సోమవారం, ఫిబ్రవరి 02, 2026

అడుగడుగున గుడి... అందులో దీపం!





 

అద్వైతం...దీని గురించి చెప్పాలంటే మహా మహా గ్రంథాలున్నాయి. అవన్నీ చదివినా అర్థం చేసుకోవడం కష్టమే. దీన మీద ఎన్నో సిద్ధాంతాలు, వాదోపవాదాలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి చాలా సులువుగా, సరళంగా అద్వైతం సారాన్ని ఓ సినిమా పాటలో అందించాలంటే ఆ రచయితలో ఎంత పరిణతి ఉండాలి?

అలాంటి రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన రాసిన పాట గురించి ఇక్కడ తెలుసుకుందాం.

‘దేవుడు ఎక్కడో లేడు... నీలోనే ఉన్నాడు...’ అంటుంది అద్వైతం. కానీ ఆ సంగతి సామాన్యులకు కొరుకుడు పడదు. అవగాహనకు రాదు. కానీ దేవులపల్లి ఎంత చక్కగా చెప్పారో చూడండి.

‘‘అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది...

ఆ గుడిలో దీపముంది... అదియే దైవం...’’

గుడిని, గుడి పరిసరాలని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం? ఎంత పవిత్రంగా భావించుకుంటాం? మరి మనలోనే గుడి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? అదే చెబుతారు ఆయన చరణంలో....

‘‘ఇల్లు, వాకిలి, ఒళ్లు, మనసు ఈశుని కొలువనిపించాలి...’’ ఎంత చక్కని వ్యక్తీకరణ. పూజలు, వ్రతాలు చేసేప్పుడు ‘‘యత్ స్మరేత్ పుండరీకాక్షం... సబాహ్యాభ్యంతర శుచి:’’ అని చదువుతారు. మన ఇల్లు, వాకిలితో పాటు మన ఒళ్లు, మనసు కూడా శుభ్రంగా, పవిత్రంగా ఉండాలని ఒకే ఒక వాక్యంలో చెప్పారు. మనసు కూడా ఈశుని కొలువనుకుంటే ఎవరిలోనైనా ఈర్ష్యా ద్వేషాలు, అసూయలు, కక్షలు ఉంటాయా? వాటన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలని చిన్న పిల్లలకి సైతం, ఏమీ చదువుకోని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా చెప్పారు కృష్ణశాస్త్రి.

అందరిలోనూ గుడిని, ఆ గుడిలో దేవుడిని చూడగలిగితే ఒకరినొకరం ఎంత గౌరవించుకుంటాం? ఎంత ప్రేమిస్తాం? ఆ సంగతిని రెండో చరణంలో చెప్పారు.

‘‘తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం

కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం’’

మొదట ఇంట్లోంచే మొదలు పెట్టారాయన. కుటుంబంలో అందరూ ఇది గుర్తిస్తే ప్రతి ఇల్లు అద్భుతంగా మారిపోతుంది కదా? ఇంటి సంగతి చెప్పిన తర్వాత ఆయన సమాజం కేసి దృష్టి సారించారు. ఆపై ఈ  సమస్త సృష్టిని కూడా కలిపారు, తర్వాతి వాక్యంలో...

‘‘ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం..’’ అనేటప్పటికి మనిషి విశ్వమానవుడిగా మారిపోతాడు. అందరినీ, అన్నిటినీ, ప్రతి ప్రాణినీ గౌరవించి ప్రేమించే స్థాయికి మనిషిని తీసుకెళిపోతారు ఆయన.

ఇప్పుడు ఆ పాటను పూర్తిగా చదవండి.

‘‘పల్లవి:
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది

చరణం 1:
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి

ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి.. తెరలూ పొరలూ తొలగాలి

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది

చరణం 2:
తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం
తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం

కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..



చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : దేవులపల్లి
గానం: పి.సుశీల

 

విశేషణాలు సరిపోని విశిష్ట వ్యక్తి ... ‘దేవులపల్లి’

కొందరి గురించి చెప్పాలంటే విశేషణాలు వెతుక్కోవాలి. అసలు అవి సరిపోవు కూడా. అలాంటి వ్యక్తుల్లో ఒకరు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన గురించి ఓ వ్యాసంలో చెప్పలేం. ఓ పుస్తకం రాయాల్సిందే. దానికి కూడా మన జ్ఞానం, విశ్లేషణ శక్తి లాంటివి సరిపోవు. కాబట్టి తెలిసినంత వరకు సూర్యుడికి దివిటీ చూపించినట్టు ప్రయత్నం చేయాల్సిందే.

భావకవిగా, రచయితగా, గీత రచయితగా ఇంకా బహుముఖంగా సాహితీ సేవ చేసిన కృష్ణశాస్త్రి గోదావరి జిల్లా వారే. తూర్పగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర్లోని చంద్రపాలెం పుట్టిన ఊరు. 1897 నవంబరు 15న పుట్టిన ఈయన పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్ననాటి నుంచే రచనలు ఆరంభించారు. లలిత గీతాలు, పాటలు, భావ కవితలు, రేడియోలో నాటకాలు, కావ్యాలు ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియలను జీవితాంతం కొనసాగించారు. విజయనగరంలో డిగ్రీ చేశాక పెద్దాపురంలో ఉపాధ్యాయుడిగా కొంత కాలం ఉన్నారు. తర్వాత 1920లో వైద్యంకోసం రైలులో వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం ఆయన రచనలలో విషాదం అధికమయ్యింది. తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరారు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. దాంతో ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశారు. 1929లో విశ్వకవి టాగూర్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టారు. 1942లో బి.ఎన్. రెడ్డి  ప్రోత్సాహంతో మల్లీశ్వరి (1951) చిత్రానికి పాటలు వ్రాశారు. సినిమా పాటలకు కావ్య గౌరవాన్ని కల్పించారు.

మొత్తం మీద దాదాపు 170 పాటలు రాశారు. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని ఆయన రచనా పరంపర కొనసాగింది. ఆయన కి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980లో మరణించారు. జీవిత సాఫల్యానికి గుర్తుగా కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ, పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి