ఆదివారం, మార్చి 06, 2022

మూడు ముక్క‌లాట‌లో ముచ్చ‌టైన సూత్రాలు!



 ఏంట్రా అలా ఈసురోమన్న‌ట్టున్న‌వేం?” అని అడిగారు గురువుగారు, నీర్సంగా కాళ్లీడ్చుకుంటూ వ‌చ్చి చ‌తికిల‌బ‌డిన శిష్యుడిని చూసి.

శిష్య‌డు నిట్టూర్చి, “ఏం లేదు సార్‌. చిన్న కోర్టు వ్య‌వ‌హార‌మండి. బెడిసికొట్టిందండి...అన్నాడు.

ఓసింతేనా? దానికే బెంబేలు ప‌డితే ఎలా? ఇంత‌కీ ఏమైంది?”

ఏముందండీ... మ‌న‌కి వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చిందండి...

ఒరే... మ‌నం ఎద‌వ ప‌న్లు చేశాక తీర్పులు అలాగే ఎదురుతిరుగుతాయిరా... దానికే నీరుగారిపోతే ఎలా?”

మీకేమండి సార్‌... ఎన్న‌యినా చెబుతారు. తీర్పు విన‌గానే ప్రాణం చ‌చ్చిపోయిన‌ట్ట‌నిపించిందండి. ప‌రువు మొత్తం ఊడ్చుకుపోయిన‌ట్టే క‌దండి మ‌రి? ఛ‌... ఇంత బ‌తుకూ బ‌తికి ఇంటెన‌కాల చ‌చ్చిన‌ట్టు అనిపించిందండి. పైగా గెలిచినోళ్లు సంబ‌రాలండి... త‌లెత్తుకోలేక‌పోతున్నానండి...

ఓరి నా వెర్రి శిష్యా... నువ్వు నా ద‌గ్గ‌ర‌కి ఎందుకొస్తున్నావురా, అది చెప్పు ముందు...

రాజ‌కీయాలు నేర్చుకుందామ‌నేక‌దండీ, అయితే ఏంటండీ?”

ఏంటంటావేంట్రా? పోలిటికల్ లీడ‌ర్‌గా ఎద‌గాల‌నుకునేవాడివి, ఇలా సిగ్గు ప‌డితే ఎలారా? సిగ్గూ శ‌రం, మానం అభిమానం... ఇలాంటివ‌న్నీ వ‌దిలేస్తేనే క‌ద‌రా నికార్స‌యిన నీచ నేత‌గా ఎదిగేది? ఇంత చిన్న విష‌యం నీకింకా ఒంట‌బ‌ట్ట‌కపోతే ఎలారా?”

ఊరుకోండి సార్‌... పాఠాలు వేరు, ప్ర‌తిష్ఠ వేరండి... అదే పోతే ఎంత అప్ర‌తిష్ఠండీ?”

ఒరే... నువ్వు రాజ‌కీయ నేత‌గా ఎదిగాక చేసేవ‌న్నీ అప్ర‌తిష్ట‌క‌ర‌మైన ప‌నులే క‌ద‌రా? అప్పుడే క‌దా నువ్వు అస‌మాన అసాధార‌ణ అధ‌మాధ‌మ నాయ‌కుడిగా చ‌రిత్ర‌లో మిగిలిపోతావు? ఏదో ఒక చిన్న కేసుకే ఇలా మ‌ధ‌న ప‌డిపోతే రేప్పొద్దున్న ఏ ముఖ్య‌మంత్రో అయి, నీ నికృష్ట ఆలోచ‌న‌ల‌న్నీ అమ‌లులో పెట్టేట‌ప్పుడు ఇంకెన్ని కేసులు ఎదుర్కోవాల్సి వ‌స్తుందో, మ‌రెన్ని తీర్పులు నీకు వ్య‌తిరేకంగా వచ్చి వెక్కిరిస్తాయో అది ఆలోచించు ముందు... అర్థ‌మైందా?”

అర్థ‌మైంది కానీ గురూగారూ, ఇప్పుడు న‌న్నేం చేయ‌మంటారండీ?”

ఏముందిరా... ఈ కోర్టు తీర్పును స‌వాలు చేస్తూ పైకోర్టుకెళ్లు. అక్క‌డా చుక్కెదురైతే రివిజ‌న్ పిటీష‌న్ త‌గిలించు. అక్క‌డా ఓడిపోతే స్పెష‌ల్ బెంచ్‌కెళ్లు. అక్క‌డ కూడా నీ ఎద‌వ ప‌నులు బ‌య‌ట‌ప‌డిపోయాయ‌నుకో, ఏకంగా ఆ తీర్పునిచ్చిన న్యాయ‌మూర్తుల మీద‌నే పిటీష‌న్ వేసెయ్యి. వాళ్లు ఈ కేసులో తీర్పులివ్వ‌డానికి అనర్హుల‌ని ఏవేవో కార‌ణాలు చూపించు...

అయ్య‌బాబోయ్ గురూగారూ! మీ బుర్ర‌లో ఇన్ని నీచ ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయండీ? మీ అంత‌రంగంలో ఊరుతున్న నికృష్ట ఉపాయాలు వింటుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోందండి... ఎంత‌యినా మీకు మీరే సాటి గురూగారూ! అస‌లింత‌కీ మీరు ఇంత‌లేసి రాజ‌కీయాలు ఎక్క‌డ నేర్చుకున్నారండీ?”

ఓరేయ్‌... నీ పొగ‌డ్త‌లు ఆపు. న‌యా నీచ రాజకీయ నేత‌ల ముందు మ‌న‌మెంత‌? మ‌న తెలివితేట‌లెంత‌రా? చుట్టూ జ‌రుగుతున్న స‌మ‌కాలీన రాజ‌కీయం గ‌మ‌నిస్తే ఇలాంటి అద్భుత అకృత్యాల‌న్నో అవ‌లీల‌గా ఔపోస‌న ప‌ట్టొచ్చురా స‌న్నాసీ... కాబ‌ట్టి ముందు నీ ప‌ర‌గ‌ణాపై ప‌రిశీల‌న పెంచుకో. ఆపై నువ్వే నాకు పాఠాలు చెప్ప‌గ‌ల‌వు...

ఆ... అర్థ‌మైంది గురూగారూ! మీరు చెబుతున్న‌ది తాజాగా  అమ‌రావ‌తిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించే క‌దండీనాకు న్యాయవ్య‌వ‌స్థ మీద గౌర‌వం అమాంతం పెరిగిపోయిందండి. ఎంత స్ప‌ష్ట‌మైన తీర్పండీ? స‌ర్కారు వారి కుయ‌త్నాల మీద ఎన్ని వ్యాఖ్యానాలండీ? అస‌లంత స్థాయిలో ఎక్క‌డికక్క‌డ ఎండ‌గట్ట‌డం ఆ నేత‌ల‌కు ఎంత నామ‌ర్దా? ఎంత సిగ్గుచేటు? ప‌రువు గోదాట్లో క‌లిసిపోయి త‌ల‌లు భూమిలోకి దిగిపోయుంటాయండి... అస‌లు మ‌ళ్లీ త‌లెత్తుకుని ప్ర‌జ‌ల ముందుకు ఎలా రాగ‌ల‌రండీ పాపం?”

ఓరి అమాయ‌కుడా? నువ్వెక్క‌డి సత్తెకాల‌పు స‌త్తెయ్య‌విరా? వాళ్ల మొహాల్లో అలాంటి భావాలేమైనా క‌నిపించాయిరా నీకు? ఎంచ‌క్కా విలేక‌రుల మైకుల ముందు మూతులెట్టుకుని ఎదురెట్టి వాగ‌లేదూ? రాష్ట్రంలో మూడు ముక్క‌లాట ఆగేది లేద‌ని మోర‌లెత్తుకుని మ‌రీ వ‌క్కాణించ‌లేదూ? అదిగో... ఆ తెగువ, ఆ తెంప‌రిత‌నమే నేర్చుకోవాలి నువ్వు. అస‌లీ వ్య‌వ‌హారాన్ని మొద‌టి నుంచీ గ‌మ‌నించావ‌నుకో, నీకు అడుగ‌డుగునా నీచ రాజ‌కీయ పాఠాలే క‌నిపిస్తాయి. ఏ స్థాయిలో అబ‌ద్దాలు ఆడ‌వచ్చో, ఎంత నీచంగా ప్ర‌చారాలు చేయ‌వ‌చ్చో, ఎంత బ‌రితెగించి బుకాయించ‌వ‌చ్చో... అన్నీ నేర్చుకోవాలి నువ్వు. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్నారు కానీ ఏమైనా నిరూపించ‌గ‌లిగారా? అంటే నీవ‌నుకున్న‌ది సాధించేందుకు ఎలాంటి నికృష్ట ఆరోప‌ణ‌ల‌కైనా వెనుకాడ‌కూడ‌ద‌ని అర్థం కావ‌డం లేదూ? ఓ వ‌ర్గం వారికే ప్ర‌యోజ‌నం క‌లిగిందంటూ ప్ర‌చారం చేశారు కానీ, అది అవాస్తవ‌మే క‌దా? అంటే అవ‌స‌ర‌మైతే నువ్వు కుల రాజ‌కీయాల‌ను కూడా ఎగ‌స‌న దోసి స‌మాజాన్ని తప్పుదోవ ప‌ట్టించ‌వ‌చ్చ‌ని తెలియ‌డం లేదూ? అస‌లా ప్రాంతం భారీ క‌ట్ట‌డాల‌కు ప‌నికిరాద‌ని, శ్మ‌శాన‌మ‌ని బుకాయించారే, దాన్ని బ‌ట్టి దుష్ప్ర‌చారాలు ఎలా చేయాలో నేర్చ‌కోవ‌ద్దూ? భూములిచ్చిన రైతులు పిడికిలి బిగించి ఉద్య‌మిస్తే ఏం చేశారో గ‌మ‌నించావ‌నుకో, నీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించే జ‌నాన్ని ఎలా రాచి రంపాన పెట్టొచ్చో సులువుగా గ్ర‌హించలేవూ? ఉద్య‌మం సాగిన 27 నెల‌ల్లో రైతుల‌పై ఏకంగా 3853 కేసులు బ‌నాయించారంటే, అడ్డ‌గోలుగా చ‌ట్టాన్ని ఎలా వాడుకోవ‌చ్చో తెలిసిపోదూ? శాంతియుతంగా ర్యాలీలు చేసే మ‌హిళ‌ల్ని కూడా ఈడ్చిపారేశారంటే పోలీసు వ్వ‌వ‌స్థ‌ని ఎంతలా దుర్వినియోగం చేయ‌వ‌చ్చో తేట‌తెల్లం కాదూ? ఏకంగా 807 రోజుల పాటు సాగిన ఉద్య‌మంలో 189 మంది మ‌ర‌ణించినా చ‌లించ‌లేదంటే, ఎంత మొండిగా అధికారాన్ని చెలాయించ‌వ‌చ్చో అర్థం కాదూ? ఆఖ‌రికి తీర్పు చెప్ప‌బోయే న్యాయ‌మూర్తుల్ని కూడా ఈ కేసుల విచార‌ణ నుంచి తొలగించాలంటూ అడ్డ‌గోలు పిటిష‌న్ వేయించారంటే, అవ‌స‌ర‌మైతే న్యాయ‌వ్వ‌వ‌స్థ‌పై కూడా బుర‌ద జ‌ల్లే న‌య‌వంచ‌క విధానాల‌కు వెన‌కాడ‌క్క‌ర్లేద‌నే సూత్రం స్ఫురించ‌డం లేదూ? ఇలా చూస్తే ఒక‌టా, రెండా... ఈ మూడు ముక్క‌లాటలో  నువ్వు నేర్చుకోగ‌లిగే ముచ్చ‌టైన నికృష్ట‌పాఠాలెన్నో లెక్క తేల్చ‌డం సాధ్యం కాదురా... భ్ర‌ష్ట రాజ‌కీయాల‌కు నీ ప‌ర‌గ‌ణా ఓ పెదబాల‌శిక్ష‌! వికృత రాచ‌కేళికి అదొక విజ్ఙాన స‌ర్వ‌స్వం! నీచ ప‌రిపాల‌నక‌దో నిఘంటువు! అడ్డ‌గోలు విధానాల‌క‌దో అడ్డా! దుష్ట చేత‌ల‌క‌దో ద‌ర్ప‌ణం! అరాచ‌కానికదో అద్దం! కాదంటావా చెప్పు?”

ఆ పాటికి శిష్య‌డు క‌ళ్లు తేలేశాడు.

ఆపండి గురూగారూ... ఆపండి. ఇన్నేసి పాఠాలు ఒకేసారి చెప్పేస్తే నా బుర్ర తట్టుకోలేదండి. అస‌లింత‌టి అస‌మాన అద్వితీయ అకృత్యాల నేత‌గా ఎద‌గాలంటే నాకు ఎన్ని జ‌న్మ‌లు ప‌డుతుందో అర్థం కావ‌డం లేదండి. కానీ నాదొక సందేహం గురూగారూ! ఇలాంటి రాజ‌కీయాలన్నీ నేర్చుకుని అధికార పీఠం ఎక్కానే అనుకోండి, ఇన్నేసి ఎద‌వ‌ప‌నులు చేశానే అనుకోండి... మ‌రి ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌రంటారా? న‌న్నొక ద‌గుల్బాజీగా గుర్తు ప‌ట్టేసి సీటు దించేయ‌రంటారా?”

అస్స‌లు అన‌నురా... ప్ర‌జ‌లు చాలా తెలివైన వారు. వాళ్లు నీ నిజ‌స్వ‌రూపం ప‌సిగ‌ట్టి త‌మ వ‌ద్ద‌నున్న ఓట‌నే వ‌జ్రాయుధంతో చీల్చి చెండాడుతారు. ప‌ర‌గ‌ణా ప‌రిధిలోంచి త‌రిమి త‌రిమి కొడ‌తారు. కానీ ఈలోగా నువ్వీ దారుణ రాజ‌కీయ పాఠాల సాయంతో త‌రాత‌రాలు త‌ర‌గ‌ని ప్ర‌జాధ‌నాన్ని దోచుకుంటావు క‌దా? అదే క‌దా నీకు కావ‌ల‌సింది?”

అవునండోయ్‌... మీరు చెప్పిన‌ట్టు ఈ మూడు ముక్క‌లాట‌లో ముచ్చ‌టైన సూత్రాల‌న్నీ నేర్చేసుకుని నీచ రాజ‌కీయ ప‌ర‌మ‌ప‌ద సోపాన ప‌టంలో పాము తోక‌ప‌ట్టుకుని పైకి ఎగ‌బాకుతా! నిచ్చెన‌ల మీంచి నీతి నిజాయితీల‌ను తోసేస్తా!!

శెభాష్‌...ఇక పోయిరా!

-సృజ‌న‌

PUBLISHED ON 5.6.2022 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి