ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం ఏకాంతంలో కూర్చుని కళ్లుమూసుకుని ధ్యానం చేయడం కాదు. లౌకిక జీవితం గడుపుతూ, లోకహితం కోసం కృషి చేస్తూనే భగవంతుడితో నిరంతర అనుసంధానాన్ని నిలబెట్టుకోవడం. ఈ సత్యాన్ని నిరూపించిన మహనీయుడు ఒంటిమిట్ట వాసుదాసు.ఆయన జీవితం ఆధ్యాత్మికతకు, సేవకు, సాహిత్యానికి సమన్వయ రూపం.
ఒంటిమిట్ట వాసుదాసుగా పేరొందిన ఆయన అసలు పేరు వావిలికొలను సుబ్బారావు. ప్రొద్దుటూరులో జన్మించారు. చిన్న వయసులోనే శ్రీ కుమారాభ్యుదయం వంటి ప్రౌఢ ప్రబంధాన్ని రచించిన ఆయనలో అసాధారణ కవితా ప్రతిభ కనిపించింది. అయితే భార్యా వియోగం ఆయన జీవితాన్ని ఆధ్యాత్మికత దిశగా మలిచిన కీలక ఘట్టమైంది. సంసారం అశాశ్వతమని గ్రహించిన ఆయన, శాశ్వతమైన శ్రీరాముణ్ని శరణు వేడి జీవితాన్ని భగవత్సేవకు అంకితం చేశారు. వ్యక్తిగత దుఃఖాన్ని ఆత్మోన్నతికి అవకాశంగా మలచుకోవచ్చని నిరూపించారు.
ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు అహంకార విసర్జన. దీనికి వాసుదాసు జీవితం గొప్ప నిదర్శనం. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా గౌరవప్రదమైన స్థానం పొందిన ఆయన, జీర్ణావస్థలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయ పునరుద్ధరణ కోసం చేతిలో టెంకాయ చిప్ప పట్టుకుని ఊరూరా భిక్షాటన చేశారు. హోదా కన్నా భక్తి గొప్పదని, గౌరవం కన్నా సేవే శ్రేష్ఠమని ఆచరణ ద్వారా చాటిచెప్పారు. ఆ భిక్షాటన ద్వారా సమకూరిన ప్రతి పైసానూ ఆలయ పునర్నిర్మాణానికే వినియోగించడం ఆయన నిష్కామ సేవాభావానికి దర్పణం. ఖాళీ అయిన కొబ్బరి చిప్పమీద ‘నీ జన్మ ధన్యము కదే టెంకాయ చిప్పా’ అంటూ శతకం రాసిన మహాకవి ఆయన.
వాసుదాసు సాధనకు పరాకాష్ఠ ఆంధ్ర వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణాన్ని నూట ఎనిమిది పర్యాయాలు పారాయణం చేసిన అనంతరం, మూలానికి పూర్తిగా అనుగుణమైన తెలుగు రామాయణాన్ని రచించాలనే సంకల్పదీక్ష బూనారు. ఎనిమిదేళ్ల నిరంతర కృషితో ఆ మహాగ్రంథాన్ని పూర్తిచేసి, ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడికే సమర్పించి ‘ఆంధ్రవాల్మీకి’ అన్న బిరుదాన్ని అందుకున్నారు. ఇది కేవలం సాహిత్య సృష్టి కాదు. భక్తి, తపస్సు, అంకితభావం కలిసిన ఆధ్యాత్మిక యజ్ఞం. సాధనలో స్థిరత్వం ఉంటే అసాధ్యం అనిపించిన కార్యాలూ సుసాధ్యమవుతాయని ఆయన నిరూపించారు.
‘ఎవరి పుణ్యం వారిదే, ఒకరి సాధన మరొకరిని మోక్షపథంలో నడిపించదు’ అనే వాసుదాసు సందేశం ప్రతి సాధకుణ్నీ స్వయంసాధన వైపు మేల్కొలుపుతుంది. కర్త తాను కాదని, కర్తృత్వమంతా శ్రీరాముడిదేనని నమ్మి, తనను కేవలం నిమిత్తమాత్రుడిగా భావించిన ఆయన జీవన దృక్పథమే పరిపూర్ణ శరణాగతికి సజీవ నిర్వచనంగా నిలుస్తుంది.
తొంభయ్యేళ్ల క్రితం ఇదే రోజున కన్నుమూసిన వాసుదాసు జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, ప్రపంచంలోనే ఉంటూ, స్వార్థాన్ని విడిచి, ప్రతి కర్తవ్యాన్ని భగవదర్పణంగా నిర్వర్తించడం. అదే నిజమైన సాధన. అదే మానవ జీవితానికి పరమార్థం.
~పున్నమరాజు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి