సోమవారం, ఫిబ్రవరి 13, 2023

అరాచక గీతాలు!

 


శిష్యుడు వచ్చేసరికి గురువుగారు ఇయర్‌ఫోన్స్‌పెట్టుకుని పాటలు వింటున్నారు. తన్మయత్నంతో తలూపుతూ ఆయన ఆనందిస్తుంటే, శిష్యుడు చాలా సేపు ఎదురు చూశాడు.

ఆఖరికి విసుగొచ్చి, ''అదేంటి గురూగారూ! నేనేదో  మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుందామని వస్తే, మీరేమో పాటలతో కాలక్షేపం చేస్తున్నారూ?'' అంటూ నిష్ఠూరమాడాడు.

గురువుగారు ఫోన్‌పక్కన పెట్టి, ''సినిమా పాటలంటే అంత చులకనొద్దురోయ్‌. అవి కూడా రాజకీయాలు నేర్పుతాయి తెలుసా?'' అన్నారు.

''ఊరుకోండి సార్‌... మీరు మోకాలికీ బోడిగుండుకీ  ముడి పెడతారు. పాటలు పాఠాలు చెప్పడమేంటండీ?''

''మరదే తెలివితక్కువతనమంటే. నేర్చుకోవాలనే తపనుండాలే కానీ ఎందులోనుంచైనా మనక్కావలసినదాన్ని పిండుకోవచ్చు. కావాలంటే నేనొక  పాట పెడతాను. దాని పరమార్థం ఏమిటో చెప్పు చూద్దాం...''

''సరే పెట్టండి. వద్దంటే మాత్రం మీరు వింటారా?''

''అప్పు చేసి పప్పుకూడు తినరా ఓ నరుడా...

గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా...

ఉన్నవాడు లేనివాడు రెండే రెండు జాతులురా...

ఉన్నచోట తెచ్చుకొనుట లేనివాడి హక్కురా!

వేలి ముద్ర వేయరా సంతకాలు చేయరా...

అంతగాను కోర్టుకెళితె ఐపీ బాంబుందిరా!

రూపాయే దైవమురా రూపాయే లోకమురా...

రూక లేనివాడు భువిని కాసుకు కొరగాడురా!''

''అయ్యబాబోయ్‌... భలే పాటండీ బాబూ ఇది. ఘంటశాల పాడాడండి. మరింత చక్కని పాటలో రాజకీయం ఏముందండీ, చోద్యం కాకపోతేనూ?''

''భలేవాడివిరా... రాజకీయం ఎక్కడో ఉండదురా. నీ చుట్టూనే వైఫైలాగా అల్లుకుని ఉంటుంది. నువ్వు దాన్ని ఆన్‌చేసుకుని ఆలోచించాలంతే. మరిప్పుడు నీ పరగణాని ఏలుతున్న అధినేత ఈ పాటని ఔపోసన పట్టేశాడని కానుకో వద్దురా? రేప్పొద్దున నీ అదృష్టం బాగుండో, ప్రజల ఖర్మకాలో నువ్వు పాలకుడివైపోయావనుకో, అప్పుడు ఈ పాటే కదరా నీకు కర్తవ్యం బోధించేది?''

''అదెలాగండీ? కాస్త వివరించి చెబుదురూ...''

''ఏముందిరా... మొన్నటికి మొన్న పార్లమెంటులో నీ పరగణా ఎంత అప్పుల ఊబిలో కూరుకుని పోయిందో బయటపడింది కదరా. ఒకటా, రెండా... నీ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 4 లక్షల 42 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించలేదూ? ఇక్కడితో ఆగిందా? కార్పొరేషన్లు, ఇంకా ఇతర మార్గాల్లో చేస్తున్న అప్పులు దీనికి అదనం అని కూడా చెప్పారా లేదా? అన్నీ కలిపితే మొత్తం అప్పులు పది లక్షల కోట్ల పైమాటేనని ఆర్థిక నిపుణులు, ప్రతిపక్షాలు కోళ్లై కూయడం లేదూ? వీటన్నింటి భారం పడేది ప్రజల మీదే కదా? అప్పుడిక ప్రజలంతా కలిసి 'అప్పుల కుప్ప వయ్యారి భామా...' అని పాడుకోక వేరే దారేముంది చెప్పు?''

''అవునండోయ్‌... కానీ నాకు తెలియక అడుగుతాను, ఇలా ఎడా పెడా అప్పులు చేయడం చాలా దారుణమంట కదండీ? దీని ప్రభావం భావి తరాలపై పడుతుందటగా? ఆఖరికి శ్రీలంక, పాకిస్థాన్‌లాంటి కొన్ని దేశాల్లోలాగా పరిస్థితి ఘోరంగా తయారైపోయి, జనం భోజనానికి కూడా అల్లాడిపోతారని చెబుతున్నారు కదండీ?''

''ఒరే... నీ కుటుంబం తరతరాల గురించి ఆలోచించాలి కానీ, రాష్ట్ర ప్రజల భావి తరాల గురించి నీకెందుకురా? ఆళ్లు అడుక్కుతింటే నీకేల? నీక్కావలసిందల్లా ప్రస్తుతం నీ అధికారం బాగుంటే చాలదూ? అలవి కాని ఉచిత పథకాలు ప్రకటించేసి, సాధ్యం కాని హామీలు గుప్పించేసి జనానికి ఆశలు పెట్టి, ఆళ్ల ఖాతాల్లో సొమ్ములు మీట నొక్కి పంపించేసి నీ ఓట్లు నీకు పడేలా చూసుకుంటే చాలదూ? పావలా పాసుబుక్కులో పడేసి, ఆళ్ల జేబులోంచి రూపాయి లాక్కుంటే మాత్రం నిన్నడిగేదెవర్రా?అందుకోసం అందిన చోటల్లా అప్పులు చేయడం తప్ప మార్గమేముందీ? వడ్డీలు ఎంతయినా తెచ్చేయొచ్చు. ఇంకా కావాలంటే రాష్ట్రానికి రాబోయే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి రుణాలు దండుకోవచ్చు. అర్థమైందా?''

''అర్థమవడమేంటండీ బాబూ, తల గిర్రున తిరిగిపోతుంటేను? అప్పు చేసి పప్పు కూడు పాట సరిగా వింటే ఇంత రాజకీయం వంటబడుతుందని తెలిసిందండి... ఇప్పుడే పాట వినిపిస్తారండీ?''

''దోపిడీ దోపిడీ అంతా దొంగల దోపిడీ...

చిన్న చేపలను పెద్ద చేపలు చెప్పకుండ భోంచేయురా...

ఉన్నవాణ్ణి పైనున్నవాడు చేజిక్కితె స్వాహా చేయురా...

పేదల నెత్తురు పిండి పిండి జేబులు నింపిరి బాబులూ...

ఆ జేబులు బొత్తిగ ఖాళీ అయితే ఇంకేమున్నవి డాబులూ...''

''ఆ... గుర్తొచ్చింది గురూగారూ! ఇది 'మంచి మనిషి' సినిమాలోదండి. ఎన్టీఆర్‌ హీరో అండి. భలే సరదాగా ఉంటుందండి... కానీ ఇందులో పాఠమేముందండీ?''

''ఏడిశావ్‌... ఆ సినిమాలో హీరోగారు మంచిగా మారతాడు కానీ, నీ నిజ జీవితంలో నిన్ను పాలిస్తున్న నేత మాత్రం అలా కాదు కదరా? మారనుగాక మారడు. ఆయన పాటిస్తున్న విధానాలన్నీ ఈ  పాటలోవే కదరా మరి?''

''అదెలాగండీ...?''

''ఏముందిరా... అధికార పీఠం మీద నువ్వు కూర్చోవాలే కానీ రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ నీవే కదరా? రోడ్లు వేయిస్తామని పెట్రోలు మీద సెస్సు వేశావనుకో, ఆ వెర్రి జనం నుంచే కోట్లకు కోట్లు వచ్చిపడతాయి.  ఆటికేమన్నా లెక్కా? జమా? హోల్సేలు వ్యాపారులతో మాటాడుకుని ధరలు పెంచనిచ్చావనుకో, నీ సొంత ఖాతాలో కోట్లు జమైపోతాయి. ఇక చెత్త బాగు చేయాలనో, మరోటనో వంకెట్టి పన్నులు వేశావనుకో. పిచ్చి జనం కష్టపడి సంపాదించిన సొమ్ము మూకుమ్మడిగా పోగుపడదూ? అయ్యన్నీ ఎక్కడికి పోయాయో నువ్వేమన్నా లెక్క చెప్పాలా, ఏమన్నానా? మరిది దోపిడీ కాదూ? ఒరే... నీ అధినేత అడుగుజాడల్లో నడిచే తెలివితేటలు నీకు అబ్బాలే కానీ, పేదోళ్లకి పాత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలు, ఇళ్ల మీద కూడా డబ్బులు గుంజుకోవచ్చు, పైగా ఆళ్ల మేలుకేనని చెప్పి మరీనీ! మరిది పేదల నెత్తురు పిండడం కాదూ? ఇక నువ్వేలుతున్న రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, సర్కారు వారి గనులు, కొండలు, గుట్టలు, ఆఖరికి ఇసుక పర్రలు కూడా నీ సొంత ఖజానానికి కామధేనువులే కదరా? వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవచ్చు. ఫలానా కంపెనీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టేస్తుందంటూ ఓ ప్రెస్మీటెట్టి, ప్రభుత్వ భూములు రాసిచ్చేయొచ్చు. అలా ఇచ్చినందుకు ఆ కంపెనీ నీకు వాటా సమర్పించుకుంటుందని వేరే చెప్పాలా? ఆ తర్వాత ఆ కంపెనీ ఆ ఫ్యాక్టరీలు కట్టిందో లేదో ఎవడు చూడొచ్చాడు? కొన్నాళ్లు పోయాక ఆ భూముల్ని రియల్‌ఎస్టేటు వ్యాపారం చేసి అమ్ముకున్నా అడిగేవాడుండడు. అలాగే గనులు కూడాను. పైకి అనుమతి తీసుకునేది ఏ సున్నపు రాయి కోసమో అయినా, లోపాయికారీగా తవ్వుకుని తరలించేది వాటిలోని విలువైన ఖనిజాలనే కదా? ఈ నిజాలేమైనా బయటపడేవా ఏమన్నానా? ఏమంటావ్‌?''

''ఇంకేమంటానండీ, పాటల్లో ఇన్నేసి పాఠాలున్నాయని తెల్లబోవడం తప్ప. సార్‌... ఈసారి ఏదైనా మాలాంటి కుర్రాళ్లకు ఊపిచ్చే పాటేదైనా పెట్టండి సార్‌...''

''కోకా కోకా కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు...

పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టీపట్టీ చూస్తారు...

కోకా కాదు, గౌను కాదు... కట్టులోన ఏముంది?

మీ కళ్లల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి...

ఊ... అంటావా? మావా, ఊహూ అంటావా?''

''అబ్బ... అదరగొట్టారు సార్‌'పుష్ప'లో పాటేసి.  కానీ గురూగారూ, ఈ ఐటెమ్‌సాంగులో పాఠం ఏముంటుందండీ?''

''ఆ 'పుష్ప' సినిమా హిట్టే కావచ్చురా. కానీ ప్రజల చెవుల్లో పుష్పాలు పెట్టే నీ నేతల సినిమా అంతకంటే సూపర్‌హిట్టు కాదురా? అధికారం చేతిలో ఉంటే ఎలాంటి తైతక్కలైనా చెల్లుతాయని చెప్పడానికీ పాటొక ఎగ్జాంపులొరే. మరి నీ రాష్ట్రంలో ఆమధ్య ఓ అమాత్యులుంగారు పండగ పేరు చెప్పి ఏకంగా కాసినో గాంబ్లింగు సెట్టింగెట్టేసి అమ్మాయిలతో కలిసి స్టెప్పులేసిన సంగతి ఎలా మర్చిపోతాంరా? బాధ్యతాయుతమైన పదవిలో ఉండే ఓ ప్రజాప్రతినిధి చేయాల్సిన పనేరా ఇది? కానీ ఎవరైనా నోరెత్తారా అని? ఇలాంటోళ్లా మనం ఓటేసి ఎన్నుకున్నోళ్లని జనం బిత్తరపోయారు కానీ, ఆ నేతలకి ఓ సిగ్గా? ఎగ్గా? ఏకంగా పేపర్లలో ఫొటోలు, వార్తలు వచ్చినా చలించారా అని? నీ అధినేత కూడా కిమ్మన్నాడా అని? మరెంత తెంపరితనమో తెలిసిందా? ఈల్లవన్నీ వంకర బుద్ధులే అయినా గెలిపించిన పాపానికి అమాయక ప్రజలు భరిస్తున్నారు చూశావా? మరి నీ నేతల అనుచరులు, అనుయాయులు, ఆళ్ల తోకలు కలిసి రాష్ట్రంలో ఆడవాళ్ల మీద అత్యాచారాలని దేశం మొత్తం మీద ఘనతకెక్కేలా చేస్తున్నారు కదరా? ఆఫీసుల్లో పని చేసుకునే ఆడాళ్లకు కూడా అధికార పార్టీ వాళ్ల వేధింపులు తప్పడం లేదన్నా, అలాంటి నీచలపై ఎలాంటి కేసులు కూడా నమోదవడం లేదన్నా, అంతకు మించిన ఘోరం ఉందా అని? మరి ఇంతకు మించిన అధికార రాజకీయ అధమాధమ పాఠం ఇంకేముంటుందిరా?''

''అవునండి బాబూ... దిమ్మ తిరిగిపోతోంది. ఎంత అధికారం ఉంటే మటుకు మరీ ఇంత అధ్వానమా, అనిపించేస్తోందండి... ఇప్పుడింకో పాటేయండి గురూగారూ...''

''ఫిఫ్టీ... ఫిఫ్టీ....

నీవో సగం... నేనో సగం...

సగాలు రెండూ ఒకటైతే

జగానికే ఒక నిండుదనం...

ఫిఫ్టీ...ఫిఫ్టీ...''

''గురూగారూ... ఇది అక్కనేని, కాంచన నటించిన డ్యూయెట్టండి. 'పవిత్రబంధం' సినిమాలోదండి. ఆఖరికి యుగళగీతాలు కూడా రాజకీయాలు నేర్పుతాయాండీ?''

''ఒరే... రాజకీయాల్లో ఉండేవన్నీ యుగళగీతాలేరా. ఈ పాట పవిత్రబంధంలోదే కావచ్చుకానీ, నీ పాలకుల హయాం చూపించే సినిమా మాత్రం 'అపవిత్ర బంధం'రా. ఆ పాటలోలాగే అధినేత నుంచి అమాత్యులు, స్థానిక అధికార పార్టీ నేతల వరకు పాడుతున్న డ్యూయట్టు ఇదే కదరా? అంతా 'ఫిఫ్టీ... ఫిఫ్టీ...' వ్యవహారమే నడుస్తోంది మరి. ఓసారలా ఇసుక కేసి చూడు. మరోసారలా మద్యం కేసి తల తిప్పు. ఇటు పేదల బియ్యం మాఫియాకేసి చూసినా, అటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల కేసి చూసినా అంతా కనిపించేదీ, వినిపించేదీ ఈ యుగళగీతమే కదా? ఏ వ్యవహారం తీసుకున్నా ఎక్కడికక్కడ 'నీకో సగం... నాకో సగం...' అన్నట్టు పంచుకోవడం లేదూ? ఆఖరికి ఓ అభాగ్యుడు మరణించినందుకు ఆ కుటుంబానికి వచ్చే సాయంలో కూడా సగం ఇమ్మని ఓ అమాత్యుడు అడిగాడంటే దానికి మించిన నికృష్ట పాఠం ఏముంటుందిరా? అధికారం, అవినీతి కలిసి డ్యూయట్టు పాడుతున్నట్టు లేదూ? ఇప్పటికైనా అర్థమైందా పసందైన పాటలు చెప్పే అసహ్యమైన పాఠాలేంటో?''

''అర్థమైంది గురూగారూ! ఇప్పుడు మీరు కాదండి. నేనే ఓ పాట పెడతాను. అది వినండి...''

''అంతా నా ఇష్టం...

ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం...

చెడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం...

మీ ఇళ్లలో గబ్బిలాలనే పెంచండి అంటా నా ఇష్టం...

కుకూ అని గుడ్లగూబనే కూయించమంటా నా ఇష్టం...

హిస్టరీ కొత్తగా రాయమంటా...

హిట్లర్‌ని దేవుడిగ చేయమంటా...

టైగర్‌ని పచ్చగడ్డి మేయమంటా...

పావురానికి బాంబులిచ్చి వేయమంటా...

అంతా నా ఇష్టం... అంతా నా ఇష్టం..''

''విన్నారా గురూగారూ? కౌరవుడు సినిమాలోదండి ఈ పాట. మన అధినేత పరిపాలన తీరు ఇలాగే ఉందండి. ఏం చేసినా ఎవరేం చేస్తారనేంత ఇష్టారాజ్యంగా సాగుతోందండి వ్యవహారం. హిస్టరీని ఇప్పటికే కొత్తగా, చెత్తగా రాసేశాడండీ రాజకీయ కౌరవుడు. స్వయంగా ఆయనే హిట్లర్‌గా మారాడండి.  టైగర్‌లాంటి పోలీసు వ్యవస్థని గులాములు చేసి సర్కస్‌లో పులుల్ని ఆడించినట్టు ఆడిస్తున్నాడండి. మరది ఆళ్ల చేత పచ్చగడ్డి మేయించినట్టే కదండీ? శాంతి భద్రతలని గాలికొదిలేశాడండి. ఇప్పుడు శాంతి అంటే అధినేత మనశ్శాంతి మాత్రమేనండి. ఇక భద్రత అంటే ఆయనకి, ఆయన పార్టీ అనుచరులకే భద్రత కల్పించమండి. పావురానికి బాంబులిచ్చి వేయమనడం అంటే ఇదే కదండీ మరి? ఎవడైనా నోరెత్తి అదేమని ప్రశ్నిస్తే చట్టంలో కాలం చెల్లిన కేసుల్ని సైతం తిరగదోడి బుక్‌చేస్తున్నారండి. ఏ ప్రతిపక్ష నాయకుడైనా నిరసన ప్రదర్శన చేయబోతే ఎక్కడ లేని ఆంక్షలు, నిబంధనలు పెడుతున్నారండి. అంతా ఆళ్లిష్టమన్నట్టు సాగుతోంది కదండి... ఎలా ఉందండి ఈ పాటలో పాఠం?''

''సెభాష్‌రా... శిష్యా! పాటల్లో అరాచకీయాన్ని ఇట్టే గ్రహించావ్‌... మరి నీ పాలకుల అకృత్యాలన్నీ చూసి విసుగెత్తి పోయిన జనం ఒక్కొక్కడూ ఒక్కో జనసైనికుడైతే ఎలా ఉంటుందో, ఏమవుతుందో కూడా ఓ పాటలో చెప్పు చూద్దాం...''

''తెలుగు వీర లేవరా... దీక్ష బూని సాగరా

ఆంధ్ర మాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

దారుణ మారణకాండకు తల్లడిల్ల వద్దురా

నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా

ఎవడు వాడు? ఎచటి వాడు?

ఇటు వచ్చిన కంత్రీగాడు?

తగిన శాస్తి చేయరా

తరిమి తరిమి కొట్టరా

ప్రతి మనిషి తొడలు కొట్టి

తుది సమరం మొదలు పెట్టి

సింహాలై గర్జించాలీ

సంహారం సాగించాలీ!''

-సృజన

PUBLISHED ON 14.02.2023 ON JANASENA WEBSITE

శుక్రవారం, జనవరి 27, 2023

రాజ్యాంగ భ్రష్ట అరాచకోత్సవం!




 

అధినేత కుర్చీలో కులాసాగా కూర్చుని అధికారులు సిద్ధం చేసిన రిపబ్లిక్‌ దినోత్సవం ప్రసంగాన్నిచదువుకుంటున్నాడు. ఈలోగా సెక్రటరీ వచ్చాడు.

''ఆఫీసర్లు కిందా మీదా పడి స్పీచేదో రాసుకొచ్చారు కానీ, నాకెందుకో కాస్త వెలితిగా ఉందయ్యా...'' అన్నాడు అధినేత జనాంతికంగా.

సెక్రటరీ ఆ ప్రసంగం కాగితాన్ని తీసుకుని చూసి, ''సర్... మీ అసంతృప్తి ఏంటో చెబితే తిరగరాయిస్తానండి...'' అన్నాడు వినయంగా.

''మనం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేం చేశామో ఏకరువు పెట్టారు కానీ, ఇది చాలదయ్యా...'' అన్నాడు అధినేత ఏదో ఆలోచిస్తూ.

''చిత్తం... అక్కడికీ నేను చెప్పానండి. తమరు పవర్‌ లోకి వచ్చింతర్వాత జనానికి జరిగిందంతా  పోగు చేసి, కూసింతైనా దాన్నే మైక్రోస్కోపులో చూసి,  జీళ్ల పాకం పట్టి, దిమ్మిశా చేసి, సాగదీసి, విశాలం చేసి భూతద్దంలో పెద్దగా చూపించాలని, ఆ పైన టెలిస్కోపులో చూపించినట్టు హంగామా గట్రా చేయాలని సూచించానండి. పాపం... ఇంతకన్నా కుదరలేదనుకుంటానండి...'' అన్నాడు సెక్రటరీ ఉన్నదున్నట్టుగా.

''అవుననుకో. కానీ అవతల ఎన్నికలొచ్చేస్తున్నాయా, మరీ సమయంలో స్పీచ్ ఇంత చప్పగా ఉంటే ఎలాగా అని ఆలోచిస్తున్నానయ్యా. నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు...'' అన్నాడు అధినేత.

ఆ మాటకి సెక్రటరీ ఉబ్బితబ్బిబ్బయిపోయి, ''దాందేముంది సార్‌... ఉన్నదంతగా లేనప్పుడు, లేనిది ఉన్నట్టుగా, మీ పాలనలో లేనిదేదీ లేనట్టుగా, జనానికసలు సమస్యలనేవే లేనట్టుగా, తమరి హయాంలో ఎక్కడా లేని సంతోషమంతా ఉన్నట్టుగా,  మీ పరిపాలన తీరు ప్రపంచంలో మరెక్కడా లేనట్టుగా,  సామాన్యుల జీవితాలు స్వర్గంలో ఉన్నట్టుగా, ఇక్కడ ఉన్న అభివృద్ధి మరెక్కడా లేనట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా, చెప్పేదేదేనా  చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకురావడం మీకలవాటేగా? అలా చెప్పేయండి సార్‌...'' అన్నాడు హుషారుగా.

''హ్హ...హ్హ...హ్హ హ్హా! బలే చెప్పావయ్యా... సర్లే, అలాగే కానిచ్చేస్తాను. ఇంతకీ ఏంటివాళ విషయాలు?''

''మరేం లేదు సార్‌... మీరు కాదనరనే ధైర్యంతో, మీ దగ్గర ఇన్నాళ్లుగా పని చేసిన చనువుతో, మీకు ముందుగా చెప్పకుండా, మీ అపాయింటుమెంటు కొందరికి ఇచ్చేశాను సార్‌... వాళ్లు బయట కూర్చుని ఉన్నారు.  తమరు కాదనకూడదు...''

''వార్నీ... అప్పాయింటుమెంటంటే ఆయింటుమెంటనుకున్నావేంటయ్యా, ఎవరికి పడితే వారికి ఇచ్చేయడానికి?  వచ్చేదెవరో తెలియకపోతే అప్పటికప్పుడు ఏం మాట్లాడతాం? తెలిస్తే వాళ్లనెలా బుట్టలో వేయొచ్చో ఆలోచించుకుని రమ్మనచ్చు... ఇంతకీ ఎవరు వాళ్లు?''

''భలేవార్సార్‌. మీకిబ్బంది కలిగిస్తానా? వాళ్లు మీ అభిమానులండి. ఇంకా చెప్పాలంటే తమ భక్తులండి. బాగా ఆరా తీసే ఈ రహస్య సమావేశం ఏర్పాటు చేశానండి...''

''సర్లె... మరయితే వాళ్లని మన సీక్రెట్‌ ఛాంబర్ లోకి  తీసుకురా...''

అధినేత అనుమతి ఇవ్వడంతో సెక్రటరీ ఉత్సాహంగా బయటకి వెళ్లి ఓ గుంపుని వెంట తీసుకుని వచ్చాడు. వాళ్ల చేతిలో పూలదండలు, పుష్ఫగుచ్ఛాలు ఉన్నాయి.

వాళ్లలో చూడ్డానికి మొరటుగా ఉన్న ఒకతను ఓ పెద్ద దండ పట్టుకుని చకచకా ముందుకొచ్చి అధినేత మెడలో వేశాడు.

''జగజ్జేతకీ జై... జగజ్జెట్టీకీ జై...'' అన్నాడు బొంగురుగొంతుతో. అతడితో పాటు వచ్చిన వాళ్లంతా పళ్లికిలిస్తూ చప్పట్లు కొట్టారు.

''ఎవరయ్యా మీరు... ఈ జేజేలు దేనికి? నేనేం సాధించాననీ?'' అన్నాడు అధినేత, లోపల ఆనందపడుతూనే, పైకి లేని వినయం చూపిస్తూ.

''అమ్మమ్మ... ఎంత మాట! తమరు అలవోకగా చేసే పనులన్నీ మాలాంటి వాళ్లకు పెదబాల శిక్షలు కదండీ... అందుకే ఓ విన్నపంతో వచ్చామండి...''

''ఏంటో మీ అభిమానం. వద్దంటే వినరు కదా. సరే... ముందు మీరెవరో, ఏంటో చెప్పండి మరి...''

''మా గురించి ఉన్నదున్నట్టు చెబుతానండి. ప్రజల భాషలో చెప్పాలంటే నేనొక దగుల్బాజీనండి. ఇదిగో వీడొట్టి వెధవండి. వీడికంటే వాడొక అరెక్కువండి. అంటే వెధవన్నర వెధవన్నమాటండి. ఇక ఆడొక పుండాకోరండి. ఆపక్కన నుంచున్నోడు తేనె పూసిన కత్తండి. ఇహ ఈయన తడి గుడ్డల్తో గొంతులు కోసే రకమండి... మొత్తానికి మేమంతా అఖిలాంధ్ర దొంగ, దుండగ, దగాకోరు, దౌర్జన్యకారుల సంఘం సభ్యులమండి. నేనే అధ్యక్షుడినండి...''

అధినేత పగలబడి నవ్వాడు. ''వహార్నీ... బాగుందయ్యా మీ ఇంట్రడక్సను. అయితే ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్నమాట. ఏ మాత్రం వెనకేశారేంటి?''

''శ్రీవారితో పోలిస్తే మేమెంతండి? గడ్డి మేసే  గాడిదలం. తమరిలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖజానాని పిండే తెలివెక్కడిదండీ?''

''సర్లె... పొగడ్తలు ఆపి, విషయంలోకి రండి. నాకవతల చాలా పనులున్నాయి...''

''అదేనండి. రిపబ్లిక్‌ దినం వస్తోంది కదండి. ప్రజలతో మీ పబ్లిక్‌ సమావేశం పూర్తయ్యాక, మేం ఏర్పాటు చేసే మరో ప్రత్యేకమైన రీపబ్లిక్‌ రాత్రోత్సవ సభకు రావాలండి...''

''ప్రత్యేకమైన రీపబ్లక్‌ రాత్రోత్సవమేంటయ్యా...?''

''మరేంలేదు సార్‌. రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాక, దాన్ని అమలు చేసుకునే రోజునే దేశమంతా రిపబ్లిక్‌ దినోత్సవం జరుపుకుంటుంది కదండీ? అదంతా పబ్లిక్‌ వ్యవహారమండి. కానీ తమరు అధికారంలోకి వచ్చాక ఆ రాజ్యాంగాన్ని తిరగరాస్తున్నారు కదండీ?   రాజ్యాంగానికే వక్రభాష్యాలు చెబుతూ, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అమలు చేస్తున్నారు కదండీ? అంచేత మేం ప్రత్యేకంగా ఈ రీపబ్లిక్‌ రాత్రోత్సవాన్ని ఏర్పాటు చేశామండి. అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేక రాత్రోత్సవమన్నమాటండి. అర్థరాత్రి మొదలవుతుందండి. తమరొచ్చి మేం ప్రత్యేకంగా తయారు చేసిన జెండాను ఆవిష్కరించి, మాలోంటోళ్లని ఉద్దేశించి ప్రసంగించాలండి.  మాకదో తృప్తండి. కాదనకూడదు....''

అధినేత ముసిముసిగా నవ్వుకుని సరేనన్నాడు.

++++++++++

రాజ్యాంగ వ్యతిరేక రాత్రోత్సవం మొదలైంది. అధినేత వస్తుంటే మైకులో పాట మొదలైంది.

''వేలెత్తి ఎదురెట్టు మొరటోడా... గతమెంతో అపకీర్తి కలవోడా!''

అక్కడ హాజరైన సంఘ సభ్యులందరూ పూలు జల్లుతుంటే అధినేత, హుందాగా జెండా కొయ్య దగ్గరకి వచ్చి అక్కడ తాడు పట్టుకుని లాగాడు. వెంటనే జెండా ఆవిష్కృతమైంది. ఎర్ర మరకులున్న జెండాపై కత్తులు, కటార్లు, కళ్లగంతలు, బేడీలు లాంటి గుర్తులు ముద్రించి ఉన్నాయి. వెంటనే సభ మొదలైంది.

అధినేతను ఆహ్వనించిన అధ్యక్షుడు తన ఉపన్యాసం మొదలు పెట్టాడు.

''సంఘ వ్యతిరేక శక్తులారా! చట్ట విరుద్ధ మిత్రులారా! నేడు మనకు సుదినం. అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని విస్మరించి, దాన్ని తిరగరాసి, చరిత్రను వక్రంగా లిఖిస్తున్న మన అధినేత ఈ సభకు విచ్చేయడం మనందరికీ ఆనందదాయకం. మనమందరం నీచమైన పనులు చేసి, దొంగతనాలు దోపిడీలు, దురాగతాలకు తలబడి చెడ్డవాళ్లమనే ముద్ర వేసుకుని తిరుగుతున్న వాళ్లమే. కానీ ఈయన? పైకి  మంచిగా కనిపిస్తూ, అందరికీ మంచి చేయడానికే అవతారమెత్తినట్టు నమ్మిస్తూ మనందరి కన్నా ఎక్కువగా దోచుకుంటున్న ఘన నేత. మనం చేసే పనులను మనం దొంగతనంగా, భయపడుతూ చేస్తున్నాం. మరి ఈయన? ప్రజల పేరు చెప్పి, అభివృద్ధి చేస్తున్నట్టు పైకి చెబుతూ, ఏ పని చేపట్టినా, లోపాయికారీగా కమీషన్ల రూపంలో కోట్లకు కోట్లు చేతులు మారే వ్యవస్థను నెలకొల్పారు. ఇసుకని కాదు, మద్యమని కాదు, నీటి ప్రాజెక్టులని కాదు, కొండలని కాదు, గనులని కాదు, భూములని కాదు, పొలాలని కాదు... అన్నింటినీ ప్రగతి పేరిట బాహాటంగా, ఎక్కడా చట్టానికి దొరక్కుండా భోంచేస్తున్నమహా రాజకీయ నేత. ఒకప్పుడు ఇల్లు తాకట్టు పెట్టే స్థితి నుంచి ఈనాడు ఇతర రాష్ట్రాల్లో సైతం విలాసవంతమైన భవంతులు నిర్మించుకునే స్థితికి వెళ్లిన నాయకుడు. అధికారం లేకుండానే ఈయన నడిపిన అవినీతి కార్యకలాపాల లోగుట్టుమట్టులు తేల్చడానికి మహా మహా కోర్టులు సైతం కిందమీదులవుతున్నాయి. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా తన అధికారానికి అనుగుణంగా సొంత రాజ్యాంగాన్ని రచించుకున్న ఈయనకు నేను ఈ సందర్భంగా 'రాజ్యాంగ భ్రష్ట' అనే బిరుదును సభా ముఖంగా సవినయంగా సమర్పించుకుంటున్నాను...'' అనగానే చప్పట్లు మార్మోగాయి.

''ఇప్పుడు ఈయన మనందరి మేలు కోరి ప్రసంగించాలని, నీచ నికృష్ట పనులను చేయడంలో నైపుణ్యాలను వివరించాలని కోరుతున్నాను. ఈయన మాటలు విని మీరంతా మరింత చెడిపోవాలని కోరుతున్నాను...'' అంటూ అధ్యక్షుడు, అధినేతను సాదరంగా మైకు ముందుకు ఆహ్వానించాడు.

అధినేత ముసిముసిగా నవ్వుతూ, ''అసలిలాంటి వినూత్నమైన రీపబ్లిక్‌ ఉత్సవాన్ని జరపాలనే ఆలోచన వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉంది. కాబట్టి నాకు తెలిసిన కొన్ని చెడ్డ మాటలు చెబుతాను. మీరంతా ముందు చూపులేని సాదా సీదా అమాయక నేరగాళ్లు. నేనలా కాదు. రానున్న కొన్నేళ్లపాటు నిరాటంకంగా, నిరంతరాయంగా, నిర్భయంగా, నిశ్చింతగా, నిబ్బరంగా కోట్లకు కోట్లు దోచుకోడానికి పథక రచన చేసిన రాజకీయ వేత్తను. అన్నింటికన్న పెద్ద సంపద ప్రజా ధనం. దాన్ని దోచుకోవాలంటే అధికారం రావాలి. అది రావాలంటే ప్రజలను నమ్మించాలి. నిజానికి అదొక కళ. ఒకసారి అధికారం అందాక అమాత్యుల నుంచి అధికారుల వరకు, అస్మదీయుల నుంచి అనుచరుల వరకు అందరికీ అవినీతిని రుచి చూపించాలి. ఒక విధంగా అవినీతిని కేంద్రీకరించాలి. వ్యవస్థీకృతం చేయాలి. అందుకుగాను రాజ్యంగ, చట్ట, న్యాయ, ప్రజాస్వామ్య వ్యవస్థలను, విధానాలను ఒకటొకటిగా భ్రష్టు పట్టించాలి. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలెదురైనా జంక కూడదు. ప్రశ్నించే వాళ్లను, మన చర్యలను నిరసించే వాళ్లను కర్కశంగా అణచివేయాలి. ఇందుకు చట్టంలో లొసుగులను వాడుకోవాలి. రాజ్యాంగంలోని లోపాలను ఉపయోగించుకోవాలి. నేను చేసిందదే. ఇన్ని పనులు చేస్తున్నా మనం అధికారంలోకి రావడానికి దోహద పడే ఓటు బ్యాంకును మాత్రం విస్మరించకూడదు. వాళ్లకి కూడా డబ్బు రుచి చూపించాలి. ప్రజలు అమాయకులు. వాళ్లకు పది రూపాయలు పడేసి, వాళ్ల కళ్ల ముందే కోట్లకు కోట్లు దోచేసుకుంటున్నా పట్టించుకోరు. నిజానికి వాళ్లకి మనం పథకాల రూపంలో పంచేది కూడా వాళ్ల డబ్బేనని తెలుసుకోలేరు. ఇప్పటికే మీలాంటి వాళ్లను నా అనుచర వర్గంగా పెట్టుకున్నాను. మిమ్మల్ని కూడా ముందు ముందు ఉపయోగించుకుంటానని మాట ఇస్తున్నాను'' అంటూ ముగించాడు.

ఆ అర్థరాత్రి అక్కడ చేరిన సభ్యులందరూ ఆనందంతో చప్పట్లు మోగించారు. ఆ తర్వాత 'భారత భ్రష్ట', 'చెడ్డశ్రీ', 'నీచ విభూషణ్‌', 'నికృష్ట రత్న' లాంటి పతకాలను అధినేత ప్రదానం చేశాడు. శకటాలుగా ప్రదర్శించిన దోపిడీ ధనం, తుపాకులు, బందూకులు, బాంబులు, గ్రెనేడ్లులాంటి  పరికరాలతో కూడిన వాహనాలను ఆనందంగా తిలకించాడు. దౌర్జన్యకారుల గౌరవవందనం స్వీకరించాడు. ఈలోగా తెల్లారిపోయేసరికి ఎక్కడివారక్కడ జారుకున్నారు.

-సృజన

PUBLISHED ON 24.1.2023 ON JANASENA WEBSITE