మంగళవారం, జులై 07, 2026

ఆ ఆలయంలో... అన్నీ ఆశ్చర్యాలే!

 

తంజావూరు బృహదీశ్వర ఆలయం! 🔱
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన తంజావూరు బృహదీశ్వర ఆలయం- భారతీయ శిల్పకళా వైభవానికి అద్భుత నిదర్శనం- సిమెంట్, ఉక్కు లేకుండా నిర్మించిన ఆలయం- ఈ ఆలయ విశేషాలు మీ కోసం!
 
అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. ఈ గుడిలో అన్నీ వింతలే! శాస్త్రజ్ఞులు సైతం చేధించలేని మిస్టరీలకు నిలయం ఈ ఆలయం. ఇక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఆలయమైనప్పటికీ చెక్కు చెదరకుండా అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించాలని అనిపిస్తోంది కదా! ఇంతకూ ఈ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

తంజావూరులోని బృహదీశ్వరాలయం
మన దేశ చరిత్రలోనే తంజావూరుకు ప్రత్యేక స్థానం ఉంది. అత్యద్భుతమైన ఆలయాలతో, అతి ప్రాచీన గ్రంథాలకు నిలయమైన సరస్వతి గ్రంథాలయంతో పాటు, శిల్పకళలకు కాణాచి అయిన తంజావూరులో వెలసిన అతి ప్రాచీన శివాలయము బృహదీశ్వరాలయం. అసలు ఈ ఆలయ నిర్మాణ శైలినే అబ్బురపరుస్తుంది.

ఆలయ నిర్మాణ శైలి
ఎక్కడా సిమెంట్ అన్నమాటకు తావు లేకుండా ఉక్కు అన్నపదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి శాస్త్ర విజ్ఞానం ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ప్రపంచ దేశాలకు ఇంజినీరింగ్ అనే పదానికి కూడా అర్ధం తెలియని రోజుల్లో మన దేశంలో రూపుదిద్దుకున్న ఈ అపూర్వ కట్టడం ఆనాటి నిర్మాణశైలికి అద్దం పడుతుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడికి సంబంధించి ఎన్నో మిస్టరీలు, ఆశ్చర్యం కలిగించే ఎన్నో వింతలు! అవేంటో చూద్దాం.

13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం
దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన బృహదీశ్వర ఆలయం భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయ గర్భాలయంలో వెలసిన శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. మొత్తం 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే కట్టారు.

ఆలయ విశేషాలు
శ్రీ బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటి. 1,30,000 టన్నుల గ్రానైట్​తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఆలయ గోడలపై భరతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 శివలింగాలు ఉన్నాయి.

ఏకశిలా నంది
శివలింగానికి ఎదురుగా అతి పెద్ద నంది విగ్రహం ప్రతిష్ఠించి ఉంటుంది. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.

అతి పెద్ద గోపుర శిఖరం
ఆలయ గోపురానికి 80 టన్నుల ఏకశిలతో తయారు చేసిన కలశం గొప్ప విశేషం. ఈ శిఖరం ఆలయానికి తలమానికంగా భావిస్తారు.

నీడలు కనపడని ఏకైక ఆలయం
ఇక మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు? ఎలా ప్రతిష్ఠించారనేది ఈనాటికి అంటూ చిక్కని మిస్టరీ! ఇది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

ప్రతిద్వనించని శబ్దాలు
సాధారణంగా పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్లినపుడు ఒక శబ్దానికి ప్రతిధ్వని వినిపించడం సహజం. కానీ బృహదీశ్వర ఆలయంలో శబ్దానికి ప్రతిధ్వనులు ఉండవు. ఆ రోజుల్లోనే అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని కట్టారు.

సొరంగ మార్గాలు
బృహదీశ్వర ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఈ సొరంగ మార్గాల నుంచి తంజావూరులో ఉన్న ఇతర ఆలయాలకు చేరుకోవచ్చు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఈ సొరంగాలు మూసేశారు. చేధించలేని మిస్టరీలతో, అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించిన తంజావూరు బ్రహదీశ్వర ఆలయం భారతీయ అద్భుత కట్టడాలతో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. తమిళనాడు యాత్ర చేసే వారు బృహదీశ్వర ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటారు.
ఓం నమః శివాయ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి