“ఏంటో గురూగారూ! పొద్దున్నే పేపర్ చదవగానే మనసంతా వికలమైపోయిందండి... ఇక నాకు రాజకీయ భవిష్యత్తు లేదేమోనని దిగులేస్తోందండి... మీరేదైనా కాస్త ధైర్యం చెబుతారేమోనని ఇలా వచ్చానండి...” అంటూ నిరాశగా చతికిలబడ్డాడు శిష్యుడు వస్తూనే.
“ఏంట్రోయ్ అంత నిర్వేదం? నీకొచ్చిన
కష్టం ఏంటి?” అన్నారు గురువుగారు పడక్కుర్చీలో కూర్చుంటూ.
“ఏం చెప్పమంటారండీ... నేనేదో మీ దగ్గర కాసిని నీచ
రాజకీయ పాఠాలు నేర్చుకుని, ఓ బరితెగించిన నేతగా ఎదిగి,
ఓ నాలుగు తరాల పాటు కూర్చుని తిన్నా తరగనంత సంపద పోగేసుకుందామని ఓ... తెగ ఆశ పడిపోయానండి ఇన్నాళ్లూనూ. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదండి... ప్చ్!”
“ఇంతకీ ఏం వార్తలు చదివావురా... అదేడు ముందు...”
“ఏముందండీ... ఆ సుప్రీం కోర్టు కొత్త న్యాయమూర్తి ఏమన్నారో
తెలుసాండీ? రాజకీయాల్లో నేర చరితులపై కేసులు దాఖలు చేయడానికే
ఏళ్లూ పూళ్లూ పడుతోందని గుర్తించేశారండి. పైగా అలాంటి పరిస్థితులు మార్చడానికి చర్యలు
మొదలెట్టారండి. న్యాయ విచారణ సంస్థల్లో సిబ్బంది ఖాళీలు వెంటనే పూరించాలన్నారండి.
న్యాయమూర్తులను కూడా సరిపడా నియమించాలన్నారండి. రాజకీయ నేరాలపై విచారణకు ప్రత్యేక
కోర్టులు కూడా పెట్టేస్తారటండి... ఆయ్!”
“పోనీలేరా... ఆయన బాధేంటో ఆయనది. ఆయనకు పనులు
ఆయన్ని చేసుకోనీ. మధ్యలో నీకెందుకు ఉలుకు?”
“అదేంటండీ అలాగంటారు? నేనింకా
మీ దగ్గర సరిగ్గా రాజకీయ పాఠాలే నేర్చుకోలేదు. ఎప్పుడు ఆరితేరుతాను? ఎప్పుడు నీచ నేతగా ఎదుగుతాను? పోనీ ఎలాగోలా ఎదిగేసరికి
ఇలా ప్రత్యేక కోర్టులు గట్రా వచ్చేస్తే నా గతేంటండీ? నేనింక
ఏం వెనకేసుకోగలనండీ? ఏం కుంభకోణాలు చేయగలనండీ?
ఇలా గతిలేక ప్రజాసేవ చేయడానికా చెప్పండి, నేను
రాజకీయాలు నేర్చుకుంటుంట? ఏంటోనండి బాబూ... దేశమేదో బాగుపడిపోతున్నట్టు
పీడకలలు వచ్చేస్తున్నాయండి...”
శిష్యుడి మాటలకి గురువుగారు పగలబడి నవ్వారు.
“వహార్నీ... అదట్రా నీ భయం? ఒరే వాళ్లు ఇప్పుడే ఇల్లు అలకడం ప్రారంభించార్రా... అప్పుడే వాళ్ల పండగ
రాదులే. నువ్వు నిశ్చింతగా ఉండు...”
“ఏంటో సార్ మీ నిబ్బరం? నాకు మాత్రం
నీచ నేతలందరూ ఊచలు లెక్కబెడుతున్నట్టు భ్రమ కలుగుతోందండి...”
“ఒరే... నీ భ్రమే కనుక నిజమైతే, నాకు తెలిసి ప్రత్యేక కోర్టులు కాదురా, ప్రత్యేక జైళ్లు
కట్టించాలి... అంతలా రాజకీయాలు, నేరాలు జట్టాపట్టాలేసుకుని
చేతులు పట్టుకుని ఒప్పులకుప్ప తిరిగేస్తున్నాయి... ఏ పార్టీని తీసుకో, అందులో
నేరాలతో సంబంధం ఉన్న నేతలు పుష్కలంగా కనిపిస్తారు. ఇంట్లోకి బురద కాళ్లతో వస్తే
కడిగేస్తే పోతుంది. కానీ బురదలోనే ఇల్లు కట్టుకున్నామనుకో. ఇక కడిగేదేముంటుంది? అయినా నువ్వు
హడలిపోయి ఏడుస్తున్నావు కాబట్టి, నీకు ధైర్యం చెప్పడానికి
కొన్ని పచ్చి నిజాలు చెబుతాను. చెవులు రిక్కించి విను. దేశమ్మొత్తం మీద 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మేల్యేలపై ఆర్థిక నేరారోపణలు
ఉన్నాయి. పైగా ఈ లెక్కలు ఏడెనిమిదేళ్ల క్రితంవి.
ఈ పాటికి వాళ్లకి మరి కొందరు కూడా జతపడి ఉండొచ్చు. అంతే కాదు వాళ్లందరినీ
మించి పోయి ఆర్థిక నేరాల్ని నిర్భయంగా,
నిస్సిగ్గుగా చేస్తూ కూడా నిక్షేపంగా అధికార పీఠంపై బాసింపట్టు వేసుకుని
కథ నడిపించేస్తున్న నేతలు కూడా ఉంటారు. అందుకు నీ పరగణా అధినేతే ప్రత్యక్ష
సాక్ష్యం. కాదనగలవా? అంతెందుకురా సీబీఐ కోర్టుల్లో ఎంపీ,
ఎమ్మెల్యేలపై విచారణ జరగాల్సి ఉన్న కేసులే 121. వాటిలో 58 కేసులైతే జీవిత ఖైదు విధించాల్సినంత పెద్ద
పెద్ద నేరాలే మరి...”
“అయ్‌బాబోయ్... అవునాండీ? అయితే
రేపో మాపో ఇవన్నీ తేలిపోయి, రుజువైపోయి, నిందితులు కాస్తా నేరస్థులగా మారిపోతే వాళ్లని ఎంచుకున్న జనం ఏమనుకుంటారండీ?
ఇలాంటి నీచుల్నా మనం ఎన్నుకున్నామని తెల్లబోరండీ పాపం...”
“జనానిదేముందిరా పాపం... ఇద్దరి వెధవలో ఒకడిని
ఎంచుకోక తప్పదనుకున్నప్పుడు ఎవరో ఒకరికి ఓటేయక తప్పదు కదా? అలాంటి పరిస్థితిలో పడిపోయారా వాళ్లు... అసలు జైలు నుంచి బెయిలు మీద వస్తూనే
ఊరేగింపుగా బయల్దేరి, దండలతో, డప్పులతో
హంగామా చేస్తూ నామినేషన్ వేసి, ఆ తర్వాత గెలిచి మరీ మీసం మెలేస్తున్న
నాయకులు ఎంత మంది లేరురా మన కళ్ల ముందు?
నీకింకో సంగతి చెబుతాను వినుకో.
తాజా నాయకులో, మాజీ నేతలో ఎవరి మీద అయితేనేం,
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులెన్నో తెలుసా? ఏకంగా 4800. వీటిలో కొన్ని కేసులైతే ఏళ్లకేళ్ల తరబడి
సాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ తేలేదెప్పుడు?
వాయిదాల వాయుగుండాల నుంచి తేరుకుని రుజువయ్యేదెప్పుడు?
ఆ నేరనేతలకు శిక్ష పడేదెప్పుడు, నువ్వే చెప్పు?”
“అవునండోయ్... ఈలోగా ఆ నాయకులందరూ ఎంచక్కా రెండు
మూడు ఎన్నికలను చూసి గెలుపు సంబరాలు చేసుకోవచ్చు కూడానూ. అయినా గురూగారూ,
నాదో సందేహమండి. మరి తెలిసి తెలిసి ఇలాంటి నీచ, నికృష్ట, నయవంచక అభ్యర్థులకు టిక్కెట్లు ఎలా ఇస్తున్నాయండీ
రాజకీయ పార్టీలు?”
“ఎందుకివ్వవురా? ఈ రోజుల్లో గెలవాలంటే
డబ్బు వెదజల్లాలి, ఖర్చు చేయగలిగి ఉండాలి, కింద నుంచి పైదాకా ప్రలోభ పెట్టగలిగి ఉండాలి. మరి బరిలోకి దిగిన నేత వీధిలోకి వస్తే హారతివ్వడానికి ఓ రేటు,
బొట్టు పెట్టడానికి ఓ రేటు, దిష్టి తీయడానికో
రేటు, ఆయనగారు మీటింగ్ పెడితే లారీల్లో తరలి రావడానికో రేటు,
ఆ సభలో చప్పట్లు కొట్టడానికో రేటు, నినాదాలు
చేయడానికో రేటు, జేజేలు పలకడానికో రేటు... ఇలా అడుగడుగునా
లక్షలు, కోట్లు విరిజిమ్మాల్సి ఉంటే... నీతులు చెబుతూ,
నిరాడంబరంగా, వినయంగా, నమస్కారం పెట్టి ఓటడిగే స్వచ్ఛమైన అమాయక అభ్యర్థికి ఏ పార్టీ టికెట్ ఇస్తుందిరా?”
“మరైతే గురూగారూ, న్యాయ వ్యవస్థ
కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఏమీ చేయలేవాండీ? ఓ పద్ధతి, ఓ నిబంధన, ఓ రూలు
ఇలాంటివేమీ లేవంటారా?”
“ఎందుకుండవురా అన్నీ ఉంటాయి. కానీ పట్టించుకునే నాథుడెవడు
చెప్పు? అభ్యర్థుల్ని ఎంపిక చేసిన రెండు రోజుల్లోగా వారి నేర
చరిత్రను బయటపెట్టాలని ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలే ఉన్నాయి. కానీ మొన్నటికి మొన్న జరిగిన బీహార్ ఎన్నికలనే
చూసుకో. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది పార్టీలు ప్రకటించిన
అభ్యర్థుల్లో 469 మంది నేర చరితులే. ఇక చెప్పేదేముంది?
కాబట్టి నువ్వింక నిశ్చింతగా
ఉండు. నిబ్బరంగా నీచ రాజకీయ పాఠాలు నేర్చుకో. నీ దశ బాగుండి, జనం ఖర్మ కాలితే నేతగా ఎదుగుతావు...”
“అమ్మయ్య... ఇప్పటికి ధైర్యం వచ్చిందండి. కానీ గురూగారూ,
దేశంలో ఈ పరిస్థితి ఇక బాగుపడదంటారా?”
“ఎందుకంటానురా? జనం చైతన్య వంతులై,
జన సైనికులై, నికృష్ట అభ్యర్థులను నిర్ద్వందంగా
తిరస్కరించే సత్సంకల్పం చేసుకుంటే ఇక నీలాంటి వాళ్లకి రూకలు చెల్లినట్టే. అంతవరకు నువ్వు ఆడింది ఆట, పాడింది పాట...”
“చివరాకరిగా మరో సందేహం గురూగారూ! ఒక వేళ జనం సైనికులై
స్వచ్ఛ రాజకీయ సమరానికి పూనుకున్నారనుకోండి, మరి మీ గురుకులం
ఏమవుతుందండీ? ఇక మీరెవరికి పాఠాలు చెబుతారండీ పాపం?”
“ఓరెర్రి నా శిష్యా! నేను చెప్పే నీచ రాజకీయ పాఠాలు
నీ లాంటి వాళ్లకు ఎలా ఉండాలో చెబితే, నీతి పరులకు ఎలా ఉండకూడదో
చెబుతాయి. కాబట్టి నా గురుకులానికేం ఢోకా లేదు. నువ్విక పోయిరా!”
-సృజన
PUBLISHED ON 23.9.2021 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి