శనివారం, సెప్టెంబర్ 23, 2023

అరెస్టోపాఖ్యానం!


''నమస్కారం గురూగారూ!''

''రారా... బెయిల్ఇచ్చారా?''

''బెయిలేంటి సార్‌?''

''నువ్వీమధ్య కనబడకపోతేనూ... అరెస్టు చేశారేమో అనుకున్నారా...''

''అయ్యబాబోయ్‌! నేను అరెస్టవడమేంటి సార్‌? నేనేం చేశానని?''

''ఒరే... నీ పరగణాలో అరెస్టు చేయడానికి  కారణం గట్రా ఉండాలేంట్రా?''

''ఊరుకోండి సార్‌... మీరు మరీనూ... మరీ నన్ను అరెస్టెందుకు చేస్తారండీ''

''ఎందుకు చేయకూడదురా... నువ్వు నా దగ్గరకి ఎందుకొస్తున్నావు? రాజకీయాలు నేర్చుకోడానికే కదా? మరి నువ్వుగానీ బాగా రాటుదేలిపోతున్నట్టు అనుమానం వచ్చి, రేప్పొద్దున్న ఎక్కడ కుర్చీ ఎక్కడానికి అడ్డుపడతావో అనిపించిదనుకో. సీఐడీ వాళ్లకి సిగ్నల్ వెళిపోతుంది. వాళ్లు  అర్థరాత్రో వచ్చి తలుపులు దబదబా కొడతారు. నువ్వు  పాలవాడో, పేపరోడో అనుకుని తలుపు తీశావనుకో. గబుక్కున పట్టేసుకుని పదమంటారు...''

''ఏంత సీఐడీ వాళ్లయితే మాత్రం, ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండానే పట్టుకుపోతారా?''

''మరదేరా... నువ్వు రాజకీయాలు నేర్చుకోడానికి వస్తున్నావు కానీ, బొత్తిగా సామాజిక పరిశీలన లేదు. నీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఊరికే పోలిటిక్స్పాఠాలు బట్టీపట్టి ఏం లాభంరా?''

''అర్థమైంది గురూగారూ! ఇవాళ పాఠమేంటో తెలిసిపోయింది. చెప్పండి సార్‌, రాసుకుంటాను...''

''ఒరే ఇది రాసుకునేది కాదురా... మూసుకునేది. కళ్లూ చెవులూ నోరూ కూడా మూసుకునేది. అరాచక రాజకీయ పర్వంలో అరెస్టోపాఖ్యానం ఇది. దీన్ని మీ అధినేత కాచి వడబోసేశాడు. మరందుకే నువ్వు కనిపించకపోయేసరికి ఊచలు లెక్కపెడుతున్నావేమోనని ఊహించుకుని ఉలిక్కిపడ్డా...''

''భలేవారండీ బాబూ... రాగానే భయపెట్టేశారు. కానీ సర్‌, నేనేమైనా ప్రతిపక్షం వాడినా? అంతక్రితం అధికారం చెలాయించిన వాడినా? అధికార విధానాలను ప్రశ్నిస్తున్నవాడినా? ప్రదర్శనలు చేశానా? నిరసనలు తెలిపానా? తిరగబడ్డానా? ఉద్యమించానా? నోరు మూసుకుని నా దారిని నేను పోయే వాడిని.  దారి నిండా గోతులు, గొప్పులు ఉన్నా తప్పించుకుపోయేవాడిని. అడ్డమైన పన్నులూ విధించినా మాట్లాడకుండా కట్టేవాడిని. ధరలు ఆకాశాన్నంటుతున్నా, పాతాళం కేసి తప్ప ఇంకేమీ చూడని వాడిని. నా బతుకేదో నాది తప్ప ఇంకేదీ పట్టని సామాన్యుడిని కదా? మరి నన్ను అరెస్టు చేద్దామన్నా ఎలాంటి సాకూ దొరకదు కదండీ?''

''ఓరి వెర్రి సన్నాసీ!  రాజ్యంలో రాజదండన విధించడానికి సాకులూ, సాక్ష్యాలూ దేనికిరా? ఉదాహరణకి నువ్వు అధికార పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడు నీ మానాన నువ్వు పోతూ గబుక్కున తుమ్మావనుకో. శుభమా అని సమావేశం పెట్టుకుంటే తుమ్ముతావా అని చెప్పేసి తన్ని లోపల పడేయచ్చు.  ఎమ్మెల్యే సభలోనో నువ్వు పొరపాటున దగ్గినా అగ్గిమీద గుగ్గిలమై అరదండాలు వేయవచ్చు.  ప్రతిపక్షం వాళ్లో నిరసన ప్రదర్శన చేస్తున్నప్పుడు నువ్వు నీ కర్మకాలి కూరగాయలు కొనుక్కోడానికి బయటకు వచ్చినా  ప్రదర్శనకు మద్దతు పలికావని చెప్పి క్రూరంగా నిన్ను కుమ్మేయవచ్చు. ఎగస్పార్టీ వాడికేసి నువ్వు ఎగాదిగా చూసినా వాడితో కలిసి ఏదైనా కుట్ర పన్నుతున్నావని ఎకాఎకీ జైల్లో పడేయవచ్చు. అధికార పార్టీ నేత నీకు రోడ్డు మీద ఎదురయినప్పుడు నువ్వు చూసుకోకుండా తప్పుకుపోయినా ఎదుటి పార్టీ సానుభూతిపరుడవని కటకటాల వెనక పడేయచ్చు. ఆఖరికి నీకు వచ్చిన వాట్సాప్మెస్పేజిని చూసినట్టు బ్లూ టిక్కులు పడితే చాలు బరబరా లాక్కుపోవచ్చు. అంతెందుకురా... నీ పరగణాలో పరిస్థితి ఎలా ఉందంటే... నీకు ఏడుపొచ్చినా అటూ ఇటూ చూసి ఏడవాలి. నవ్వొచ్చినా వెనకా ముందూ చూసుకుని నవ్వాలి. నెత్తి మీద దురదేసినా కూడా బుర్ర పెట్టి ఆలోచించి మరీ గోక్కోవాలి. కాదంటావా చెప్పు?''

''వార్నాయనోయ్‌. ఇక చాలు సార్‌. భయమేస్తోంది. ఎందుకైనా మంచిది ముందస్తు బెయిల్తీసుకుని జేబులో పెట్టుకోమంటారా?''

''ఓరెర్రోడా! నిన్నుగానీ నిజంగా అరెస్టు చేయదల్చుకున్నారనుకో. నీకు బెయిలు మాత్రం ఇచ్చేదెవర్రా? నీ రాజ్యంలో దర్యాప్తు సంస్థలు పాలక పార్టీ వాళ్లకి పెంపుడు కుక్కలు. పోలీసులు అధికార నేతల ఇంపుడుగత్తెలు. చట్టాలు నీ ఏలిక చుట్టాలు. రాజ్యాంగం నీ రాజుగారి వీరంగం. వాడనుకున్నదే న్యాయం. వాడు చేసిందే ధర్మం. వాడేదంటే అదే శాసనం...''

''అవునండి బాబూ... ఎప్పుడు ఎవర్ని అరెస్టు చేస్తారో, ఎవర్ని కుమ్మేస్తారో, ఎవర్ని లోపలేస్తారో, ఎవర్ని చంపేస్తారో కూడా తెలియడం లేదండి. అధినేత అనుచరులంతా ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారండి. మహిళలపై అరాచకాలండి. సామాన్యులపై దాష్టీకాలండి. స్థలాలు కబ్జా చేసినా నోరెత్తడం లేదండి. భూమి లాక్కున్నా బుర్రెత్తడం లేదండి. మరీ దారుణంగా ఉందండీ బాబూ...''

''మరదే చూశావా? వాగించేసరికి నీ నోటమ్మట వాస్తవాలెలా తన్నుకొస్తున్నాయో? ఇదన్న మాట రాజకీయం నేర్చుకునే శిష్యుడికి ఉండాల్సిన లక్షణం. తెలిసిందా?''

''మరైతే గురూగారూ, శిష్యుడిగా పాసయిపోయినట్టేనా?''

''శిష్యుడిగా పాసయితే ఏం లాభంరా సన్నాసీ! రాజకీయ నేతగా రాణించాలిగానీ...''

''మరి దానికేం చేయాలండీ?''

''ఏముందిరా... నీ అధినేత అడుగుజాడల్లో నడవాలి...''

''ఛీఛీ... అదేంటి సార్‌, అలాగనేశారు? ఇంత బతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్టు పోయి పోయి వాడి అడుగుజాడల్లో నడవాలంటారూ?''

''ఒరే దద్దమ్మా! నువ్వు రాజకీయం నేర్చుకుంటున్నదెందుకురా? అధికారంలోకి రావాలనేగా? అధికారంలోకి వచ్చేదెందుకు? అంతకంతకు వెనకేసుకోడానికేగా? మరందుకు ఎన్ని వెధవ్వేషాలు వేయాలో, ఎంత వంచన చేయాలో, ఎన్ని అబద్దాలు చెప్పాలో, ఎంతగా నమ్మించాలో తెలియద్దూ? మరి అధికారం అందాక నువ్విచ్చిన వాగ్దానాలన్నీ ఎలా తుంగలో తొక్కాలో, ఎలా ప్రజాధనం దండుకోవాలో, జనానికి మేలు చేయడానికే జన్మ ఎత్తినట్టు పైకి నటిస్తూ, వాళ్లనే ఎలా దోచుకోవాలో, సామాన్యుల కోసమే పథకాలు పెట్టినట్టు ప్రచారం చేసుకుంటూ వాటినే అడ్డం పెట్టుకుని లక్షలాది కోట్లు ఎలా నొక్కేయాలో, ప్రజల సంక్షేమం కోసమేనంటూ ప్రాజెక్టులు చేపట్టి, వాటి కాంట్రాక్టులు నీ అనుచరులకే కట్టబెట్టి వాళ్ల ద్వారా ప్రజల కష్టార్జితాన్ని ఎలా దర్జాగా పిండుకోవాలో ఇవన్నీ వంటబట్టించుకోవద్దూ? అంతేనా... నీ మీద నలభైనాలుగు కేసులున్నా, నువ్వోసారి జైలుకెళ్లొచ్చినా, బెయిలు మీద తిరుగుతూ పాలన చెలాయిస్తున్నా, పరిధి దాటి వెళ్లాలన్నా కోర్టుకు విన్నవించుకోవలసిన స్థితిలో ఉన్నా, ఎప్పుడు  కేసు విచారణకొచ్చి నిన్ను అరెస్టు చేస్తారో కూడా తెలియకపోయినా, అత్యున్నత న్యాయస్థానాలు నీ నిర్ణయాలను ఎన్ని సార్లు ఆక్షేపించి అక్షింతలు వేసినా, నీ చర్యలను సవాలక్ష సార్లు ఖండించి చీవాట్లు పెట్టినా, సిగ్గూ ఎగ్గూ లేకుండా అబద్దపు ప్రచారాలు చేసుకుంటూ తిరగాలన్నా, నువ్వు నవ్వినా ఏడ్చినట్టున్నా, నువ్వు ఏడిస్తే అందరికీ నవ్వొచ్చినా, నీ అనుచరులు హత్యలు చేసి కూడా అరెస్టు కాకుండా కాపాడాలన్నా, నీ సహచరులు అరాచకాలు చేసినా కేసులు లేకుండా చూడాలన్నా, స్వయంగా నీ బంధువర్గం హత్య కేసులో అనేక అనుమానాలు నీకేసే వేళ్లు చూపిస్తున్నా, నీ మీద ఉన్న కేసులను ముందుకు సాగనీయకుండా చట్టంలో ఏవేవో లొసుగులను ఉపయోగించుకుని పిచ్చి పిటీషన్లు వేస్తూ కాలయాపన చేయాలన్నా, నీ అక్రమార్జనకు సాయపడిన అధికారులను అందలమెక్కించి నీకు గులాములుగా చేసుకోవాలనుకున్నా, నీ మాట కాదన్న అధికారులను బెదిరించి వేధించి నీ దారికి తెచ్చుకోవాలన్నా, నీ చర్యలను ప్రశ్నించే నేతలను రాజద్రోహం కేసులు పెట్టి లాకప్లో కుళ్లబొడిచి పగ తీర్చుకోవాలన్నా, నీ నిజస్వరూపాన్ని ప్రజల ముందు బయట పెట్టి జనచైతన్యం తీసుకొస్తున్న నిజమైన నాయకుల సభలకు ఎక్కడలేని ఆంక్షలు పెట్టి అడ్డుకోవాలన్నా,  సభలకు స్థలాలిచ్చిన ఊళ్లలో ఇళ్లను బుల్డోజర్లు పెట్టి కూలగొట్టించి అమాయక ప్రజలను భయభ్రాంతులను చేయాలన్నా, నీ అధికారానికి అడ్డమొస్తాడనే అనుమానం కలిగితే చాలు ప్రతిపక్ష నేతల్ని కారణమైనా చెప్పకుండా అక్రమ అరెస్టులు చేయించి కారాగారాల్లోకి నెట్టాలన్నా, నీ కక్షసాధింపు పాలన విధానాల వల్ల విసిగిపోయిన ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే వాళ్ల మీదకి నీ గూండాలను ఉసిగొల్పి చితక్కొట్టించాలన్నా... నీకు అధికారం కావాలి కదరా? అందుకోసమైనా నువ్వు నీ అధినేత అడుగుజాడల్లో నడవాలి మరి...''

''అయ్యబాబోయ్‌... అధికారం ఉంటే ఇన్నేసి వెధవపన్లు హోల్సేలుగా చేసేయొచ్చన్నమాట. అడ్డం వచ్చిన వాళ్లని అరెస్టులు చేసెయొచ్చన్నమాట. అయినాగానీ గురూగారూ, నాకు తెలియక అడుగుతానూ ప్రజలు ఇవన్నీ గ్రహించలేరంటారా?''

''గ్రహించి తీరాలిరా... లేకపోతే అరెస్టుల వరెస్టు ఫెలో అరాచకానికి మరింతగా బలికాకతప్పదు... కాబట్టి  సంగతి గురించి కూడా బాగా ఆలోచించుకుని బరిలోకి దిగు... ఇక పోయిరా!''

-సృజన 

PUBLISHED ON 21.9.2023 ON JANASENA WEBSITE

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి