“హే... భగవాన్!” అంటూ ఆక్రోశించాడు సామాన్యుడు.
అల వైకుంఠపురములో, నగరిలో, ఆమూల సౌధంబుదాపల లక్ష్మీదేవితో
పాచికలాడుతున్న విష్ణుమూర్తి ఉలిక్కి పడ్డాడు.
లక్ష్మీదేవి వెంటనే కంగారు
పడి శ్రీహరి చేతిలోని తన చీర చెంగును చటుక్కున వెనక్కి తీసుకుంది.
“ఎందుకా కంగారు దేవీ?” అని ప్రశ్నించాడు విష్ణుమూర్తి.
“మరేంలేదు స్వామీ! అలనాడు
మొసలి బారిన పడిన గజేంద్రుడు వేడుకోగానే మీరు నా చేలాంచలమైనా వీడక పరుగందుకున్నారు.
దాంతో మీ వెనక నేను, ఆ వెనుకనే మీ శంఖుచక్రాలు, గరుడుడు, ఆపై వైకుంఠవాసులంతా పరిగెత్తాం, గుర్తులేదా? ఇప్పుడూ అలాగే చేస్తారేమోనని ముందుగా నా కొంగు తీసుకున్నానంతే” అంది లక్ష్మీదేవి.
విష్ణుమూర్తి నిట్టూర్చి, అర్థనిమీళిత నేత్రాలతో ఆలోచనలో
పడ్డాడు.
“అదేంటి స్వామీ! ఆ సామాన్యుడు
అలా ఆక్రోశిస్తున్నా మీలో కదలిక లేదు. కనీసం గరుత్మంతుడికైనా కబురంపడం లేదేంటి?” అంది అయోమయంగా.
విష్ణుమూర్తి కళ్లు విప్పి, “అతడు ఆంధ్ర దేశమున, అస్తవ్యస్త పరిస్థితుల మధ్య, అగమ్యగోచరంగా అల్లాడుతున్న
సామాన్యుడు దేవీ! వేరొకండెవరైనా అయిన ఎడల ఈ పాటికే వెళ్లి అతడి అభీష్టమును నెరవేర్చెడివాడనే...” అన్నాడు.
“అతడు చేసుకున్నపాపమేమిటి
నాథా?”
“పాపం.. అతడికేమీ కళంకము
లేదు దేవీ. ప్రస్తుతం ఆ రాష్ట్ర పరిస్థితే అల్లకల్లోలముగా ఉన్నది...”
“సకల చరాచర సృష్టికే
స్థితి కారకులైన మీరే ఇలా తటపటాయిస్తే ఎలా స్వామీ? పాపం... ఆ సామాన్యుడి కష్టమేంటో కాస్త చూడండి...” అంది లక్ష్మి ఒకింత జాలితో.
“దేవీ! ముందా సామాన్యుడి
విన్నపాలు వినవలెను. అవి ఎంత వింతవింతలో నీకే తెలియును...” అన్నాడు విష్ణుమూర్తి.
లక్ష్మి మేఘాల దొంతరలను పక్కకు
దొర్లించి కిందికి దృష్టి సారించింది.
సామాన్యుడు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు.
“హే... భగవాన్! కొత్త
సంవత్సరం వస్తోంది. కానీ మా పాత బాధలు తీరే మార్గం కనిపించడం లేదు. ధరలన్నీ
ఆకాశంలో చుక్కల పక్కన కూర్చుని వెక్కిరిస్తున్నాయి. నిత్యావసరాలు కొందామన్నా
నిట్టూర్పులు తప్పడం లేదు. కూరగాయలు కూడా కస్సుమంటున్నాయి. ఇలాగైతే ఎలా?”
లక్ష్మి రోషకషాయిత నేత్రాలతో
క్రీగంట చూసింది. విష్ణుమూర్తి ఎలా చెప్పాలా అని ఆలోచించేంతలో సమయానికి నారదుడు
“నారాయణ... నారాయణ” అంటూ ప్రత్యక్షమయ్యాడు. వస్తూనే
పరిస్థితి గ్రహించి మొదలు పెట్టాడు.
“అమ్మా... అలా ఆగ్రహించకు. ఆ సామాన్యుడి కోరికలో చాలా చిక్కులున్నాయమ్మా. ఆ
రాష్ట్ర అధినేత ప్రజలందరికీ స్వర్ణయుగం తెస్తానని నమ్మించి అధికారం అందుకుని
కుర్చీ ఎక్కి రెండున్నరేళ్లయింది. ఎంతసేపూ ఆ నేత దృష్టి అప్పుల మీదే ఉంది తప్ప, ధరవరల అదుపు మీద లేదు తల్లీ!
ఇప్పటికే ఆ రాష్ట్రం లక్షలాది కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. ఇక కొత్తగా
అప్పు పుట్టే దారులు కూడా కనిపించడం లేదు. ఉద్యోగులకు నెలనెలా జీతాలు కూడా ఇవ్వలేని
దుస్థితిలో ఆ ప్రభుత్వం ఉందమ్మా. ఆఖరికి
సామాన్యులకు ఇచ్చే పింఛను డబ్బులు కూడా ఎప్పుడొస్తాయో తెలియని దుర్భర పరిస్థితి.
ఒకవేళ వచ్చినా అందులో కూడా చెత్త పన్నులవీ కోత కోసి అందిస్తున్నారు. చెయ్యగలిగిన
నేతలే చేతులెత్తేస్తుంటే, ఇక వైకుంఠనాథుడు మాత్రం ఏమి చేయగలడమ్మా?”
లక్ష్మీ దేవి తలపంకించి, తిరిగి సామాన్యుడి ప్రార్థన
కోసం చెవులు రిక్కించింది.
“హే... భగవాన్! రైతులకు
గిట్టుబాటు ధర దక్కడం లేదు. మా దగ్గర కొన్న పంటలకు ప్రభుత్వం నుంచి కూడా బకాయిలు
విడుదల కావడం లేదు. చేతిలో కాసులాడక అప్పులపాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ పరిస్థితి ఎలా మారుతుంది స్వామీ?”
లక్ష్మీదేవి విష్ణుమూర్తి కేసి
చూశాడు. విష్ణుమూర్తి నారదుడి కేసి చూశాడు. నారదుడు అందుకున్నాడు.
“చెప్పాను కదమ్మా...
ఆ అధినేత నిర్వాకం వల్ల ఒకప్పుడు అన్నపూర్ణ అనిపించుకున్న ఆ రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక
సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులకే కాదమ్మా, ప్రభుత్వ పనులు చేసిన గుత్తేదారులకు కూడా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి.
ఆఖరికి ఆ నేత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా దారిమళ్లిస్తున్నాడు. ప్రజల
నుంచి పన్నుల రూపంలో వచ్చే సొమ్ము, సంక్షేమ పథకాల కోసం విడుదలయ్యే సొమ్ముకు కూడా ఓ అజాపజా, లెక్కాజమా కనిపించడం లేదని
అక్కడి ప్రతిపక్షనేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ లక్ష్మీపతి
మాత్రం చేసేదేముందమ్మా?”
లక్ష్మీదేవి నిట్టూర్చి, మళ్లీ సామాన్యడి కేసి చూసింది.
“హే... భగవాన్! మా పిల్లలు చదువుకుందామంటే పూర్వం అందే సాయం కూడా బందయిపోయింది.
ఇప్పుడు కొత్తగా ఫీజులు కట్టమంటున్నారు. ఎలాగోలా చదువు చెప్పించినా ఉద్యోగాలు వస్తాయన్న
ఆశ కూడా లేదు. ఇలాగైతే ఎలా తండ్రీ?”
నారదుడు మళ్లీ వివరించాడు.
“ఏం చెప్పమంటావు తల్లీ? అక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ అనాలోచితంగానే ఉన్నాయి. దాతల సాయంతో
నడిచే ఎయిడెడ్ పాఠశాలల ఆస్తుల మీద కూడా అక్కడి నేత కన్ను పడిందటమ్మా. వాటికి
ప్రభుత్వ పరంగా ఇచ్చే నిధులను కూడా ఆపుచేయడంతో పిల్లల చదువులు భారమవుతున్నాయి.
ఇక అక్కడి పాలన తీరుతెన్నులు చూసి కొత్త పరిశ్రమల వారెవరూ రాష్ట్రం కేసి
చూడడం లేదు. పైగా ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతున్నాయి. దాంతో అక్కడి యువతీ
యువకులకు ఉద్యోగాలు రావడం కష్టమైపోతోంది. దాంతో చాలా మంది ఇతర ప్రాంతాలకు పోవాల్సి
వస్తోంది. పోనీ ప్రభుత్వ రంగాల్లో ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదమ్మా.
ఇక స్థితికారుడు సైతం ఈ దుస్థితిని ఎలా మార్చగలడమ్మా?”
లక్ష్మీదేవి కూడా ఆలోచనలో
పడింది. సామాన్యుడు మాత్రం తన ప్రార్థనను ఆపలేదు.
“హే... భగవాన్! ఏదైనా
సమస్యను ఎవరితోనైనా చెప్పుకోడానికి కూడా భయమేస్తోంది తండ్రీ. ఎప్పుడెప్పుడో మమ్మల్ని
కనికరించి పాతప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలు, ఇళ్ల మీద కూడా పడుతున్నారు. ఇదెక్కడి
విచిత్రం తండ్రీ?”
లక్ష్మీదేవి అర్థం కానట్టు
చూసింది. నారదుడు అందుకున్నాడు.
“అవునమ్మా! అక్కడి సామాన్యుల
సమస్యలను గ్రహించి వారి తరపున నిరసన ప్రదర్శనలు చేసే మనసున్న జననాయకుల
మీద కూడా ఆ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తోందమ్మా. అలాంటి ప్రదర్శనలకు
వెళ్లిన వారిపై గూండాలను ఉసిగొల్పుతున్నారు. రక్షక భటులను పంపించి అన్యాయపు కేసులు
కూడా పెట్టిస్తున్నారమ్మా. నిధులు రాబట్టుకోవడం కోసం సామాన్యులకు దశాబ్దాల క్రితం
ఇచ్చిన ఇళ్లను ఇప్పుడు కొత్తగా రిజిష్టర్ చేయించుకోమంటున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు లోకమాతా! ఆ రాష్ట్రంలో
వ్యవస్థలన్నీభ్రష్టు పట్టిపోయాయి తల్లీ! సామాజిక, ఆర్థిక, చట్ట, న్యాయ, రక్షణ, పరిపాలన, విద్య, వినోద రంగాలన్నీ కుదేలైపోయాయమ్మా...”
సామాన్యుడు ఇంకా ఆగలేదు.
“హే... భగవాన్! రాబోయే
కొత్త సంవత్సరంలోనైనా మా బాధలు తీరే దారిచూపించు. మా పరిస్థితులు బాగయ్యేలా అనుగ్రహించు...
“
నారదుడు ఏదో చెప్పబోయేంతలో
లక్ష్మీదేవి కల్పించుకుంది.
“ఆగు నారదా! నాకిప్పుడు
అంతా అర్థమైంది. ఆ సామాన్యుడి కోరికల్లో చిక్కులేమిటో తెలిశాయి. అక్కడి రాజకీయ
చదరంగంలో అతడెలా పావుగా మారాడో తెలిసింది...” అంటూ వైకుంఠనాధుడి కేసి తిరిగి, “స్వామీ! ఆ సామాన్యుడి సమస్యలు
ఇప్పటికిప్పుడు చటుక్కున తీర్చేవి కాకపోవచ్చు. కానీ తనను ఇలాంటి విషమ పరిస్థితుల్లోకి
నెడుతున్న నేతల నిజస్వరూపాన్ని గ్రహించగలిగే అవగాహనను అతడికి కలిగించండి.
వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో తెలుసుకునే తెలివిని అనుగ్రహించండి. అప్పుడు అతడు తన
సమస్యలను తానే పరిష్కరించుకోగలడు...” అంది.
“తథాస్తు!” అన్నాడు విష్టుమూర్తి.
-సృజన
PUBLISHED ON 30.12.21 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి