గురువారం, ఏప్రిల్ 26, 2012

బాగోతాల గీత

బాగోతాల గీత


గురువుగారు వ్యాసపీఠం ముందేసుకుని భగవద్గీత చదువుకుంటుండగా శిష్యుడు వచ్చాడు. వెంటనే కళ్లు తిరిగి పడిపోయాడు. గురువుగారు ఇన్ని బీరు చుక్కలు మొహం మీద చల్లితేకానీ స్పృహలోకి రాలేదు.
'ఏట్రా! కళ్లు తేలేశావ్‌, కొంపదీసి గ్నానోదయం అయిపోలేదు కద?' అంటూ పరామర్శించారు.

కాస్త తేరుకున్న శిష్యుడు, 'కాకపోతే మరేంటండీ? మీ దగ్గర నీచ రాజకీయాలు నేర్చుకుని నికృష్ఠుడినయ్యానని నేనేదో సంబరపడుతుంటే, ఉన్నట్టుండి తమరు భగవద్గీత పట్టుకుని కనిపిస్తే... కళ్లు తిరగవా చెప్పండి?' అన్నాడు.

'వార్నీ... అదా నీ కంగారు? బలేవోడివే! నువ్వు నీచావతారంలో నిగ్గు తేలావని నమ్మకం సిక్కింది కాబట్టే, నీకో కొత్త ఇసయం సెప్పేసేద్దారని అనుకుంటుంటే, సటుక్కున నువ్వే ఊడిపడ్డావ్‌!'

'అంటే పాఠం మొదలెట్టేశారన్నమాటే. చెప్పండి గురూగారూ!'

'నేను సెప్పడం కాదురా. అలనాడు ఆ సీకిట్ట పరమాత్మ, మునులు, మగానుబావులు సెప్పినవే. ఆటినిప్పుడు అరజెంటుగా ఒంటబట్టించుకోవాల...'

'అంటే వాళ్లంతా కూడా ఈ నీచరాజకీయాలు చెప్పారంటారా?'

'సిస్సీ, నోర్ముయ్‌! కబోదివైపోగలవు. ఆల్లు బగవద్గీతలు సెబితే, మనం ఆటిని బాగోతాల గీతగా మార్సుకోవాల. అందుకు ఆల్లు సెప్పిన మంచి ముక్కల్ని నువ్వు బట్టీపట్టాలని సెబుతున్నా. అంచేత ఇదిగో ఈ బగవద్గీత, ఆ పురాణం, ఈ పంచాంగం... అన్నీ బజారుకెల్లి తెచ్చేసుకోమరి!'

'అయ్యబాబోయ్‌! అవన్నీ ఎందుకండీ? నోరు తిరగదు కూడానూ! పైగా వాటిలో ఏవేవో మనకు మింగుడుపడని ధర్మపన్నాలు, నీతిసూత్రాలు గట్రా ఉంటాయి కదా, మనకెందుకూ?'

'అందుకే రాగానే కళ్లు తిరిగిపడిపోయావ్‌! ఏదో నా దగ్గర నాలుగు నీచోపాయాలు నేర్సుకున్నావు కదాని, బాగా దిగజారిపోయాననుకుని విర్రవీగకు. నువ్వింకా జారాల్సిన లోతులు, వదులుకోవాల్సిన ఇలువలు శానా ఉన్నాయి మరి!'

'బాబ్బాబు! తమకెంత కోపమొచ్చినా సరే, మంచోడినని మాత్రం తిట్టకండి. అది నా మనసుని గాయపరుస్తుంది. అయినా కానీ గురూగారూ... ఆ ధర్మాధర్మ సూక్ష్మాలన్నీ చదివితే ఎదుగుతాం కానీ, ఎందుకు దిగజారతామండీ?'

'ఓరెర్రోడా! జారాలనుకునేవోడు ముందు ఎత్తులేంటో తెలుసుకోవాల. సెడిపోవాలనుకునేవోడు ముందు మంచేంటో కానుకోవాల. అదరమాలు బాగా సేయాలన్నా, సేసిన ఎదవ పన్లను ఎనకేసుకోవాలన్నా నాలుగు దరమపన్నాలు బుర్రకెక్కించుకోవాల. నువ్వాటిని పాటించనంతకాలం పెమాదం లేదు. నువ్వెన్ని నీతిసూత్రాలు నేర్సుకుంటే అంతలా దూసుకుపోతావు. రాజకీయంలో ఇదొక నీచాతినీచోపాయం. అర్దమైందా?'

'ఓహో... అదన్నమాట మీ గీతా సారాంశం! మరి ఇలాంటి విద్యలో ఆరితేరినవారెవరైనా మన సమకాలీన సమాజంలో వేగుచుక్కలా వెలుగులీనుతున్నారాండీ?'

'కళ్లెట్టుకు సూడ్రా కుర్రసన్నాసీ! సుట్టూ జరిగే రాజకీయమంతా అదే! అందునా ఆ తండ్రి కన్నబిడ్డని, ఆ బిడ్డ పలుకుల్ని సూత్తా కూడా నేర్సుకోకపోతే ఎట్టారా! సేసినవన్నీ సేసేసి సానుబూతి పొందాలని సూడ్డంలేదూ? వాడిపోయిన గంజాయి మొక్కలా మొగమేసుకుని తులసి మొక్కనంటూ తెగించి మాట్టాడ్డం లేదూ? పెజానీకం మనసుల్లో తులసిమొక్క ఎంత పవిత్రమైందో నీకు తెలీలేదనుకో, అప్పుడు దాన్ని అడ్డమేసుకోగలవా? అంచేత ముందు పవిత్రమైనవేంటో జాబితా రాసుకో. గంగిగోవు పాలు, గంగాభవాని నీళ్లు, రాములోరి పాలన తీరు... ఇలాగన్నమాట. ఆటిని ఎడాపెడా వాడేసుకో. నీలాంటోల్లకు ఆ యువనేత ఓ నడిచే విగ్నాన గ్రందమనుకో. ఆయన దారిలో నువ్వు కూడా ముందు జనాన్ని దోసేసుకో. ఆనక మనసంతా జనమను. అదే నిజమను. ఇక ఆయన తండ్రిగారి జమానా ఓపాలి గురుతు సేసుకో. తమదంతా దేవుడి పాలనన్నా, వరుణుడు తమలో దూరిపోయాడన్నా, తన మనసే శివుడన్నా... అయ్యన్నీ సెప్పాలంటే ముందుగాల నీకు పురాణాలు గట్రా తెలిసుండాలిగా? అదన్న మాట. అర్దమైందా?'

'ఎందుకు అర్థం కాదండీ, ఇంత బాగా చెప్పాక! రాబోయేది రామరాజ్యమని, సువర్ణస్వామ్యమని చెబుతుంటే విని విస్మయం చెందుతున్నాం కదండీ?'

'అద్గదీ! అయ్యన్నీ ఇంటూ కూడా బుర్రలోకి ఇంకించుకోలేదనుకో, నిన్నా దేవుడు కూడా కాపాడలేడు. ఆయనగారి పెతి పలుకూ నీలాంటోల్లకు నికార్సయిన పాటమే మరి'

'కానీ గురూగారూ! పంచాంగం చదవమన్నారు, అదెందుకండీ?'

'మూర్తాలు చూసుకోడానికిరా...'

'మనం చేసేవే నీచకార్యాలు... మళ్ళీ వాటికి ముహూర్తాలెందుకండీ?'

'ఓరెర్రోడా! ఎదవపన్లకు అవకాశం వస్తే సటుక్కున సేసేయాలి కానీ మూర్తాలు సూసుకుంటా కూసుంటామేంట్రా? పంచాంగాలు కొనమన్నది ఆటిగ్గాదు. నీ సేతకాని తనానికి అడ్డమేసుకోడానికి'

'చేతకానితనమా? విజయవంతంగా అడ్డగోలు పనులు చేసే మనల్ని మనమే ఇలా కించపరుచుకుంటే ఎలాగండీ?'

'అది కాదెహె! అడ్డగోలు పన్లు బానే సేత్తాం. ఆటిని సేసే పెద్ద నేతల మాటలకు తానతందానా అని తలూపుతాం. అంతవరకు ఓకే. మరా సందడిలో పెజాసేవ కూడా సేయాలనే సంగతి ఒకోసారి మర్సిపోతాం కదా? ఆనక నీ పరిపాలన జావగారిపోయిందని అంతా అనుకుంటారు కదా? అప్పుడు అడావుడిగా పంచాంగాలు తిరగేసి మూర్తాలు అడ్డమేసుకోచ్చు. నేను కుర్సీ ఎక్కిన సమయాన్ని ఏ రాహువో ఒంటి కన్నుతో సూశాడనో, మంచి పనులు సేద్దామనుకున్నప్పుడల్లా ఏ కేతువో వంకరగా నవ్వాడనో సెప్పుకోవచ్చు. మొత్తం మీద మూర్తం బాలేదంటే సరి! దాని మీద పడి అంతా కొట్టుకుపోద్ది! మరి మన రాట్రంలో పెద్దాయన ఏమన్నాడో మర్సిపోయావా? అదన్నమాట! అర్దమైందా? అరెరె... అదేంట్రా? ఉన్నట్టుండి లేచి అదాటున బయల్దేరావు?'

'భలేవారండి బాబూ! అర్జంటుగా వెళ్లి పురాణాలు, పంచాంగాలు కొనుక్కోవాలి. వస్తా!'

PUBLISHED IN EENADU ON 26.4.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి