సామాన్యుడు పేపరు తెరచి చూసేసరికి దాన్నిండా
బడ్జెట్ వార్తలే. అవన్నీ చదివేసి టీవీ పెట్టేసరికి అందులో అన్నీ బడ్జెట్ మీద
విశ్లేషణలే. బుర్రంతా వేడెక్కి పోయింది.
కాసేపు అలా తిరిగొద్దామని రోడ్డున పడ్డాడు. గోతులు తప్పుకుంటూ రాళ్లు తన్నుకోకుండా
జాగ్రత్తగా నడుస్తుంటే ఓ చోట జనం రద్దీగా కనిపించారు. వెళ్లి చూసేసరికి "పీసీ సర్కార్
ఐంద్రజాలికుడు. గొప్ప మ్యాజిక్ షో" అని రాసి ఉంది. చూడాలని సరదా పుట్టి
లోపలికి దూరిపోయాడు. చీకటిగా ఉన్న హాలులో ఓ సీటు చూసుకుని చతికిల పడేసరికి వేదిక
మీద లైట్లు వెలిగాయి. వేదిక మీద ఒకాయన మెత్తగా
నవ్వుతూ చేతులూపుతున్నాడు. ఆయన చేతిలో మంత్రదండం! షో మొదలైంది.
నేపథ్య సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేస్తూ ఆయన
తళతళలాడే ఓ అట్టపెట్టెను అందరికీ బోర్లించి చూపించాడు. ఏమీ లేవు. తర్వాత మూత వేసి దాని చుట్టూ మంత్రదండం
తిప్పి 'అబ్రకదబ్ర' అన్నాడు. ఆపై లోపల చెయ్యి పెట్టి బయటకి
తీశాడు. అందులోంచి అంకెల ఆకారంలో ఉన్న అట్టముక్కలు ఒకదానికొకటి గొలుసులాగా అతుక్కుని
బయటకి రాసాగాయి. జనమంతా చప్పట్లు కొట్టారు.
"ఖాళీ పెట్టె లోంచి ఎన్ని వస్తున్నాయో!
అద్భుతం కదా గురూ?" అంటూ పక్కనున్న
వాడు సామాన్యుడి కేసి చూశాడు.
సామాన్యుడు నవ్వేసి, "నేనింతకన్నా పెద్ద మ్యాజిక్ షో చూశాన్లే.
దాని ముందు ఇదెంత?" అన్నాడు.
"అదెవరి మ్యాజిక్ షో గురూ?"
"ఏపీ సర్కార్... మహేంద్రజాలికుడు!"
"ఆయన కూడా ఇలాగే సృష్టించాడా?"
"ఓ... ఈ అంకెలో లెక్కా? ఆయనైతే ఏకంగా 2 లక్షల 56 వేల కోట్లకు
పైగా అంకెలు చూపించాడు తెలుసా?"
"అబ్బో... మీ వాడు గొప్పవాడే..."
ఈలోగా వేదికపై మెజీషియన్ ఓ సన్నమూతి సీసా అందరికీ
చూపించాడు. ఆ తర్వాత పెద్ద బొమ్మ చూపించాడు.
"ఇంత పెద్ద బొమ్మ ఈ సీసాలో పడుతుందా?" అని అడిగాడు.
"అసాధ్యం... పట్టదు" అన్నారు
ప్రేక్షకులు.
"అయితే ఇప్పుడు చూడండి" అంటూ మెజీషియన్
వాటిపై ఓ గుడ్డ కప్పి కర్ర తిప్పి తీసేశాడు.
అరె... అద్భుతం! అంత పెద్ద బొమ్మా ఆ సీసాలోకి ఎలా
దూరిందో కానీ లోపల ఒదిగిపోయి కనిపించింది. చప్పట్లు మార్మోగిపోయాయి. సామాన్యడు
చప్పట్లు కొట్టలేదు.
పక్కవాడు అది చూసి, "ఏంటి గురూ! మీ వాడు ఇంత కంటే పెద్ద మ్యాజిక్
చేసేశాడా?" అన్నాడు.
"కాదా మరి? ఆ సన్నమూతి సీసా మద్యం సీసా.
అందులోకి మావాడు ఏకంగా రాష్ట్రాన్నే దూర్చేశాడు. అంతే కాదు ఆ సీసాలోంచి ఏకంగా వేల కోట్ల
రూపాయలు రాలుస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఆ సీసా ద్వారా ఏకంగా 16,500 కోట్ల రూపాయలు
రాబడతానని ప్రకటించాడు కూడా. ఆ మ్యాజిక్ ముందు ఇదెంత?" అన్నాడు సామాన్యుడు.
ఇంతలో వేదిక మీద మెజీషియన్ "మీకిప్పుడు
చుక్కల లోకం చూపిస్తా" అన్నాడు. ఒక్కసారిగా హాలంతా చీకటిమయమైపోయింది.
ఇంతలో పైనంతా మిణుకుమిణుకుమనే నక్షత్రాలు, వాటి మధ్యన దూసుకుపోతున్న వెలుగులు. సభికులు సంబరపడిపోయారు.
"ఇది భలేగుంది గురూ!" అంటూ పక్కోడు
సామాన్యుడి కేసి చూశాడు.
సామాన్యడు నవ్వి, "మావాడైతే పట్టపగలే చుక్కలు చూపిస్తాడు.
అన్నింటి మీద పన్నులు పెంచేస్తే జనానికి కళ్లల్లో చుక్కలే కనిపిస్తున్నాయి. పెట్రోలు, సిమెంటు, మద్యం, ఇసుక, నిత్యావసరాల ధరవరలు
అన్నీ కలిపి మా చుట్టూ నక్షత్రాలనే చూపిస్తున్నాయి తెలుసా?" అన్నాడు.
ఈసారి వేదికపై మెజీషియన్ చేతులు విచిత్రంగా ఊపాడు.
వెంటనే పై నుంచి తళతళలాడే ఓ పెద్ద చీర పైనుంచి కిందికి జారింది.
"ఇదెవరికి కావాలి?" అన్నాడు.
"నాకు.." అన్నారు చాలా మంది.
"అయితే దోసిలి పట్టండి" అన్నాడు
మెజీషియన్.
అందరూ ఆశపడి దోసిలి పట్టారు.
మెజీషియన్ 'అబ్రకదబ్ర' అంటూ మంత్రదండాన్ని
తిప్పి ఆ చీరను ప్రేక్షకుల మీదకు విసిరాడు.
దాంతో అందరి చేతుల్లోకి వచ్చిపడ్డాయి... చీరలు
కాదు, జేబురుమాళ్లు.
సభంతా నవ్వులే నవ్వులు. సామాన్యుడు నవ్వలేదు. పక్కోడు ఆశ్చర్యంగా చూశాడు.
"మా ఏపీ సర్కార్ బడ్జెట్‌లో చేసిందిదే. కేటాయింపులన్నీ ఆ కోకలాగే
నిగనిగలాడుతూ కనిపిస్తాయి. చివరకి సవరింపులు, కోతలు పోను మిగిలేది రుమాళ్లే. పథకాలకు చూపించే
కోట్ల రూపాయల అంచనా నిధులు, వాస్తవానికి వచ్చేసరికి కరిగిపోతాయి.
దాని ముందు ఇదెంత?" అనుకున్నాడు సామాన్యుడు.
వేదిక మీద మరో ఐటెమ్. మెజీషియన్ ఓ ఇత్తడి బిందెను
ఎత్తి చూపించాడు. లోపలంతా ఖాళీ. ఈలోగా అసిస్టెంటు వచ్చి దాన్నిండా నీళ్లు పోశాడు.
'వాటర్
ఆఫ్ వరల్డ్' అన్నాడు మెజీషియన్. ఆపై కర్ర తిప్పి బిందెను అమాంతం బోర్లించాడు.
ఆశ్చర్యం!
ఒక్క చుక్క కూడా కిందకి పడలేదు.
సభికులు లేచిపోయి మరీ అరవసాగారు. సామాన్యుడు, నీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో
చూపించిన అంచనాలు గుర్తొచ్చి లేవలేదు. 'అంకెలు ఘనంగా కనిపించినా, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో
అంచనాలు సవరిస్తారు. ఆపై కోతలు తప్పవు. ఇక నిర్వహణ మినహాయించే ప్రాజెక్టులకు
దక్కేదెంత? ఈ బిందెలోంచి
నీళ్లు రానట్టే, ఆ అంకెల నుంచి నిధులు రావు' అనుకున్నాడు.
"ఏం గురూ! ఈ మ్యాజిక్ కూడా నచ్చలేదా" అన్నాడు
పక్కోడు నవ్వుతూ.
"నచ్చింది. అచ్చం మావాడిలాగే చేశాడులే" అన్నాడు
సామాన్యుడు నవ్వకుండానే.
ఇద్దరూ కలిసి వేదికమీదకి చూశారు. అక్కడి మెజీషియన్
వేదికకి ఈ పక్క స్టాండుపై ఓ ఖాళీ పెట్టె,
ఆ పక్క మరో స్టాండుపై మరో ఖాళీ పెట్టె ఉంచాడు. "ఇదిగో చూడండి.
ఈ కుందేలును ఈ పెట్టెలో పెడుతున్నాను. అది ఆ పెట్టెలోకి వచ్చేస్తుంది. ఇది బ్లాక్
మేజిక్" అంటూ అని కర్ర ఊపాడు. ఆ తర్వాత అవతలి పెట్టె
దగ్గరకి వెళ్లి దాంట్లోంచి కుందేలును బయటకి తీసేసరికి సభికులంతా ఈలలు వేశారు.
"ఇందులో పెడితే అందులోకి ఎలా వచ్చింది
గురూ?" అంటూ పక్కోడు
ఆశ్చర్యంగా అడిగాడు.
"అదంతేలే. అదే మరి మ్యాజిక్కంటే. మా ఏపీ
సర్కారైతే ఏవేవో పథకాలు ప్రకటించి వాటిలో నిధులు పెడతాడు. అయితే ఆ నిధులన్నీ దారిమళ్లి అయినవారి జేబుల్లోకి వెళ్లిపోతాయి.
కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా మావాడు ఒక చోట పెడితే మరెక్కడో తేల్తాయి. మేం రోజూ చూసేదేలే..." అన్నాడు
సామాన్యుడు తేలిగ్గా.
వేదకపై మెజీషియన్ కర్ర గిర్రున తిప్పేసరికి
సభికుల మొహాలకు రంగురంగుల కళ్లజోళ్లు వచ్చేశాయి. అందరూ కేరింతలు కొట్టారు. "చూడండి...
రంగుల రంగేళీ. మీ కళ్ల ముందు అంతా వైభవం,
డబ్బు, సంపద... హ..హ్హ...హ్హ!" అన్నాడు.
ఆ కళ్లద్దాల లోంచి చూస్తే వేదిక అంతా బంగారంలాగా మెరిసిపోతోంది. ఎక్కడ చూసినా అక్కడ
డబ్బు కట్టలు కొండల్లాగా కనిపించాయి.
"ఇది మాత్రం అదుర్స్ కదా గురూ?" అన్నాడు పక్కోడు.
సామాన్యుడు తాపీగా "ఓసారి కళ్లజోడు
తీసి చూడు" అన్నాడు. ఇద్దరూ అలా కళ్లజోడు తీసి చూసేసరికి
వేదిక మీద ఏవో కొన్ని చిల్లర డబ్బులు తప్ప కాసుల రాశులేమీ లేవు. పైగా అంతా మామూలుగానే
ఉంది.
"అరె... ఇదేం మాయ?" అన్నాడు పక్కోడు.
"నీకు మాయే. మాకు మాత్రం ఇది నిత్య సత్యమే.
స్వర్ణయుగం చూపిస్తానంటూ మావాడు ఇలాగే కళ్లకు గంతలు కట్టాడు. బడ్జెట్‌లో లక్షల
కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తూ మాయ చేశాడు. అంకెల గారడీ చేశాడు.మాటలతో బురిడీ కొట్టించాడు.
గంతలు తీసి వాస్తవాలు చూస్తే హాం... ఫట్. అంతా అప్పుల మయం. లక్షల కోట్ల
రుణాలే కనిపిస్తాయి. అంచనా ఆదాయాలు చూపించి హుళక్కి చేయడంలో మావాడు దిట్ట. మా
ఏపీ సర్కార్ ముందు, ఈ పీసీ సర్కార్ ఎంత గురూ?" అంటూ సామాన్యుడు లేచాడు.
పక్కోడు కూడా లేచి, "నాకూ మీ మేజిక్ షో చూపించవూ, సరదాగా ఉంది" అన్నాడు.
"వద్దు... వద్దు... నువ్వు చూసి భరించలేవు.
ఈ మ్యాజిక్ షో చూస్తే నీకు ఆనందమైనా కలుగుతుంది. మాది చూస్తే అంతా విషాదమే!" అంటూ నిట్టూర్చి
సామాన్యుడు నిర్వేదంగా సాగిపోయాడు.
-సృజన
PUBLISHED ON 12.3.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి