"అమ్మా... అలా భూలోకానికి వెళ్లొస్తాను..." అన్నాడు
వినాయకుడు కిరీటం సవరించుకుంటూ. ఆ పాటికే సిద్ధమైన మూషికుడు తోక తుడుచుకుంటూ "నేను కూడా
సిద్దం స్వామీ" అంటూ ముందుకు వచ్చాడు. వినాయకుడు వినయంగా పరమేశ్వరుడి
దగ్గరకు వెళ్లి "నాన్నా! ఆశీర్వదించండి..." అన్నాడు.
పార్వతి వినాయకుడి తల నిమిరి, "శుభంగా వెళ్లిరా
నాన్నా... ఈ పది రోజులూ భక్తుల మొరలు శ్రద్ధగా విని వరాలియ్యి. ఉండ్రాళ్లూ, కజ్జికాయలు తిని వారిని దీవించి
రా..." అంది మురిపెంగా.
"నారాయణ... నారాయణ" అంటూ అప్పుడే
కైలాసంలో ప్రత్యక్షమైన నారదుడు,
పార్వతీ పరమేశ్వరులకు ప్రణామం చేసి వినాయకుడి కేసి తిరిగి,
"కానీ...జాగ్రత్త గణనాయకా! భూలోకంలో పరిస్థితులు మునపటిలా లేవు
మరి..." అన్నాడు.
"అదేమిటి నారదా, అలాగంటావు. సకల విఘ్న నివారకుడు,
అఖిల లోక మాన్యుడు అయిన వినాయకుడికా నువ్వు జాగ్రత్తలు చెబుతున్నది?
అంది పార్వతి.
పరమేశ్వరుడు కళ్లు విప్పి చిరునవ్వుతో చూస్తున్నాడు.
"మరోలా భావించకు తల్లీ! వినాయకుడి శక్తి
యుక్తులు నాకు తెలియనివి కావు. కానీ అక్కడ భూలోకంలో కొందరు నాయకులు మరింతగా రెచ్చిపోతున్నారు.
నేనంటున్నది వారి గురించి..." అన్నాడు.
"ఇంతకీ నిన్ను
అంతగా కలవర పెడుతున్న సంగతులేంటి నారదా?" అన్నాడు వినాయకుడు.
"ఏముంది వినాయకా! ఈసారి ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రంలో నీ ఉత్సవాలనే రద్దు చేశాడు అక్కడి నాయకుడు. మరే రాష్ట్రంలోనూ లేని
విధంగా మితిమీరిన ఆంక్షలు విధించాడు. నేనకక్కడి నుంచే వస్తున్నాను. ఈసారి నీ వినాయక
చవితి పండగను ఉత్సాహంగా చేసుకోలేక పోతున్నందుకు అక్కడి ప్రజలంతా ఉసూరుమంటున్నారు..."
"ఇంతకీ ఎవరా నాయకుడు నారదా?" అన్నాడు వినాయకుడు.
"ఉన్నాడులే వినాయకా! ఊరంతా ఒక దారి, ఉలిపిరి కట్టదో దారి అన్నట్టుంటుంది
అతడి వ్యవహారం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా చవితి ఉత్సవాల మీద కనీవినీ
ఎరుగనన్ని నిబంధనలు విధించాడు. కాబట్టి నీకక్కడ పెద్దగా పండగ సంబరం,
ఉత్సాహం, వేడుకలు ఇలాంటివేమీ కనిపించకపోతచ్చు.
భక్త జన బాంధవుడవైన నువ్వు ఒకవేళ అక్కడికి వెళ్లినా, కొన్ని
జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది..."
"ఏమిటా జాగ్రత్తలు నారదా?"
"ఏముంది స్వామీ! దేశంలో ఎక్కడైనా నీ మూషికం
మహా వేగంతో పరిగెట్టవచ్చేమో కానీ,
ఆంధ్రరాష్ట్రంలో మాత్రం అలా సాధ్యం కాకపోవచ్చ..."
"ఎందుకని?"
"ఎందుకేమిటి స్వామీ? అక్కడ రోడ్లు అధ్వాన్న స్థితిలో
ఉన్నాయి. అడుక్కో గొయ్యి, గజానికో గుంత అన్నట్టుంది అక్కడి
పరిస్థితి... అక్కడ అన్ని ప్రదేశాల్లో లాగా మూషికం పరుగులు పెడితే నడుం పట్టేయడం
తథ్యం... అక్కడి ప్రజలు అక్కడ అనేక ప్రమాదాలకు గురవుతూ, బాధలకు ఓర్చుకుంటూ ప్రయణాలు సాగిస్తున్నారు వినాయకా"
"చాలా చిత్రంగా ఉంది నారదా, నువ్వు చెబుతున్నది. అక్కడి
నాయకుడు ప్రజల బాధలు పట్టించుకోడా?
ముందు చూపుతో వ్యవహరించడా?"
"ఆ మాత్రం ఇంగితం ఉంటే ఇంకే స్వామీ? అధినేతలో అది కానరాకే జనం అగచాట్లు
పడుతున్నారు..."
"ఖజానాలోని ధనాన్ని వెచ్చించి రహదారుల
మరమ్మతులు చేయించడానికి ఆ నేతకు ఏమిటి అభ్యంతరం?"
"అభ్యంతరం కాదు స్వామీ. గత్యంతరం లేక.
ఆ అధినేత పాలనలో ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి కూడా సరైన నిధులు లేవు. ప్రతి
నెల కటకట లాడాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా తయారైంది..."
"అట్లయిన... ఏ కుబేరునిలాంటి వాడినో చూసుకుని
కొంత పైకము రుణము తెచ్చి ముందు ప్రజా సమస్యల నివారణకు ప్రాధాన్యత ఇవ్వవచ్చును
కదా?"
నారదుడు పకపకా నవ్వి, "అయ్యో స్వామీ, ఏమని చెప్పాలి అక్కడి పరిస్థితి? అవడానికి ప్రభుత్వమే అయిననూ అక్కడ
ఎక్కడా అప్పు పుట్టని దుస్థితిలో ఆ రాష్ట్రం పడిపోయింది స్వామీ! ఎందుకంటే ఆ నేత
తన స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్థికంగా ఆచరణకు కష్టసాధ్యమైన ఏవేవో పథకాలను
రచించి, వాటిని అమలు పరిచి రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి
నడిపిస్తానంటూ ప్రజల్ని ఊరించి, బులిపించి, నమ్మించి అధికారంలోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆ పథకాలను అమలు చేయడానికి
అప్పనంగా ప్రజాధనాన్నే వెనకాముందూ చూడకుండా వెచ్చిస్తున్నాడు. ఇప్పటికే అందిన
సంస్థల నుంచి అప్పుల మీద అప్పులు చేసినాడు. ఆ అప్పులకు వడ్డీలే వేల కోట్లు చెల్లించాల్సిన
దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టినాడు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా
దారి మళ్లించి వేరే పద్దులకు వాడుతున్నాడు. ఆఖరికి ప్రభుత్వం తరపున పనులు చేసే
కాంట్రాక్టర్లకు సైతం కోట్ల కొద్దీ ధనమును బకాయి పడినాడు. ఇకపై ఏ పనులు చేయడానికి సైతం కాంట్రాక్టర్లు
ముందుకు రాని ఘోరమైన పరిస్థితి ఎదురవుతున్నదక్కడ. దాంతో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం
రహదారులు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ ఆ పనులు ఎప్పటికి జరిగేనో ఆ పరమేశ్వరునికే
ఎరుక. కాబట్టి అక్కడ నీ మూషికాన్ని జాగ్రత్తగా గోతులు, గుంతలు
చూసుకుని నడవమని చెప్పక తప్పదు..." అంటూ వివరించాడు.
"ఎంతటి ఘోరమెంతటి నిర్లక్ష్యమెంతటి
ఉదాసీనమెంతటి అహంకారమెంతటి తెంపరితనమా అధినేతకు? ఆతడికి తప్పక బుద్ధి చెప్పవలసిందే" అన్నాడు
వినాయకుడు కోపంగా.
"అమ్మమ్మ... అంతటి ప్రయత్నాలేవీ చేయకు
స్వామీ! నువ్వు వినాయకుడివైతే, ఆయన వింత నాయకుడు. నీవు ఆ రాష్ట్రంలో ప్రజలు ఇళ్లలో నివేదించిన కుడుములు
తిని, వాళ్లను ఆశీర్వదించి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేయడమే
మంచిది. ఏల అన ఆ అధినేత అత్యంత అసహనశీలి. తన పాలనలో కనిపించే ఏ చిన్న సమస్య
గురించి ఎవడు ప్రస్తావించినా, ప్రశ్నించినా ఆఖరికి ప్రాధేయపడినా
ఆతండు సహించలేడు. అద్దానిని ధిక్కారుముగానెంచి తన గులాములుగా మారిన రక్షక భటులను
ఉసిగొల్పి అర్థంలేని సెక్షన్లతో రకరకాల కేసులు పెట్టించగలడు. తన పార్టీ అనుచరులతో
దాడులు చేయించగలడు. మొన్నటికి మొన్న అదే జరిగింది స్వామీ. రహదారులు బాగా లేవని
వినతి పత్రాలు ఇవ్వాలని తలపెట్టిన ప్రజలను పోలీసుల సమక్షంలోనే తన గూండాలతో
చితగ్గొంటించినాడు. అదీ అక్కడి ప్రజల దుస్థితి..."
"హతవిధీ... అంతటి దుర్భర స్థితిలో
ఉంటిరా ఆ రాష్ట్ర ప్రజలు అట్లయిన,
దీనికి నివారణోపాయమేంటో నా తండ్రి గరళకంఠునినే అదగవలె... " అంటూ వినాయకుడు
పరమేశ్వరుడి కేసి తిరిగి వినమ్రంగా నమస్కరించాడు.
పార్వతి కూడా ఆసక్తిగా శివుడికేసి దృష్టి సారించింది.
పరమేశ్వరుడు చిద్విలాసంగా నవ్వి, "దేనికైనా సమయం రావాలి వినాయకా. లోగడ
ప్రజా కంటకులైన ఎందరో నాయకులు ఇలాగే అనాలోచిత పనులతో, అహంకారంతో, అసహనంతో, అవకతవక పనులతో విర్రవీగి తుదకు మాయమైన
కథలు నీకు తెలిసినవే కద..." అన్నాడు.
"ఓహో... అట్లయిన ఆ వింత నాయకుని ఆగడాలు
మితిమీరిన పిమ్మట, స్వయంగా మీరో, లేక ఆ వైకుంఠవాసుడో మరో అవతారం ఎత్తుదురా
తండ్రీ?" అన్నాడు వినాయకుడు.
పరమశివుడు చిద్విలాసం చేశాడు. "ఇది కలియుగం వినాయకా! ఇప్పుడు దేవుళ్లు
కొత్తగా అవతారాలు ఎత్తాల్సిన అవసరం లేదు. అంతటి శక్తి యుక్తులు కలిగిన దేవుళ్లు
అక్కడే ఆ ప్రాంతంలోనే ఉన్నారు నాయనా!" అన్నాడు.
ఆ మాటలకు పార్వతి, వినాయకుడు, నారదుడు సహా కైలాసవాసులందరూ ఆశ్చర్యపోయారు.
"ఎవరు స్వామీ, ఆ దేవుళ్లు?" అని అడిగారు
ముక్త కంఠంతో.
"ఓటరు దేవుళ్లు! అంటే ఆ ప్రాంతలోని ప్రజలే!
వాళ్లలో చైతన్యం పెరిగి, ఒక్కక్కరూ ఒకొక్క జనసైనికుడై కదలిన
నాడు ఆ వింత నాయకుడు ఎలా అధికార పీఠంపైకి ఎక్క గలిగాడో అలానే ఆ పీఠాన్ని అవరోహించగలడు.
అంతవరకు అందరూ నిరీక్షించక తప్పదు. కాబట్టి నీవు ఈ రాజకీయ విషయాలేవీ పట్టించుకోకుండా
భూలోకానికి వెళ్లి, భక్తులు నివేదించిన కుడుములు ఆరగించి వరాలు
ప్రసాదించి రమ్ము. అన్నట్టు... నారదుడు చెప్పిన జాగ్రత్తలు మాత్రం తప్పక తీసుకో" అంటూ పరమశివుడు
ధ్యానమగ్నుడయ్యాడు.
"అవశ్యం తండ్రీ!" అంటూ వినాయకుడు
మూషిక వాహనం ఎక్కి భూలోకానికి బయల్దేరాడు.
-సృజన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి