అస్సీ... ఇదేమి? ప్రజాస్వామ్య విధాన జనిత ఎన్నికల సమరాంగణ సందోహ సంరంభ సమయాన...
కీలక కోలాహల ప్రచార ప్రభంజన భాసమానమైన విజృంభన విశేష వికాస తరుణాన...
జన మానస ప్రలోభబంధురమైన మాయా వాగ్దాన వాగాడంబర వాగ్బాణ ప్రయోగ ప్రధాన తరుణంబున...
మదీయ మానసమెందులకు కలవర పాటునకు గురవుతున్నది?
అస్మదీయ హృదయమెందులకు కుంగుబాటుకు లోనవువుతున్నది?
అధికార పీఠమునధిరోహించి ఉండియూ, అప్రతిహత అకృత్య కార్యకలాపాల నిత్య నిర్వహణ ధురంధుడనై ఉండియూ, అంతులేని అవినీతి వ్యవస్థీకృత విన్యాసాల సృష్టికర్తనై ఉండియూ... ఈ వేళ ఇలా ఎందులకు ఊరక ఉలికిపాటునకు గురవుతుంటిని?
ఎందుకిలా మనో చింతనకు వశమైపోతుంటిని?
ఇదంతయూ మదీయ స్వయంకృతాపరాధ నీచ నికృష్ట కృత్యముల ప్రభావంబు కాదుకద! అట్లనే అంతరాత్మ ఘోషించుచున్నట్టు లోలోపల తోస్తున్నదే!
ఇంతకాలమూ అంతరాత్మ నోరునొక్కి అద్వితీయ అక్రమ, అన్యాయ, అధర్మ పాలనా విధానములను అవలంబించి, అధికార మదాంధుండనై, దురంహంకార దుర్నీతి దుష్ట నాయకుండనై, అవిక్రమ పరాక్రమ అక్రమార్జన సార్వభౌముండనై చెలరేగిన నేను... ఇప్పుడు ఈ ఎన్నికల వేళ ఇట్లు అపరాధ భావములతో అణగారిన మనోభావములతో అంతర్మధనమునకు లోనగుట ఏల సంభవించుచున్నది?
అయ్యారే... ఎటు చూసిననూ ఒంటరినైన భావము మదీయ మానసంబును కలవరపరుచుచున్నదే!
అస్మదీయ సోదరీమణులు సైతము నా అక్రమ పోకడలను జన సమూహ మధ్యమున ఎండగట్టుచుండిరే?
ఇందెంత తలవంపెంతదుర్భరమెంతవమానమెంత సిగ్గు! మదీయ పరిపాలనా తీరుతెన్నులకిదెంత అప్రతిష్ఠ!
తోడబుట్టిన ఆడపడుచనైననూ చూడకుండా, బాల్యంబు నుండియూ కలిసి మెలిసి మసిలిన అనుంగు సోదరియనైననూ తలవకుండా, గత ఎన్నికల సమయమున నా విజయమునకై వీధుల వెంట, వాడల వెంట, ఊర్ల వెంట పాదయాత్రలు సలిపి మదీయ అధికారంబునకు ఇతోధికముగా తోడ్పాటునందించిన ఆమె సహకారమును విస్మరించి, పీఠమునెక్కగానే ఆమెను తృణీకరించి, చులకన చేసి, ఏరు దాటగానే తెప్ప తగులబెట్టిన విధంబున ప్రవర్తించినందులకు తగిన ఫలితమా ఇది?
స్వయానా పినతండ్రి హత్యకు గురైననూ పట్టకపోగా, కనీస బాధ్యతనైననూ కనబరచకపోగా, ఆ హత్యారోపణల మకిలి అంటిన నిందితులతోనే అస్మదీయ రాజకీయ ప్రయోజనముల కొరకు అంటకాగిన ప్రభావమా ఇది? తండ్రి మరణంతో తల్లడిల్లుతూ, ఆ హత్యాకాండకు పాల్పడిన నేరస్థుల ఉనికిని కనిపెట్టమని అభ్యర్థించిన సోదరి పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించుటయేగాక, అవాంఛిత వ్యాఖ్యానాలతో ఆమె పైనే ఆరోపణలు గుప్పించిన మదీయ దురహంకార వైఖరికిది నిదర్మనమా?
సొంత సోదరీమణులే ఎదురు తిరిగి అస్మదీయ అకృత్యములను బహిరంగ పరుచుచుండిన ఇక సామాన్య ఓటర్లను మెప్పించుట ఎట్లు? అమాయక జన సమూహములను తిరిగి వశపరుచుకును ఎట్లు? ఇది సాధ్యమేనా?!
జన్మనిచ్చిన తల్లికి సైతము దూరమైన ధోరణులు ద్యోతకమవుతున్నవే? మదీయ రాజకీయ వైభవమునకు ఒకనాడు దోహదపడినదన్న సంగతిని సైతము మరచి, అస్మత్ అక్రమ ఆర్థిక లావాదేవీల ఫలితమ్ముగా నేను అరదండడాల పాలై, కారాగారమున కునారిల్లు సమయాన, ప్రజల మానసంబున సానుభూతి భావజాలంబులను రేకెత్తించుటకు బహిరంగ సభలను నిర్వహించినదన్న కృతజ్ఞతనైననూ చూపకుండా పార్టీ పదవి నుంచి సాగనంపిన మదీయ అరాచకీయ విధానమునకు శాస్తియా ఇది?
అస్మత్ పితృదేవుని దుర్మరణంబును సాకుగా చేసుకుని అప్పటికప్పుడే సింహాసనమధిరోహించుటకు ప్రజా ప్రతినిధుల దస్కతులను సైతము సేకరించి ప్రయత్నించిననూ, అలనాటి అధిష్ఠానము తిరస్కరించిన తరుణాన... ప్రజలలో పెల్లుబుకిన సానుభూతిని సోపానములుగా మార్చుకొనుటకు, తండ్రి ఎదిగిన పార్టీలో సైతము వేరు కుంపటి రగిల్చి, సొంత పార్టీని స్థాపించుకుని, జనులెవ్వరూ రోదించకున్ననూ ఓదార్చు నెపమున వీధిన పడి పాదయాత్రలు చేసి, అమలుకు అసాధ్యమైన వాగ్దానములను గుప్పించి, అమాయక సామాన్య జన సమూహములలో ఆశలు రేకెత్తించి, నమ్మబలికి, నమ్మించి, మసిబూసి మారేడుకాయ జేసి, అధికారమును కైవశము చేసుకొనిన మదీయ అసమాన అరాచకీయ సామర్థ్యమునకు ఇప్పుడెంత కష్టకాలము దాపురించినది? హతవిధీ! ఏమిటిది?!
ఆదరణతో ప్రజలందించిన అధికారమును ఆలంబనగా చేసుకుని, అడ్డమైన చెత్త పన్నులను ఎడాపెడా విధించి, ప్రజల కష్టార్జితముతో నిండిన ఖజానాను సైతం కొల్లగొట్టి, నిధులను దారిమళ్లించి, అస్మదీయ గుత్తేదారులకు గుత్తాధిపత్యమునిచ్చి, వారి నుంచి వాటాలు దండుకుని, అగణిత ఆర్థిక గణాంక సూత్రీకరణలతో, అద్వితీయ అవాంఛిత మేధాసంపత్తితో, ఎల్లలు లేని అకృత్యముల పరంపరతో, అయిదేళ్లపాటు అప్రతిహతముగా సాగిన పాలనా కాలములో, ఎల్లరూ ఆశ్చర్యపడునటుల... కళ్లు విప్పార్చి కలవరపడునటుల... గిల్లి చూసుకునిన గానీ నమ్మలేనటుల... శతధా, సహస్రధా, లక్షధా, కోటిధా అనునటుల సొమ్ములను కైంకర్యము చేసిన మదీయ అరాచక విధానములకు వినాశకాలము వాటిల్లినదా ఏమి?!
సజావుగా సాగుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ గుప్పిట పెట్టుకుని, భ్రష్టుపట్టించి, ప్రజల శాంతి భద్రతలను పరిరక్షించు రక్షక భటులను పెంపుడు శునకముల వలె మచ్చిక చేసుకుని, అస్మత్ అకృత్యములకు ఊతముగా చేసుకుని, అదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధించి, బెదిరించి, ప్రజాగ్రహ ఫలితమ్ముగా పెల్లుబికిన ఉద్యమాలను ఉక్కుపాదములతో అణచి వేసి, భయభ్రాంతులకు గురిచేసి, సామాన్యులను అష్టకష్టాల పాల్జేసి, వారి కనీస సౌకర్యాలను సైతం విస్మరించిన మదీయ ఏలుబడి వికృత విధానములకు ఇది ప్రతిఫలము కాదుకద?!
అన్నపూర్ణని పేరుబడిన ఒకనాటి ఆంధ్రదేమును అల్లకల్లోలము చేసి, అతలాకుతలము చేసి, అప్పుల పరిపూర్ణగా మార్చి, అప్రతిష్ఠ పాల్జేసి, అతివలపై అకృత్యములలో, ఆత్మహత్యలలో, నేరములలో దేశములోనే అగ్రగామిగా చేసి, పరగణా పరువును బంగాళాఖాతములో ముంచేసిన నా అనుచిత అనాలోచిత చర్యలకిది కాదుకదా ప్రతిఫలము?
అహో... ఏమి ఈ వైపరీత్యము?
కక్షల, కావేశాల, పగల, ప్రతీకారాలతో కలుషితమై, కాళకూట కర్కోటక కర్కస కార్యకలాపాల విషపూరితమై కరడు కట్టిన నా మానస సరోవరంబున కల్లోలమా? కూడదుగాక కూడదు!
అవినీతి సంపాదనాసక్త హృదయుండ!
మరొక్కసారి అధికార పీఠమధిరోహణాభిలాష మానసుండ!
నిర్లజ్జాకర నీచ వ్యవహార కార్యకలాపానురక్త చరితుండ!
ప్రజావంచక విధాన వికృత రాజకీయ చతురుండ!
నీచ నేతల పారంపర్య సమూహములలోనే ఉత్తముండ!!
నేనా.... ఇటుల స్వయంకృతాపరాధ భావజాలములో చిక్కుకొనుట? ధిక్!
మదీయ వక్ర మేధో సంపత్తిని మరిచి... అన్యులకు అసాధ్యమైన అక్రమ కలాపాల చమత్కృతిని విడిచి... గోముఖ వ్యాఘ్ర విన్యాసములను విస్మరించి... పయోముఖ విషకుంభ పథాన్ని తిరోగమించి... ఇట్లు బేల వలె, బాల వలె ఆత్మావలోకమున అలమటించుటయా! అంతర్మథనమున తల్లడిల్లుటయా!! వలదు... వలదు!
అక్రమ అకృత్య ఘన చరిత్రకు వారసుండనై... అవినీతిమయంబైన అధికార పథంబున అగ్రగామినై సాగు సమయమున... తిరిగి ఎన్నికల రణరంగమున ప్రవేశించుటకు ముందు... కించిత్... ఆందోళన భరితమైన మానసిక చింతకు గురైన వాస్తవమే అగుగాక!
కానీ... ఈ అవాంఛిత మానసిక స్థితి నుంచి తక్షణము మేల్కాంచెద!
అద్వితీయ సంకల్పముతో, అకుంఠిత అక్రమ దీక్షాదక్షతలతో, అబ్ధుత భవిష్కత్ కార్యాచరణకు సమకట్టెద!
ఎవరక్కడ?
వందిమాగధులారా... రథాన్ని సిద్ధం చేయుడు... ఊరూరా సభలను పెట్టించవలె!
వాలంటీరులారా... ప్రజలను తోలుకు రండు... వారిని తిరిగి ఏమార్చవలె!
అనుంగు అనుచరులారా... టన్నుల కొద్దీ కాగితములను తీసుకు రండు...
ఓటర్లను మాయ చేయుటకు దిమ్మదిరిగే కొత్త పథకములను రచించవలె!
మదీయ మిత్రులారా... తరలిరండు... మోసపూరిత వాగ్దానములతో జనములను మాయచేయవలె!
మదీయ పాలనలో కోట్లకు పడగలెత్తిన అస్మదీయ గుత్తేదారులారా... నోట్ల కట్టలను మోసుకురండు... ప్రజల ఇళ్లకు పోయి ప్రలోభపెట్టవలె!
సొంత పత్రికా విలేకరులారా... కలాలకు పదును పెట్టుకొనుడు... మమ్ములను విమర్శించిన వారి పుట్టుపూర్వోత్తరాలను ఏకరవు పెడుతూ, అసంబద్ధ, అబద్ద కథనాలను ప్రచురించవలె!
గులాములైన రక్షక భటులారా... లాఠీలను ఝళిపించుడు... ప్రతిపక్ష పార్టీల సభలకు పోయి ఏదో వంకపెట్టి కల్లోలములు సృష్టించి సభికులను చితకబాదవలె!
మదీయ గూండాల్లారా... జనాల ఇళ్లకు పొండు... మాకు ఓటేయకున్న అధోగతి తప్పదని బెదిరించవలె!
అనుంగు అనుచరుల్లారా... ఊర్లలో జొరపడుడు... ఓటర్ల జాబితాలను తారుమారు చేయవలె!
రౌడీల్లారా... మారు వేషాలు వేసుకొండు... దొంగ ఓట్లను దండిగా వేయవలె!
దౌర్జన్యకారులారా... మీ మారణాయుధములకు పదును పెట్టుకొనుడు...
ఎన్నికల వేళ పోలింగు బూత్లను కైవశం చేసుకొనవలె!
హ...హ్హ...హ్హ...హ్హా!
అదిగదిగో చూడుడీ! మదీయ మానసంబున జగజ్జేగీయమానమైన... ధగద్ధగాయమానంబైన మరో స్వర్ణయుగము ఆవిష్కృతమైనది!
అది మనకు మాత్రమే బంగారు అధికార యుగము! జనులకు మాత్రమది అధోయుగము!! ఎనీ డౌట్స్?!!
-సృజన
PUBLISHED ON 30.3.2024 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి