శనివారం, మార్చి 02, 2024

చెరువులో మెట్లెన్నో తేలనేలేదు!


అబ్బో... దాదాపు 55 ఏళ్ల నాటి ముచ్చట. కోటిపల్లి జ్ఙాపకం. నా అక్షరాభ్యాసం తూర్పుగోదావరి జిల్లా చెల్లూరులో జరిగితే, నేను రెండో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా మా నాన్నగారికి కోటిపల్లి బదిలీ అయింది. ఆయన హెడ్మాస్టర్‌. అయితే నన్ను వెంటనే స్కూల్లో వేయలేదు. కారణం నాకు దూకుడు ఎక్కువనిట. అదంతా ఏమో కానీ మనం పిచ్చ హ్యాపీ అన్నమాట. హాయిగా ఆడుకోవడమే పని కదా. మా ఇంటి ఎదురుగా తెలుగు మాస్టారు ఉండేవారు. వాళ్లబ్బాయి విజయ్‌ కూడా నా ఈడు వాడే. వాడు స్కూలుకి వెళుతుండేవాడు. ఇంట్లో మనం తిన్నగా ఉండం కదా? ఒకటే అల్లరట. దాంతో అమ్మకి విసుగెత్తి, ''బాబూ విజయ్‌! మా వాడిని కూడా నీతో పాటు స్కూలుకి తీసుకుపో నాయనా. వీడి అల్లరి భరించలేకపోతున్నాం. కానీ... వీడు చెరువులో దిగుదాం అంటే వినకేం?'' అంటూ జాగ్రత్తలు చెప్పి పంపించింది. ఆ కొత్త ఊర్లో మనం అదే మొదటి సారి వీధి దాటడం. విజయ్‌తో కలిసి వెళ్తుంటే దారిలో సోమేశ్వరాలయం, దాని ఎదురుగానే పెద్ద చెరువు, దాంట్లోకి రాతి మెట్లు భలే నచ్చశాయి. ఆ చెరువులో పెద్ద పెద్ద తాబేళ్లు ఉండేవి. అవి మధ్యాహ్నం వేల నీటి పైకి వస్తే వాటి వీపులు కనిపిస్తూ ఉండేవి. విజయ్‌ బుద్ధిమంతుడిలా చెరువు వైపు కూడా నడవకుండా, రోడ్డుకి రెండో వైపు నడుస్తూ తీసుకెళ్లాడు. మధ్యాహ్నం స్కూల్లో లాంగ్‌ బెల్‌ కొట్టేశారు. విజయ్‌, నేను ఇంటి ముఖం పట్టాం. దార్లో సంత. అందులో ఓ చోట పీతల్ని అమ్ముతంటే చూశా. అవి డెక్కల్ని ఆడిస్తుంటే వింతగా అనిపించింది. ముట్టుకోబోతే ఆ పీతలమ్మేవాడు అరిచాడు. ''డెక్కతో నొక్కిందంటే వేలూడిపోద్ది...'' అని. ''అమ్మో...'' అని విజయ్‌ నా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. ఆ సంత చూస్తూ చెరువు రోడ్డు మీద గుడి దాకా వచ్చేశాం. 

''అరే... విజయ్‌! దాహం వేస్తోంది. చెరువులో నీళ్లు తాగుదామా?'' అన్నాన్నేను.

''వద్దు. ఇంటికెళ్లి తాగుదాం...'' అన్నాడు వాడు, ఓ పక్క భయంతో, మరో పక్క ఉత్సాహంతో కూడా. అది పసిగట్టేశాం మనం. 

''ఎహె... అలా వెళ్లి నీళ్లు తాగి వచ్చేద్దాం...'' అంటూ వాడి చెయ్యి విదిలించుకుని మెట్ల మీదకి చేరా. బహుశా ఓ పది మెట్లు ఉంటాయేమో. వాడు రెండో మెట్టు మీదే నిలుచుండిపోయాడు. నేను మెట్లు లెక్క పెడుతూ కిందకి వెళ్లా. ఆఖరి మెట్టు మీద నుంచి కిందకి ఒంగుని దోసిట్లో నీళ్లు తాగా. 

''అరే... నీళ్లు భలే చల్లగా ఉన్నాయిరా. రా...'' అంటూ కేకేశా. 

విజయ్‌ కూడా వచ్చాడు. వాడూ ఆఖరి మెట్టు మీంచే తాగాడు. మనకి ఉత్సాహం వచ్చి నీళ్లలో ఉన్న మొదటి మెట్టు మీదకి దిగా. 

''అరే... చెరువులో కూడా మెట్లున్నాయిరా...'' అంటూ అరిచా, పెద్ద ఆర్కిమెడిస్‌ లాగా ఏదో కనిపెట్టినట్టు.

''అసలెన్ని మెట్లున్నాయో చూద్దామా?'' అన్నా కూడా.

''అమ్మో... వద్దు. ఇంట్లో తెలిసే కొడతారు. పోదాం, పద...'' అంటూ వాడు రెండు మూడు మెట్లెక్కేసి అక్కడి నుంచి చూడసాగాడు.

''ఇంట్లో చెప్పద్దులే...'' అంటూ నేను ఒకటి, రెండు, మూడు... అంటూ మెట్లు దిగా. మూడో మెట్టు మీద నాచుంది. అది జర్రున జారింది. మనం బుడుంగు! 

విజయ్‌ గబగబా మెట్లెక్కేసి బిక్కమొహం వేసి చూస్తుండిపోయాడుట, ఆ సంగతి తర్వాత తెలిసింది.

చెరువులో పడిన మనకి ఏమీ గుర్తులేదు. ఇంతలో గుడి అరుగు మీద పడుకున్న పూజారికి ఏదో అనుమానం వచ్చి, గబగబా వచ్చాట్ట. విజయ్‌ నాకేసి చూపించాట్ట. అప్పటికి నా చొక్కా బుడగలాగా తేలుతోందిట. ఆ పూజారి ఉన్నపళంగా పరిగెత్తుకుంటూ మెట్లు దిగి ఆ చొక్కా పట్టుకుని నన్ను గుంజి పైకి లాగాడుట. ఇదేమీ మనకి తెలీదు. 

గూబ గుయ్యి మనడం  మాత్రం తెలుసు. అది ఆ పూజారి కొట్టిందే. నన్ను నిలబెట్టి లాగి పెట్టి కొట్టి, ఆ తర్వాత నన్ను భుజం మీద వేసుకుని ఇంటికి బయల్దేరాడు. పూజారి దెబ్బ వల్లే కాదు, ఆ చెరువులో తాబేళ్ల భయం వల్ల కూడా నేను ఏడుపు లంకించుకున్నా. విజయ్‌ ముందుగా పరుగెత్తుకుంటూ వెళ్లి మన సాహసం గురించి చెప్పేశాడు. అమ్మ, ఆ చుట్టు పక్కల అమ్మలక్కలు అందరూ గుమి గూడారు. నిలువునా తడిసిపోయిన నన్ను పూజారి దింపి, జరిగింది చెప్పాడు. 

''పెద్ద గండం గడిచింద''న్నాడు. 

అమ్మ ఏడుస్తూనే నాకు మరో రెండు అంటించింది. ఇంతలో ఎవరు చెప్పారో ఏమో కానీ నాన్నగారు, టీచర్లు కూడా వచ్చేశారు. అందరూ కలిసి మీటింగు పెట్టుకున్నారు. చాలా సేపు నా గురించి మాట్లాడుకున్నారు. ఆ రాత్రికి నాకు జ్వరం. జ్వరంలో ''బాబోయ్‌... తాబేళ్లు, తాబేళ్లు...'' అంటూ పలవరింతలట. దాంతో ఇక కోటిపల్లిలో మనకి స్కూలు లేదు. ఇంట్లోనే ట్యూషన్‌ పెట్టేశారు. నా చెరువు సాహసం గురించి మాత్రం నేను పెద్దయ్యే వరకు అమ్మ, నాన్నగారు అందరికీ చెబుతూనే ఉండేవారు. నేను కూడా ఆసక్తిగానే వినేవాడిని. చెప్పాక అందరూ కలిసి తిట్టేవారు కూడా. నేను పైకి ఉడుక్కున్నట్టు నటించేవాడిని, లోపల సంతోషంగానే ఉన్నా.

1 కామెంట్‌:

  1. అజ్ఞాత5:00 AM

    డియర్ శర్మాజీ.. "చెరువులో మెట్లెన్నో తేలకపోయినా" ఫర్లేదు గాని.. ఆ పూజారి గారి పుణ్యమాని మీరు పైకి క్షేమంగా తేలడం మా అందరి అదృష్టం! 👌👌🤗

    రిప్లయితొలగించండి