ఆదివారం, సెప్టెంబర్ 10, 2023

ఆ వరమియ్యి... వినాయకా!


''మూషికాసురా...''

కైలాసంలో మంచు కొండల మధ్య ప్రతిధ్వనించింది వినాయకుడి కంఠం. నున్నగా మెరుస్తున్న ఓ మంచు ఫలకంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ కిరీటాన్ని సవరించుకున్న వినాయకుడు కాసేపు వేచి చూసి మళ్లీ పిలిచాడు.

''మూషికా!''

హడావుడిగా, ఆపసోపాలు పడుతూ వచ్చింది మూషికం.

''స్వామీ పిలిచారా?''

''అవును మూషికా. ఎప్పుడూ భూలోక పయనమనగానే నా కన్నా ముందుగానే గుమ్మం ముందు సిద్ధంగా ఉంటావు కదా? మరివాళ ఏంటి ఎంత పిలిచినా ఇంత జాగు?''

''మీకేం స్వామీ! హాయిగా కుడుములూ, ఉండ్రాళ్లూ బొజ్జ నిండా భోంచేసి లంబోదరంతో లటుక్కున నా వీపు అధిరోహించి ఆసీనులవుతారు. మరి మీకు ఎక్కడా శ్రమ కలుగకుండా తీసుకెళ్లాలంటే నేను ఎన్ని కోణాల నుంచి ఎంతలా ఆలోచించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకోరు...''

''అదేంటి మూషికాసురా, కొత్తగా మాట్లాడుతుంటివి? అభిమాన ఆంధ్ర భక్త జనం దగ్గరకి వెళ్లడానికి ఇంత ఆలోచనేల? జాగ్రత్తలు దేనికి?''

''స్వామీ! మీరు ప్రసాదాలు అందుకుని వరాలు ఇచ్చే వినాయకుడు. కానీ అక్కడున్నది ఓట్లు కొల్లగొట్టి పాట్లు మిగిల్చే నాయకుడు. అందుకే నా భయం నాది...''

''అదేమిటి మూషికా? నాయకుడికి భయపడడమా? వింతగా ఉన్నదే! నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నట్టున్నావు?''

''లేదు స్వామీ లేదు. ఈమధ్య ఆంధ్ర దేశమున జరుగుతున్న పరిణామములను పరిశీలించియే మాట్లాడుచుంటిని...''

''ఏమిటా విపరిమాణములు?''

''ఏమున్నది స్వామీ! ఇక్కడ స్థితిగతులు వేరు. అక్కడి పరిస్థితులు వేరు. తమరు గణాధిపత్యము వహించడానికి తమ్ముడైన కుమారస్వామితో పోటీ పడిన సంగతి గుర్తున్నది కదా? మీ ఇరువురిలో ఎవరు భూలోకంలోని సకల తీర్థాలలోనూ స్నానాలు ఆచరించి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యమన్న నిబంధన కూడా తెలిసినదే కదా? అది వినగానే కుమారస్వామి నెమలి వాహనమెక్కి రివ్వున సాగిపోగానే మీరు మొదట బిక్కమొహం వేశారు. నాపై అధిరోహించి అంత వేగంగా దూసుకుపోవడం కష్టమని తలంచారు. అందువల్ల బుద్ధి కుశలతతో ఆలోచించి ఆదిదంపతులైన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి, సూక్ష్మంలో మోక్షంగా భూలోక ప్రదక్షిణ ఫలితాన్ని పొంది, పోటీలో గెలిచి సకల ప్రమధ గణాలకు అధినాయకుడయ్యారు. ఇక ఎప్పటికీ మీ పదవి మీదే. కానీ అక్కడ అలాకాదే? ప్రతి ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ప్రజల మనసు గెలిచి ఓట్లు పొందిన వారే నాయకుడవుతారు...''

''మంచిది. దేశ కాల మాన పరిస్థితులను బట్టి నాయకుడయ్యే విధి విధానాలు వేరువేరుగా ఉండవచ్చు. చక్కగా పాలించి, ప్రజలను అలరించి, తిరిగి పోటీలో గెలుపొందవచ్చు. ఇందులో చిక్కేమున్నది?''

''అది మీరన్నంత సులువు కాదు స్వామీ. అక్కడ కొలువుదీరిన నాయకుడు సుపరిపాలనను అందించినచో ధైర్యముగానే ఉండెడివాడు. కానీ అతగాడు పదవి పొందిన దగ్గర నుంచీ అరాచక పాలననే కావించినాడు. ప్రజలకు మేలు జరుగుతుందని పైకి మభ్యపెడుతూ ఏవేవో ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వ భూములను  అయినవారికి అప్పనంగా అప్పజెప్పి అందుకు ప్రతిఫలంగా వాటాలు అందుకొనినాడు. ఆ భూములను అందుకున్నప్రబుద్ధులంతా ఆ ప్రాజెక్టుల సంగతి విస్మరించి బహిరంగ మార్కెట్లో రియల్ఎస్టేటు అనెడి వ్యాపార లావాదేవీలలో వాటిని తెగనమ్ముకుని సొమ్ము చేసుకొనినారు. తన బంధుజనం చేతికి సైతం ఆ భూములు వచ్చేటట్టు చక్రం తిప్పడంలో ఆ నాయకుడు మహా ఘటికుడు...''

''ఔరా! ఎంతటి తెంపరితనము?''

''ఇంకా అవలేదు స్వామీ! ఆ నాయకుడు ప్రజలను వంచించడంలో ఆరితేరినవాడు. సురాపానము వలన సంసారాలు నాశనమయిపోతాయి కాబట్టి తాను పాలనలోకి వచ్చినచో మద్యమన్నదే రాజ్యంలో లేకుండా చూచెదనంటూ నమ్మబలికి, తీరా అధికారంలోకి వచ్చాక ఆ మత్తు వ్యాపారంలోకి తన అనుచరులనే దింపి దేశంలో మరెక్కడా లేనంతగా అమ్మకాలు పెంచుతూ ప్రజలను వ్యసన కూపంలోకి నెట్టినాడు. పైగా రకరకాల సురాపాన, మద్య, మత్తు పదార్థాలను వేర్వేరు పేర్లతో అమ్ముతూ, వాటి ధరలను సైతం అధికాధికం చేస్తూ జనం సొమ్మును పోగుచేసుకుంటున్నాడు...''

''ఇస్సీ! ఇంతటి అరాచకమా?''

''ఇంతే కాదు స్వామీ! ఆ నాయకుడి అండదండలతో అతడి అనుచరులు విజృంభిస్తూ ఎక్కడిక్కడ అత్యాచారాలను గావించుచున్నారు. అక్కడ మహిళలకు భద్రత కరవైనది ప్రభూ! చట్టమన్నది అక్కడ కానరాదు. న్యాయమన్నది సుంతయునూ లేదు. తాము చెప్పిందే వేదమన్నట్టు ఆ నాయకుడి పాలన సాగుతున్నది. ఎదురు తిరిగినచో ఎక్కడా కానరాని, ఎన్నడో కాలం చెల్లిన నిబంధనలతో అక్రమ కేసులు బనాయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడా నాయకుడు. ఇలా ఎన్నని చెప్పగలను స్వామీ... పచ్చని కొండకోనలను తవ్వి పోస్తూ వాటిలోని నిక్షేపాలను ఆరగించుచున్నాడు. గనులను కొల్లగొడుతున్నాడు. సామాన్యులకు ఇచ్చే రేషను బియ్యాన్ని సైతం అనుచరుల ద్వారా సేకరించి ఓడలకెత్తించి విదేశాలను తరలించి అధిక ధరలకు అమ్ముకుని వాటాలు అందుకొనుచున్నాడు. ధరవరలను పెంచినాడు. చెత్త పన్నులను విధించినాడు. ఛార్జీలు పెంచినాడు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాడు.  అది, ఇది అని అననేల? అన్ని వ్యవస్థలను నాశనం చేసినాడు...''

''అకటా! ఎంతటి కటకట? అయిననూ అతడి అరాచకముల ఫలితమును అతడే అనుభవించును కదా? మనకేల?''

''అక్కడికే వస్తున్నాను స్వామీ! పదవిలోకి వచ్చిన నాలుగేళ్లలో ఇంతలేసి దారుణ కృత్యములను చేసిన అతడికి ఇప్పుడు గెలుపు భయం పట్టుకున్నది. '' అంటే ఉలికి పడుతున్నాడు. '' అంటే అదిరిపడుతున్నాడు. అక్రమంగా అరెస్టులు చేయుచున్నాడు. ప్రశ్నించే వారెవరైనా ప్రజల వద్దకు వస్తున్నారన్న లేనిపోని  నిబంధనలు విధిస్తూ చట్టమును దుర్వినియోగము చేయుచున్నాడు. అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పలేదు స్వామీ...''

''ఏమిటా జాగ్రత్తలు మూషికా?''

''అరెస్టు చేయడానికి వీలుకాని విధంగా ముందస్తు బెయిలు తీసుకున్నాను స్వామీ...''

''...హ్హ...హ్హా! వెర్రి మూషికా! మనను ఎందుకు అరెస్టు చేయుదురయ్యా?''

''భలేవారు స్వామీ! కిందటి వినాయక చవితికి మీరు ఇచ్చిన వరాల వల్ల, అక్కడి ప్రతిపక్షానికి చెందిన సానుభూతిపరులెవరైననూ బాగుపడినట్టు అనుమానం సోకినచో అతడు అంతకు సైతం బరితెగించుననే భయం నాది స్వామీ... తమరు కాదనకూడదు...''

''నీ స్వామిభక్తి కడు ప్రశంసనీయము మూషికా! సరి... సరి... ఇంకేమి ఏర్పాట్లు చేసితివి?''

''ఏముంది స్వామీ! తమరు అనేక రకాలైన వేషధారణలతో భక్తుల అభిమతానికి తగినట్టు వేర్వేరు చోట్ల కొలువుదీరుతారు కదా స్వామీ? అందువల్ల మీ వాహనాలుగా బయల్దేరే మా మూషిక గణుములన్నింటి వీపులకు షాక్ఎబ్జార్బర్లు అనబడు సాంకేతిక పరికరములను అమర్చినాను. మూషిక సేనంతటికీ ఈతలో సైతము శిక్షణ ఇప్పించినాను...''

''ఇదెందుకు మూషికాసురా?''

''మరేమీ లేదు స్వామీ! అక్కడ ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణమన్నట్టు... అన్నింటి రహదారులు గోతులతో, గొప్పులతో, కంకర లేచిపోయి గతుకులతో అతుకులేసినట్టు అఘోరిస్తున్నాయి ప్రభూ! తమరు ఎక్కడికి వేంచేసినా మీకు కుదుపులు లేకుండా ఉండేందుకే ఈ   ఏర్పాటు. ఇక ఈమధ్య వర్షాలకు అక్కడి రహదారులపై గోతులన్నియూ వాన నీటితో నిండిపోయి, చెరువులను తలపిస్తున్నవి. అందుకనే తమరి వాహనములకు ఈతలో సుశిక్షితులను చేసినాను. అంతటితో ఆగక వ్యాయామములు సైతం చేయించినాను...''

''వ్యాయాయములెందుకయ్యా?''

''మీకు తెలియదు స్వామీ! మీరేమో చవితి పందిళ్లలో చల్లగా సేదతీరుతూ ఉంటారు. కానీ అక్కడ పోలీసులు ఎప్పుడు ఎప్పుడెవరి మీదకు దండెత్తుతారో తెలియని పరిస్థితులు ఉన్నాయి స్వామీ. నలుగురు గుమి గూడి ఒక చోట ప్రశాంతంగా నిద్రపోతున్నా కూడా... వారికి ప్రతిపక్ష గుడారాలేమోననే అనుమానం కలిగితే చాలు, విరుచుకు పడి లాఠీలతో కుమ్మించి, వ్యానుల్లోకి ఎక్కించి తీసుకుపోతున్న సంఘటనలు అనేకం నా దృష్టికి వచ్చాయి స్వామీ. అదే జరిగితే మీ దాకా రాకుండా వారిని నిలువరించుటకు మూషిక సైన్యానికంతటికీ దేహదారుఢ్యాన్ని మెరుగు పరిచే ప్రత్యేక శిక్షణ ఇప్పించాను స్వామీ...''

''నీ ఏర్పాట్లు వింతగా ఉన్నాయి మూషికా! ఇంకేమి చర్యలు తీసుకున్నావు?''

''నైట్విజన్కళ్లజోళ్లను కూడా సిద్ధం చేసినాను స్వామీ!''

''ఏమా వింత సులోచనాలు? అవెందులకు?''

''అక్కడి నాయకుడి అసమర్థ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్అంతా అంధకార బంధురంగా తయారైంది ప్రభూ! ఎప్పుడు కరెంటు పోతుందో, ఎంత సేపటికి వస్తుందో ఎవరూ చెప్పలేరు. పాపం... తమ భక్తులు ఎంతో ఖర్చు పెట్టి వినాయక పందిళ్లను రంగురంగుల కాంతులిచ్చే బల్బులతో అలంకరించిననూ కరెంటు పోతే అంతా చీకటే కదా స్వామీ? అందుకే చీకట్లో సైతం చూడగలిగే నైట్విజన్కళ్లజోళ్లు సిద్ధం చేయించాను. కరెంటు పోయినప్పుడు మన మూషికములు సైతం అవి పెట్టుకుని వచ్చే పోయే జనం రాకపోకలను నిశితంగా గమనిస్తూ ఉండాలని సూచించాను స్వామీ...''

''జనాన్ని గమనించడం దేనికయ్యా?''

''ఏమని చెప్పను స్వామీ? అక్కడి అధినాయకుడు మత విద్వేషాలను సైతం రెచ్చగొట్టి ప్రజలను విభజించి పాలించాలనే నీచ నైజము కలవాడు. అతడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆలయాలపై మత విద్యేషకుల ఆగడాలు మితిమీరిపోయాయి ప్రభూ! విగ్రహాలను ధ్వంసం చేయడం, విరూపులను చేయడం, రథములను దగ్ధం చేయడం లాంటి వికృత చేష్టలు పెచ్చుపెరిగి పోయాయి. ఆ దుశ్చర్యలకు పాల్పడిన వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు సైతం తీసుకోకపోగా, వారందరినీ కేవలం పిచ్చివాళ్లుగా జమకట్టి కేసులను నీరుగార్చారు స్వామీ. అందుకే నేనింతగా భయపడుతున్నది...''

''ఔరౌరా... మూషికాసురా! అక్కడి అకృత్య, అతిహేయ, అతినీచ, అరాచక, అన్యాయ, అధోగమన, అధమాధమ, అధ్వాన పరిపాలనా తీరుతెన్నులను వింటున్నకొద్దీ ఆగ్రహము కలుగుచున్నది. ఆ అధినాయకుడి దారుణ, దుస్సహ, దుర్నిరీతి, దౌర్జన్య, దుండగ, దరంహంకార, దుర్భర, దౌర్భాగ్య కృత్యములను తెలుసుకుంటున్న కొద్దీ నా ఆవేశము అధికమవుతున్నది. ఆ ఆంధ్ర దేశమున నా అమాయక, సామాన్య, నిర్బాగ్య, నిరుపేద, నిస్సహాయ భక్తజనం బాధలను తీర్చే మార్గమే లేదా?''

''ఉంది ప్రభూ...''

''ఏమది?''

''అక్కడ వందలాదిగా వెలసే తమరి వినాయక పందిళ్లలో రైతులు తమ బాధలు మొరపెట్టుకుందురు. మహిళలు తమ అగచాట్లను ఏకరవు పెట్టుకుందురు. నిరుద్యోగులు తమ ఆశలను విన్నవించుకుందురు. సామాన్యులు తమ కష్టాలు చెప్పుకుందురు. ప్రజలు తమ వెతలు వినిపించుదురు. వ్యాపారులు తమ గోడు వెల్లబోసుకుందురు. ఇలా అన్ని వర్గాల వారూ తరలి వచ్చి మీ ముందు మొట్టికాయలు వేసుకుని, గుంజీలు తీసి తమ ఘోషను వినమని ప్రార్థించెదరు. తమరు తమ చేటల్లాంటి చెవులతో వారి ఇక్కట్లను ఆలకించి, వారి ఆకాంక్షలను తమరి లంబోదరంలో పెట్టుకుని, ఈసారి ఎన్నికలలో ఇప్పటి అధమాధమ నాయకులను కాక... జనం కోసం నిలబడే, జనం వెన్నంటి ఉండే, జనం వెంట నడిచే, జనం ఆకాంక్షలను నెరవేర్చే, జనం కోసం నిస్వార్థంగా పనిచేసే, జన సంక్షేమమే కోరుకునే, సరైన జనసేనా నాయకులనే ఎన్నుకోవాలనే విచక్షణా శక్తిని, ఎలాంటి ప్రలోభాలకు లొంగ కుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోగలిగే వివేచనని మీ భక్తులందరికీ కలిగించేలా మీ తొండంతో ఆశీర్వదించండి ప్రభూ! అప్పుడిక ఆంధ్రప్రదేశ్అగచాట్లన్నీ తీరినట్టే!!''

''లెస్స పలికితివి మూషికా! అయితే పద!!''

-సృజన

PUBLISHED ON 10.9.2023 ON JANASENA WEBSITE

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి