శుక్రవారం, మార్చి 22, 2024

దశరథుడి యాగంలో దేవతల వ్యూహం! (పిల్లల కోసం రాముడి కథ-4)


దశరథుడు తన కూతురైన శాంతను, అల్లుడైన రుష్యశృంగుడిని అయోధ్యకు తీసుకు వచ్చిన తర్వాత కొంత కాలానికి వసంత రుతువు ప్రారంభమైంది. అప్పుడు దశరథుడు అశ్వమేధ యాగం నిమిత్తం రుష్యశృంగుడిని కలుసుకున్నాడు. ఆయనకు ప్రణామాలు చేసి, ''వంశాభివృద్ధి కోసం చేసే  యాగానికి రుత్విజునిగా ఉండి అనుగ్రహించండి'' అంటూ ప్రార్థించాడు. రుష్యశృంగుడి సూచనలపై యాగానికి సకల ఏర్పాట్లనూ చేశాడు. యాగ నిర్వహణలో పాలు పంచుకోడానికి సుయజ్ఙుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైన మహర్షులు, వేద పండితులు వచ్చారు. సరయూ నదికి ఉత్తర తీరంలో గొప్ప యాగశాలను నిర్మించారు. దశరథుడి కోరికపై రాజ పురోహితుడైన వశిష్ఠుడు, యాగ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. యాగం ప్రారంభ సూచకంగా అశ్వాన్ని వదిలిపెట్టారు. దాని వెనుక సాయుధులైన వందలాది మంది యోధులు బయల్దేరి వెళ్లారు. మిధిలాధిపతి అయిన జనక మహారాజు సహా దేశ దేశాలకు చెందిన రాజులకు, ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. వచ్చేవారి కోసం సకల సౌకర్యాలతో కూడిన వసతి గృహాలను వేలాదిగా నిర్మించారు.  

''అతిధులు ఎవ్వరినీ కించపరచ కూడదు. అన్న పానీయాలకు లోటు రానీయకూడదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు అనాదరణ చూపించరాదు. పరిహాసం చేయరాదు. చులకన భావంతో చేసే దానం వల్ల దాతకు కీడు జరుగుతుంది'' అంటూ వశిష్ఠుడు రాజోద్యోగులకు తగిన సూచనలు చేశాడు.

యాగం కోసం వదిలిన అశ్వం ఒక ఏడాదికి తిరిగి వచ్చింది. అనేక దేశాల నుంచి రాజులు, ప్రముఖులు తరలివచ్చారు. దశరథ మహారాజుకు అనేక రకాలైన కానుకలు సమర్పించారు. మహా వైభవంగా యాగం మొదలైంది. సమృద్ధిగా అన్నదానం జరిగింది. ప్రతి రోజూ వండిన ఆహార పదార్థాల రాశులు కొండలను తలపించాయి.

యాగం పూర్తయిన తర్వాత దశరథుడు పరమానంద భరితుడై రుత్విజులకు భూమి యావత్తూ దానం చేశాడు.

వారంతా ఆయనతో, ''మహారాజా!  సమస్త భూమండలాన్నీ పరిరక్షించడానికి నీవే సమర్థుడవు. అందుచేత మాకు భూమి బదులు మణులో, బంగారమో, గోవులో, మరొకటో, ఏది సిద్ధంగా ఉందో దాన్ని ఇప్పించు'' అన్నారు. దశరథుడు వారికి పది లక్షల గోవులను, పది కోట్ల బంగారు నాణెములను, నాలుగు వందల కోట్ల వెండి నాణెములను దానం చేశాడు. వారా  సంపదనంతా తిరిగి వశిష్ఠుడికి, రుష్యశృంగ మహర్షికి సమర్పించారు. యాగం చూడడానికి వచ్చిన బ్రాహ్మణులకు దశరథుడు, కోశాగారంలోని ద్రవ్యమంతా దానం చేశాడు. అప్పుడొక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చేయి చాచాడు. వెంటనే దశరథుడు తన చేతికి ఉన్న బంగారు కడియాన్ని తీసి ఇచ్చేశాడు. అందరూ దశరథుడిని వేనోళ్ల కొనియాడి, దీవెనలను అందజేశారు.

అశ్వమేధ యాగం పూర్తి కాగానే దశరథుడి చేత రుష్యశృంగుడు, పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు.  యజ్ఞంలో భాగంగా సమర్పించే హవిస్సులను స్వీకరించడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు విచ్చేశారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మతో రావణాసురుడి వల్ల తామంతా పడుతున్న బాధలను ప్రస్తావించారు.

'' బ్రహ్మదేవా! మీరు అనుగ్రహించిన వరాల ప్రభావంతో లంకాధిపతి రావణుడు అందరినీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దిక్పాలకులను, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని కూడా వేధిస్తున్నాడు. రావణుడు విహరిస్తుంటే సూర్యుడు సైతం తన వేడిమిని తగ్గించ వలసి వస్తోంది. వాయువు కూడా భయంతో మెల్లగా వీస్తున్నాడు. సముద్రుడు తన అలల జోరును తగ్గిస్తున్నాడు. రావణుడు వరగర్వంతో రుషులను, గంధర్వులను, యక్షులను, బ్రాహ్మణులను హింసిస్తున్నాడు'' అంటూ మొర పెట్టుకున్నారు.

అందుకు బ్రహ్మ, ''దేవతలారా! రావణాసురుడు గొప్ప తపస్సు చేసి,  దేవ, దానవ, యక్ష, గంధర్వ, కింపురుషుల ద్వారా తనకు చావు లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల చులకన భావంతో వారిని విస్మరించాడు. కాబట్టి మానవుడి చేతిలోనే అతడి మరణం సంభవిస్తుంది'' అన్నాడు. ఇంతలో అక్కడ గొప్ప తేజస్సుతో విష్ణుమూర్తి శంఖ, చక్ర, గదా, సారంగపాణియై ప్రత్యక్షమయ్యాడు. వెంటనే బ్రహ్మాది దేవతలందరూ చేతులు కైమోడ్చి మొక్కి, ''ప్రభూ! మా అందరికీ నీవే దిక్కు. రావణాసురుడి ఆగడాలను భరించలేకపోతున్నాం. అతడిని అంతమొందించడానికి మానవుడిగా అవతరించమని ప్రార్థిస్తున్నాం'' అంటూ సాగిలపడ్డారు.

అందుకు మహావిష్ణువు, ''దేవతలారా! భయపడకండి. దురాత్ముడు, క్రూరుడు అయిన రావణుని పుత్రులు, మంత్రులతో సహా సంహరిస్తాను.  తర్వాత పదకొండు వేల సంవత్సరాలు మానవలోకంలో ఉండి  భూమండలాన్ని 

పరిపాలిస్తాను'' అని వరమిచ్చి, దశరథుడి కొడుకుగా జన్మించడానికి సంకల్పించుకుని అదృశ్యమయ్యాడు.

ఇంతలో పుత్రకామేష్టి హోమకుండం నుంచి కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఒక దివ్వ పురుషుడు పైకి వచ్చాడు. అతడి చేతిలో  బంగారు కలశం ఉంది. దాని మూత వెండిది.

 దివ్య పురుషుడు దశరథుడితో, ''రాజా! నీ యాగ, హోమాలతో సంతుష్టులైన దేవతలు పంపగా వచ్చాను.  పాత్రలో దివ్యమైన పాయసం ఉంది. దీన్ని నీ భార్యలకు ఇచ్చినట్టయితే, వారు గర్భవతులవుతారు. నీకు పుత్ర సంతానం కలుగుతుంది'' అన్నాడు. దశరథుడు ఆనందంగా  కలశాన్ని అందుకుని  దివ్యపురుషుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. వెంటనే  దివ్యపురుషుడు అదృశ్యమయ్యాడు.

దశరథుడు  కలశంలోని పాయసంలో సగాన్ని పట్టపురాణి కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన దాంట్లో సగం రెండో భార్య సుమిత్రకి ఇచ్చాడు.  మిగిలిన దానిలో సగాన్ని ప్రియ భార్య కైకేయికి ఇచ్చాడు. ముగ్గురూ తీసుకోగా ఇంకా మిగిలిన పాయసాన్ని మరోసారి సుమిత్రకే ఇచ్చాడు. దశరథుడి భార్యలైన  ముగ్గురూ  పాయసాన్ని స్వీకరించి దివ్య తేజస్సుతో వెలుగొందారు. త్వరలోనే వాళ్లు గర్భవతులయ్యారు.

ఇలా మహా విష్ణువు మానవుడిగా అవతరించడానికి రంగం సిద్ధమైంది. రావణాసుర సంహారంలో ఆయనకి సాయ పడడానికి ఏఏ దేవతలు ఏఏ రూపాలతో అవతరించారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి