‘‘బ్రహ్మతేజో బలం ముందు క్షత్రియ బలం ఎందుకూ పనికిరాదు. బ్రహ్మర్షిగా మారడం కోసం మరింత తీవ్రంగా తపస్సు చేస్తాను’’ అని గట్టిగా సంకల్పించుకున్నాడు. తన భార్యతో సహా దక్షిణ దిశకు వెళ్లి కేవలం కందమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయసాగాడు. అక్కడ ఆయనకు హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు కలిగారు. వేయి సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత విశ్వామిత్రుడి ముందు సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు.
‘‘ఓ కౌశికా... తపస్సు ద్వారా నీవు రాజర్షులు పొందే లోకాలను జయించావు. ఇప్పటి నుంచి నిన్న రాజర్షిగా గుర్తిస్తున్నాను’’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.
అందుకు విశ్వామిత్రుడు సంతోషించకపోగా మరింత నిరాశపడ్డాడు.
‘ఇంత తపస్సు చేసినా దేవతలు నన్ను రాజర్షిగానే గుర్తించారు. నాకు తగిన ఫలితం దక్కలేదు’ అనుకున్న విశ్వామిత్రుడు మరింత కఠినంగా తపస్సు చేయసాగాడు.
ఇలా విశ్వామిత్రుడి కథను మిథిలానగరంలో శతానందుడు చెబుతుంటే రామలక్ష్మణులు శ్రద్ధగా వింటున్నారు.
‘‘రామా... ఆ కాలంలోనే ఇక్ష్వాకుల వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు. ఆయనకు శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగింది. అందుకోసం అవసరమైన అన్ని యాగాలను చేయాలనే బుద్ధి పుట్టింది. వెంటనే రాజగురువైన వసిష్ఠుడిని పిలిపించి తన కోరికను చెప్పాడు. అందుకు వసిష్ఠుడు ‘అది అసాధ్యం’ అని నిరాకరించాడు.
త్రిశంకు మహారాజు ఈసారి దక్షిణ దిశకు ప్రయాణించి వసిష్ఠుడి కుమారుల దగ్గరకి వెళ్లాడు. తపస్సు చేసుకుంటూ తేజస్సుతో వెలిగిపోతున్న వారికి నమస్కరించి, ‘మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగింది. అందుకు మీ తండ్రి అంగీకరించలేదు. ఆయనతో సమానమైన మీరే నా చేత తగిన యాగం చేయించాలని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను’’ అన్నాడు.
వసిష్ఠుడి కుమారులైన ఆ నూరుగురూ ఆ మాటలు విని కోపించారు.
‘మా తండ్రి కాదన్న పనిని మేమెలా చేయిస్తాం? అది ఆయనను అవమానించడం కాదా? నీవు ఒట్టి మూర్ఖుడిలా ఉన్నావు. ఇక్ష్వాకు రాజులందరికీ వసిష్ఠుడే పరమ గురువు. ఆయన మాటను కాదని మేమేమీ చేయలేం’ అంటూ తిరస్కరించారు.
అందుకు త్రిశంకువు ‘అయితే నేను మరొకరిని ఆశ్రయిస్తాను’ అన్నాడు.
ఆ దురంహంకారానికి వారికి మరింత ఆగ్రహం కలిగింది. దాంతో వాళ్లు, ‘నీకు చండాల రూపం కలుగుగాక’ అని శపించారు.
ఫలితంగా తెల్లవారేసరికి త్రిశంకువు శరీరం తేజస్సును కోల్పోయి నల్లగా మారిపోయింది. జుట్టంతా కురచగా అయిపోయింది. బంగారు ఆభరణాలన్నీ ఇనుపవైపోయాయి. ఒళ్లంతా బూడిదతో, శ్మశానంలో మాలలతో వికృతంగా మారిన త్రిశంకువును చూసి ఆయన మంత్రులు, ప్రజలందరూ భయంతో పరుగులు తీశారు.
తన రూపానికి ఎంతగానో బాధపడిన త్రిశంకువు, వసిష్ఠుడితో వైరభావం కలిగిన విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడు.
‘ఓ మహర్షీ... మీరే నాకు శరణు. ఎంతో ధర్మంగా పరిపాలన సాగించే నాకు శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగింది. దాన్ని మా కులగురవైన వసిష్ఠుడు, ఆయన కుమారులు కూడా తిరస్కరించారు. గురుపుత్రుల శాపం వల్ల ఇలా చండాల రూపం పొందాను. మీరే నన్ను ఆదుకోవాలి’ అని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆయనపై జాలి కలిగింది.
‘ఓ రాజా... భయపడకు. నీకు నేను అండగా నిలుస్తాను. నువ్వు ధర్మాత్ముడవని నాకు తెలుసు. నన్ను శరణు కోరావు కాబట్టి నీకు స్వర్గం లభించినట్టే అనుకో. నీ చేత నేను యాగం చేయిస్తాను. ఈ రూపంతోనే నిన్ను స్వర్గానికి పంపుతాను’ అని భరోసా ఇచ్చాడు. తన కుమారులను పిలిచి యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. తన శిష్యులను పిలిపించి, ‘మీరంతా అన్ని దిక్కులకు వెళ్లి రుషులు, వేద పండితులను నా ఆజ్ఘ్నగా తీసుకు రండి. ఎవరైనా చులకనగా మాట్లాడితే ఆ సంగతి నాతో చెప్పండి’ అన్నాడు. శిష్యులంతా బయల్దేరి వెళ్లారు. వాళ్ల ఆహ్వానం అందుకున్న మునులందరూ యాగానికి తరలి వచ్చారు. అందరినీ ఆహ్వానించిన శిష్యులు విశ్వామిత్రుడి దగ్గరకు తిరిగి వచ్చి, ‘మీ పిలుపు విని అందరూ బయల్దేరారు కానీ మహోదయుడు అనే ముని, వసిష్ఠుని కుమారులు మాత్రం రావడం లేదు. పైగా వాళ్లు కోపంతో యాగం చేసే వాడు చండాలుడు... చేయించే వాడు క్షత్రియుడు... ఇలాంటి యాగంలో హవిస్సులు అందుకోడానికి దేవతలు ఎలా వస్తారు? అని నిష్టూరంగా పలికారు’ అంటూ చెప్పారు.
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో కళ్లెర్ర చేసి, ‘నన్ను దూషించిన వాళ్లంతా మసైపోతారు. నరకానికి పోతారు. ఏడు వందల జన్మల వరకు శవభక్షణ చేస్తూ ముష్టికులుగా మారుతారు. వికృత వేషధారులై, నీచమైన చేష్టలతో సంచరిస్తారు. నన్ను నిందించిన ఆ మహోదయుడు కిరాతుడై అందరి దూషణలకు గురవుతాడు. కఠినాత్ముడై జంతువులను చంపుతూ బతుకుతాడు’ అంటూ తీవ్రంగా శపించాడు.
ఆ తర్వాత అక్కడి మునులతో ‘ఈ త్రిశంకు రాజు నన్ను ఆశ్రయించాడు. ఇతడు ఇదే శరీరంతో స్వర్గానికి చేరేలా మనం యాగం చెయ్యాలి’ అన్నాడు.
వాళ్లంతా ఆ మాటలు విని తమలో తాము చర్చించుకున్నారు. ‘ఈ విశ్వామిత్రుడు ముక్కోపి. కోపం వస్తే శపిస్తాడు. కాబట్టి ఈయన చెప్పినట్టుగానే చేద్దాం’ అనుకుని పనులు మొదలు పెట్టారు.
యాగం మొదలైంది. అయితే హవిర్భాగాలు తీసుకోడానికి దేవతలు ఎవరూ రాలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. ఆవేశంతో దండాన్ని పైకెత్తి, ‘ఓ మహారాజా... ఎంతో కష్టపడి నేను సంపాదించిన తపశ్శక్తిని నీకోసం ధారపోస్తున్నాను. దాని ప్రభావంతో నువ్వు స్వర్గానికి చేరతావు’ అన్నాడు.
వెంటనే అక్కడి మునులందరూ చూస్తుండగా త్రిశంకువు స్వర్గానికి వెళ్లాడు. అక్కడ స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు దేవతలందరి సమక్షంలో ‘ఓరీ మూర్ఖుడా... గురువు శాపానికి గురైన నీకు స్వర్గంలో ప్రవేశించే అర్హత లేదు. తలకిందులుగా భూమిపై పడు’ అంటూ నిరోధించాడు.
త్రిశంకువు కిందకి పడిపోతూ ‘రక్షించు... రక్షించు’ అంటూ విశ్వామిత్రుడికి మొరపెట్టుకున్నాడు.
విశ్వామిత్రుడు వెంటనే అతడిని ఆపి, అక్కడే మరో నక్షత్ర మండలాన్ని, స్వర్గాన్ని సృష్టించాడు. ‘ఈ స్వర్గంలో మరో ఇంద్రుడిని, దేవతలను కూడా సృష్టిస్తాను’ అంటూ కోపంతో పలికిన విశ్వామిత్రుడి దగ్గరకు రుషులు, దేవతలు వచ్చి శాంతింపజేశారు.
‘ఈ రాజు గురువు శాపానికి గురైనవాడు. శరీరంతో స్వర్గానికి చేరలేడు’ అంటూ నచ్చచెప్పారు.
అందుకు విశ్వామిత్రుడు వారితో, ‘స్వర్గానికి పంపుతానని ఈ రాజుకు నేను మాటిచ్చాను. దానిని తప్పను. కాబట్టి ప్రస్తుతం అంతరిక్షంలో త్రిశంకువు ఉన్న చోటే ఆయనకు శాశ్వతమైన స్వర్గం అవుగాక. నేను సృష్టించిన నక్షత్రములు, వస్తువులు లోకాలున్నంత వరకు స్థిరంగా ఉంటాయి. ఇందుకు దేవతలు అంగీకరించాలి’ అన్నాడు.
దేవతలందరూ అందుకు సరేనని, ‘ఆకాశంలో జ్యోతిశ్చక్రమునకు వెలుపల అంతటను నీవు సృష్టించిన నక్షత్రాలు ఉంటాయి. వాటి మధ్య దేవతలతో సమానంగా ప్రకాశిస్తూ త్రిశంకువు ఉంటాడు. అయితే గురువుకు చేసిన అపచారం వల్ల తలకిందులుగానే ఉంటాడు’ అని ప్రకటించారు.
ఈ కథంతా చెప్పిన శతానందుడు, ‘రామా... అలా విశ్వామిత్రుడి యాగం పూర్తయింది. దేవతలు, మునులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు’ అంటూ ముగించాడు.
ఆ తర్వాత విశ్వామిత్రడి కథను వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.
మంగళవారం, నవంబర్ 10, 2026
తలకిందులు స్వర్గం (పిల్లల కోసం రాముడి కథ-20)
తీవ్రమైన తపస్సు చేసి అస్త్రాలు సంపాదించినప్పటికీ వసిష్ఠుడి తపోబలం ముందు ఓడిపోయిన విశ్వామిత్రుడు, మరింత పట్టుదల పట్టాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి