"థూ... దీనెవ్వా బతుకు..." అంటూ నోట్లో చుట్ట ముక్క నేలకేసి కొట్టాడు గంగులు. బుగ్గపై పులిపిరి, గళ్ల లుంగీ, నుదిటిపై గాటు, నల్లబెల్టు, బొడ్డులో బాకు... చూడగానే భయంకరంగా ఉన్న గంగులు కంఠం, ఆ పాడు పడిన సత్రంలో ఖంగున మోగింది. సగం పడిపోయిన గోడకున్న సున్నం పెచ్చు ఊడి కింద పడింది. గంగులు ఏం చెబుతాడా అని అక్కడ చేరిన అందరూ చెవులు రిక్కించి వింటున్నారు.
"ఇంకెంతకాలంరా ఈ సిన్నా సితకా చోరీలు? ఎంటనే ఆపేద్దారి... ఏటంటారు?" అంటూ చికాగ్గా అడిగాడు గంగులు.
అక్కడ చేరిన దొంగలు, రౌడీలు, పాత నేరస్థులు, గూండాలు అందరూ ఉలిక్కిపడ్డారు.
"అదేంటి గంగులూ, అట్టంటావ్? మనమింతకన్నా ఏటి సేయగలం? తరతరాలుగా చోరీలనే నమ్ముకున్నాం... నువ్వు ఉన్నట్టుండి వృత్తినే వద్దంటే
మా గతేంటి?" అన్నాడు రత్తయ్య కత్తితో గెడ్డం
మీద గోక్కుంటూ.
"ఔ... అన్నా! మరింకేం సేద్దారే?" అన్నాడు రంగూన్ రౌడీ రంగన్న.
గంగులు అందరి కేసీ తేరిపారి
చూశాడు. ఆ తర్వాత తుపుక్కున ఉమ్మి, "నోర్ముయ్యండెహె. ఆ పాటి నేనాలోచించలేదంటారా? జాగ్రత్తగా వినుండ్రి. మనం
ఈ దొంగతనాలు, దబాయింపులు, చోరీలు, హత్యలు అన్నీ బంద్ చేసి ఎంచక్కా
రాజకీయాల్లో చేరిపోదారి..." అన్నాడు గంభీరంగా.
కారాకిళ్లీ కాశయ్య ఫెల్లున నవ్వి, "ఏటి గంగులూ... మతేమన్నా సెడిందా
ఏటి? రాజకీయాల్లో మన్నెవడు సేర్చుకుంటాడు? అయినా ఉన్నపళాన ఈ ఆలోచనేంటి నీకు?" అన్నాడు.
గంగులు కస్సుమంటూ, "మూసుకోరా కాశిగా! నేనేమన్నా
ఎర్రెదవనా?" అంటూ కసిరి, ఆపై అందరి కేసీ చూస్తూ, "ఒరేయ్... నిదానంగా వినుకోండి. బాగా ఆలోసించే సెబుతున్నా. ఇన్నేళ్లుగా దొంగతనాలు
సేత్తన్నా మనకి దక్కిందేటి? ఎనక్కి తిరిగి సూసుకుంటే ఎర్రని ఏగాని లేదు. ఎప్పటికప్పుడు కట్టెను కొట్ట, పొయ్యిలో పెట్ట. పైగా ఇంతోటి
పనులకే ఉలికులికి పడిపోతూ, ఎప్పుడు దొరికి పోతామో తెలీక బిక్కుబిక్కుమంటూ నక్కి నక్కి తిరుగుతున్నాం. కాలం
సెడి దొరికామో, జైల్లో ఏళ్ల తరబడి మగ్గిపోతన్నాం. కానీ ఓసారి కళ్లెట్టుకుని మన రాజకీయ నాయకుల
కేసి సూడండి. కళ్లంటుకుపోతాయ్. ఒకటి కాదు, రెండు కాదొరేయ్! కోట్లకు కోట్లు కొల్లగొట్టేత్తన్నారు. ఇంతా సేసి ఆళ్లు కూడా
సేసేది మనలాటి పన్లే. ప్రజల్ని నిలువునా దొచేసుకుంటున్నారు. మన్ని మించిపోయి
మరీ అక్రమాలు, అన్నాయాలు, దౌర్జన్యాలు సేత్తా కూడా దర్జాగా కారుల్లో కాలరెగరేసుకుని మరీ తిరుగుతున్నారు..."
అంటూ ఆగాడు.
ఇంతలో అబ్బులు లేచి, జబ్బలు రాసుకుంటూ చెప్పాడు, "గంగులన్న సెప్పింది పరమ సత్తెం.
మొన్నటి దాకా మన జట్టులో కలుపుకోండంటూ బతిమాలుతూ నా చుట్టూ తిరిగే జగ్గులుగాడు
ఆంధ్రాలో అధికార పార్టీలో సేరిపోయిండు. ఎమ్మెల్యే కాడ అనుచరుడిగా మారిపోయిండు. ఇప్పుడు
సూడండి. ఆడు ఆడిందాట, పాడింది పాట. ఆడి నేత ఎవుడ్ని కొట్టమంటే ఆడ్ని కొట్టి రావడమే పని. మొన్నాపాలి
కొందరు ఎక్కడ సూసినా రోడ్లు బాగా లేవని
ఫుటోలు తీసి, నినాదాలు సేత్తంటే మనోడు మరి కొందరితో కలిసి ఆళ్లని సితగ్గొట్టిండు. అలాగే
ఎవరో రైతులంట, పాపం అందరూ కలిసి ఊరేగింపు సేత్తంటే ఆళ్లని కూడా ఇరగదీసిండు. ఆ పక్కనే పోలీసోళ్లు
ఉన్నా ఆపితే ఒట్టు. ఆళ్ల ఎదురుగ్గానే ఈడు కారెక్కి చక్కా పోయిండు. నేను ఆడనే ఉండి
ఇదంతా సూసి నోరెళ్లబెట్టినా. కేసూ లేదు, గీసూ లేదు. ఇలా ఆ పార్టీలో చేరి ఆళ్ల నేతలు ఏం చెబితే అది చేసేవోళ్ల మీద ఈగ కూడా
వాలదంట. అంతా ఆళ్ల పెద్దన్న చూసుకుంటడంట. ఆయనేం చెబితే పోలీసోళ్లంతా అదే సేత్తారంట.
కాబట్టి గంగులన్న కరక్టే" అన్నాడు.
వెంటనే ఖూనీకోర్ కోటిగాడు లేచి
అందుకున్నాడు, "నిజమన్నా! అబ్బులు చెప్పేది అక్షరాలా నిజం. మనమంతా వెంటనే ఆ పార్టీలో చేరిపోవాల.
ఆ పార్టీ మనలాంటోళ్లకి గొప్ప ఆసరా. మాగొప్ప భరోసా. ఇన్నాళ్లూ మనం భయపడుతూ
చేసే పనులన్నీ ఆ పార్టీలో చేరితే పబ్లిగ్గా చేసేయచ్చు. అంతెందుకు? మనం మనసు బాలేకపోతే కూసింత
గంజాయి ఆకు ముట్టించుకుని పీలుస్తామా? ఇప్పుడా ఆకుని ఏజెన్సీలో ఎకరాలకెకరాలు సాగు చేసేత్తన్నారు. ఆటిని లారీల్లో
లోడుకెత్తించి దేశం మొత్తం తోలేత్తన్నారంట. పోలీసోళ్లు కూడా చూసీ చూడనట్టు ఒగ్గేత్తన్నారంట.
అప్పుడప్పుడు మాత్రం కొన్ని కేసులెట్టి హడావుడి చేస్తారంటంతే. దీనికి సాయం విదేశాల
నుంచి వచ్చే మత్తు పదార్థాలు కూడా సరఫరా అవుతున్నాయంట. మన్లాంటి పనీ పాటా
లేని పోరంబోకు నాయాళ్లంతా ఈ లోడింగు, అన్‌లోడింగు పనుల్లో కుదిరిపోతున్నారు. ఈళ్లందరికీ ఆ పార్టీవోళ్ల అండదండలుంటాయంట.
కళ్ల ముందే కరెన్సీ నోట్లతో పెళపెళలాడిపోతన్నారనుకో..." అంటూ చెప్పుకొచ్చాడు.
అప్పుడు గంగులు లేచాడు. అందరికేసీ
ఓసారి చూసి, "చూశారా? ఇప్పుడు రోజులు సానా మారిపోనాయి. మనమంతా వెనకబడిపోయాం. మనకెన్ని కట్టాలో
ఓ సారి గుర్తు తెచ్చుకోండి. ఒంటి నిండా నూని రాసుకోవాల. మసి పూసుకోవాల. సీకట్లో
తక్కుతూ, తారుతూ, బెదురుతూ పని సేయాల. పోలీసోడి విజిల్ ఇనిపిస్తే సాలు, పై ప్రాణం పైనే పోద్ది. కానీ మన కళ్ల ముందు వెలిగిపోతున్న కొందరు రాజకీయ నాయకుల్ని
చూడండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన పన్లు సేత్తన్నారు. ఏ వ్యాపారానికైనా
పెట్టుబడి పెట్టాల. కానీ నయాపైన జేబులోంచి పెట్టకుండా, కోట్లకు కోట్లు వేరే వాళ్ల చేత పెట్టించి, ఆళ్లకి అప్పనంగా భూములు, సెజ్‌లు, గనులు పంచిపెట్టేసి లావాదేవీలు నడిపే నేత గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆ నేతే మనకి దిక్కు. ఆయన దొర.
దొంగల్లో దొర. అసలు ఆయన మీద కూడా బోలెడన్ని కేసులు ఉన్నాయి. అయ్యన్నీ కోరటుల్లో
నడుస్తున్నాయి. ఆయనోసారి జైలుక్కూడా వెళ్లొచ్చాడు. అయితేనేం? ప్రజల్ని నమ్మించి, ఊరించి, బులిపించి గెలిచాడంతే. ఇక చూసుకోండి.
ఆయనకి కానీ, ఆయన్ని నమ్ముకున్న వారికి కానీ జాతరే
జాతర. మనం ఒకసారి ఒకరి జేబే కొట్టగలం. మరి ఆళ్లు? ఒకేసారి ప్రజల జేబులన్నీ కొట్టేస్తున్నారు.
ఇసుక క్వారీలు, గనులు, పోర్టులు, భూములు ఇలా అన్నీ అయినవాళ్లకి
ఎంచక్కా కట్టబెట్టేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు, కాంట్రాక్టులన్నీ ఊరికే ఇత్తారేంటి? అందుకు భారీగా సొమ్ములు సేతులు
మారే ఉంటాయి. అంటే పైకి ప్రజల పనులు, లోపల సొంత కాతాకి సొమ్ముల జమలు. అందుకని నేనింతకీ సెప్పొచ్చేదేటంటే, మనకిక రెండేళ్లే టైముంది. మనమంతా
గళ్లలుంగీలు విప్పేసి, గెడ్డాలు అవీ గీసేసుకుని నెమ్మదిగా ఆ పార్టీ నేతల అనుచరుల్లో సేరిపోవాల. అప్పుడిక
మనం ఏ కేసులకీ భయపడక్కర్లేదు. ఇప్పుడు మనం సేసే పనులే దర్జాగా, పబ్లిగ్గా సేసుకోవచ్చు. ఆ నేతలు
ఎవరిని కొట్టమంటే ఆళ్లని కొట్టడం, ఎవరికి జైకొట్టమంటే వాళ్లకి జైకొట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేవాళ్లని తుక్కురేగ్గొట్టడం, ప్రభుత్వానికి అనుకూలంగా దొంగ
ప్రదర్శనలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసే ఎగస్పార్టీ వాళ్లని బెదిరించి అడ్డుకోవడం, దొంగ ఓట్లు గుద్దడం... ఇలా దొంగ పనులన్నీ దొరల్లా సేయొచ్చు. ఏటంటారు?" అంటూ వివరించాడు గంగులు.
అక్కడ చేరిన దొంగలంతా
"సై" అంటూ గెడ్డాలు గీసుకోవడం మొదలు పెట్టారు.
-సృజన
UPLOADED ON 21.12.2021 ON JANA SENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి