న్యాయస్థానం. వాతావరణం గంభీరంగా ఉంది. ఆ రోజు ఇద్దరు నేరస్థుల గురించి తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఇద్దరూ వేర్వేరు చోట్ల ఒకే నేరం చేశారు. ఆ నేరాలు రుజువయ్యాయి. ఇక శిక్ష పడడమే తరువాయి. వాళ్ల నేరాలకి సంబంధించిన రుజువులున్న ఫైల్సు, న్యాయమూర్తి బల్ల మీద ఉన్నాయి. న్యాయమూర్తి వచ్చారు. అంతా లేచి నిలబడ్డారు. న్యాయమూర్తి కూర్చున్నాక మొదటి నేరస్థుడిని బోనులో నిలబెట్టారు. న్యాయమూర్తి తన ముందున్న ఫైలు పరిశీలించారు. ఓ నిర్ణయానికి వచ్చారు.
గంభీరంగా బోనులో ఉన్న నేరస్థుడి కేసి చూసి, "నువ్వు చెప్పదలుచుకున్నదేమైనా ఉందా?" అని అడిగారు.
"సార్... నమస్కారమండి. మిమ్మల్ని ఇదే మొదటి సారి చూడ్డమండి. ఎంత బాగున్నారో? మీ మొహం చాలా అందంగా ఉందండి. అబ్బ... ఆ కళ్లు ఎంత పెద్దగా చక్కగా ఉన్నయో! మీ నవ్వు మరింత బాగుందండి. అసలు మీరు వేసుకున్న దుస్తులు అద్భుతంగా ఉన్నాయండి. అన్నీ తెలిసిన మారాజండి తమరు. కాబట్టి నన్ను వదిలేయండి..." అన్నాడు నేరస్థుడు.
న్యాయస్థానంలో అందరూ నవ్వారు. న్యాయమూర్తి నవ్వలేదు. ఓ సారి తలపంకించి, చట్టప్రకారం ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. రక్షక భటులు తీసుకెళ్లడానికి వస్తే నేరస్థుడు గింజుకున్నాడు.
"ఇది అన్యాయం. నేనెంతగానో న్యాయమూర్తని పొగిడాను. అయినా శిక్ష వేసేశారు. ఇదెక్కడి న్యాయం?" అని అరుస్తుండగానే రక్షక భటులు అతడిని తీసుకెళ్లిపోయారు, శిక్ష అమలు పరచడానికి.
ఆ తర్వాత రెండో నిందితుడిని బోను ఎక్కించారు. న్యాయమూర్తి అతడి ఫైలుని కూడా పరిశీలించారు. నేరానికి సంబంధించిన రుజువులు చూశారు. ఓ నిర్ణయానికి వచ్చారు.
గంభీరంగా బోనులో ఉన్న నేరస్థుడి కేసి చూసి, "నువ్వు చెప్పదలుచుకున్నదేమైనా ఉందా?" అని అడిగారు.
"దండాలండి బాబయ్యా... నేను తప్పు చేశానండయ్య. ఒప్పుకుంటున్నానండయ్య. ఇంకెప్పుడూ ఇలా చేయనండయ్య. మంచిగా బతుకుతానండయ్య. కనికరించండయ్య. నన్ను వదిలేయండయ్య..." అంటూ కన్నీళ్లతో వేడుకున్నాడు.
న్యాయమూర్తి తలపంకించారు. శిక్షాస్మృతి ప్రకారం ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించాల్సి ఉంది. కానీ నేరస్థుడు పశ్చాత్తాప పడుతున్నాడు. పరివర్తన చెందాడు. ఆ విషయాన్ని న్యాయమూర్తి పరిగణించారు. తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించారు. తర్వాత తీర్పు చెప్పారు. అతడికి వారం రోజులు సాధారణ జైలు శిక్ష విధించారు.
*******
ఈ రెండు తీర్పుల కథలో న్యాయమూర్తి లాంటి వాడే భగవంతుడు కూడా. మనం ఎన్నో తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా... ఊరికే భగవంతుడిని స్తోత్రాలతో పూజిస్తే ఫలితం ఉండదు. మనలో పరివర్తన రావాలి. పశ్చాత్తాపం కలగాలి. ఆ మార్పు వచ్చాక భగవంతుడిని వేడుకుంటే ఆయన విచక్షణాధికారం వల్ల శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే నేనెన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా భగవంతుడు కరుణించలేదని ఎంత గింజుకున్నా మొదటి నేరస్థుడిలాగా శిక్ష అనుభవించక తప్పదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి