అధినేత పొద్దున్నే కళ్లు తెరిచి చూసేసరికి మంచం
పక్కన నీడలో ఒక వ్యక్తి కనిపించాడు. ఉలిక్కిపడిన అధినేత అదాటున లేచి కూర్చుని
"ఎవరయ్యా నువ్వు?" అనడిగాడు.
అప్పుడా వ్యక్తి లైటులోకి వచ్చి, "సార్... నేనండి. మీ పరగణాలో ఓ నియోజక
వర్గానికి అప్రయోజకుణ్ణండి..." అన్నాడు వినయంగా చేతులు కట్టుకుని.
అధినేత గుర్తుపట్టి, "వార్నీ నువ్వా? అదేంటయ్యా ఇలా ఏకంగా గదిలోకే
జొరపడ్డావ్? ఏదైనా ఎమర్జన్సీయా? నీ పరిధిలో ప్రజలకేమైనా కష్టం
వచ్చిందా?" అన్నాడు.
"అబ్బే... ప్రజలకి కష్టం వస్తే ఇంత
హడావుడి ఎందుకండీ? కానీ మీరన్నట్టు ఎమర్జెన్సీయేనండి..." అన్నాడు
వంచిన తల ఎత్తకుండా.
"ఏంటయ్యా అంత అర్జంటు ఎమర్జంటు వ్యవహారం?"
"ఏముందండీ... తమరి మనసులో ఏవేవో మార్పుల
ఊహలు మెదులుతున్నాయని తెలిసిందండి. రేపొచ్చే ఉగాది కల్లా కొత్త దినుసులతో పచ్చడి
చేయబోతున్నారని విన్నానండి..."
"ఉగాదేంటి? పచ్చడేంటయ్యా? ఇక్కడెవరూ ఉండర్లే కానీ, డైరెక్ట్‌గా విషయానికొచ్చెయ్.
సంకేత భాషలో అక్కర్లేదులే..."
"అదేనండి... తమరు అమాత్యవర్యుల
వర్గాన్ని తార్‌మార్ తక్కిడమార్ చేయబోతున్నట్టు పత్రికలు కోడై కూస్తున్నాయండి.
ఆ కూతలేమైనా నిజమవుతాయేమనని ఇలా చక్కా వచ్చానండి..."
అధినేత ముసిముసిగా నవ్వేశాడు.
"వార్నీ... మంత్రి వర్గ విస్తరణ సంగతా? అయినా ఇదేం పద్ధతయ్యా... పదవి
కోసం ఆశ పడితే పడ్డావు కానీ, ఇలా నేరుగా బెడ్రూంలోకి దొంగలాగా
వచ్చేస్తే ఎలా?"
"ఆయ్... అక్కడే ఉందండి మరి కీలకం. ఇంత
సెక్యూరిటీ కళ్లుగప్పి రాగలిగానంటే నేనెంతటి వాడినో తెలుస్తుందండి. మీరు గనక
నాకో అవకాశం ఇస్తే మనకిలాంటి దొంగ పనులు వెన్నతో పెట్టిన విద్యండి. మనకదే కదండి
మరి కావలసింది? అలాగే ఇలా తమరి పడగ్గదిలోకి వచ్చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి..." అన్నాడు
అప్రయోజకుడు.
"ఏమిటో అది?"
"నాకంటూ అవకాశం వస్తే మీకెంత బాగా చేరువవుతానో, ఎంత చేదోడువాదోడుగా ఉంటానో,
నన్నెంత బాగా వాడుకోవచ్చో చూపించడానికండి..." అంటూ అప్రయోజకుడు
చనువుగా అధినేత బ్రెష్ తీసుకుని దాని మీద పేస్ట్ పిండి చేతికిచ్చాడు.
అధినేత తెల్లబోయాడు.
"ఇదే కాదండి... తమరు కానీ అనుమతిస్తే
మీరు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలోకి
వచ్చేసి మీ వీపు రుద్దమన్నా సిద్ధమేనండి... ఇంకా మీరు ఆవులిస్తే చిటికేస్తానండి.
తుమ్మితే చిరంజీవ అంటానండి. దగ్గొస్తే నా గుప్పిడి అడ్డెడతానండి. మీకు జలుబు చేస్తే జేబురుమాలు పట్టుకుని మీ వెనకే
తిరుగుతానండి. అలాగే అకస్మాత్తుగా మీకేదైనా కొత్త జీవో జారీ చేయాలనే ఆలోచన వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు చేతికి పెన్ను,
కాగితం ఇచ్చి మీ ముందుకొచ్చి వంగుంటానండి. మీరు ఎంచక్కా నా వీపు మీద
ఆ కాగితం పెట్టుకుని పెన్నుతో ఆ జీవో ఏదో బరికేయొచ్చండి.
అంతలా ఉపయోగపడతానండి..."
అప్రయోజకుడి చొరవ చూసి అధినేతకి ఏమనాలో తెలియలేదు.
అయినా కాస్త గాంభీర్యం ప్రదర్శిస్తూ,
"అదికాదయ్యా... నీకు అవకాశం వస్తే సేవ చేయాల్సింది ప్రజలకి. నాకు
కాదు..." అన్నాడు గుంభనంగా.
"అమ్మమ్మ... ఎంత మాట. తమకి సేవ చేస్తే
జనానికి చేసినట్టేనండి. ఆ మాటకొస్తే తమరి సేవే ముఖ్యమండి. మరి తమరు ఎవర్నైనా
ఎంత బాగా వాడుకుంటారో తెలుసుకందండి. మీ అనుచరుల్ని చేరువ చేసుకుని రౌడీలుగాను, గూండాలుగాను చులాగ్గా వాడేసుకుంటారండి.
అధికారంలోకి రాగానే పోలీసుల్ని మీ సొంత మనుషుల్లాగా వాడేసుకోడం గమనించానండి. ఇక
ప్రజల్ని కూడా ఎన్నికల్లో ఓటేసే దాకా బాగా వాడుకున్నారండి. ఆపై అధికారుల్ని మీ మాట
వినక తప్పనంతగా ఉపయోగించుకుంటున్నారండి. ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోనట్టుగా
అనిపిస్తే తమరేం చేస్తారో కూడా బాగా పసిగట్టానండి. ఉన్నట్టుండి అవసరం లేని జీవోలేవో
జారీ చేయించి, వాళ్లకి లేని సమస్యలు సృష్టించి, గిజగిజలాడిపోయేలా చేస్తారండి. ఇహ
తమరి సమక్షానికి రాక తప్పని పరిస్థితులు కల్పిస్తారండి. వాళ్లొచ్చి వొంగి వొంగి దండాలెట్టాక, ఇచ్చిన జీవోలు మార్చేసి కొత్తవిస్తారండి. పైగా ఇదంతా ప్రజల కోసమేననే భ్రమ కలిగిస్తారండి. ఇలాంటి
తమరి దర్పం, ఠీవి, రాచకారితనం,
అరాచకతత్వం... ఇవన్నీ ఆకళింపు చేసుకున్నానండి. అందుకని నన్నెంతగా
వాడుకోవచ్చో మీకు అర్థం కావడానికి ఇలా పొద్దున్నే వచ్చేశానండి..." అంటూ అప్రయోజకుడు
తువ్వాలు తీసుకొచ్చి అధినేత భుజం మీద వేశాడు.
అప్రయోజకుడి సేవ, చొరవ అధినేతకి బాగా నచ్చాయి.
ముసిముసిగా నవ్వుకుంటూ, "సర్లేవయ్యా... చూద్దాం. నీ పేరు తప్పక
పరిశీలిస్తాలే..." అంటూ అధినేత బాత్రూంలోకి వెళ్లి చటుక్కున తలుపేసుకున్నాడు.
అప్రయోజకుడు సంతృప్తిగా వెళ్లిపోయాడు.
****
అధినేత తయారై చేతులు మడత పెట్టుకుంటూ హాల్లోకి
వచ్చేసరికి అక్కడ మంత్రులు వెనక కుర్చీల్లో కూర్చుని కనిపించారు.
"ఓ... మంత్రులా? మీరేంటి అక్కడ కూర్చున్నారు?" అని అడిగాడు అధినేత.
"వెనక కూర్చోడం అలవాటు చేసుకుంటున్నామండి" అన్నాడో
మంత్రి.
అధినేత ముసిముసిగా నవ్వుకుని, "సర్లేవోయ్ సెటైర్లు. ఇంతకీ మీరెందుకు
వచ్చారు? నేనేమీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు
చేయలేదే?" అన్నాడు.
:మీరు ఏర్పాటు చేస్తే అదే మా ఆఖరి మంత్రివర్గ
సమావేశం అవుతుందేమోననే భయంతో ముందుగానే తమరి దర్శనం చేసుకుందామని వచ్చామండి" అన్నాడింకో
మంత్రి.
అధినేత డైరెక్ట్‌గా విషయానికి వచ్చేశాడు.
"చూడండి... నేను ముందే చెప్పాను కదా, రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో
మార్పులుంటాయని? బాగా
పనిచేసే వాళ్లని నేనెప్పుడూ మర్చిపోను. వాళ్ల పదవులు ఎక్కడికీ పోవు. మరి కొత్త
వాళ్లకి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా, ప్రజాసేవ చేసుకోడానికి?" అన్నాడు
అదోలా నవ్వుతూ.
"అదే సార్... ఆ ప్రజాసేవ మేమెలా చేశామో
మీకు ఓసారి గుర్తు చేయాలని ఇలా ప్రైవేటుగా వచ్చేశామండి. మీరు అనుమతిస్తే మనవి
చేసుకుంటామండి" అన్నడో మంత్రి వినయంగా వంగి నిలబడి.
"ఏమిటో ఆ ప్రజాసేవ? చెప్పండి..." అన్నాడు అధినేత.
"సర్... తమరికి తెలియనిదేముంది? మీ మనసు తెలిసి మసులుకున్న చరిత్ర నాది. మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా,
నానా బూతులూ తిట్టాను. ఆ విషయంలో నా కృషి అనితర సాధ్యం. కొత్త కొత్త తిట్లు కనిపెట్టాను.
ఎవరూ ఎరగనంత అహంకారంతో, తలపొగరుతో వ్యవహరించాను. అసలు
విలేకరుల సమావేశంలో ఇంత బరితెగించి వాగొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేటట్లు మీ
వ్యతిరేకులపై దుమ్మెత్తి పోశాను. సభ్యత, సంస్కారాలనే బూజుపట్టిన
పాత కాలపు ధోరణులను చెరిపి పారేసి దూసుకుపోయాను. సాక్షాత్తు శాసన సభలో కూడా,
చుట్టూ కెమేరాలు ఉన్నాయని తెలిసినా కూ డా ప్రతిపక్ష నేతల మీద ఏకవచన
ప్రయోగంతో పాటు అడ్డమైన అసభ్య పదజాలం
ఉపయోగించాను. ఆఖరికి వాళ్లింట్లో ఆడవాళ్లని కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేసి
బరితెగించాను. అలాంటి నన్నుమార్చేస్తే మళ్లీ
తమకు నా అంతటి దిగజారినవాడు దొరకడం కష్టమనే నా అభిప్రాయం..." అన్నాడొక
మంత్రి.
అధినేత తలపంకించాడు.
వెంటనే మరో మంత్రి అందుకున్నాడు.
"అసలా మాటకొస్తే, తిట్ల విషయంలో... సభ్యత మరచి
వాగడం విషయంలో ఒకరు కాదండి... మేమంతా సమానమైన కృషి చేశాం. నా విషయానికొస్తే,
నా పరిధిలో ప్రజల మొహంలో ఆనందం కోసం కాదు, మీ
పెదవులపై చిరునవ్వు కోసమే పని చేశాను. అడుగడుగునా గూండాలు, రౌడీలతో మనకంటూ ఓ ప్రైవేటు సైన్యాన్నే ఏర్పాటు చేశాను. ఆఖరికి రోడ్లు బాగా
లేవని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని కూడా సహించలేదు. చిన్న పామైనా పెద్ద
కర్రతో కొట్టాలన్నట్టు పోలీసుల ఎదురుగుండానే వాళ్లపై దాడులు చేయించాను. చితగ్గొట్టించాను.
బాధితులు కేసులు పెట్టకుండా పోలీసులను భయపెట్టాను. రైతులని, మహిళలని కూడా చూడకుండా లాఠీలతో చితగ్గొట్టించేలా చేశాను. ఒకవేళ తప్పని సరై కేసు నమోదు చేసినా అది ముందుకు
సాగకుండా చూశాను. మీకు ఎక్కడా అశాంతి, అభద్రత కలగకుండా
శాంతిభద్రతలను అదుపు చేశాను... నా కృషి మీరు దృష్టిలో పెట్టుకోవాలి..."
ఇంకో మంత్రి వినయంగా చెప్పుకొచ్చాడు.
"అయ్యా... తమకు తెలియంది కాదు. నా హయాంలో
ప్రజానీకానికి కొత్త కొత్త రుచులు అలవాటు చేశాను. అంతక్రితం మామూలు మద్యం, సారా తాగుతుండేవారు. కానీ మన
పాలనలో ఎప్పుడూ ఎరగని కిక్కు వచ్చేలా నాటు సారా, సరికొత్త
మద్యం తయారయ్యేలా చేశాను. ప్రతి ఊరిలోను కుటీర పరిశ్రమలాగా ఈ మహత్తర పానీయాల
తయారీని ప్రోత్సహించాను. గిరిజన గ్రామాల్లో ఇబ్బడిముబ్బడిగా గంజాయి సాగుతో పచ్చదనం
పరిఢవిల్లేలా చేశాను. ఆ గంజాయి దేశంలోని నలుమూలలకు రవాణా అయ్యేలా చక్రం తిప్పాను.
దీని వల్ల జులాయిలుగా తిరిగే యువత నాలుగు డబ్బులు అక్రమంగా వెనకేసుకునేలా చేశాననే
తృప్తి నాకుంది. ఆఖరికి ఈ విషయంలో కాలేజీ కుర్రకారుని కూడా వాడుకుని పగడ్బందీ
నెట్‌వర్క్ తయారు చేశాను. ఓడల ద్వారా మాదక ద్రవ్యాల ఎగుమతి దిగుమతులు పెంచాను.
రైతుల, పేదల నోళ్లు కొట్టి బియ్యం చవగ్గా సేకరించి,
దాన్ని పాలిష్ పట్టించి, విదేశాలకు రవాణా చేసి
కోట్ల వ్యాపారం జరిగేలా చేశాను. మరి ఇన్ని చేయాలంటే కింద నుంచి పైనుండే తమరి వరకు
ఎవరికెంత వాటా రావాలో అంతా వచ్చేలా ప్రణాళికను రచించాను... కాబట్టి మీరు నాలాంటి
ప్రతిభావంతుడిని వదులుకోరనే భావిస్తున్నాను".
మరో అమాత్యుడు గొంతు సవరించుకుని ఏకరువు పెట్టాడు.
"అయ్యా... మీ కనుసన్నల్లో కదలాడే భావాలు గ్రహించి తదనుగుణంగా
నడుచుకున్నాను. ప్రజల్లో కులాల చిచ్చు పెట్టాను. మత పరమైన కల్లోలాలు సృష్టించాను.
గనులు, సెజ్‌లు,
భూములు, కాంట్రాక్టులు అన్నీ మనకి వాటాలిచ్చిన
వారికే అందేలా చేశాను. ప్రజా ప్రయోజనం కన్నా మన స్వప్రయోజనానికే ప్రాధాన్యతనిచ్చాను.
ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అప్రజాస్వామ్య వ్యవహారాలు జరిగేలా చూశాను. చట్టాలకు
దొరక్కుండా చట్ట వ్యతిరేక విధానాలు అభివృద్ధి చేశాను. పైకి ఏమాత్రం అనుమానం రాకుండా
ముడుపుల వ్యవహారాలు లోపాయికారీగా నడిపించాను. ఇవన్నీ తమకు తెలియనివి కావు..." అంటూ వంచిన
తల ఎత్తకుండానే విన్నవించుకున్నాడు.
అన్నీవిన్న అధినేత ముసిముసిగా నవ్వాడు. ఆపై నిదానంగా
చెప్పుకొచ్చాడు.
"మీరెంతటి ఘటికులో, ఘనులో నాకు తెలుసయ్యా. కానీ మీరు తెలుసుకోవలసింది ఇంకోటుంది. మీరు ఇంత
వరకు చేసిన బాధ్యతలను మించిన అతి ముఖ్యమైన పని ఒకటుంది. అందుకని మీలో కొందరికి
అది అప్పగించాలని చూసున్నాను..." అన్నాడు అధినేత.
"ఏంటి సర్ అది?" అన్నారు మంత్రులు ముక్తకంఠంతో.
"ప్రజలను మభ్యపెట్టడం... మీరు కేవలం
మీ పదవుల కోసమే ఆలోచిస్తున్నారు. నేను మనందరి పదవుల కోసం ఆలోచిస్తున్నాను. ఇక
ఎన్నికలు రెండేళ్లే ఉన్నాయి. మళ్లీ మనందరం కలిసి అధికారాన్ని అందుకోవలసి ఉంది.
అందుకు అతి ముఖ్యమైన పనే ప్రజలను మరో సారి మభ్యపెట్టడం. కాబట్టి మీలో కొందరికి
నియోజక వర్గాల వారీ బాధ్యతలు అప్పగిస్తాను. మీరంతా మీ మీ పరిధుల్లో ప్రజలను, ఓటర్లను మరోసారి హామీల మత్తులో
ముంచాలి. మాటల మైకంలో తేల్చాలి. మన హయాంలో అభివృద్ది జరగకపోయినా ఎంతో జరిగినట్టు
భ్రాంతి కలిగించాలి. మనం తప్ప ఈ రాష్ట్రానికి ఇంకెవ్వరూ దిక్కు లేనంతగా ప్రజలను
ఏమార్చాలి. ఈ రెండేళ్లూ మనం చేసే శ్రమ ఫలించి మళ్లీ అధికారంలోకి వచ్చామా,
మనకిక తిరుగుండదు. తిరిగి మరో ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవచ్చు.
పంచుకోవచ్చు. నంచుకోవచ్చు... అర్థమైందా?" అన్నాడు అధినేత.
అధినేత అంతరంగ విశ్వరూపం
చూసిన అమాత్యులు అప్రతిభులైపోయారు. మోకాళ్లపై కూర్చుని వినయంగా తలలు వంచి
నమస్కరించి, మారు
మాట్లాడకుండా నిష్క్రమించారు.
-సృజన
PUBLISHED ON 21.3.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి