మంగళవారం, జనవరి 16, 2024

రమణీయం... రామాయణం!



 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

''పర్వతాలు, నదులు, నక్షత్రాలు ఉన్నంత కాలం భూమ్మీద రామాయణం ఉంటుంది'' అని బ్రహ్మ దేవుడు చెప్పాడు. అంటే సృష్టి ఉన్నంత కాలం రామాయణాన్ని ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. పారాయణం చేస్తూనే ఉంటారు. తల్చుకుంటూనే ఉంటారు. తన్మయులవుతూనే ఉంటారు. రాముడి కథ అంత మధురమైనది. అయితే  కథ చుట్టూ అనేక కల్పనలు, ఊహాగానాలు  అల్లుకుపోయాయి. వీటన్నింటి మధ్య అసలు రామాయణంలో ఏముంది? అని తెలుసుకోవాలంటే వాల్మీకి రాసిన మూలగ్రంథం వైపే దృష్టి సారించాలి. కానీ నేటి తరం  పని చేస్తోందా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. రామాయణం గురించి, అందులోని పాత్రల గురించి అందరూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ వాల్మీకి రామాయణాన్ని చదివిన వారు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నారు. అందుకనే నేటి తరం కోసం, ముఖ్యంగా ఈనాటి పిల్లల కోసం  రామాయణంలోని అసలు కథను సరళంగా, విపులంగా చెప్పాలనే ప్రయత్నమే ఇది.

రామాయణం ఆధారంగా ప్రాచర్యంలో ఉన్న కథలకు, సినిమాలకు భిన్నంగా అనేక ఘటనలు వాల్మీకి రామాయణంలో కనిపిస్తాయి. అంటే రాముడి కథను జనరంజకంగా చెప్పడం కోసం ఎన్నో మార్పులు, చేర్పులు చేశారని అర్థం అవుతుంది.  మరయితే అసలైన రాముడి కథ ఏంటి?   సందర్భాల్లో రాముడు ఎలా మాట్లాడాడు? ఎలా ప్రవర్తించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం తెరిచి చదవాల్సిందే. తరచి చూడాల్సిందే.

రామాయణాన్ని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రాశాడు.  శ్లోకాలు 6 కాండలు, 500 సర్గలు, 100 ఉపాఖ్యానాలుగా కనిపిస్తాయి. కాండలంటే  పాఠాల్లో అధ్యాయాల్లాంటివన్న మాట. బాలకాండ, అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధకాండల్లో రాముడి పుట్టుక నుంచి పట్టాభిషేకం వరకు ఉంటుంది. వీటితో పాటు ఉత్తర కాండను కూడా వాల్మీకి మహర్షి రచించాడు. ఇందులో రాముడి కుమారులైన లవకుశులు పుట్టడం నుంచి రాముడు తన అవతారాన్ని చాలించడం వరకు ఉంటుంది.

ఇప్పుడు మనం బాలకాండలోకి ప్రవేశిద్దాం. ఇందులో 77 సర్గలు ఉంటాయి. అంటే ఇవి పాఠాల్లో ఛాప్టర్ల వంటివన్నమాట. వీటిలో మొదటి సర్గ పేరు సంక్షిప్త రామాయణం. వంద శ్లోకాలతో కూడిన ఇందులో మొత్తం రామాయణం క్లుప్తంగా ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చినప్పుడు వారిద్దరి సంభాషణగా ఇది కనిపిస్తుంది.  కథేంటో మనం కూడా చూద్దాం.

రామాయణాన్ని రచించిన వాల్మీకి మహా తపస్వి. ఆయన ఆశ్రమానికి ఒకసారి నారదుడు వచ్చాడు. నారదుడు బ్రహ్మదేవుడి కుమారుడు. గొప్ప యోగి పుంగవుడు. దేవర్షి. ఆయన ముల్లోకాలలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్లగల శక్తి కలవాడు. తన ఆశ్రమానికి వచ్చిన నారదుడిని వాల్మీకి అడిగిన ప్రశ్నతో  సర్గ మొదలవుతుంది.  

'' మహర్షీ! అన్నీ మంచి గుణాలే ఉన్నవాడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చలించని వాడు, అన్ని ధర్మాలు తెలిసిన వాడు, ఆడితప్పని వాడు, అన్ని శాస్త్రాలు చదివిన వాడు, ధైర్యవంతుడు, మహా వీరుడు, అన్ని ప్రాణుల హితాన్ని కోరుకునే వాడు, చూడగానే అందరికీ ఆనందాన్ని కలిగించే వాడు ఎవరైనా  భూమి మీద ఉన్నారా? ఉంటే  మహానుభావుడిని గురించి తెలుసుకోవాలని ఉంది'' అని వాల్మీకి అడిగాడు.

దానికి నారదుడు, ''వాల్మీకీ! నువ్వు అడిగిన గుణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉండడం సాధారణంగా జరగదు. అయినా అలాంటి ఉత్తమ పురుషుడు ఉన్నాడు. అతడే శ్రీరాముడు. ఇక్ష్వాకుల వంశంలో పుట్టాడు. ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్నాడు కూడా. అతడి కథ చెబుతాను విను'' అంటూ చెప్పడం మొదలు పెట్టాడు. ఇలా చెబుతూ రాముడి రూపాన్ని,గుణగణాలను కూడా వర్ణించాడు నారదుడు.

''రాముడు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. మితంగా మాట్లాడుతాడు. ఎత్తయిన భుజాలు కలవాడు. బలమైన బాహువులు కలవాడు. అంత పొట్టి కాదు, మరీ పొడుగూ కాదు. అవయవాలన్నీ చక్కగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి. అతడి ముఖం  ఎంతో అందంగా ఉంటుంది. నుదురు అర్థ చంద్రాకారంలో చక్కగా ఉంటుంది. విశాలమైన కన్నులు కలవాడు. అతడి బాహువులు, మోకాళ్లను తాకుతూ ఉంటాయి. అందుకనే అతడిని ఆజానుబాహువు అంటారు. విశాలమైన వక్షస్థలం కలవాడు. బలమైన ధనుస్సును ధరించి ఉంటాడు. అడవిలో ఏనుగులాగా ఎంతో  గంభీరమైన నడక కలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడికి అన్నీ శుభలక్షణాలే. తనను ఆశ్రయించిన వారిని తప్పక ఆదుకునేవాడు. ఆడిన మాట తప్పడు. ప్రజలందరికీ హితమును చేకూరుస్తాడు. అందరితోనూ ఎంతో ఇష్టంగా, మధురంగా మాట్లాడుతాడు. అన్ని శాస్త్రాలను చదువుకున్నాడు. వేదాలు, వేదాంగాల అర్థాలన్నీ తెలిసినవాడు. ఎప్పుడూ సౌమ్యంగా ఉంటాడు. ఉదారంగా, దయతో ప్రవర్తిస్తాడు. గురువులు, పెద్దల పట్ల ఎంతో వినయ విధేయతలతో మసలుకుంటాడు. అందరితోనూ ఎలాంటి తారతమ్యాలు, వైషమ్యాలు లేకుండా ఉంటాడు. గాంభీర్యంలో సముద్రుని వంటి వాడు. ధైర్య సాహసాలలో హిమాలయ పర్వతంలా స్థిరమైనవాడు. చంద్రుడిలాగా చల్లనైనవాడు. ఆహ్లాదకరమైన వాడు. సుతి మెత్తని హృదయం కలవాడే అయినా, తన ఆశ్రితులకు అపకారం చేసిన వారి పట్ల ప్రళయ కాలంలో ప్రజ్వరిల్లే అగ్నిలాంటి వాడు. ఓర్పులో భూదేవి అంతటి సహనం కలవాడు. పరిపాలన విషయంలో ధర్మదేవతలాంటి వాడు. పరాక్రమం విషయంలో అతడికి సాటి అయిన వారెవరూ లేరు'' అంటూ నారదుడు వివరించాడు.

 తర్వాత రాముడి కథను చెప్పాడు. ఇలా చెప్పడంలో మొత్తం రామాయణాన్ని ముఖ్యమైన ఘట్టాలతో వివరించాడు.

కోసల రాజైన దశరథుడు, తన నలుగురు పుత్రులలో పెద్దవాడైన రాముడికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు. అది తెలిసిన దశరథుడి ప్రియ భార్య కైకేయి వ్యతిరేకిస్తుంది. ఆయన గతంలో తనకు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఇవ్వాలని అడుగుతుంది.  వరాలలో మొదటిదిగా రాముడిని వనవాసానికి పంపాలని, రెండోదిగా తన కుమారుడైన భరతుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని కోరుతుంది. ఆడి తప్పని దశరథుడు విధిలేక అందుకు ఒప్పుకుంటాడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు వనవాసానికి బయలుదేరుతాడు. రాముడి వెంట వెళ్లడానికి అతడి సోదరుడైన లక్ష్మణుడు, భార్య సీత కూడా సిద్ధపడతారు. అలా వాళ్లు ముగ్గురూ రాజ్యం విడిచి అడవులకు వెళ్లిపోతారు.  విచారంతో దశరథుడు మరణిస్తాడు. జరిగినదంతా తెలుసుకున్న కైకేయి కుమారుడు భరతుడు, రాజ్యాధికారాన్ని చేపట్టడానికి అంగీకరించడు. అడవులకు వెళ్లి రాముడిని తిరిగి రమ్మని ప్రార్థిస్తాడు. రాముడు అందుకు అంగీకరించక భరతుడికి నచ్చచెప్పి తనకు బదులుగా తన పాదుకులను ఇచ్చి అయోధ్యకు పంపుతాడు.  వనవాసం చేస్తూ సీతా రామ లక్ష్మణులు దండకారణ్యం చేరుకుంటారు. అక్కడ లంకాధిపతి రావణాసురుడి సోదరి అయిన శూర్పణఖ, రాముడిని చూసి మోహిస్తుంది. రాముడు తిరస్కరించడంతో సీతను చంపబోతుంది. అప్పుడు లక్ష్మణుడు  శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు. శూర్పణఖ మాటలపై ఖరుడు, దూషణుడు మొదలైన పద్నాలుగు వేల మంది రాక్షసులు యుద్ధానికి వస్తే రాముడు ఒక్కడే అందరినీ చంపేస్తాడు. శూర్పణఖ ద్వారా అది తెలిసిన రావణుడు పగపట్టి, మారీచుడనే రాక్షసుడి సాయంతో సీతను ఎత్తుకుపోతాడు. సీతను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధ చేరుకుంటారు. అక్కడ హనుమంతుడిని కలుసుకుంటారు. అతడి ద్వారా రాముడు, వానరుడైన సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు. సుగ్రీవుడి వివరాలన్నీ తెలుసుకుని అతడిని తరిమికొట్టిన అతడి అన్న వాలిని చంపుతాడు. కిష్కింధ రాజైన సుగ్రీవుడు, తన సైన్యమైన వానరులను సీతను వెతకడం కోసం నలుమూలలకు పంపుతాడు. అలా వెతుకుతూ బయల్దేరిన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకంటాడు. అక్కడ సీతను చూస్తాడు. త్వరలోనే రాముడు వస్తాడని ధైర్యం చెబుతాడు. అశోకవనాన్ని ధ్వంసం చేసి, తనను బంధించడానికి రావణుడు పంపిన  వేలాది రాక్షస సైన్యాన్ని మట్టుబెడతాడు. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన ఐదుగురు సేనాపతులను, ఏడుగురు మంత్రి కుమారులను, రావణుడి కొడుకైన అక్షకుమారుని కూడా సంహరిస్తాడు. రావణుడి మరో పుత్రుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కావాలనే కట్టుబడి, రావణుడి సభలో బందీగా ప్రవేశిస్తాడు. రావణుడిని హెచ్చరిస్తాడు. రావణాసురుడి ఆజ్జపై రాక్షసులు తన తోకకు నిప్పంటిస్తే  మంటలతో లంకను దగ్ధం చేస్తాడు. తిరిగి సముద్రాన్ని దాటి రాముడి దగ్గరకు వచ్చి సీత ఎక్కడ ఉన్నదీ చెబుతాడు. రాముడు వానర సైన్యంతో కలిసి లంక దిశగా బయల్దేరి దక్షిణ సముద్రానికి చేరతాడు. సముద్రుడిని ప్రసన్నం చేసుకుని నలుడి సాయంతో వారధిని నిర్మిస్తాడు. దాని మీదుగా అసంఖ్యాక వానర సైన్యంతో సహా లంకలోకి ప్రవేశించి రావణుడితో యుద్ధం చేసి చివరకి రావణుడిని సంహరిస్తాడు. సీత చెర విడిపించి ఆమె పవిత్రతను లోకానికి చాటడం కోసం కఠినంగా మాట్లాడుతాడు.  మాటలను భరించలేక సీత అగ్నిలో ప్రవేశించగా, అగ్నిదేవుడు ప్రత్యక్షమై 'సీతాదేవిలో ఎటువంటి దోషము లేదు' అని ప్రకటిస్తాడు. రావణుడి సోదరుడైన విభీషణుడికి లంకా రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసి, తనను అభినందించడానికి వచ్చిన దేవతల నుంచి వరం పొంది యుద్దంలో మరణించిన వానర సైన్యాన్నంతటినీ బతికిస్తాడు. ఆపై విభీషణుడు, సుగ్రీవుడు మొదలైన ప్రముఖులతో కలసి పుష్పక విమానంపై అయోధ్య చేరుకుని పట్టాభిషేకం చేసుకుంటాడు. రామరాజ్యంలో ప్రజలందరూ ఎలాంటి కరువు కాటకాలు, వ్యాధులు, అకాల మరణాలు లేకుండా ఎంతో సుఖ సంతోషాలతో వర్థిల్లుతారు. రాముడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించిన అనంతరం వైకుంఠానికి చేరుకుంటాడు.

ఇలా రామాయణం కథలో ముఖ్యాంశాలన్నీ చెప్పిన తర్వాత నారదుడు, '' రామాయణాన్ని నిత్యం పారాయణ చేసేవారు అన్నిపాపాల నుండీ విముక్తులవుతారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెంది చివరకు మోక్షాన్ని పొందుతారు'' అంటూ వాల్మీకికి వివరించాడు.

నారదుడి ద్వారా రాముడి కథను విన్న వాల్మీకి  తర్వాత ఏం చేశాడు? రామాయణాన్ని కావ్యంగా రాయాలనే ఆలోచన ఆయనకి ఎలా కలిగింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇవన్నీ మనం రెండో భాగంలో చెప్పుకుందాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి