శుక్రవారం, సెప్టెంబర్ 01, 2023

రాజకీయ ప్రక్షాళన సిద్ధిరస్తు!



కలియుగ వైకుంఠం. సుప్రభాతం వీనుల విందుగా వినిపిస్తున్న ప్రభాత వేళ ఓ వెలుగు పుంజం కొండమీద ఆవిర్భవించింది. ఆ వెంటనే తిరుమల నాథుడి వక్షస్థలం నుంచి  ఓ కాంతి కిరణం వెలుపలికి వచ్చి, వెలుగు పుంజం దగ్గరకి వచ్చి ఆగింది. ఆ వెంకటాద్రిపై మనుషులు ఎవరూ మసలని శిఖరాగ్రాన ఆ రెండు ప్రకాశాలూ రూపం దాల్చాయి.

''రావమ్మా... పార్వతమ్మా! ఎన్నాళ్లకు నీ దర్శనం? పక్కనే ఉన్న శ్రీకాళహస్తి నుంచి ఇన్నాళ్లకా రావడం?'' అంది సాకారమైన శ్రీదేవి.

''అమ్మా... లక్షీదేవీ! శ్రావణ మాసం సందర్భంగా భక్తజనుల పూజలందుకుంటున్న నిన్ను, నీ వైభవాన్ని చూసిపోదామనే వచ్చా. అందునా శ్రావణ పూర్ణిమ సందర్భంగా మా అన్నగారికి రాఖీ కట్టినట్టు కూడా ఉంటుందని ఇలా వేంచేశా'' అంది ఆకారం దాల్చిన పార్వతీదేవి.

''ఏమి వైభవమో ఏంటో'' అంది శ్రీదేవి.

''అదేంటమ్మా అలా అంటావు? ఆంధ్రదేశంలో కొలువైన నీకు లోటేముంటుంది వదినమ్మా?'' అంటూ ఆరా తీసింది పార్వతి.

సకల సంపదల తల్లి ఓసారి నిట్టూర్చింది.

''ఏం ఆంధ్రదేశమో! ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడెలా అయిపోయింది? నా బాధంతా నాకోసం కాదు పార్వతీ! ఇక్కడ నానా పాట్లు పడుతున్న జనం గురించే...''

''అవునవును. నేనూ కూడా వింటూనే ఉన్నా. విశ్వ ప్రఖ్యాతిగాంచిన ఈ తిరుమల తిరుపతి పవిత్ర స్థలంపై ఆధిపత్యం వహించే బాధ్యతలను కట్టబెట్టిన వారిలో కొందరు నేరచరిత్ర కలవారు, అరెస్టయిన వారు కూడా ఉన్నారటగా? అసలు ఆధ్యాత్మక వాసనలు లేని వారు సైతం భక్తజనంపై అజమాయిషీ చేయడానికి కొలువైపోయారట కదా?''

''అదొక్కటేనా గిరిరాజ సుతా? అత్యధిక వ్యయ ప్రయాసలకోర్చుకుంటూ, పిల్లాపాపలతో, వృద్ధులతో కలిసి ఆపసోపాలు పడుతూ ప్రపంచం నలుమూలల నుంచీ తరలి వచ్చే భక్త జనం గంటల తరబడి వేచి చూస్తూ అలసిపోతుంటే, పూజలందుకుంటున్న మనకి మనసు కరిగిపోదూ? ఓ పక్క ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న వారి అనయాయులు, అనుచరులు, వారి ప్రాపకం పొందిన వారు, వారి కనుసన్నల్లో మసలు కొంటున్న వారు మాత్రం గుంపులు గుంపులుగా వచ్చి ప్రత్యేక దర్శనాలు అవీ అనాయాసంగా పొందుతుంటే, పాపం సామాన్య భక్త జనం వేచి చూసే కాలం అంతకంతకు అధికమై తల్లడిల్లిపోతున్నారనుకో. అదీకాక ఈ పవిత్ర శిఖరాన్ని కాలి నడకన అధిగమించే జనానికి రక్షణ కూడా కరవవుతుంటే కలవరపాటుకు గురికామా, కామాక్షీ!''

''అవును వదినా! అదికూడా విన్నాను. కొండదారుల్లో వణ్యమృగాలు సంచరిస్తూ జనాన్ని భ్రయభ్రాంతులకు లోను చేస్తుంటే, అందుకు నివారణ మార్గాలను పటిష్ఠం చేసే సకల చర్యలనూ తీసుకోకుండా, భక్తుల చేతికి ఊత కర్రలిచ్చారని చెప్పుకుంటుంటే చెవిన పడింది. పైగా ఆ  ఊత కర్రలపై కూడా ఇక్కడి అధినేత చిత్రాన్ని ముద్రించి, దాన్ని సైతం ప్రచారానికి ఉపయోగించుకుంటున్న పాలకుల విచిత్ర కీర్తి కండూతి గురించి విని విస్తుపోయాననుకో...''

''అక్కడితో ఆగాయా ఇక్కడి పాలకుల దురాగతాలు శివపత్నీ! పరమ పవిత్ర ప్రదేశంగా ఇంద్రాది దేవతలు, బ్రహ్మరుద్రాది సురప్రముఖులు సైతం భావించే ఈ ఆలయ ప్రాంగణంలో కమలనాభుడు ఉత్సవ మూర్తిగా దర్శనమిస్తూ ఊరేగే మాడ వీధుల్లో సైతం అన్యుల వాహనాలు యధేచ్ఛగా తిరుగాడుతుంటే, క్షణకాల దర్శనం కోసం కోటి కష్టాలకు వెరవకుండా వెల్లువలా వచ్చిపడే భక్తజనుల మనోభావాలు దెబ్బతినవా చెప్పు? అదీకాక ఈ ఆలయం మీదుగా వినువీధుల్లో మానవ నిర్మిత విమానాలు, ఆధునిక సాంకేతిక ఫలాలైన డ్రోన్లనబడే చిత్ర ప్లవంగాలూ ఎగురుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని భంగ పరుస్తుంటే, ఇక్కడి పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదనుకో...''

''హతవిధీ హరిప్రియా! అందుకేనా కలవర మానసివై కనిపిస్తున్నావు?''

''అదొక్కటేనా శ్రీదుర్గా! ఆలయం సంగతి అట్లుంచుము. ఆంధ్రప్రదేశమున నివసిస్తున్న ప్రజలకేసి దృష్టి సారించిననూ, ఆవేదన ముప్పిరిగొంటున్నది. మా రాజధాని వైకుంఠము, మీ రాజధాని కైలాసము, దేవతల రాజధాని అమరావతి అని తెలిసినదే కదా? కానీ అదేమి దౌర్భాగ్యమో పాపం ఆంధ్రప్రదేశ నివాసులు మాత్రం రాజధాని అన్నదే లేకుండా ఉసూరుమంటున్నారు.  సువిశాల రాష్ట్ర విభజన తర్వాత,  అమరావతి అనే ముఖ్యపట్టణ నిర్మాణం జరగుతుందనే ఆశతో, బంగారం పండే తమ పచ్చని పంట పొలాలను సైతం విస్తృత ప్రయోజనాల కోసం ధారాదత్తం చేసిన రైతుల నిరుపమాన త్యాగానికి అర్థం లేకుండా చేశాడిక్కడి అధమాధమ పాలకుడు. ప్రజలకు ఆశలు ఎరవేసి, అమలుకు అసాధ్యమైన వాగ్దానాలు చేసి అధికారాన్ని కైవశం చేసుకున్న ఇతగాడు... వరాలు పొంది అరాచకంగా విజృంభించే అసురుల మాదిరిగా  పీఠమెక్కుతూనే, విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నాడు. కక్ష కావేశ మనోజ్వర పీడితుడై, ఉన్న నిర్మాణాలను సైతం కూలగొడుతూ పాలనను ప్రారంభించిన పరమ నికృష్ఠుడితడు. ఒక్క రాజధానికి దిక్కులేదు కానీ, మూడు రాజధానులు నిర్మిస్తానంటూ ప్రగల్భాలు కొడుతూ, నాలుగేళ్లుగా ఆంధ్రజనుల ఉసురుపోసుకుంటున్న అపర రాక్షసుడితడు. రాజధానికి భూములిచ్చి సర్వం కోల్పోయిన కర్షకులు ఉద్యమిస్తుంటే కర్కశంగా వారిని అణచివేస్తున్న కర్కోటకుడితడు...''

''ఔరా, సాగరతనయా! ఎంతటి దురాగతం? వింటుంటే భస్మారుడికి వరాలిచ్చి తనకే ప్రమాదం తెచ్చుకున్న నా నాధుడు భోళా శంకరుడి పరిస్థితి లాగా తయారైందన్నమాట ఈ ఆంధ్రజనుల దుస్థితి. పరికించి చూడ, అష్టాదశ పురాణాల్లో కనిపించే అసురులను సైతం మించిపోయినట్టున్నాడే ఇక్కడి పాలకుడు?''

''బాగా చెప్పావు భక్తార్తి హారిణీ! దేవతలను సైతం ముప్పుతిప్పలు పెట్టి, ముల్లోకాల ప్రజలను కల్లోల పరిచిన అలనాటి అసురులకు ఇతగాడు ఏమాత్రమూ తీసిపోడనుకో. అధికారం అందుకోగానే ఆంధ్ర ప్రజల అమూల్య ఆస్తి అయిన ప్రభుత్వ భూములను అయిన వారికి కట్టబెట్టి, అందుకు ప్రతిఫలంగా లక్షల కోట్ల సొమ్మును ముడుపులుగా అందుకుంటున్న ఇతగాడి తీరు చూస్తే, సత్యయుగంలో భూమిని చుట్టచుట్టిన హిరణ్యాక్షుడు గుర్తుకు రాడూ? కళ్లముందు జరుగుతున్న అక్రమాలను అదేమని అడుగుతున్న పాపానికి కన్నబిడ్డల లాంటి ప్రజల మీదనే కత్తిగట్టి, అన్యాయపు కేసులు బనాయిస్తూ వేధిస్తున్న ఇతడి వైఖరి గమనిస్తే, కన్నకొడుకుని సైతం చంపడానికి సమకట్టిన హిరణ్యకశిపుడు స్ఫురణకు రాడూ? ఎన్నో అమూల్యమైన ఖనిజాలకు నెలవైన గనులను, కొండలను అక్రమంగా తవ్వుకుంటూ ప్రకృతి వనరులను ఆరగిస్తున్న ఇతడి పాలన గమనిస్తే ద్వాపర యుగంనాటి బకాసురుడు జ్ఙప్తికి రాడూ? అధికార పార్టీ అనుయాయులు, అనుచరులు, అరాచక శక్తుల ఆగడాలతో దేశం మొత్తం మీదే ఆంధ్ర దేశము అబలల పట్ల అత్యాచారాల విషయంలో అగ్రస్థానానికి ఎగబాకుతోందన్న కఠోర సత్యం వెల్లడవుతున్నా, వాటిని అరికట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఈ నీచ నేత ముందు, త్రేతాయుగం నాటి రావణాసురుడు తీసికట్టే అనిపించడంలో విచిత్రమేముంటుంది చెప్పు?''

''కటకటా, కమలనయనీ! ఎంతటి దారుణము? మహిళల భద్రత పట్ల ఉదాసీనమన్న మహిషాసుర మర్దినినైన నాకే మనసు కలవరపడుతున్నది. అట్లయిన, అసురుల అంశలన్నీ ఇతగాడిలో కొలువైనట్టున్నాయే?''

''లెస్స పలికితివి లలితాంబికా! తనకు మద్దతు పలికినచో ఆంధ్రదేశమున మద్యమన్నదే లేకుండా చేయుదునని ప్రజలను ఆకట్టుకుని, తీరా పాపం అమాయక ప్రజలు నమ్మి పాలన పగ్గాలు అందించగానే మద్యం ఏరులై ప్రవహించేలా చేసి, జనం కష్టార్జితాన్ని ఆదాయంగా మార్చుకుని కులుకుతున్న సురాసురుడితడు. ప్రచారం కోసం కొంత పైకమును ప్రజలకు ముట్టచెబుతున్నట్టు నాటకమాడుతూ, వెనుక మార్గమున అడ్డమైన పన్నలూ పెంచి, వారి ఆదాయాన్ని అంతకు పదింతలుగా కొల్లగొడుతున్న నయవంచకాసురుడితడు. ఎక్కడ వీలయితే అక్కడ అప్పులు చేస్తూ ప్రజలు తేరుకోలేని ప్రచండ భారాన్ని పెంచుతూ, ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభానికి  కారకుడైన దారుణ రుణాసురుడు ఇతగాడు. అస్తవ్యస్త పాలనా విధానాలతో విద్యుత్వ్యవస్థని నాశనం చేసి ప్రజలను అంధకారంలో ముంచుతున్న అంధకాసురుడు వీడు. అధికారులను, రక్షక భటులను బెదిరించి, ప్రలోభపెట్టి వారిని పెంపుడు కుక్కలుగా మార్చుకుని, తననెదిరించిన వారిపైకి ఉసిగొల్పుతూ ప్రజలను ఉసూరుమనిపిస్తున్న అరాచకాసురుడు. పురాణాల్లో కనిపించే దానవులను మించిపోయి అధికారమదంతో విజృంభిస్తున్న కలియుగ రాజకీయ భ్రష్టాసురుడు ఈ పాలకుడు. ఇతడి కబంధ హస్తాలలో కకావికలవుతున్న ప్రజల శాంతిభద్రతలను తలంచిన కొద్దీ మనసు తల్లడిల్లుతోంది భవానీ!''

''మరి కళ్లముందు ఇంత జరుగుతుంటే కొండలపై నెలకొన్న కోనేటిరాయుడైన మా అన్నగారు మౌనం వహిస్తున్నారెందుకు చంద్ర సహోదరీ? నీవైనా చెప్పలేకపోయావా?''

''నా నాధుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైనా, నీ నాధుడైన భక్తవశంకరుడైనా సమయం వచ్చే వరకు స్పందించరు కదా భైరవీ?''

శ్రీదేవి మాటలు విన్న దుర్గామాత వదనం ఆగ్రహంతో ఎరుపెక్కింది. కాళికలా మారి నాలిక చాచి త్రిశూలం అందుకుంది.

''చాలు చాలు చెంచలాక్షీ! ఇక ఊరుకుని లాభం లేదు. సకల జనులకు తల్లులమైన మనం మన శక్తులను ఉపేక్షించి, అమాయక ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే సహించడమా? విజృంభించు. ఈ దుష్టుని దునుమాడి శాంతి నెలకొల్పుదాం...'' అంది కోపంగా.

ఇంతలో ''నారాయణ! నారాయణ!'' అంటూ నారదుడు ఆవిర్భవించాడు.

''శాంతించు తల్లీ, శాంతించు. నువ్వొచ్చిన పని మరిచి రాజకీయ దురంతాలు విని కలవరపడితే ఎలా? మీ అన్నగారు నా ద్వారా పంపిన సందేశం విను...'' అంటూ నారదుడు స్తోత్రాలు చేశాడు. పార్వతి శాంతించింది.

''మా అన్నగారి సందేశమా? ఏమిటది నారదా? ఆయనకు రాఖీ కడదామని వచ్చి ఆంధ్ర జనులు అగచాట్లు విని ఆగ్రహానికి లోనయ్యాను...'' అంది.

''అమ్మా! ఇది కలియుగం. యుగధర్మం ప్రకారం దేవతలు ప్రత్యక్ష శక్తిని ప్రదర్శించరని తెలిసినదే కదా? అందుకే శ్రీకాళహస్తిలో జ్ఙాన ప్రసూనాంబగా కొలువైన నీకు మీ అన్నగారు ఒక మాట చెప్పారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్ర జనుల బుద్ధిని వికసింపజేసి వారిలో సరైన జనచైతన్య నాయకుడిని ఎన్నుకునే జ్ఙనాన్ని ప్రదీప్తమించమని సూచించారు. కాబట్టి మీరిద్దరూ ఓటర్ల మనసులను ప్రభావితం చేసి వారిలో ప్రలోభాలకు లొంగని, మాయ మాటలకు లోనుకాని చైతన్యాన్ని పెంపొందించండి. ఇక ఆపై అంతా మంచే జరుగుతుంది'' అన్నాడు నారదుడు.

ఇంతలో వినీలాకాశం లోంచి, మేఘాల దొంతరలను దాటుకుని ఓ దివ్యమైన హస్తం పార్వతి ముందుకు వచ్చింది. వెంటనే పార్వతి ఆ వెంకటాచలాధీశుని చేతికి రాఖీ కట్టింది. గుడిలో గంటలు మోగాయి. జ్ఙాన ప్రసూనాంబ కాంతి పుంజమై కాళహస్తి వైపు సాగిపోయింది. లక్ష్మి కాంతిరేఖగా మారి శ్రీనివాసుని వక్షస్థలంలోకి చేరుకుంది.

నారదుడు తన్మయత్వంతో నమస్కరించి, ''జనచైతన్య ప్రాప్తిరస్తు! రాజకీయ ప్రక్షాళన సిద్ధిరస్తు!!'' అంటూ నారదుడు కూడా మాయమయ్యాడు మహతి మీటుతూ!

-సృజన

PUBLISHED ON 1.09.2023

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి