానితులు ఇంతమంది ఎందుకు?
అనేదే ఇప్పుడు భక్తులను కలవర పరుస్తున్న ప్రశ్న!
ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే
ఈ బోర్డు సభ్యుల పూర్వాపరాలు ఒకసారి పరిశీలించాలి. అలా పరిశీలించినప్పుడు వీరిలో
అత్యధికులకు శ్రీవారి సేవతో కానీ,
ఆధ్యాత్మిక నేపథ్యంతో కానీ సంబంధం లేకపోవడమే కాదు, వారికి ఎలాంటి ప్రత్యేక అర్హతలు
కూడా లేవని తేటతెల్లమవుతుంది. పైగా వీరిలో 70 శాతం మంది ఇతర
రాష్ట్రాలకు చెందినవారే. అంతేకాదు,
వీరిలో కొందరు కొన్ని కేసుల్లో నిందితులు కూడా. ఇంకా ఘోరమేమిటంటే ఓ
కేసులో అరెస్టయిన వ్యక్తికి కూడా ఈ బోర్డులో స్థానం లభించడం! ఇంకా కొందరు పారిశ్రామిక
వేత్తలు, అవినీతి ఆరోపణలకు గురైనవారు, సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు
కూడా ఉండడమే ఇప్పుడు భక్త జనుల మనోభావాలను కలచివేస్తోంది.
ఇలాంటి వారినా నియమించేది?
దేశ దేశాల్లో అత్యంత పవిత్రమైన యాత్రా స్థలంగా
పేరొందిన తిరుమల క్షేత్రానికి సంబంధించిన పాలక మండలి విషయంలో ప్రభుత్వం ఎందుకింత
నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా
వ్యవహరించింది? అనే ప్రశ్నకు ఎలా చూసినా ఒకే సమాధానం కనిపిస్తోందని
పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అదేంటంటే... ఇది ఓ క్షేత్రం పవిత్రతను కానీ,
దాని ప్రాచుర్యాన్ని కానీ, ప్రాధాన్యతను కానీ
దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు... కేవలం రాజకీయ కోణంలో, వ్యాపార కోణంలో స్వప్రయోజనాలనకు మత్రమే పరిగణిస్తూ చేసిన నిర్వాకమేననే
విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉన్న అక్రమార్జన కేసుల్లో సహనిందితులకు కూడా
ఇందులో చోటు దక్కడమే ఇందుకు తార్కాణమని విశ్లేషకులు, ప్రతిపక్ష
నాయకులు ఢంకాపధంగా చెబుతున్నారు. తనకు
గతంలో సహకరించిన పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులకు కూడా
జగన్ స్థానం కల్పించడాన్ని ఇప్పుడు అందరూ వేలెత్తి చూపుతున్నారు. ప్రభుత్వంలోను,
పార్టీలోను ఉన్న అసంతృప్తి వాదులను బుజ్జగించడానికి, మరి కొందరిని ప్రలోభ పెట్టడానికి ఇలా తిరుమల బోర్డును ఉపయోగించుకున్నారనే
నిరసనలను వినిపిస్తున్నారు.
సామాన్యలకు వెతలేనా?
దేవస్థానం సభ్యల నియామకాల్లో రాజకీయ, వ్యాపార, ప్రలోభ కారణాలను పక్కన పెట్టి ఈ భారీ పదవుల పందేరం వల్ల సామాన్య భక్తులకు ఒరిగేదేంటని ఆలోచిస్తే... శూన్యమనే చెప్పకతప్పదు. పైగా తిరుమల యాత్ర మరింతగా వెతల పాలు కాక తప్పదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తిరుమల అనగానే ప్రత్యేక దర్శనాలు, బ్రేక్ దర్శనాలు తప్పవు. కొందరు ప్రముఖులకు ఇలాంటి దర్శనాలు ఏర్పాటు చేయడంలో ఎవరికీ అభ్యంతరాలు కూడా పెద్దగా ఉండవు. గతంలో బ్రేక్ దర్శనాల సంఖ్య 2500కి మించేది కాదు. ప్రత్యేక సందర్భాలలో కూడా ఈ సంఖ్యను మూడు వేల లోపే ఉండేలా చూసేవారు. వీరి కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగకుండా చకచకా దర్శనం జరిగేలా చూసేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ సంఖ్య 4000 దాటి పోయింది. వీరి దర్శనానికే 4 గంటల సమయం పట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ భారీ నియామకాల వల్ల ప్రత్యేక, బ్రేక్ దర్శనాల సంఖ్య అయిదు వేలకు మించిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే... బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన వారందరికీ సిఫార్సు లేఖలు జారీ చేసే అధికారం ఉండడమే. మామూలుగానే బోర్డు సభ్యులు ఒకొక్కరు 20 మందికి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అలాగే సుపథం ద్వారా కూడా 20 మందికి ప్రత్యేక దర్శనాలు కల్పించే వీలు ఉంది. ఇలా చూస్తే ఇప్పుడు కొలువైన 81 మంది ద్వారా వచ్చే వారి కోసం దాదాపు 3200 టికెట్లను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంచనా. వీరు కాక ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఇతర ప్రముఖుల ద్వరా వచ్చే సిఫార్సులను కూడా లెక్కలోకి తీసుకుంటే వీరందరి దర్శనాలకు పట్టే సమయం మరిన్ని గంటలు పట్టక తప్పదు. అంటే... అంతసేపూ సామాన్య భక్తులు క్యూలైన్లలో పిల్లా పాపలతో నిరీక్షించి చూస్తూ ఆపసోపాలు పడక తప్పదని ఇట్టే అర్థమవుతుంది.
అడుగడుగునా అవకతవకలే!
అత్యంత పవిత్ర క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే తిరుమల పట్ల ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఉదాహరణలు కోకొల్లులుగా ఉన్నాయని సామాన్యల నుంచి విశ్లేషకుల వరకు అనేక ఉదాహరణలు చూపిస్తున్నారు. దేవస్థానం ఆస్తుల వేలానికి తెగబడడం, తిరుమల బస్ టికెట్ల వెనుక అన్యమత ప్రచారం సాగడం, తిరుమల అధికారిక వెబ్‌సైట్లో అన్య మత గేయాలు కనిపించడం, ఎస్వీబీసీ చైర్మన్ గా నియామకుడైన వ్యక్తి రాసలీలలు వెల్లడి కావడం, తలనీలాలను స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు, దేవస్థానం మాస పత్రికలో రామాయణాన్ని వక్రీకరించే వ్యాసాలు రావడం, లడ్డూ ప్రసాదం ధరలు పెండడం, శ్రీవారి ప్రసాదాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపిణీ చేయడం, తిరుమలలో రోడ్డు డివైడర్లకు వైకాపా రంగులు వేయడం, తితిదే కళ్యాణ మండపాల లీజు వ్యవహారం, తిరుమలలో అన్యమతస్థుల నియామకాలు జరగడం లాంటి ఎన్నో అవకతవలకల గురించి సర్వత్రా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేవే. ఇలాంటి వ్యవహారాలను పరికించి చూసినప్పుడు ఒకే విషయం ప్రశ్నార్ధకమవుతోంది.... అదే ప్రభుత్వం చిత్తశుద్ధి!
PUBLISHED ON 18.09.2021 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి