''రారా శిష్యా! ఇంత లేటయిందేం? అదేంటి కళ్లు ఎర్రగా ఉన్నాయ్?''
''ఏం చెప్పమంటారు గురూగారూ! మీరిచ్చిన ఎసైన్మెంటుతో రాత్రంతా కలత నిద్రండి. కలలో ఏవేవో కలలండి...''
''ఇంతకీ ఎసైన్మెంటు గురించి చెబుతావా? కలల గురించి చెబుతావా?''
''మీరేమో మన అధినేత ఎన్నికల ప్రచార సభల ప్రసారాలు, వీడియోలు చూసి నేను గమనించిన అంశాలన్నీ రాసుకురమ్మన్నారు కదండీ?
ఆ పని మీద కూర్చున్నానండి. ఎంతసేపని ఆయన సొల్లు వాగుడు వింటానని చికాకేసి ఛానెల్ మార్చానండి. దాంట్లో 'మాయాబజార్' సినిమా వస్తోందండి. ఇలా రెండూ మార్చి మార్చి చూసేసరికి పొద్దుపోయిందండి. దాంతో రెండూ కలసి కల్లోకొచ్చాయండి...''
''ఇదేదో భలే ఇంట్రస్టింగ్ గా ఉందిరోయ్. ఎసైన్మెంటు గురించి తర్వాత చెబుదువులే కానీ, ముందు ఆ కలేంటో చెప్పు...''
+++++
''హెయ్... లంబూ!''
''హై నాయకా!''
''హెయ్... జంబూ!''
''హై నాయకా!''
''ఇక మన బలగాల్ని ద్విగుణం, త్రిగుణం చేయండి'' అన్నాడు చిన్నమయ.
ఇంతలో అధినాయకుడు అందుకున్నాడు. ''లేని అభివృద్ధిని ఉన్నట్టు ఊదరగొట్టండి. బతుకులన్నీ బాగుపడ్డట్టు భ్రమలు కలిగించండి. రాక్షస మాయలు ఉపయోగించి విజృంభించండి. ప్రచారంలో పరుగులు పెట్టండి...'' అంటూ ఉత్సాహపరిచాడు.
''ఓ... అలాగే! ఓహోహో... అలాగే! అభివృద్ధంటే చేయలేం కానీ, పెచారం ఎందుకు చేయలేం? లేనిది ఉన్నట్టూ, ఉన్నది ఇంకెక్కడా లేనట్టూ అదరగొడతాం...'' అంటూ వంత పాడారు లంబూ, జంబూ.
అధినాయకుడు అలా వెళ్లగానే చినమయ కేసి తిరిగారు ఇద్దరూ.
''ఇన్నావుగా? ఇంకా చూస్తావేం? ఓటర్లను తందనాలాడించడానికి తతంగమేదీ తతంగం?'' అంటూ హడావుడి చేశారు.
చిన్నమయ, ''ఉష్షు... ఆగండి...'' అంటూ దుస్తుల్లోంచి మంత్రదండం తీశాడు.
''అం.... అహా... ఇం... ఇహీ... ఉం... ఉహూ'' అంటూ ఊపేసరికి ఎన్నికల శిబిరాలు 'సిద్ధం'గా కనిపించాయి. వేదికలు, కుర్చీలు వెలిశాయి. కానీ అందులో జనం లేరు!
లంబూ, జంబూ పగలబడి నవ్వసాగారు.
''కుర్చీలు ఖాళీ... వేదికలు ఖాళీ... ఇదేం ఎన్నికల ఏర్పాట్లయ్యా? మనం చెప్పేది వినడానికి జనమేరీ జనం?'' అంటూ ఎకసెక్కం చేశారు.
చిన్నమయ నవ్వుకుని, లంబూ జంబూలను 'ఉష్షు' అంటూ వారించి రాక్షస భటుల్ని పిలవసాగాడు.
''గగ్గోలకా...''
''వై గురూ...''
''గంద్రగోళకా...''
''హై గురూ...''
''ఉగ్రా... ఉద్దండకా... కర్కోటకా... కల్లోలకా...'' అంటూ చిన్నమయ పిలవగానే, రాక్షస సైనికులందరూ ప్రత్యక్షమయ్యారు.
''వెళ్లండి. మీరు ఎక్కడెక్కడి ప్రజల్ని తోలుకు రండి. అధినాయకుడి సభలు నిండుగా కనిపించాలి...''
''మరి జనం రామంటే?''
''బెదిరించండి. అదిలించండి. ఆర్టీసీ బస్సుల్ని కైవసం చేసుకుని అందులో కుక్కండి. కాలేజీ బస్సుల్ని తీసుకొచ్చి వాటిలో కుదేయండి. కావాలంటే ఎక్కడెక్కడి వాళ్లనీ తోలుకురండి. ప్రలోభ పెట్టండి. తప్ప తాగించండి. డబ్బులు ఆశ చూపించండి. బిర్యానీ ప్యాకెట్లు చేతిలో పెట్టండి. రాకపోతే రేషన్ కార్డులు మాయం చేయండి. లబ్దిదారుల జాబితాలో పేర్లు మాయం చేస్తామని హడలకొట్టండి. ఉన్నదంతా ఊడగొడతామని ఉరుకులు పరుగులు పెట్టించండి...''
''లల్లల్లల్ల....లా'' అంటూ రాక్షసులందరూ మాయం అయిపోయి ఊర్లలో ప్రత్యక్షమై జనాల్ని తోలుకురాశాగారు.
అలా విధిలేక వచ్చిన జనం ఎన్నికల శిబిరాల్లో తిరుగుతుంటే చిన్నమయ సృష్టించిన మాయగాళ్లు వారిని ఆకర్షించడానికి పాటలు, ప్రలోభాలతో ఆడసాగారు.
''పథకాలూ... నవ పథకాలూ...
కమిటీలూ... ఉప కమిటీలూ...
తెల్ల కార్డులు... హెల్త్ కార్డులూ...
సంక్షేమానికి సంబంధాలు!
మీట నొక్కితే మీకు సొమ్ములు...
మాటలు వింటే మాయ గొప్పలు...
అందుకోండయ్యా... బాబూ దండుకోండయ్యా!''
ప్రజలంతా విడ్డూరంగా చూడసాగారు. మరో శిబిరంలో ఇంకో సందడి మొదలైంది. నృత్యాలు చూస్తూ అలరించసాగారు.
''సెజ్లు... సెజ్లు... మహాసెజ్ లు...
పంట భూమిలో ప్రగతి సెజ్లు...
అడుగు పెట్టంగానే జాబులు... జాబులు...
జేబులు నిండుగ డబ్బులు... డబ్బులు...
పంచుకోండయ్యా... బాబూ ఎంచుకోండయ్యా!''
అధికారగణం ప్రచార పటాటోపంతో జనానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంతలో అధికార పార్టీ అభ్యర్థులు శిబిరాల్లోకి పల్లకిలెక్కి రాశాగారు. చిన్నమయ మాయ వల్ల ప్రచారం మత్తులో ఉన్న జనం ఊగిపోతూ పాటందుకున్నరు.
''అభ్యర్థులారా... రారయ్యా...
మా భాగ్యం కొద్దీ దొరికారయ్యా...
ముల్లోకాలను వెతికి చూసినా నాయకులంటే మీరయ్యా...
దయచేయండి... దయచేయండి...
తమంత వారిక లేరండీ...
ఇక తతంగమంతా తమదండి...''
ఇంతలో... ''ఆగండి...'' అనే కేక వినిపించింది. జనం మత్తులోంచి బయటపడ్డారు. ఏం జరిగిందో తెలియక అరుపు వచ్చిన వైపు చూశారు. అక్కడొక స్వామీజీ చిరునవ్వుతో కనిపించారు.
''ఎవరు సామీ తమరు?'' అని అడిగారు జనం.
''నేను నవజన చైతన్యానంద స్వామిని నాయనా! మీరు చూస్తున్నదంతా మాయ. ప్రచార మాయ. ఐదేళ్లుగా ఇలాంటి తతంగంతోనే మిమ్మల్ని ఆకట్టుకుంటున్నారు. ఏమీ లేకపోయినా, ఉన్నట్టు భ్రమ కల్పిస్తున్నారు. ఒక్కసారి మేలుకుని మీ చుట్టూ మీరు చూసుకోండి. మీ బతుకులు ఎలా అణగారిపోయాయో తెలుసుకోండి. ప్రలోభాలకు లొంగకుండా వాస్తవాలు గమనించండి...'' అన్నారు ప్రశాంతంగా.
''ఏమిటి స్వామీ... ఆ వాస్తవాలు?'' అంటూ అడిగారు జనం.
స్వామీజీ నవ్వారు.
''నేను చెప్పడం కాదు నాయనా! మీరే మీ కళ్లతో స్వయంగా వీక్షించండి. పైకి మీ కోసం ఏర్పాట్టు చేసిన మాయ పథకాల వెనుక ఎవరి అవినీతి విందు సాగుతోందో చూడండి...'' అంటూ స్వామీజీ ముందుకు నడిచారు.
ఆయన వెంట జనమంతా ఎన్నికల మాయాబజార్ విడిదిలో వంటశాల వెనక్కి చేరారు. అక్కడ కిటికీ లోంచి లోపల దృశ్యాన్ని చూసి తెల్లబోయారు.
లోపల అధినాయకుడు విశ్వరూపంలో ఉన్నాడు. అతడి ముందు రకరకాల వంటకాల పాత్రలు సిద్ధంగా ఉన్నాయి. అధినాయకుడు ఉత్సాహంగా పాట పాడుతూ వాటిని లాగిస్తున్నాడు. ఆ పదార్థాలన్నీ అతడి నోట్లోకి వెళ్లిపోతున్నాయి.
''హ...హ...హ... హ్హ..హా!!
అధికార భోజనంబు... అవినీతి వంటకంబు...
ఓటర్ల వారి విందు... అహహ్హ నాకె ముందు!
ఔరౌర భూములెల్ల... అయ్యారె స్కాములెల్ల...
వహ్వారె సొమ్ములెల్ల... హహహహ్హహ్హా!
ఇవన్ని నాకె చెల్ల!''
''మజారె కంపెనీలు... మనవారి ఫ్యాక్టరీలు...
వహ్వారె పెట్టుబడులు... హహహహ్హహ్హా!
ఇవన్ని నాకె చాలు!''
అధినాయకుడి అవినీతి విందు భోజనం చూసి జనం నోరెళ్లబెట్టారు.
నవజన చైతన్య స్వామి గొంతు సవరించుకున్నారు.
''చూశారా ప్రజలారా! మీరెంత సేపూ పైకి చూపిస్తున్న ప్రచార మాయలో పడి మోసపోతున్నారు. లోపల అధికార గణం సాగిస్తున్న అవినీతి భోజనం ఎంత పెద్ద ఎత్తున సాగుతోందో గమనించారా? ఇదంతా ఎవరి సొమ్మో తెలుసుకోండి. మీకు దక్కాల్సిందంతా అధినాయకుడు ఎలా బొక్కుతున్నాడో చూడండి... ఇప్పటికైనా మేలుకోండి. ఏం చేయాలో నిర్ణయించుకోండి!'' అంటూ వెళ్లిపోయారు.
++++
శిష్యుడు ఈ కలంతా చెప్పి ''ఈ కలకి అర్థం ఏమిటి గురూగారూ!'' అన్నాడు.
''ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నదేరా శిష్యా! అధికార పార్టీ ప్రచారం వెనుక ఏ జరుగుతోందో నీకు కల రూపంలో వచ్చింది. ఇప్పుడు ఒక ఓటరుగా ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో'' అన్నారు గురూగారు.
''అర్థమైంది గురూగారూ! ఇక ఈ రాక్షస మాయలో పడను'' అన్నాడు శిష్యుడు.
''సెభాష్! నీకిచ్చిన ఎసైన్మెంటు పూర్తయింది. ఇక వెళ్లిరా'' అంటూ గురువుగారు, శిష్యుడి భుజం తట్టారు.
-సృజన
PUBLISHED ON 15.3.2024 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి