శనివారం, సెప్టెంబర్ 16, 2023

20 కోట్ల యజ్క్షాలు!

మనం అప్పటికి మూడో తరగతి చదువుతున్న కుర్రగాళ్లం. మా నాన్నగారు ఓసారి ఏదో చెబుతూ 'అనాథ ప్రేత సంస్కారం... కోటి యజ్క్షం ఫలం లభేత్‌' అని చెప్పారు. అంటే దిక్కూమొక్కూ లేని వాళ్లు ఎవరైనా చనిపోతే వారి మృతదేహానికి అంత్యక్రియలు జరిపితే అంత పుణ్యం అన్నమాట అంటూ వివరించారు. 'ఓహో...' అనుకున్నాం మనం.  

మా నాన్నగారు తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు హెడ్మాస్టరు. మనం ఆ పక్క బడిలోనే చదువు వెలగబెడుతూ ఉండేవాళ్లం. ఆ తర్వాత మా నాన్నగారికి విశాఖ జిల్లా చోడవరానికి బదిలీ అయింది. సంగతి తెలియగానే మనం అందరికీ 'మేం కొత్త వెళ్లపోతున్నామోచ్‌...' అంటూ టాం టాం చేసుకున్నాం. ఆ తర్వాత నాన్నగారు అక్కడ ఇళ్లు చూడ్డం, సామాను ఎస్సారెమ్టీలో వేసెయ్యడం, మమ్మల్ని తీసుకెళ్లడం జరిగిపోయాయి. కొత్త ఇల్లు భలే ఉంది. ముందు చెక్కతో చేసిన గేటు. అది తీయగానే కొంత దూరం సన్నని మార్గంలో నడవాలి. ఆ మార్గంలో అటూ ఇటూ నిమ్మగడ్డి మొక్కలు. వాటి ఆకులు చిదిమితే ఘాటు వాసన వచ్చేది. ఆ మార్గంలో ఎదురుగా ఉండేది ఇంటి ఓనరు వాటా. ఆయన పేరు ఆనందరావుగారు. వాళ్ల అమ్మాయి నా కంటే వయసులో రెండేళ్లు పెద్దదనుకుంటా. పేరు బాల. ఓనరు వాటాకి ఎడమ వైపు నడిస్తే మా వాటా. ముందు చెక్క పేడులతో చేసిన కటకటాలు. అదే వీధి గది లేక వరండా అన్నమాట. లోపల ఓ పెద్ద గది. ఆ తర్వాత ఓ వంటిల్లు. మననింకా కొత్త స్కూళ్లో వేయలేదు కాబట్టి తోచిన ఆటలు ఆడుకోవడమే పని. ఆ ఇంటి పెరడంతా తిరుగుతూ చూస్తుంటే వెనక వైపు బూజులు, సాలె గూడులు, చీమల పుట్టలు గట్రా కనిపించాయి. అన్నీ చూస్తుంటే కండ చీమలు కొన్ని చచ్చి పడున్నాయి. ఇక మనకి పని పడింది. ఆ చీమలన్నింటినీ జాగ్రత్తగా పుల్లతో తీసి ఓ కాగితంలో వేశాను. ఆ తర్వాత వాటిని లెక్క పెడితే ఇరవై ఉన్నాయి. అటూ ఇటూ వెతికితే ఓ పెద్ద పుల్ల దొరికింది. దాంతో అక్కడి నేలపై ఓ గొయ్యి తీశాను. ఆ చీమలన్నింటినీ అందులో వేసి మట్టి కప్పేశాను. 

సాయంత్రం నాన్నగారు వచ్చారు. రాత్రి భోజనాలు చేస్తుంటే...  

''నాన్నగారూ! నేనివాళ ఇరవై కోట్ల యజ్క్షాలు చేశాను...'' అన్నాను గొప్పగా.

''అదేంట్రా? ఎలా?''

''మన ఇంటి చుట్టూ కండ చీమలు చచ్చి పడున్నాయండీ. వాటన్నింటినీ గొయ్యి తీసి కప్పెట్టా. మీరన్నారుగా? అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్క్ష ఫలం లభేత్‌ అని!'' అంటూ వివరించా. 

ఆయన గట్టిగా నవ్వేశారు. ఆ తర్వాత ''ఏడిశావ్‌'' అన్నారు. ''దానర్థం అది కాదు'' అనేశారు.

నాకు మాత్రం అప్పట్లో అర్థం కాలేదు. మనుషులు చనిపోతేనే అంత్యక్రియలా? పాపం చీమలకు ఉండవా? వాటికెవరు చేస్తారు? నేను చేశానుగా? మరి నాకు పుణ్యం రాదా? 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి