శుక్రవారం, జనవరి 26, 2024

రామాయణాన్ని తొలిసారిగా పాడింది కుశలవులే!

 

పిల్లల కోసం రాముడి కథ-2

వాల్మీకి మహర్షి ఆశ్రమానికి దేవర్షి నారదుడు వచ్చి రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పాడు. రాముడి గుణగణాలను కూడా వర్ణించి చెప్పాడు. నారదుడు అలా చెప్పే సమయానికి రాముడు రాజ్యపాలన చేస్తున్నాడు. అంటే అప్పటికే వనవాసం, రావణాసురుడి వధ పూర్తయ్యాయి. రాముడు అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషేకం కూడా చేసుకున్నాడు. అంతేకాదు, నారదుడు చెప్పిన రాముడి కథను వాల్మీకి రచించే సమయంలోనే మరో ముఖ్యమైన అంశం జరిగింది. గర్భవతి అయిన సీతను రాముడు అడవుల్లో వదిలేయాల్సి వచ్చింది. సీతను వాల్మీకి తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. అక్కడే లవకుశలు పుట్టారు. వాళ్లు వాల్మీకి ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని మొదటగా లవకుశలే గానం చేశారు. అంటే వాళ్ల ద్వారానే రామాయణం అందరికీ తెలిసిందన్నమాట.

ఇప్పుడు మనం, నారదుడు చెప్పిన రామకథను వాల్మీకి రామాయణంగా రచించడానికి ప్రేరణ ఎలా కలిగిందో తెలుసుకుందాం. అంటే ఇది రామాయణ కావ్యానికి ప్రారంభమన్నమాట.

వాల్మీకి ఆశ్రమం తమసా నది తీరంలో ఉండేది. ఇది గంగానదికి ఉపనది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్రాష్ట్రాలలో ప్రవహిస్తోంది. నారదుడు వెళ్లిపోయాక వాల్మీకి తన శిష్యుడు భరధ్వాజుడుతో కలిసి తమసా నది దగ్గరకు వెళ్లాడు. నదిలో స్నానం చేస్తూ ప్రకృతి దృశ్యాలను గమనించసాగాడు. అక్కడ ఆనందంగా కేరింతలు కొడుతున్న రెండు క్రౌంచ పక్షులను చూశాడు. వాటిని చూస్తుండగానే ఓ వేటగాడు వాటిలో మగపక్షిని బాణంతో కొట్టాడు. బాణం గుచ్చుకుని రక్తం కారుతూ గిలగిల కొట్టుకుంటున్న దాని దగ్గరకు ఆడపక్షి చేరి దీనంగా అరుస్తూ ఏడవసాగింది. అది చూసిన వాల్మీకి ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడింది. దాని అర్థం ఏమిటంటే... ''ఓ వేటగాడా! అనురాగంతో ఉన్న పక్షుల జంటలో ఒక దాన్ని చంపేశావు. నీవెంతో కాలం జీవించవు సుమా'' అని! సంస్కృత భాషలో ఆయన అనుకోకుండా పలికిన ఆ శ్లోకమే రామాయణ కావ్య రచనకు నాంది పలికింది. ఆ శ్లోకం ఓ ప్రత్యేకమైన ఛందస్సుతో ఉంది. లయబద్ధంగా ఉంది. సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో ఉన్న ఆ శ్లోకం వాయిద్యాల సాయంతో పాడడానికి కూడా అనువుగా ఉంది. వాల్మీకి నోటి వెంట వచ్చిన ఈ శ్లోకాన్ని ఆయన పక్కనే ఉన్న శిష్యుడు భరధ్వాజుడు విని గుర్తు పెట్టుకున్నాడు. వెంటనే కంఠస్థం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. వాల్మీకి మహర్షి తన నోటి వెంట వెలువడిన ఆ శ్లోకం గురించే ఆలోచిస్తుండగా అక్కడ బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యానికి గురైన వాల్మీకి ఆయనకు నమస్కరించాడు. అప్పుడు బ్రహ్మ, ''వాల్మీకీ! నువ్వు పలికినది ఛందోబద్ధమైన శ్లోకం. నా సంకల్పం వల్లనే అది నీ నోట పలికింది. ఈ ఛందస్సులోనే నువ్వు రాముడి కథను రచించు. నారదుడు నీకు చెప్పిన అంశాలతో పాటు మరిన్ని వివరాలు కూడా నీ కళ్ల ముందు కదలాడుతాయి. వాటి ఆధారంగా నువ్వు రాసే రామాయణంలో అన్నీ సత్యాలే ఉంటాయి. అందులోని పదాలలోకానీ, వాక్యాలలో కానీ, అర్థాలలో కానీ ఎలాంటి దోషాలూ ఉండవు. ఆ రామకథ పాపాలను పోగొడుతుంది. విన్నమాత్రం చేతనే పరమానందాన్ని కలిగిస్తుంది. ఈ భూమి మీద పర్వతాలూ, నదులు ఉన్నంత కాలం రామాయణం నిలిచి ఉంటుంది. నీ కీర్తి ప్రతిష్ఠలు ముల్లోకాల్లోనూ వ్యాపిస్తాయి'' అని చెప్పి అదృశ్యమయ్యాడు. వాల్మీకి ఎంతో ఆనందించి బ్రహ్మ చెప్పినట్టుగానే రామాయణ కావ్య రచనకు పూనుకున్నాడు.

వెంటనే రాముడి కథంతా వాల్మీకి యోగదృష్టికి యథాతథంగా, కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఆ కథకు సంబంధించిన సన్నివేశాలు, అందరి మాటలు, మనోభావాలు సైతం ఆయనకు పూర్తిగా, వివరంగా అవగతమయ్యాయి. అలా వాల్మీకి రాముడు పుట్టడం దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు రామాయణాన్ని ఆరుకాండలుగా, 500 సర్గలుగా, 24 వేల శ్లోకాలతో పూర్తి చేశాడు. రాముడి పట్టాభిషేకం తర్వాత ఏం జరిగిందో, జరుగుతోందో, జరుగబోతోందో కూడా ఆయన దివ్యదృష్టికి గోచరమైంది.

రమణీయమైన రామాయణాన్ని పూర్తి చేశాక, దాన్ని గానం చేయడానికి తన ఆశ్రమంలోనే పుట్టి పెరిగి, తన వద్దనే సకల విద్యలూ నేర్చుకున్న కుశలవులే తగిన వారని వాల్మీకి మహర్షి భావించాడు. వాళ్లకి దాన్ని నేర్పించాడు. ముని బాలుర వేషంలో ఉన్న కుశలవులు రామాయణాన్ని చక్కగా నేర్చుకుని, శ్రావ్యంగా పాడడంలో ఆరితేరారు. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన అనేక మంది రుషులు, మునులు కుశలవుల నోటి వెంట రామాయణాన్ని విని పరమానంద భరితులై ఆశీర్వదించారు. అలా కుశలవులు రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్య  చేరి శ్రీరాముడి దృష్టిని కూడా ఆకర్షించారు. రాముడి సభలో ప్రజలందరి సమక్షంలో కూడా అద్భుతంగా రామాయణాన్ని ఆలపించారు. వారి ద్వారా లోక ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని తిరిగి మనం కూడా మొదటి నుంచీ తెలుసుకుందాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి