సోమవారం, జనవరి 15, 2024

అసలైన పండగంటే అదే!



''సంక్రాంతి శుభాకాంక్షలు గురూగారూ...''

''నీక్కూడారా. ఏంటి సంగతులు?''

''ఏమున్నాయండీ... ఊరికి పోయొచ్చానండి. ఎక్కడ చూసినా గంగిరెద్దులోళ్లు, సన్నాయి నాదాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు కనిపిస్తున్నాయండి. పండగ సందడి వచ్చేసిందండి...''

''నేనడిగింది  సంగతులు కాదురా. ఊళ్లలో జనం ఏమనుకుంటున్నారని...''

''ఏమనుకుంటారండీ? పెద్ద పండగొచ్చేసిందని సందడిగా ఉన్నారండి...''

''అది సరేలేరా. ఇంకా ఏమనుకుంటున్నారో గమనించలేదా?''

''... ఏముంటాయండీ? కోడి పుంజులకి జీడిపప్పు, బాదం పెడుతూ పందేలకి సిద్ధం అవుతున్నారండి. ఎద్దులను బాగా మేపుతూ బండ లాగుడికి ఏర్పాట్లు చేసుకుంటున్నారండి. పిడకల దండలు, కట్టె పుల్లలు భోగి మంటలకి సిద్ధమండి. సంక్రాంతికైతే పెద్ద పెద్ద ప్రభలు కడుతున్నారండి. అబ్బో...ఇక పిట్టల దొరలు, కొమ్మ దాసరోళ్లు, హరిదాసుల సంగతి చెప్పక్కర్లేదండి. జనం కూడా ఆటి గురించే మాట్లాడుకుంటారు కదండి మరి...''

''ఏడిశావ్దద్దమ్మా... నా దగ్గర రాజకీయాలు నేర్చుకుంటున్నావు కానీ, నీకు  పాఠాల లోతు ఎక్కినట్టు లేదు. నువ్వు ఊరెళ్లినా, ఊళ్లోనే ఉన్నా, షికారెళ్లినా, కరివేపాకు కోసం సంతకెళ్లినా, ఆఖరికి తింటున్నా, నిద్రపోతున్నా కూడా నువ్వు రాజకీయాల గురించే ఆలోచించాలిరా.  సంగతి పట్టకుండా కోళ్లంటావ్‌, పిడకలంటావ్‌... ఏంటో!''

''... అదాండీ. ఇప్పుడర్థమైందండి...''

''ఏమర్థమైంది? అసలు  పండక్కి  ప్రత్యేకత ఉంది. అదేంటో చెప్పు చూద్దాం...''

''అంటే మీరు  పాఠం మొదలెట్టేశారని మాత్రం అర్థమైందండి.  ప్రత్యేకత ఏంటో మీరే చెబుదురూ...''

''ఓరెర్రెదవా.  పెద్ద పండగుంది చూశావూ? ఇది నీ పాలకులకు ఆఖరిదిరా...''

''అంటే...వచ్చే పెద్ద పండక్కి ఆళ్లు ఉండరాండీ?''

''ఏడిశావ్‌! ఎందుకుండర్రా...ఉంటారు. కానీ ఎక్కడుంటారనేదే ప్రశ్న. కుర్చీ మీదా? బెంచీ మీదా? అని...''

'' కుర్చీలు, బెంచీలేంటండి బాబూ?''

''కుర్చీ అంటే అధికార పీఠం, బెంచీ అంటే ప్రతిపక్షంరా బడుద్ధాయ్‌. అందుకే నాడి ఏమైనా పట్టుకున్నావా, అని అడిగాను...''

''నాడి చూడ్డానికి నేనేమైనా డాక్టర్నేంటండి. కావాలంటే మా ఊరి డాక్టరుగారిని అడిగి చెప్పమంటే చెబుతానండి...''

''ఓరి దద్దమ్మా... నిన్నడగడం నాదే బుద్ధి తక్కువరా. నేనంటున్నది నీ నాడి, నా నాడి, రోగుల నాడి కాదురా. ప్రజానాడి. అర్థమైందా?''

''అదాండీ...  నాడి చూడాలంటే రాజకీయాలను చీల్చి చెండాడే మీ లాంటి వారికే సాధ్యమండి. కాబట్టి  నాడులేంటో, నానుడులేంటో మీరే చెప్పండి గురూగారూ?''

''నేను చెప్పడం కాదురా. నీచేతే చెప్పిస్తాను. నీలాంటి శిష్యుడికి గురువయ్యాక చేసేదేముంది? నువ్వు పండగ మూడ్లో ఉన్నావు కాబట్టి  పద్ధతిలోకే వస్తాను. ఊరికెళ్లొచ్చావు కదా? నీకు బాగా నచ్చిన గంగిరెద్దు మేళం ఏంటో చెప్పు...''

''ఇలాంటివడిగితే చులాగ్గా చెప్పగలనండి. మా ఊరి నడిబొడ్డులో జగ్గూగాడని ఒకడున్నాడండి. అబ్బో... ఆడి మేళం చూసి తీరాలండి.

ఎలాంటి ఎద్దయినా ఆడి మాట వినాల్సిందేనండి. ఆడు చెప్పినట్టల్లా ఆడాల్సిందేనండి. 'అయ్యగారికి దండం పెట్టు...' అంటే పెట్టేస్తుందండి. డాన్సాడమంటే స్టెప్పులేస్తదండి. కొమ్మిసరమంటే కోపంగా ఇసిరేస్తుందండి. మా ప్రాంతంలో  జగ్గూగాడు భలే ఫేమస్సండి బాబూ...''

''మరి ఆడికన్నా గొప్పోడున్నాడని తెలుసా? ఈడు రాష్ట్రంలోనే ఫేమస్సొరే...''

''అవునాండీ? ఎవడండీ ఆడు?''

''ఇంకెవర్రా మీ అధినేతే. మీ జగ్గూగాడిలాగే ఈడు కూడా గొప్ప మేళంగాడు. పెద్ద జగ్గూగాడన్నమాట. మీ వాడు ఎద్దుల్నిఆడిస్తే, ఈడు ఏకంగా అధికారుల్ని, పోలీసుల్ని గంగిరెద్దుల్లాగా ఆడిస్తున్నాడు. ఈడు చెప్పినట్టల్లా వినాల్సిందే ఎవరైనా. ఈడు 'అవతలి వాడిపై కేసు పెట్టు...'' అంటే చాలు, పోలీసులు పరుగులు పెడతారు. చట్టాన్ని చాపచుట్టేసి, రాజ్యాంగాన్ని తిరగేసి ఎక్కడలేని కేసులు తీసుకొచ్చి బనాయిస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు రాజద్రోహం అంటున్నారు. నిలదీస్తే చాలు జైల్లోకి తోస్తున్నారు. అడిగితే చాలు అడ్రస్లేకుండా చేస్తున్నారు. ఉద్యమిస్తే ఊపిరాడనీయడం లేదు. నిరసన చేస్తే నిర్బంధం చేస్తున్నారు. ఒక్క ఈడే కాదురోయ్‌... ఈడి అనుచర నేతలు కూడా మేళం కట్టడంలో మహానుభావులే. ఎక్కడికక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సామాన్యుల్ని భయపెడుతున్నారు. ఈళ్లంతా కలిసి వ్యవస్థల్నికూడా ఆడిస్తున్నారు కదరా? గమనించలేదా?''

''అయ్బాబోయ్! అవునండి.  నేతలంతా కలిసి ఆడించే గంగిరెద్దు మేళం ముందు ఏదీ తూగదని అర్థమైందండి...''

''మంచిది. ఇక ఇప్పుడు కోడి పందేల దగ్గరకి వద్దాం. కోళ్ల కాళ్లకి కత్తులు కట్టి వాటిలో అవి కొట్టుకుంటుంటే పందాలు కాస్తారుగా? అందులో కూడా మీ అధినేత తర్వాతే ఎవరైనా. కులాలని, మతాలని, ప్రాంతాలని, వర్గాలని జనాన్ని విడదీసి, ఆళ్లు కొట్టుకుంటుంటే పండగ చేసుకుంటున్నాడు. విద్వేషాలు రెచ్చగొట్టి విభజించి పాలిద్దామని చూస్తున్నాడు.  మతానికి చెందిన ఆలయాలపై దాడులు చేసిన వాళ్లపై కేసులు లేవు. మరో మతానికి చెందిన ప్రార్థనాలయాలను ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తుంటే మిన్నకుంటున్నాడు. కులద్వేషాలు ఎగసన దోస్తున్నాడు. వర్గవైషమ్యాలను రెచ్చగొడుతున్నాడు. బడుగులపై, మహిళలపై, నిస్సహాయులపై ఆడి అనుచరులు, నేతలు దాడులు చేసినా చోద్యం చూస్తున్నాడు. ఊళ్లలో కోడి పందేలోళ్లు ఏం చేస్తార్రా? పోటీలకు ముందు నుంచే ఆటికి జీడిపప్పులు, బాదం పప్పులు తినిపిస్తారవునా? నిజంగా ఆటి మీద ప్రేమా, ఏమన్నానా? గెలిస్తే పందెం డబ్బులు పడతారు. ఓడితే  కోడినే కోసుకు తినేస్తారు. అచ్చం అలాగే మీ పెద్ద జగ్గూగాడు జనాన్ని మచ్చిక చేసుకోడానికి పథకాలని, పంపిణీలని మేపుతుంటాడు. ఎందుకనుకుంటున్నావ్‌? గెలిచాక ఆళ్ల వంకెట్టి  రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవచ్చని.  ఐదేళ్లుగా జరిగిందిదే కదరా? మరి ఈడు ఆడిస్తున్న అధికార ఆటల ముందు, అసలైన కోడి పందాలేపాటిరా, ఏమంటావ్‌?''

''ఏమంటానండీ, ఎస్సనక. కోడి పందేలు మనకి సరదాయే కానీ, ఆటికి మాత్రం ప్రాణసంకటమేనండి. పెద్ద జగ్గూగాడి పాలనలో సామాన్యులే అమాయక కోళ్లన్నమాటండి. ఒకళ్ల మీదకి ఒకళ్లని ఎగదోసి ఈడు చోద్యం చూస్తుంటే జనాల ప్రాణం మీదకొస్తోందని తెలిసిందండి. అంతేనాండీ?''

''బాగానే చెప్పావులేరా. ఇప్పుడు బండలాగుడు పోటీల సంగతి చెబుతాను విను. పెద్ద పెద్ద బండల్ని తీసుకొచ్చి ఎద్దుల కాడికి మధ్యలో కట్టి పరిగెత్తిస్తారు కదా? మీ పెద్ద జగ్గూగాడి పాలనలో బడుగు జనం కూడా  ఎద్దుల్లాగే తయారయ్యార్రా. పందేలకు ముందు ఎద్దుల్ని మేపినట్టు ఈడు జనానికి ఆశలు రేకెత్తించాడు. కానీ జరిగిందేమిటి?  ఐదేళ్లుగా సామాన్యుల బతుకులన్నీ బండలాగుడులా భారమైపోలా? కాడి మధ్య కట్టిన బండల్లాగా పన్నులు, ధరలు, ఛార్జీలు, ఫీజులు, ఖర్చులు... అన్నీ పెరిగిపోలా? అవన్నీ లాగుతూ సామాన్యులు సతమతమైపోతున్నారా లేదా? మరి మీ పెద్ద జగ్గూగాడి ముందు బండలాగుడు పోటీల్లో  మోతుబరి నిలుస్తాడు చెప్పు?''

''అవునండోయ్‌! ఈడికి  ఐదేళ్లూ పెద్ద పండగలాగే జరుగుతోంది. పాపం జనం మాత్రం అంతకంతకు కుదేలయిపోతున్నారని బోధపడిందండి...''

''ప్రభల తీర్థం గురించి మర్చిపోకురోయ్‌. ఊళ్లలో ఎవరి స్తోమతని బట్టి ఆళ్లు ప్రభలు కట్టుకొచ్చి ఊరేగిస్తారు. మరి మీ పెద్ద జగ్గూగాడు అలాంటిలాంటి ప్రభలు కడతాడేంటీ? ఈడి ప్రభలన్నీ అబద్ధపు ప్రచారాలే. ఇన్నేసి కోట్లు నే............రుగా మీటలు నొక్కి జనాలకి పంపేశానూ, ఇంతలేసి పథకాలతో సామాన్యుల బతుకులు మార్చేశానంటూ రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభలు కట్టేస్తున్నాడు. ఈడు జనానికి విదిలిస్తున్నదెంత? ఆళ్ల నుంచి గుంజుకుంటున్నదెంత లెక్కలు తీస్తే ఈడు కట్టిన ప్రచారాల ప్రభలో బొక్కలెన్నో తెలుస్తాయి. పేపర్లలో ఫుల్పేజీ ప్రకటనల్లో తాటికాయంత పెద్దగా అంకెలు కనిపిస్తున్నాయి కానీ, నిగ్గదీస్తే గారడీ బయటపడడం లేదూ? ఇవాల్టి జాబితా రేపటికి మారిపోతోంది.  ఏడు కాతాలో పడితే మళ్లీ ఏడు పడుతుందో లేదో డౌటే. అలా పడేదాంట్లో కూడా అదనీ, ఇదనీ విరగ్గోస్తున్నారు.  ప్రతిపక్ష పార్టీ సభకి వెళ్లొస్తే రేషన్కార్డు రద్దవుతుందో,  నేత మాట వినక పోతే  పథకం చేజారుతుందో జనానికి భయమే. అర్థమైందా?''

''భేషుగ్గానండి. మా పెద్ద జగ్గూగాడు ఎన్ని ప్రభలు కట్టినా, జనం భ్రమలు తొలిగితే అయ్యన్నీ తుస్సుమంటాయని బుర్రకెక్కిందండి...''

''అంతేకాదురోయ్‌, మీ ఊళ్లో పుల్లలు పోగేసి భోగమంటలేస్తారు. మరి మీ వాడు? జనం ఆశలతో అతి పెద్ద భోగిమంట పెట్టాడు. సామాన్యుల భవిష్యత్తు కాల్చి తగలేశాడు. నిరుద్యోగుల ఉపాధి తగలెట్టాడు. రైతుల కాయకష్టాన్ని బుగ్గి చేశాడు. ప్రజల ఆంకాంక్షల్ని బొగ్గులు చేశాడు. నువ్వు చూడాల్సింది  భోగి మంటనిరా...''

''అవునండోయ్‌...  పెద్ద జగ్గూగాడు రాష్ట్రానికే మంటెట్టి చలికాచుకుంటున్నాడని కానుకున్నానండి...''

''మంచిది. పండక్కి కొమ్మదాసరోళ్లు, పిట్టల దొరలు వస్తారు చూశావా? తెగ కోతలు కోసి, మాటల మతలబులతో జనాన్ని తెగ నవ్విస్తారు. మరి మీ పెద్ద జగ్గూగాడితో సహా, ఆడి అనుచర నేతలు,  పార్టీ నేతల ముందు వీళ్లేపాటిరా? ఈళ్లు నోరిప్పితే మాటల మతలబులే కదరా? మైకు ముందకొస్తే అబద్దాల కోతలే కదరా? ఊళ్లో హరిదాసులు పాపం, పాటలు పాడుతూ పొట్టపోసుకుంటారు. మరి వీళ్లు? జనానికి మాయ మాటల హరికథలు వినిపిస్తున్నారు. ఇక ఎన్నికలు రాబోతున్నాయి కదా? ఒకొక్కడూ జోలె తగిలించుకుని బయల్దేరుతారు చూడు, ఓట్లు దండుకోడానికి. ఇళ్ల ముందుకొచ్చి అసాధ్యమైన హామీలతో, అబద్ధపు వాగ్దానాలతో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతారు, అమాయక జనాన్ని ముగ్గులో దింపడానికి. గప్పాలు కొడుతూ గొప్పల గొబ్బెమ్మలు పెడతారు, ఓట్లు కొల్లగొట్టడానికి. తెలిసిందా?

''తెలియకేమండీ? ఈళ్ల మాయమాటలు వింటే మరో ఐదేళ్లు జనం ముంగిట్లో పండగుండదని ఎరికైందండి...''

''బాగా చెప్పావురా. మరయితే ఇప్పుడు చెప్పు, ప్రజల నాడి ఏంటో?''

''... ఇప్పటికి తెలివొచ్చిందండీ బాబూ! జరిగిందేమిటో, జరుగుతున్నదేంటో బాగా గమనించి తెలుసుకుంటే నా నాడే, జనం నాడని వంటబట్టిందండి. ఇప్పడు ఊళ్లలో కనిపిస్తున్న సందడి కాదండి పండగంటే.  పెద్ద జగ్గూగాడిని, ఆడి అనుచరులని ఊరి పొలిమేర దాటిస్తేగానీ, అసలు సిసలు పెద్ద పండగ రాదండి. జనం ఓటుకి కత్తి కట్టి బరిలోకి దిగితే,  దెబ్బకి కుర్చీ ఎక్కి తైతక్కలాడుతున్న అధికార కోళ్లు పొలాలకి అడ్డం పడి పరిగెత్తాలండి. ఇంటి ముందు గొబ్బెమ్మలు  పెట్టడం కాదండి, ఐదేళ్లుగా అవకతవకలు చేస్తున్న పాలకుల మొహాన కొట్టాలండి పేడముద్దలు. అయ్యండి అసలైన గొబ్బెమ్మలంటే. ఈడి బోడి కబుర్లని, హామీలని ఎక్కడికక్కడ తగలెట్టాలండి. అవే అసలైన భోగిమంటలండి. జనం మేలుకుంటే  అసమర్థ, అసంబద్ధ, అన్యాయ, అక్రమ, అరాచక, అద్వాన పాలకులకు చూపించాలండి నిజమైన బండలాగుడంటే ఏంటో. నిజమైన ప్రజా నాయకులని ఎన్నుకుంటే, జనం బతుకులు బాగుపడి గాలిపటాలై రెపరెపలాడుతూ ఆకాశంలో ఎగురుతాయని అర్థమైపోయిందండి.  సారి పెద్ద పండగ ప్రత్యేకత అదేనండి మరి. అంతేనంటారా?''

''సెభాష్రా. మొత్తానికి నీకు పాఠం ఒంటబట్టిందంతే చాలు. ఇక పోయిరా. జయం నీదే''

-సృజన

PUBLISHED ON 15.01.2014 ON JANASENA WEBSITE

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి